సీమ ప్రజాప్రతినిధులారా... మీకేమీ పట్టదా?

ABN , First Publish Date - 2023-09-21T01:41:52+05:30 IST

శ్రీశైలం జలాశయం ఆధారంగా నిర్మింపబడుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గత వారం వెట్ రన్ గావించారు (వాస్తవంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు)...

సీమ ప్రజాప్రతినిధులారా... మీకేమీ పట్టదా?

శ్రీశైలం జలాశయం ఆధారంగా నిర్మింపబడుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గత వారం వెట్ రన్ గావించారు (వాస్తవంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు). శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నా నీళ్లు తీసుకొనే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకాన్ని 90టియంసిలు సామర్థ్యంతో నిర్మించుతున్నది. దీనికి తోడు మరొక 30టియంసిల సామర్థ్యంతో ప్రతిపాదనలో ఉన్న డిండి పథకానికి దీని నుంచే నీటి సరఫరా జరగాల్సి వుంది. వాస్తవంలో ఇది కొత్త ప్రాజెక్టు. రాష్ట్ర విభజన చట్టం 11వ షెడ్యూల్‍లో పేర్కొన్న ప్రాజెక్టుల జాబితాలో ఈ పథకం లేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇరు రాష్ట్రాలు కొత్తగా ఏ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టదలచినా విభజన చట్టం మేరకు అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. తత్ఫలితంగా 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు దిండి ఎత్తిపోతల పథకాల నిర్మాణాన్ని నిలిపివేయాలని తీర్మానం చేయించారు. కానీ మొండివాడు రాజుకన్నా బలవంతుడన్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఈ పథక నిర్మాణాన్ని కొనసాగించింది. తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది. ఇరువురు ముఖ్యమంత్రులు కొన్నాళ్లు బహిరంగంగా ‘అలాయ్ బలాయ్’ ఆడారు. 2019లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కాంచీపురంలో దైవ దర్శనానికి వెళ్లి వస్తూ, నగరిలో ఇప్పటి మంత్రి రోజా ఇంట ఆతిథ్యం తీసుకొంటూ, రాష్ట్రంలో యువ నాయకత్వం ఏర్పడిందని, రాయలసీమను ఇరువురు ముఖ్యమంత్రులు రతనాల సీమ చేస్తామని డాంబికాలు పలికారు. కొసమెరుపు ఏమంటే– ఇది జరిగిన రెండు రోజులకే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఆంధ్రప్రదేశ్ రెండు టియంసిల నీటిని అధికంగా తీసుకొన్నదని తెలంగాణ ప్రభుత్వం నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది!

తర్వాత కేంద్ర జల వనరుల శాఖ మంత్రి షెకావత్ ఆధ్వర్యంలో జరిగిన రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో శ్రీశైలం జలాశయం నుంచి 90 టియంసిలు నీటిని తోడుకొనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోరు విప్పలేదు. పైగా కృష్ణా నదీ జలాలు తిరిగి రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేస్తే కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అమలులోనికి వస్తే తనకు రాజకీయ జన్మనిచ్చిన రాయలసీమ శాశ్వతంగా ఎడారి అవుతుందన్న ఆలోచన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేకపోయింది. తెలంగాణ డిమాండ్ చేస్తున్నట్లు మరొక ట్రిబ్యునల్ నియమింపబడితే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆ పాటికే నిర్మాణం పూర్తి అయితే, నీటి కేటాయింపులు తప్పదు. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌తో పాటు రాయలసీమ ప్రయోజనాలకు దెబ్బ తప్పదు. 2016లో జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ తీర్మానాన్ని గుర్తు చేయకపోవడమే నాటి విషాదం.

తుదకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అట్టహాసంగా ప్రకటించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ రెండు పథకాలకు గ్రీన్ ట్రిబ్యునల్ బ్రేక్ వేయడం అందరికీ తెలిసిందే. ఒక పక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గ్రీన్ ట్రిబ్యునల్ ఆంక్షలు వున్నా నిర్మాణం కొనసాగిస్తూ, మరోవైపు కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు సాధించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. నీటి కేటాయింపులు లేకున్నా ఎత్తిపోతల పథకం వెట్ రన్ పూర్తి చేశారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగడం లేదు? న్యాయపరమైన చర్యలు ఎందుకు చేపట్టడం లేదు? ప్రాజెక్టు పూర్తి కాకున్నా ఎన్నికల స్టంట్‌గా పథకం వెట్ రన్ సాగిస్తుంటే అడ్డుపడి తన మిత్రునికి ఇబ్బంది కలుగకూడదని ముఖ్యమంత్రి మౌనం పాటిస్తున్నారేమో. కనీసం సీమ ప్రజాప్రతినిధులైనా బహిరంగంగా గాని, పార్టీ సమావేశాల్లో గాని రాయలసీమకు మున్ముందు జరిగే నష్టాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఎందుకు తీసుకు రావడం లేదు? విషాదకరమైన అంశం ఏమిటంటే సీమ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నవారు కూడా పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఆందోళన కార్యక్రమాలు ఉధృతంగా చేపడుతున్నారే గాని తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుంటున్న చర్యలతో మున్ముందు రాయలసీమకు వాటిల్లే కష్ట నష్టాల గురించి న్యాయపరమైన అంశాల గురించి అంతగా పట్టించుకోవడం లేదు.


