మూడు పార్టీల మ్యూజికల్ చెయిర్స్!

ABN , First Publish Date - 2023-06-08T00:43:36+05:30 IST

కొంచెంకొంచెంగా కాంగ్రెస్ మీద కేసీఆర్ స్వరం పెంచుతున్నారు. పోయిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెసే ప్రధాన ప్రత్యర్థి అయినా, అది అప్పుడు మహాకూటమి అనే మహాపరాధానికి ఒడిగట్టి, మహాఓటమిని పొందింది...

మూడు పార్టీల మ్యూజికల్ చెయిర్స్!

కొంచెంకొంచెంగా కాంగ్రెస్ మీద కేసీఆర్ స్వరం పెంచుతున్నారు. పోయిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెసే ప్రధాన ప్రత్యర్థి అయినా, అది అప్పుడు మహాకూటమి అనే మహాపరాధానికి ఒడిగట్టి, మహాఓటమిని పొందింది. ఆ తరువాత కేసీఆర్‌కు కాంగ్రెస్‌ను తిట్టే అవసరం రాలేదు. బీజేపీ ఉనికిని నెమ్మది నెమ్మదిగా రాజేస్తూ పోయారు తప్ప, కాంగ్రెస్‌ను ఖాతరు చేయలేదు. కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచాక, అది కూడా ఫలితాలు వచ్చిన రెండుమూడు రోజులకు గానీ స్పందించలేదు. ‘అదో పెద్ద విషయమా!’ అన్నారు మొదట, ‘‘దేశాన్ని భ్రష్టు పట్టించిందే కాంగ్రెస్, దాని మాటలను తెలంగాణలో ఎవరూ నమ్మరు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎవరూ కర్ణాటక ఫలితాలను పట్టించుకోవద్దు’’ అని ముక్తాయింపు ఇచ్చారు. మొన్న ఆదివారం నాడు నిర్మల్ సభలో మాట్లాడుతూ, కాంగ్రెస్ వస్తే ధరణిని రద్దు చేస్తారని హెచ్చరించారు. నాగర్ కర్నూల్‌లో మాట్లాడుతూ, కాంగ్రెస్ గనుక అధికారంలోకి వస్తే, ఇంతకాలం తెలంగాణ సాధించిన అభివృద్ధి అంతా నాశనం అవుతుందని అన్నారు.

ప్రధాన ప్రత్యర్థి హోదాను ఎవరికి ఇవ్వాలో తానే నిర్ణయించే స్థాయిలో కేసీఆర్ ఉంటూ వచ్చారు. ఇద్దరు ప్రత్యర్థుల మధ్య కప్పల తక్కెడ నిలబెట్టి వినోదం చూశారు. కానీ, ఇప్పుడు, ఆయన ఇవ్వడం వల్ల కాక, కాంగ్రెస్ పార్టీకి సొంతంగానే ప్రత్యర్థి హోదా సమకూరుతున్నట్టు కనిపిస్తోంది. భారతీయ జనతాపార్టీ ఎందుకనో ఈ మధ్య నీరసించిపోయింది, కేసీఆర్ కూడా దాని మీద ప్రత్యేకంగా గురిపెట్టడం లేదు. కాంగ్రెస్‌లోనే ఉంటాయనుకున్న అంతర్గత సమస్యలు, కలహాలు, ఫిర్యాదులు, బాహాటపు ధిక్కారాలు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కూడా కనిపిస్తున్నాయి. తీవ్రంగా, పట్టుదలగా ముందుకు పోవాలన్న ప్రోత్సాహం కూడా ఢిల్లీ నుంచి వారికి అందుతున్నట్టు లేదు.

ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ స్థిరపడుతున్నంత మాత్రాన, కేసీఆర్ లేదా బిఆర్ఎస్ పరిస్థితి బలహీనపడిందనో, పతనోన్ముఖంగా ఉన్నదనో అనుకోవడం పొరపాటు. ఇప్పటికీ, తెలంగాణలో బిఆర్ఎస్, మళ్లీ అధికారంలోకి రాగలిగినంత బలంగానే ఉంది. కానీ, అది అట్లాగే ఉంటుందని లేదు. మునుపటి వలె సౌకర్యవంతమైన ఫలితాలు, మరింత హంగును సమకూర్చే అనంతర చేరికలు, మున్ముందు కూడా జరుగుతాయని లేదు. పరిస్థితులు మారుతున్నాయి. కేసీఆర్‌కే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి కానీ, అట్లాగని నిశ్చింతగా ఉండే పరిస్థితీ లేదు.

కేసీఆర్ మాత్రమని ఏముంది, మోదీకే ఆ నిశ్చింత తగ్గిపోతోంది. భారతీయ జనతాపార్టీకి కేంద్రంలో మళ్లీ గెలవడం మాత్రమే సరిపోదు, మరింత బలంతో గెలవాలి. మరింత బలం అటుంచి, సొంతంగా మెజారిటీ రాక, ఇరవై ముప్పై సీట్లు తక్కువ పడతాయేమో అన్న భయం పట్టుకున్నది కాబట్టే, ప్రాంతీయ పార్టీల మీద మృదుమధుర వైఖరిని ప్రదర్శిస్తున్నారు. సొంతంగా గెలవలేని చోట, అక్కడ ఎందుకు అధికంగా శ్రమపడడం? శక్తియుక్తులన్నిటిని కీలకమయిన పోరాటంలో, అంటే సార్వత్రక ఎన్నికలలో కేంద్రీకరిద్దాం అని మోదీ, షా ద్వయం అనుకుంటున్నారు. ప్రతి ప్రాంతీయ పార్టీ ఎప్పుడో ఒకప్పుడు బీజేపీతో కలిసి నడిచిందే అని దేవెగౌడ అన్నమాటలో అసత్యంలేదు. ఈ దేశంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ తప్ప, మరే ప్రధాన పార్టీ కూడా బీజేపీతో పూర్తి వైరంతో లేదేమో అనిపిస్తుంది. 2024లో కాంగ్రెస్ బలం పెరగకూడదన్నది బీజేపీ రక్షణాత్మక వ్యూహం. అందుకే తెలంగాణలో తాము కాకపోతే, బిఆర్ఎస్ గెలవడాన్నే కోరుకుంటామని ఒక బీజేపీ పెద్ద నాయకుడు జనాంతికంగా అన్నది!

ప్రాంతీయపార్టీలు తక్కువ పడిన సీట్లను అరువు ఇవ్వడమే కాదు, భయపెడితేనో, ప్రలోభపెడితోనో శాశ్వతంగా సభ్యులను కూడా ఇచ్చేయగలవు. అందుకని గత తొమ్మిదేళ్లుగా తామే కొరుక్కుతిన్న, విసిరిపడేసిన, దూరం పెట్టిన చిన్నపార్టీలను, ప్రాంతీయపార్టీలను బుజ్జగించే పనిలో పడ్డారు మోదీ, షా. కొత్త పార్లమెంటు ప్రారంభానికి ముందు ఆదివారం నాడు, ప్రాంతీయ మనోభావాల ప్రస్తావన తీసుకువచ్చారు మోదీ. సెంగోల్లో ప్రాంతీయ, జాతీయవాద ఉద్వేగాల మేళవింపు చూడవచ్చు.

