కన్నడ మంత్రం కేసీఆర్‌పై పనిచేస్తుందా?

ABN , First Publish Date - 2023-09-21T01:49:05+05:30 IST

కనిపించేవీ అనిపించేవీ నిజం కానక్కరలేదు. తెలుగు అక్షరాలు, కన్నడ అక్షరాలు చూస్తే, దాదాపుగా ఒకటే అనిపిస్తాయి, వింటుంటే కూడా నిన్నమొన్న విడిపోయిన భాషలేమో అనిపిస్తాయి...

కన్నడ మంత్రం కేసీఆర్‌పై పనిచేస్తుందా?

కనిపించేవీ అనిపించేవీ నిజం కానక్కరలేదు. తెలుగు అక్షరాలు, కన్నడ అక్షరాలు చూస్తే, దాదాపుగా ఒకటే అనిపిస్తాయి, వింటుంటే కూడా నిన్నమొన్న విడిపోయిన భాషలేమో అనిపిస్తాయి. కానీ, కాదు. లిపి చుట్టరికం ఉన్నది కానీ, భాషలో మాత్రం తమిళకన్నడాలే దగ్గరి బం‌ధువులు. చరిత్ర మొదలయినప్పటి నుంచి దక్షిణ భారతదేశంలోని అన్నిప్రాంతాలు, అందరు మనుషులూ ఒకరితో ఒకరు దగ్గరగా మెలుగుతూ వచ్చినా కొన్నివిషయాల్లో చీలిపోక తప్పలేదు, కొన్ని పోలికలు మిగుల్చుకోకా తప్పలేదు.

భౌగోళికంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నిర్వచనంలో దక్షిణాది రాష్ట్రమే అవుతుంది కానీ, అవశేష ఆంధ్రప్రదేశ్ అయినంతగా తెలంగాణ దక్షిణ రాష్ట్రం అవుతుందా? నర్మదా తుంగభద్రనదుల మధ్య ప్రాంతాన్ని దక్కన్ పేరుతో పిలిచి, ఒక కొత్త భౌగోళిక విభజనను మధ్య యుగాల రాజ్యస్థాపకులు వాడుకలోకి తెచ్చారు. కాకతీయుల ముందటి తెలంగాణ చరిత్రను చూస్తే, కనీసం ఉత్తర తెలంగాణ రాజకీయంగా మధ్యభారత రాజ్యాలలో భాగంగా ఉన్నది. ఉత్తరదక్షిణాల మధ్య ఉనికి తెలంగాణకు కొన్ని ప్రత్యేక లక్షణాలను అందించింది. చాళుక్యుల పాలన నుంచి బహమనీలు నిజాముల దాకా సహజీవనం చేసినందున కళ్యాణ కర్ణాటకకు తెలంగాణకు కొంత ఉమ్మడితనం ఉన్నమాట నిజం. ఎవరి భాష వారికి ప్రత్యేకంగా రూపొందినట్టే, ఎవరి సంస్కృతివారికి, ఎవరి ప్రాధాన్యాలు వారికి, ఎవరి చరిత్ర వారికి ఏర్పడ్డాయి.

కొత్తగా రంగం మీదకు వచ్చి ఎన్నికల రాజకీయాలను కేవలం అంకగణితంగాను, ప్రజలను ప్రలోభపరిచే ఉచితపథకాల రచనగానూ మార్చివేసిన వ్యూహ కర్తలు, సమాజాల మధ్య, రాష్ట్రాల మధ్య ఉన్న విభిన్నతను, వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారా? పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం వేస్తే ఫలితాలు వస్తాయా? కన్నడ ఫార్ములానే తెలంగాణ ఎన్నికలకు అమలుచేయాలని చూస్తున్న కాంగ్రెస్ నాయకత్వం నిర్దిష్టతలను విస్మరిస్తోందా? ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌కు రెండుహైకమాండ్స్ ఉన్నాయని, ఢిల్లీతో పాటు బెంగుళూరు కూడా తోడయిందని ప్రత్యర్థులు వెక్కిరింపులు విసురుతున్నారు కూడా!

చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు, కారుచీకటిలో కాంతి రేఖ లాగా అందిన విజయానికి ఎక్కువ విలువ ఉండే మాట నిజం. తరువాతి విజయాలకు ఆ తొలివిజయం కేవలం ప్రేరణనే కాదు, అనేకరకాల పెట్టుబడిని కూడా అందించవలసి ఉంటుంది. 2004తరువాత కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చినప్పటికీ, అనేక రాష్ట్రాలను గెలుచుకోవడానికి అవసరమైన అర్థబలాన్ని కాంగ్రెస్‌కు రాజశేఖరరెడ్డి సమకూర్చవలసి వచ్చింది. అట్లాగే, ఇప్పుడు కర్ణాటక మీద కాంగ్రెస్ పార్టీ అధికంగా ఆధారపడుతోంది. రాజస్థాన్‌లో మళ్లీ గెలవాలన్నా, మధ్యప్రదేశ్‌లో విజయం పొందాలన్నా కొత్త వ్యూహాలు ఇప్పుడు అవసరమే. కర్ణాటక విజయం నుంచి గ్రహించే పాఠాలు కొత్తవిజయాలకు అవసరమవుతాయని అనుకోవడంలో తప్పు లేదు. కొన్ని స్థూల, సాధారణ విజయాంశాలను స్వీకరించి, అన్నిరాష్ట్రాలకు అన్వయించవచ్చు. అదే సమయంలో ఆయా రాష్ట్రాల ప్రత్యేకపరిస్థితులకు తగ్గట్టు వ్యూహరచన చేయవలసి ఉంటుంది.

పదిహేనేళ్ల కిందట ప్రయోగాత్మక ప్రతిపాదనగా ఉండిన నగదుబదిలీ పథకాలు ఇప్పుడు విశ్వరూపం ధరించాయి. దీర్ఘకాలిక అవసరాల కోసం, మౌలిక పెట్టుబడులకు ఒక్కపైసా మిగలకుండా, మొత్తం బడ్జెట్‌ను పంపకాలకు కేటాయించడం నేటి ధోరణి. అధికారానికి మొహం వాచి ఉన్నవారు, గెలుపు ప్రాణావసరం అయినవారు నగదు బదిలీ పథకాలను విస్తృతంగా వాగ్దానం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితికూడా అట్లాగే ఉన్నది కనుక, సరికొత్త సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టడం సహజం. కానీ, కర్ణాటకలో సంక్షేమ వాగ్దానాల ఆధారంగా మాత్రమే విజయం సిద్ధించిందా? కర్ణాటక విజయానికి దోహదం చేసిన ముఖ్యాంశాలలో అవి కూడా ఉండవచ్చును కానీ, బీజేపీని ఓడించిన ఇతర అంశాలేమిటి? అన్న పరిగణన కూడా అవసరం.

కర్ణాటకలో అయిదువరాలు ఇస్తే, ఇక్కడ ఆరు వరాలు కాంగ్రెస్ అధినాయకత్వం ప్రకటించింది. స్త్రీలకు ఉచిత బస్సుప్రయాణం, నెలనెలా భృతి, ఉద్యోగార్థులకు సాయం, ఉచిత గృహవిద్యుత్ వంటివి రెండుచోట్లా ఉమ్మడిగా ఉన్నాయి. స్త్రీలకు ఉచిత ప్రయాణం ఢిల్లీలో ఆప్‌తో మొదలై తమిళనాడు మీదుగా కర్ణాటకకు చేరిన సంక్షేమ ప్రతిపాదన. కూలీలు, కౌలుదారులతో సహా రైతాంగానికి పెట్టుబడి సాయం, ఇళ్లు కట్టుకోవడానికి డబ్బు వంటివి ఇప్పటికే కేసీఆర్‌ అమలుచేస్తున్నవాటికి అదనపు మెరుగులు ఇవ్వడమే. రైతాంగాన్ని, మహిళలను కాంగ్రెస్ ఆరువాగ్దానాలు ఆకర్షిస్తాయన్నదాంట్లో సందేహం లేదు. కేసీఆర్‌ కంటె నాలుగాకులు ఎక్కువ చదివినట్టున్న ఈ వ్యూహరచన బాగానే ఉన్నది. కానీ, కాంగ్రెస్ గెలుస్తుందని, హామీలు నెరవేరతాయని నమ్మకం కుదిరితేనే, ఈ హామీలు ఓట్లుగా మారకం అయ్యేది!