1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం అమలులోనికి వచ్చిన తర్వాత దేశంలో ప్రతి నదీ జలాల పంపిణీ మొత్తం ట్రిబ్యునల్స్ పరిధిలోనికి వెళ్లింది. వాస్తవంలో బచావత్ ట్రిబ్యునల్ కూడా గతంలో కోస్తా జిల్లాలకు కర్ణాటక ఎంత మొత్తుకున్నా ఆ పాటికే ప్రాజెక్టుల నిర్మాణం జరిగినందున అధికంగా నీటి కేటాయింపులు చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు వివరంగా అధ్యయనం చేస్తే ఈ అంశం బోధపడుతుంది. దురదృష్టం కొద్దీ అందరూ రాయలసీమకు అన్యాయం చేశారు. సీమ అస్తిత్వ ఉద్యమకారులు ఇప్పటికైనా పెండింగ్ ప్రాజెక్టుల డిమాండే కాకుండా న్యాయపరమైన పోరాటం మొదలు పెట్టవలసి వుంది. చాలా మందికి గుర్తు వుండవచ్చు. 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూడా హైకోర్టు ఆదేశాలతో జరిగింది.

ఇంత జరుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మౌనం పాటిస్తున్నారు. తత్ఫలితంగా శ్రీశైలం జలాశయంపై ఆధారపడిన రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ అంశంలో ఉద్యమకారులు ఎవరైనా కోర్టుకు వెళ్లి వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాలని కోరవలసి వుంది. అదే జరిగితే అప్పుడైనా ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏ వైఖరి తీసుకుంటారో బహిర్గతమౌతుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు అని, పైగా దానికి నీటి కేటాయింపులు లేకున్నా శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లు తీసుకోవడం అన్యాయమని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేసేట్టుగా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవలసి వుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం కేంద్ర ప్రభుత్వంతో పేచీ పడుతున్నారు. అయినా కేంద్ర జల వనరుల శాఖలో వున్న బలమైన లాబీతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తెచ్చుకొన్నారు. అయితే కేంద్ర జల సంఘం నీటి కేటాయింపులు ఇవ్వకుండా డీపీఆర్ తిప్పి పంపింది. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర జలవనరుల శాఖలో తెలంగాణకు ఉన్నట్లు లాబీ లేదు. నీటి కేటాయింపులు లేకుండా ఎత్తిపోతలు సాగిస్తున్నారని తుదకు ఉద్యమకారులు హైకోర్టు తలుపు తట్టే అవకాశం ఉంది. మరో విషాదమేమంటే కేంద్ర ప్రభుత్వంతో నిత్యం అంటకాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణకు పర్యావరణ అనుమతులు తెచ్చుకోలేకున్నారు. ఆ ప్రయత్నాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లు లేదు. ఈ రోజుకీ తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం రూల్ కర్వ్‌తో పాటు ప్రాజెక్టులను యాజమాన్య బోర్డుకు అప్పగించాలంటే ఆంధ్ర ప్రదేశ్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 34 టియంసిలు నీరు తీసుకొనే విధంగా యాజమాన్య బోర్డు కట్టడి చేస్తేనే సంతకం చేస్తానని మొండికేస్తున్న నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వెట్ రన్ నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు?

ఏతా వాతా తేలేదేమంటే ఒకవేళ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు పొందినా నిర్మాణ వ్యయానికి ప్రభుత్వం వద్ద పైసలు లేవు. ఇక మిగిలిందల్లా సీమ ఉద్యమకారులే. వీరైనా ప్రజా పోరాటాలతో పాటు న్యాయ పోరాటం మొదలుపెట్టకపోతే మరోమారు శాశ్వతంగా రాయలసీమకు సరిదిద్దలేని అపకారం జరుగుతుంది

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Updated Date - 2023-09-21T01:41:52+05:30 IST