‘న్యూ ఇండియా’ మీద ‘ఇండియా’ గెలుస్తుందా?

ABN , First Publish Date - 2023-07-20T01:59:29+05:30 IST

ఏక్చహ్ రే పే కయి చహ్ రే (ఒక ముఖం మీద అనేక ముఖాలు).. 70లలోని ఈ హిందీ పాటను గుర్తు చేశారు మోదీ. ‘‘ఆ ముఖాలన్నిటిని కలిపిచూస్తే దేశప్రజలకు అవినీతే కనిపిస్తుంది...

‘న్యూ ఇండియా’ మీద ‘ఇండియా’ గెలుస్తుందా?

ఏక్చహ్ రే పే కయి చహ్ రే (ఒక ముఖం మీద అనేక ముఖాలు).. 70లలోని ఈ హిందీ పాటను గుర్తు చేశారు మోదీ. ‘‘ఆ ముఖాలన్నిటిని కలిపిచూస్తే దేశప్రజలకు అవినీతే కనిపిస్తుంది. జనం దాన్ని అవినీతి కూటమి అని పిలుస్తారు’’ అని తనకు వ్యతిరేకంగా మోహరిస్తున్న ప్రతిపక్ష పార్టీలకు తన ప్రతిపదార్థమేమిటో చెప్పేశారు. ముఖౌటాల కాలం నుంచి ఏ ముసుగూ అక్కరలేని పారదర్శక స్థితికి ఎన్డీయే చేరుకున్నది. మోదీ ఏమిటో జనానికి తెలుసును. దాన్ని ఆయన దాచిపెట్టరు. ఆయన ప్రదర్శిస్తున్నదే ఆయన ఓటర్లు కోరుకునేది కూడా.

అట్లాగని, నరేంద్రమోదీ అంతా పారదర్శకమే అనడానికి లేదు. ఎందుకైనా మంచిదని ఆయన కూడా కొన్ని కవచాలు ధరిస్తారు. తప్పులు చేస్తానేమో కానీ, తప్పుడు ఉద్దేశంతో చేయను అని మంగళవారం నాడు 38 పార్టీల ఎన్డీయే సమావేశంలో అన్నారు. ఈ సమయంలో ఆత్మరక్షణలో పడి తప్పుల గురించి మాట్లాడుతున్నారా అనిపిస్తుంది కానీ, 2019లో తన ప్రభుత్వం రెండోమారు అధికారంలోకి వచ్చిన సందర్భంలో కూడా ఇటువంటి మాటలే అన్నారు– తప్పులు చేస్తాను కానీ, తప్పుడు పనులు చేయనని. చర్యల నుంచి ఉద్దేశ్యాలను వేరుచేయడం చాలా కష్టం. ప్రాంతీయ ఆకాంక్షల ఇంద్రధనుస్సు గురించి, భిన్నాభిప్రాయాలు కలిగినవారిని కూడా గౌరవించడం గురించి మోదీ చెప్పినవాటిని ముఖవిలువతో తీసుకోవడం ఎంతో కష్టం. ఆ సభకు వచ్చిన ముప్పై ఏడు పార్టీల అంగుష్ఠమాత్ర నాయకులు మాత్రం వాటిని నిజమనుకోగలరా? అనుకున్నా, ఎన్టీయే భాగస్వామ్యపార్టీలకు ఓ వాట్సాప్ గ్రూపు పెట్టమని తప్ప అంతకు మించిన కోరికలేమి కోరగలరు?

ఇదంతా ఉత్తినే. వాళ్లు అన్ని పార్టీలను కూర్చి మీటింగ్ పెట్టారని, మేం కూడా ఈ షో చేస్తున్నాం అని ఒక ఎన్టీయే నాయకుడు ఒక విలేఖరితో అన్నాడట. ముప్పై ఏడు పార్టీలను కూడగట్టడం ప్రదర్శనే. అది ముప్పై ఎనిమిదో పార్టీ చేసిన ప్రదర్శన. ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే ప్రజ, ఒకే పరీక్ష, ఒకే భాష అని అంతా ఒకటో ఎక్కం చదువుతారని బిజెపి మీద విమర్శ కదా? సహచర పార్టీలతో సంప్రదింపులు ఉండవని, మాట వరసకు కూడా ఎన్డీయే సమావేశాలని నిర్వహించదని పేరున్న పెద్దన్న పార్టీ, చిన్నాచితకా జనాన్ని కూడగట్టుకుని బాహుళ్యాన్ని ప్రదర్శించడమేమిటి? చిన్నాపెద్దా అంతా సమానమేనని పలకడమేమిటి? తమ పార్టీకి చెందని పెద్దలను కూడా స్మరించుకోవడమేమిటి? కొత్తగా నామకరణం చేసుకున్న 26 పార్టీల ప్రతిపక్ష కూటమి మొదటి విజయం ఇందులోనే ఉన్నదనిపిస్తుంది. ‘‘వాళ్లదిలాగా మన కూటమి బలహీనతకు చిహ్నం కాదు, బలానికి గుర్తు’’ అని మోదీ అన్నారు కానీ, బెంగుళూరులో కాంగ్రెస్ తదితర పార్టీలు మోహరింపు సమావేశం జరుపుతున్న రోజునే, ఉనికి తెలియని అనేక పార్టీలతో బలప్రదర్శన చేయాలని అనిపించడమే ఆశ్చర్యకరమైన బలహీనత.