బీజేపీకే కాదు, కాంగ్రెస్‌కు కూడా బిఆర్ఎస్ ఆపద్ధర్మ బంధువే. కర్ణాటక తరువాత తెలంగాణలో బీజేపీని తుడిచిపెట్టే పని జరుగుతుందని రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన ప్రకటన అనేక కనుబొమలను నాట్యం చేయించింది. తెలంగాణలో బిఆర్ఎస్‌ను కదా కాంగ్రెస్ ఓడించవలసింది అన్న సందేహం వస్తుంది, అంతర్జాతీయ వేదిక మీద తన జాతీయ అజెండా మీదనే రాహుల్ దృష్టి ఉండడం సహజమే కదా అన్న వివరణా దొరుకుతుంది. కానీ, 2024లో ప్రతిపక్షాల దశ తిరిగి, ఒక ప్రత్యామ్నాయం అవసరమైతే, కేసీఆర్ కూడా కాంగ్రెస్‌కు అవసరం అవుతారు. మరి రెండు జాతీయ పక్షాలూ, అనంతర స్నేహాల కోసం ఆశ పెట్టుకుంటే, ఎన్నికల పోరాటం ఎట్లా? కాంగ్రెస్ దృష్టి కూడా 2024 సార్వత్రక ఎన్నికలే కాబట్టి, 2023 డిసెంబర్ ఎన్నికలు పూర్తి వైరంతో, స్పర్థతో, వైమనస్యంతోనే జరుగుతాయనుకోవాలి! బీజేపీ కూడా అదే స్పిరిట్‌తో పోటీపడుతుందా? పోటీపడి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుతుందా? రెండంచెల తెలంగాణ ఎన్నికలలో చివరికి లాభపడేది ఎవరు?

ఒక్క ఏడాది కాలంలోనే, ఆ మాటకు వస్తే, ఒక్క అసెంబ్లీ ఎన్నికలతోనే, దేశంలో పరిస్థితి మారుతున్నదన్న సూచన తెలిసి, రాజకీయ వాతావరణంలో ఎంతో కదలిక వచ్చింది. ఏడాది కిందట 78 శాతం భూభాగాన్ని, 69 శాతం జనసంఖ్యను పాలించిన బీజేపీ, ఇప్పుడు 43 శాతం భూభాగానికి 44 శాతం జనాభాకు మాత్రమే పరిమితమైంది. ప్రధాని అయిన నాలుగేళ్లలో 19 రాష్ట్రాలను గెలుచుకుని మోదీ ఇందిర రికార్డును అధిగమించారు. కానీ, ఇప్పుడు కేవలం 12 రాష్ర్టాలలో మాత్రమే బీజేపీ ముఖ్యమంత్రో, ఉపముఖ్యమంత్రో ఉన్నారు. మతతత్వ అంశాల మీద ప్రజల ఆసక్తి తగ్గింది, విసుగు పెరిగింది. ఆర్థిక సమస్యల మీద, అభివృద్ధి అంశాల మీద ఆలోచన కలుగుతోంది.

అట్లాగే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద విమర్శ, విముఖత పెరిగాయి. అసంతృప్తిని రాజకీయ నిర్ణయంగా మార్చగలిగిన శక్తి రూపొందితే, ప్రజలు నిర్ణయాత్మక ఫలితాలనే అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కచాన్స్‌తోనే ప్రజలలో వ్యతిరేకతను జగన్మోహన్ రెడ్డి మూటగట్టుకున్నారు కానీ, కేసీఆర్ రెండోసారి కూడా గెలిచారు. తొమ్మిదేళ్ల పాలనకే పదేళ్ల పండుగ చేసుకుంటున్నది తన విజయాలను హోరెత్తించి, ఓటర్లను ఆకట్టుకోవడానికే. అయితే, జరిగిన మంచితో పాటు, అనేకం చెడు కూడా ఈ తొమ్మిదేళ్లలో జరిగింది. తెలంగాణ ప్రజాసంస్కృతి, రాజకీయ సంస్కృతి అంతా మారిపోయాయి. దీనికి సంబంధించిన రాజకీయ వాదన, విమర్శ ఇంకా బలంగా రూపొందలేదు. కేసీఆర్ మీద బలమైన, ఫలితాన్నివ్వగలిగిన విమర్శను బీజేపీ రూపొందించగలిగింది. అవినీతి, కుటుంబ పాలన, మజ్లిస్ స్నేహం, వగైరా. కానీ, ఆ పార్టీకి క్షేత్రబలం లేదు. కేసీఆర్‌తో గట్టి పోరాటం చేయడానికి ఇప్పుడు కేంద్రం నుంచి అనుమతి కూడా లేదు. అవినీతి గురించి, కుటుంబ పాలన గురించి మాట్లాడగలిగే నైతిక శక్తి తెలంగాణ కాంగ్రెస్‌కు ఉన్నదా అన్నది ప్రశ్న. కర్ణాటకలో సిద్దరామయ్య నాయకత్వం, బొమ్మై ప్రభుత్వంలోని విపరీతమైన అవినీతి కాంగ్రెస్‌కు ఉపకరించాయి. ప్రాంతీయ ఉద్వేగాలను కూడా అక్కడ కాంగ్రెస్ తోడుతెచ్చుకున్నది. ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్‌కు బిఆర్ఎస్ వ్యతిరేక రాజకీయ వాదన, విమర్శ అన్నవే రూపొందలేదు.