కర్ణాటకలో మునుపు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దుష్పరిపాలనలో కూరుకుపోయింది. ప్రజల మధ్య చీలికలు తెచ్చి ద్వేషవాతావరణం నిర్మించడం ఒకవైపు, అవినీతికరమైన పాలన మరొకవైపు ప్రజలను పీడించాయి. అంతేకాదు, అక్కడ బీజేపీకి నాయకత్వ లోపం ఉండింది. అంతో ఇంతో జనాదరణ ఉన్న నాయకుడిని పక్కకు తప్పించి, బొమ్మైను ముఖ్యమంత్రి చేశారు. సామాజిక సమీకరణలను కూడా బీజేపీ సరిగ్గా లెక్కకట్టలేకపోయింది. కాంగ్రెస్ విషయంలో ఒకరి కంటె ఎక్కువ మంది నాయకులు ఉన్నప్పటికీ, వారందరూ సమర్థులే. సిద్ధరామయ్యో, శివకుమారో, ఖర్గేనో ఎవరిని సిఎం చేసినా కనీస గ్యారంటీ ఉన్న ఎంపికే అవుతుంది. తెలంగాణలో పరిస్థితి అది కాదు. కాంగ్రెస్ ఎదుర్కొనవలసింది ఒక జనాకర్షణ కలిగిన నాయకుడిని. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తిని. ఆయనతో తూగదగిన ప్రత్యర్థి కావాలి. కాంగ్రెస్‌కు తెలంగాణలో ఉన్న అతి బహుళ నాయకత్వం వల్ల భారమే తప్ప లాభం లేదు. ఇక్కడ కేసీఆర్‌‌తో ప్రత్యర్థిగా కాంగ్రెస్ జాతీయ నాయకత్వమే, ప్రతీకాత్మకంగా అయినా, తలపడితే తప్ప, పోటీలో ఉన్న అసమానతలకు పరిష్కారం దొరకదు. అప్రజాస్వామికత, విధాన వైకల్యం, దుష్పరిపాలన తెలంగాణలో రాజ్యం చేస్తున్నాయి, నిజమే, కానీ అవి కర్ణాటకలో మొన్నటి దాకా ఉన్న బీజేపీ పాలనతో పోల్చదగ్గంత తీవ్రంగా లేవు. అట్లాగే, కర్ణాటకలో లేని అదనపు బాధలు తెలంగాణలో కొన్ని ఉన్నాయి. వాటికి విరుగుడు ఏదో స్థానికంగానే వెదకాలి.

వివిధ మతాల ప్రజల మధ్య సామరస్యం నెలకొల్పడాన్ని ఒక ఆదర్శంగా కర్ణాటక కాంగ్రెస్ ప్రచారం చేసింది. ద్వేషపు బజారులో ప్రేమ దుకాణం తెరిచానన్న రాహుల్ గాంధీ జోడో యాత్ర కూడా అందుకు తగ్గ వాతావరణాన్ని కల్పించింది. కర్ణాటక జనసమాజంలో లౌకికతత్వం దృఢంగా ఉన్న మాట నిజమే కానీ, మైనారిటీలు కాంగ్రెస్ వెనుక బలంగా సమీకృతులు కావడం అక్కడ విజయానికి ఒక ముఖ్యమైన, కీలకమయిన నేపథ్యం. తెలంగాణలో మైనారిటీలు కేసీఆర్‌ విషయంలో భిన్నమయిన అభిప్రాయం కలిగి ఉన్నారు. కేసీఆర్‌ హయాంలో సాపేక్షంగా మతసామరస్య వాతావరణం నెలకొని ఉన్నది. మైనారిటీలు మెరుగైన భద్రతతో ఉన్నారు. అదే సమయంలో మజ్లిస్‌కు, బీఆర్ఎస్‌‌కు బీజేపీతో రహస్య అవగాహన ఉన్నదన్న అభిప్రాయం ముస్లిమ్ మైనారిటీలలో క్రమంగా వ్యాపిస్తున్నది. మతతత్వ వాతావరణం, మైనారిటీలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించడం వంటివి, జాతీయస్థాయి విధానాలకు సంబంధించినవి కాబట్టి, కేంద్రంలో బీజేపీని ఓడించగలిగే పార్టీకే ఓటు చేయాలన్న పట్టుదల వారిలో పెరుగుతున్నది. తెలంగాణలో కూడా ఆ సమీకరణ జరుగుతుందా, బీఆర్ఎస్‌, మజ్లిస్ స్నేహం దానికి పై ఎత్తు ఎట్లా వేస్తాయి అన్నవి మున్ముందు తెలుస్తుంది. రాష్ట్ర ఎన్నికలలో కూడా తన వెనుక మైనారిటీలను కూడగట్టగలిగితే ప్రగతిభవన్‌కు కాంగ్రెస్ అడుగులు చేరువ అయినట్టు. కర్ణాటక నుంచి గ్రహించవలసిన ముఖ్యమైన పాఠం ఇది.