ఇల్లలుకగానే పండుగ కాదు. బెంగుళూరు భేటీ సజావుగా జరిగినంత మాత్రాన ప్రతిపక్షాలు జబ్బలు చరుచుకోవడం సరికాదు. నిజమే, బారసాల ఘనంగా జరిగింది. పెట్టిన పేరు సంచలనం కలిగించింది. గతంలో అనేక కూటములు ఏర్పడ్డాయి, అనేక పేర్లు విన్నాము. అందరి అభిప్రాయాలు కలసివచ్చేట్టుగా, పలకడానికి సులువుగా ఉండే పేర్లు పెడతారు. అంతకు మించి పేర్లకు ప్రాధాన్యం ఉండదు. పేర్ల మీద ఆయా కూటముల పురోగతి ఆధారపడదు. యుపిఎ అన్నంత మాత్రాన అందులో, ఐక్యత, ప్రగతిశీలత ఉన్నట్టు కాదు, ఎన్‌డిఎ అన్నంత మాత్రాన అందులో జాతీయత, ప్రజాస్వామికత ఉన్నట్టూ కాదు. ఇప్పుడు ‘ఇండియా’ అన్న పేరును ప్రతిపక్ష కూటమి సుదీర్ఘమైన పేరుకు క్లుప్తనామంగా స్వీకరించారు. భారత జాతీయ అభివృద్ధికర సమ్మిశ్రిత కూటమి లేదా సంఘటన. ‘ఇండియా’ అన్న పేరు ఒక గౌరవ భావనను, సాత్విక భావాన్ని కలిగిస్తుంది. ఆ పేరు నీడలో ఉన్న వారిని విమర్శించడంలో, కూటమిని దూషించడంలో ప్రత్యర్థులకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే, అది అధిగమించలేని అవరోధమేమీ కాదు.

పోటీగా ఎన్డీయే కొత్త పేరు పెట్టుకోలేదు కానీ, తమ కూటమి క్లుప్తనామానికి మోదీ కొత్త వ్యాఖ్యానం ఇచ్చారు. ఎన్ అంటే న్యూ ఇండియా, డి అంటే డెవలప్డ్ నేషన్, ఎ అంటే యాస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా. అంటే ఇండియాకు పోటీగా న్యూ ఇండియా అన్న మాట. ప్రజలు అభివృద్ధి చెందిన దేశాన్ని కాంక్షిస్తున్నారు, అది న్యూ ఇండియా. ఈ ఆకాంక్షకు అవినీతి, వంశపారంపర్యపాలన అవరోధాలు.

ఈ న్యూ ఇండియా అన్నది కొత్త మాట కాదు. అది కేవలం అభివృద్ధి చెందిన దేశాన్ని సూచించేది మాత్రమే కాదు. అందులో మెజారిటీ వాదం ఉన్నది. మైనారిటీలను రెండవశ్రేణికి తగ్గించడం ఉంది. భావ స్వేచ్ఛను నియంత్రించడం ఉన్నది. ప్రగతిశీలతే నేరంగా భావించే సాంస్కృతిక వాదన ఉన్నది. సమాజం మీద, ముఖ్యంగా అల్పసంఖ్యాకుల మీద, బలహీనుల మీద నిర్బంధాలకు ఆమోదం, రాజకీయ సాంఘిక నియంతృత్వాలకు సమ్మతి లభించే గమ్యస్థానమే న్యూ ఇండియా. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడచిన సందర్భంలో, 2017లో మోదీ న్యూ ఇండియా సాధనకు పిలుపు ఇచ్చారు. 75 ఏళ్ల నాటికి, అంటే 2022 నాటికి, కొత్త భారతదేశాన్ని రూపొందించాలన్నది లక్ష్యం. అంటే ఇప్పుడు మనం ఉంటున్నది న్యూ ఇండియానే! భారతదేశం తన సారాంశంలో ఎట్లా మారిపోయిందో, న్యూ ఇండియా అవతరించిందో ఎవరికి వారు వ్యాఖ్యానించుకోవచ్చు. ఇప్పుడు ప్రతిపక్ష కూటమి చెబుతున్న ఇండియా, వెయ్యేళ్ల ‘పరాయి’ పాలనలో, అనంతరం కాంగ్రెస్ వంశపారంపర్య, అవినీతికర పాలనలో మగ్గిపోయిన ఇండియా. తాను వచ్చి ఆ ఇండియాను ఉద్ధరించి కొత్త ఇండియాను రూపొందిస్తే, ఇప్పుడీ ప్రత్యర్థి కూటమి తిరిగి పాతరోజులకు తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తోంది–ఇదీ మోదీ వాదన! తాము తమ దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగించి అవినీతిపరులుగా నిర్ధారించినవారందరూ జట్టుకట్టి, ఇప్పుడు తన మీద యుద్ధానికి వస్తున్నారు, నాకు కుటుంబం లేదు, స్వార్థం లేదు, దేశం తప్ప మరో ధ్యాస లేదు, నన్ను రక్షించుకోవలసింది మీరే–ఇదీ నరేంద్రమోదీ నివేదన! వీటి ప్రభావాన్ని అధిగమించడం ఏమంత తేలిక కాదు!

