Share News

రాహుల్ ఆదర్శం అట్లా, రాష్ట్రంలో చూస్తే ఇట్లా!!

ABN , First Publish Date - 2023-10-19T01:13:24+05:30 IST

కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు ప్రకటిస్తూ పోతోంది. తీరా వాటిని అమలుచేయవలసి వచ్చేసరికి డీలా పడుతోంది. ఉదయపూర్ డిక్లరేషన్ ఎప్పటిది? పోయిన సంవత్సరం మేలో చేసిన...

రాహుల్ ఆదర్శం అట్లా, రాష్ట్రంలో చూస్తే ఇట్లా!!

కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు ప్రకటిస్తూ పోతోంది. తీరా వాటిని అమలుచేయవలసి వచ్చేసరికి డీలా పడుతోంది. ఉదయపూర్ డిక్లరేషన్ ఎప్పటిది? పోయిన సంవత్సరం మేలో చేసిన ఆ డిక్లరేషన్‌లో కులజనగణన గురించి కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా మాట్లాడింది. ఆ డిక్లరేషన్ స్ఫూర్తికి మాత్రం ఇప్పటికీ కట్టుబడలేకపోతోంది. జనాభాకు తగినంత కాకపోయినా, విద్యా ఉద్యోగాలలో మండల్ కమిషన్ ప్రతిపాదించినంత శాతమైనా బీసీలకు పార్టీ టెకెట్లు ఇవ్వడానికి అదే పార్టీ తటపటాయిస్తోంది. యాభై ఏండ్ల లోపు వారికే సగం స్థానాలు అని అదే డిక్లరేషన్‌లో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తారో లేదో తెలియదు కానీ, ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ అన్న సూత్రాన్ని గాలికి వదిలేశారు.

ఈ మధ్య బిహార్ రాష్ట్ర కులగణన పూర్తి అయ్యాక, కాంగ్రెస్ తన వైఖరిని మరింత స్పష్టం చేసుకుని అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులాలవారీ జనాభాలెక్కలు తీస్తామని చెప్పడం మొదలుపెట్టింది. కులాల లెక్కలు ఎందుకు? సమాజంలో ఏ ఏ సామాజిక శ్రేణులు ఎంతెంత ఉన్నాయో తెలుసుకోవడానికి, అదే నిష్పత్తిలో వివిధ ప్రాతినిధ్యాలు, ప్రయోజనాలు అందేట్టు చూడడానికి. 1931 జనాభా లెక్కల తరువాత, వెనుకబడిన కులాల జనసంఖ్యను ప్రత్యేకంగా గణించడం లేదు. షెడ్యూల్డు కులాలు, తెగలకు తగిన నిష్పత్తిలో రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి, వెనుకబడిన వర్గాలకు దక్కవలసిన వాటా ఎంతో తెలియాలంటే, వారి జనసంఖ్య తెలియాలి. ఉత్తరాదిలో, దక్షిణాదిలో శూద్ర కులాల ఉద్యమాలు ఎన్నో జరిగినప్పటికీ, ప్రత్యేక జనగణన డిమాండ్ బలపడడానికి ఇన్ని దశాబ్దాలు పట్టింది. ‘‘దేశానికి బీసీ ప్రధానమంత్రినే అందించాం, కేంద్రకేబినెట్‌లో పదులకొద్దీ బీసీ మంత్రులను తీసుకున్నాం’’ అని చెప్పుకునే బీజేపీ కూడా కులగణనకు అంగీకరించే ధైర్యం చేయలేకపోయింది. తన పునరుజ్జీవనానికి కొత్త నినాద ఆలంబనలను వెదుక్కుంటున్న కాంగ్రెస్ మాత్రం చొరవ చేస్తోంది. ఒకప్పుడు మండల్ వాద పార్టీలుగా పేరుపడ్డ జనతా, జనతాదళ్ కుదురు బలహీనపడిన నేపథ్యంలో కాంగ్రెస్ దాని సైద్ధాంతిక స్థానంలోకి వెళ్లాలని చూస్తోంది. మంచిదే. ఇదొక రకమైన పునస్సమీకరణం. కానీ, ఇప్పటికీ పాత వాసనలను, పాత నేతలను వదులుకోలేని కాంగ్రెస్‌లో కొత్త విలువలకు కట్టుబడగలిగే శక్తీ, సంకల్పం ఉన్నాయా?