హైదరాబాద్ రాజ్యంలో భాగంగా ఉన్న ఉత్తరకర్ణాటక (కళ్యాణకర్ణాటక)లో కాంగ్రెస్‌కు మంచి ఆదరణ లభించింది కాబట్టి, తెలంగాణ అంతటా అదే ధోరణి ఉంటుందని అన్వయాలు చెబుతున్నారు. దక్షిణ తెలంగాణలో అనేక అసంతృప్తులు ఉన్నాయి కానీ, హైదరాబాద్ నగరంలోను, ఉత్తర తెలంగాణలోను కేసీఆర్‌‌ను ఎదుర్కొనడం ఏమంత సులభం కాదని గుర్తించాలి. క్షేత్ర స్థాయి సమస్యలను ఆధారం చేసుకుని సూక్ష్మస్థాయిలో పనిచేస్తేనే ఫలితానికి అవకాశం ఉంటుంది. వివిధ ప్రజాసంఘాలను సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో సానుకూల భావవాతావరణాన్ని కల్పించడం కర్ణాటక అనుభవంలోని మంచి పాఠం.

కర్ణాటకలో ఉన్న మత విభజనను బలహీనపరచడంలో కన్నడ ఐక్యత అన్న ప్రాంతీయ, భాషా అస్తిత్వ భావన కూడా దోహదం చేసింది. ఎన్నికలకు ముందు వచ్చిన ‘దహీ’, ‘అమూల్–, నందిని’ వివాదాలు కన్నడ సమాజంలో ఏది బలమైన అస్తిత్వ ఉద్వేగమో నిరూపించాయి. ఉత్తరాది ఆర్థిక, సాంస్కృతికప్రయోజనాలకే బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తోందన్న అవగాహనను ఆ వివాదాలు అందించాయి. తెలంగాణలో అటువంటి బలమైన భావోద్వేగాలు లేవు. తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న కాలంలో కూడా, కాంగ్రెస్ పార్టీ ఉద్యమ ఉద్వేగాలకు ప్రతినిధిగా లేదు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, 2018లో ఎన్నికల నినాదాలలో కానీ తెలంగాణ వాదం అన్నది కాంగ్రెస్ నోట పలకలేదు. రాష్ట్ర విభజన మీద నరేంద్రమోదీ మళ్లీ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఖండించడం, ఎన్నికల కోసమే అయినా, ఒక మార్పుగా, తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవడంగా భావించాలి. తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చినవారికి 250 గజాల స్థలం ఇచ్చే వాగ్దానం కూడా ఉద్యమపార్శ్వాన్ని స్పృశించిన అంశం. ఉద్యమభాష మాట్లాడడంలో కాంగ్రెస్ ఇంకా తొలిఅడుగులలోనే ఉన్నది. జాతీయపార్టీ పెట్టి తనను తానే నిరాయుధం చేసుకున్నారు కాబట్టి సరిపోయింది కానీ, కేసీఆర్‌ ప్రాంతీయపార్టీ నేతగానే ఉండి, ఆవేశాలను రగిలిస్తే, కాంగ్రెస్ వారు తట్టుకోగలరా?

తుక్కుగూడ సభతో మంచి ప్రారంభమే జరిగింది కానీ, కాంగ్రెస్ ఇంకా చాలా అలవర్చుకోవలసి ఉంది, చాలా ఆకళింపు చేసుకోవలసి ఉంది. కన్నడ మంత్రం యథాతథంగా తెలంగాణలో పనిచేయదు. ‍వృత్తి వ్యూహకర్తలతో పాటు, జనంనాడి తెలిసిన ఉద్యమనేతలను కూడా తంత్రరచనలో భాగస్వాములను చేస్తే ఉపయోగం ఉంటుంది.

కె. శ్రీనివాస్

Updated Date - 2023-09-21T01:49:05+05:30 IST