కాంగ్రెస్ ‘ఇండియా’ వివరణలో కూడా డెమొక్రసీ లేదు. మోదీ ‘ఎన్డీయే’కు ఇచ్చిన వివరణలో కూడా డెమొక్రసీ మాయం అయింది. ఇద్దరూ డి ఫర్ డెవలప్‌మెంటే అంటున్నారు. కాకపోతే, ఇరవయ్యారు పార్టీల ప్రతిపక్ష కూటమి చేసిన తీర్మానంలో ‘భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న’ సంకల్పం వ్యక్తమయింది. ‘ప్రజలకు మేం ఒక ప్రత్యామ్నాయ రాజకీయ, సామాజిక, ఆర్థిక ఎజెండాను అందిస్తామని వాగ్దానం చేస్తున్నాం. పరిపాలన హెచ్చు సంప్రదింపుల తీరులో, ప్రజాస్వామికంగా, ప్రజాభాగస్వామ్యంతో ఉండేట్టుగా చూస్తామని హామీ ఇస్తున్నాం’ అని ఆ తీర్మానం చాలా పెద్దమాటలే మాట్లాడింది. పార్టీలు చేసుకునే ఎన్నికల సర్దుబాటు మాత్రమే కాదని, ఈ ప్రతిపక్ష కూటమి విధానపరమైన ప్రత్యామ్నాయాన్ని కూడా ప్రజల ముందుకు తెస్తుందన్న సూచన అయితే ఆ తీర్మానం చేసింది.

బెంగళూరు మీటింగ్‌కు ఇంత ప్రాధాన్యం దొరకకపోను, నరేంద్రమోదీ ఆయన పార్టీ పనిగట్టుకుని పోటీ సమావేశం పెట్టకపోతే. గాలి మరో వైపు తిరుగుతున్నదని ప్రభుత్వానికి తెలిసివస్తోంది. అధికార కూటమిలో, ఒకే ఒక్క మహాకాయుడు, అనేకమంది అల్పజీవులు. ప్రతిపక్ష కూటమి పెద్దాచిన్నా చితకా మిశ్రమం. ఈ రెండిటికి వెలుపల ఉన్నవారు, ఆచరణలో ప్రభుత్వపక్షానే ఉన్నారు కానీ, ప్రస్తుతానికి తటస్థంగా ఉండాలనుకుంటున్నారు. ఆ తటస్థతలో కూడా మాయా తటస్థత కొందరిది. అనిశ్చిత పరిస్థితి మరి కొందరిది.

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ, మసక మసకగా ఉన్న దృశ్యాలు స్పష్టమవుతాయి. డిసెంబరులో రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తరువాత మోహరింపులు మరింత వేగవంతం అవుతాయి. ఈ లోపల అధికారం చేతిలో ఉన్నవారు, ఏ మాయాజాలాలకు పాల్పడతారో తెలియదు. ఓట్ల రాజకీయాలు సామాజిక సమీకరణాలతో చెట్టపట్టాలు వేసుకుని, క్షేత్రస్థాయిలో కొత్త బలశిబిరాలు ఏర్పడవచ్చు. ఏవేవో ఆవేశాలు, ఉద్వేగాలు ఉన్నట్టుండి విరుచుకుపడి మనుషుల విచక్షణను ప్రభావితం చేయవచ్చు. కలసి ప్రయాణిద్దామని కంకణం కట్టుకున్న కూటమి, ఒకరికొకరు పొసగక, అలకలతో ఆగ్రహాలతో చెల్లాచెదరు కావచ్చు, ఏమో, ఏమైనా జరగవచ్చు.

రానున్నది ఉద్రిక్త రాజకీయ కాలం. అనేక శక్తులు తమ తమ ప్రయోజనాల సాధనకు ఒకే దిశగా, భిన్న దిశలలో ప్రయాణించే కాలం. ఇండియా గెలుస్తుందా, న్యూ ఇండియా నిలుస్తుందా అన్న ప్రశ్నకు, ఇప్పుడు వేదికల మీద కనిపిస్తున్న ముఖాలలో కాదు, నిరాసక్తులుగా, అజ్ఞానులుగా, నిర్లిప్తులుగా, ఉన్మాదులుగా కనిపించే సామాన్యుల అంతరంగాలలోనే సమాధానం దొరుకుతుంది. ఒక ముఖంపై అనేక ముఖాలను మనుషులు తొడుక్కుంటారు, వారిని అంచనా వేయడం కష్టం. మంత్రముగ్ధులయినట్టుగా కనిపిస్తున్న వారే, మనసులో మరో నిర్ణయానికి వచ్చి ఉండవచ్చును కూడా.

కె. శ్రీనివాస్

Updated Date - 2023-07-20T01:59:29+05:30 IST