ఆశ్చర్యం ఏమిటంటే, ఇంతకాలం కష్టపడి కేసీఆర్ బీజేపీ మీద ఎటువంటి రాజకీయ దాడి చేయాలో వ్యూహ రచన చేయగలిగారు కానీ, కాంగ్రెస్ విషయంలో ఆయన నిరాయుధంగానే ఉన్నారు. ‘ధరణి’కి ప్రమాదం, 70 ఏళ్ల పాలన వంటివి పనికివచ్చే ఆయుధాలు కావు. కుక్కమూతి పిందెలు, మరుగుజ్జులు వంటి శాపనార్థాలకు కూడా కాలం చెల్లింది. ఇటీవలి రెండు మూడు మీటింగుల్లో కేసీఆర్ కానీ, కేటీఆర్‌, హరీష్ గానీ కాంగ్రెస్ మీద చేసిన విమర్శల్లో పదునూ లేదు, విషయమూ లేదు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పాత్ర పెద్దది. తొమ్మిదేండ్లుగా ఆ పార్టీ అధికారంలో లేదు. ఈ రెంటిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారాస్త్రాలను రూపొందించుకోవాలి. కాంగ్రెస్ బలపడుతూ పోతే, అదొక్కటే ఆ పార్టీకి చాలు ప్రత్యామ్నాయంగా పరిగణన పొందడానికి. దాన్ని ఎదుర్కొనడానికి మాత్రం బిఆర్ఎస్‌కు కొత్త ఆయుధాలు కావాలి.

తెలంగాణలో ముక్కోణపు పోటీ జరుగుతుందా, ప్రధానంగా రెండు పక్షాల మధ్యే పోటీ ఉంటుందా అన్నది త్వరలోనే తెలిసిపోతుంది. ఇంకా ఏ కూటమిలోకి వెళ్లకుండా త్రిశంకు స్థలంలో ఉండిపోయిన రాజకీయవాదులు ఏదో ఒక ఒడ్డుకు చేరుకుంటారా, లేదా, విడి బృందంగా మసలుకుంటారా చూడాలి. ఎంతమంది ఆటగాళ్లు పెరిగితే, అంతగా వ్యతిరేక ఓటు చీలిపోతుంది. జాతీయ స్థాయిలో అయినా, రాష్ట్రాల స్థాయిలో అయినా, ఎదుటివారిని చీల్చి బలహీనపరచడం లేదా, కూడగట్టకుని బలపడడం అన్న వ్యూహాలే రానున్న రోజులలో పోటీపడతాయి.

ఇంతటి అవకాశవాద వాతావరణం మధ్య కూడా, లాభప్రలోభ వ్యూహాల మధ్య కూడా ఏదో మంచికి ప్రాణవాయువు దొరుకుతోంది. మళ్లీ చిన్నపార్టీలకు ప్రాధాన్యం పెరుగుతోంది. తమకు ఎదురులేదని హుంకరించిన వారు నేల మీదికి దిగిరావలసి వస్తున్నది. అవకాశవాదం ఇంకా బలంగానే ఉన్నది కానీ, ప్రజలు తమ ప్రాధాన్యాలను పట్టించుకునేట్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అన్నిటికి మించి భావోద్వేగాలను కూడా అధిగమిస్తున్నారు. అసత్యాలు, విద్వేషాలు, మత విభజనలు వంటి ఆయుధాలను నిష్ప్రయోజనం చేస్తున్నారు.

కె. శ్రీనివాస్

Updated Date - 2023-06-08T00:43:36+05:30 IST