పంచపాండవుల లెక్క మాదిరిగా తెలంగాణలో కాంగ్రెస్ బీసీ టికెట్లు 34 నుంచి 28కి, అటునుంచి ఒకటో రెండో కిందికి దిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రకటించిన జాబితాలో ఇచ్చిన పన్నెండు సీట్లలో నాలుగైదు పాత, కొత్త హైదరాబాద్‌కు చెందినవే. గాలికి పోయే పిండి కృష్ణార్పణం అన్న మాదిరిగా ఎటూ గెలవని సీట్లను బీసీలకు ఇచ్చే ఆనవాయితీ ఈ సారి కూడా కొనసాగింది. తక్కిన జాబితాలో మెరుగైన పరిస్థితిని ఊహించలేము కూడా. బీసీలకు ఈ సారి కూడా బొటాబొటి సీట్లతో సరిపెట్టడానికి ఒక సమర్ధన, సంజాయిషీ తయారైపోయాయి. ఈ సారి ఎన్నికలు జీవన్మరణ పోరాటం వంటివి. ఏమి చేసి అయినా గెలవడమే ముఖ్యం. వాటాలూ కోటాలూ సాధికారతలూ తరువాత చూడవచ్చు. గెలవగలిగే సామాజిక, ఆర్థిక పెట్టుబడులు బీసీలకు ఎక్కువగా ఉండవు.... ఇటువంటి వాదనలే వింటుంటాము. కానీ ఓటర్లలో సగానికిపైగా ఆ సామాజిక వర్గాలవారే ఉన్నారు, వారు మునుపటి వలె తమ ఓటు విలువ గురించి తెలియని స్థితిలో లేరు, వారిలో క్రమంగా అస్తిత్వభావన పెరుగుతోంది కూడా. వారిని పార్టీ గెలిపించుకుంటే, పార్టీని వారు గెలిపిస్తారు అన్న స్పృహ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి కలగడం లేదు. జాతీయస్థాయిలో పార్టీ నాయకత్వమేమో, మహిళా కోటాలో కూడా ఓబీసీ వాటాను సాధ్యం చేస్తామని అంటుంది, రాష్ట్రస్థాయిలోనేమో, ఆచరణాత్మకత సాకుతో, పూర్తి భిన్నమయిన వైఖరి చూపిస్తుంది. ఈ వైరుధ్యం ఒక తీవ్రమయిన సమస్య కానున్నది.

తెలంగాణ నుంచి 27 మంది బీసీ అభ్యర్థుల గెలుపు 1978 ఎన్నికలలోనే జరిగింది. ఆ తరువాత ఆ రికార్డు దాటలేదు. కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ, అనేక చిన్నా చితకా పార్టీలు కానీ, మొన్నటి దాకా బీజేపీ కానీ బీసీ ప్రాతినిధ్యం మీద దృ‌‌ష్టి పెట్టినవి కాదు. ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న తరువాత కూడా, పాలకరాజకీయాల చట్రంలో ఏ మార్పూ రాలేదు. ఉద్యమపార్టీ అని చెప్పుకునే పార్టీ కూడా, పెద్ద సంఖ్యలో ప్రాబల్యకులాలకే టికెట్లు ఇస్తూ వచ్చింది తప్ప, బడుగులకు అధిక అవకాశాలు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర మొదటి అసెంబ్లీలో కేవలం 20 మందే బీసీలు. అందులో అధికార పార్టీ నుంచి 15 మంది గెలిస్తే, మరో ముగ్గురిని ఇతర పార్టీలనుంచి అపహరించారు. సగం మించిన జనాభాకు ప్రాతినిధ్యం ఆరోవంతు మాత్రమే. 2018లో ఏర్పడిన అసెంబ్లీలో 23 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండగా, పందొమ్మిది మందిని టీఆర్ఎస్ సొంతంగా గెలిపించుకుంది. మరో ముగ్గురిని సేకరించుకుంది. అసెంబ్లీలో ఆ పార్టీ బలం రీత్యా చూస్తే నాలుగోవంతు మాత్రమే బీసీలు. ఈ ఎన్నికలకు విడుదల చేసిన జాబితాలో బీఆర్ఎస్ 22 మంది బీసీలకు టిక్కెట్లు ఇచ్చింది. దాని కంటె మూడో నాలుగో ఎక్కువ ఇచ్చి మమ అందామని కాంగ్రెస్ చూస్తోంది. 2018లో ఇచ్చిన 26 సీట్లను మించి ఇప్పుడు ఇవ్వడం కనీస మర్యాద కాబట్టి 27, 28 అన్న సంఖ్యలు ఊహాగానాల్లో వినిపిస్తున్నాయేమో? బీజేపీ మాత్రం ఉదారంగా నలభై దాకా ఇవ్వబోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, తెలంగాణ అధికార సామాజిక వర్గానికి బీఆర్ఎస్ ఇచ్చిన సీట్ల కంటె కాంగ్రెసే ఎక్కువ ఇవ్వబోతోందట!

ఇప్పుడు పరిస్థితి మారింది. ఒకప్పుడు బ్రాహ్మణ, బనియా పార్టీగా ఉండిన భారతీయ జనతాపార్టీ బీసీ పార్టీగా మారుతోంది. బీసీ పార్టీ అంటే బీసీలకు సాధికారత ఇచ్చే పార్టీ అని కాదు. బీసీలు అధికంగా ఆకర్షితులవుతున్న పార్టీ అని. హిందూత్వ రాజకీయాలు బీసీల ఉద్వేగాలను సంతృప్తి పరచడమే కాక, వారికి ఊహాత్మకమైన ఉన్నత ప్రతిపత్తిని కల్పిస్తున్నాయి. తెలంగాణ సమాజంలో జిల్లా కేంద్రాలలో, చిన్న పట్టణాలలో యువకులు బీజేపీపై ఆకర్షణతో ఉన్నారన్నది మునుగోడు ఎన్నికల సందర్భంగా స్పష్టమయిన వాస్తవం. ఆ యువకుల ఉత్సాహాలకు రాజకీయ రూపం బీజేపీలో దొరుకుతున్నది. మున్నూరు కాపు, ముదిరాజ్, గౌడ, యాదవ కులాల యువకులు ఆ పార్టీ కార్యకర్తల్లో అధికంగా ఉన్నారు. ఈ మధ్య ఈటల రాజేందర్ నిర్వహించిన ముదిరాజ్ సభకు లభించిన ఆదరణ, కేవల సమీకరణ ఫలితం కాదు. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని మీడియా బల్లగుద్ది చెబుతున్నా, ఈటల వదిలిపెట్టకుండా ఉండడానికి కారణముంది. బీజేపీకి ఒక వ్యూహముంది, అందులో ఈటలకు ఒక స్థానముంది.

బీజేపీ ప్లాన్ ప్రకారం, ఆ పార్టీ 20కి పైగా సీట్లు సంపాదించి, ప్రభుత్వ నిర్మాణంలో కీలకపాత్రధారి కావాలి. అది సాధ్యం అయినా, కాకపోయినా కాంగ్రెస్ మాత్రం గెలవకుండా చూడాలి. ఈ జమిలి పథకానికి అనుగుణమైన సామాజిక వ్యూహాన్ని బీజేపీ రచిస్తోంది. తెలంగాణలో రాజకీయరంగంలో మంచి ఉనికి, గ్రామీణ స్థాయిలో మంచి పట్టూ కలిగిన రెండు బీసీ కులాలు మున్నూరు కాపు, ముదిరాజ్‌ల మీద బీజేపీ కేంద్రీకరిస్తోంది. రాష్ట్ర బీజేపీలో ఆ రెండు కులాలకు చెందిన నాయకులు కీలకస్థానాలలో ఉన్నారు. ఈ రెండు కులాల వారు కాక, ఇతర బీసీ కులాలకు చెందిన యువక శ్రేణుల సహాయంతో కొన్ని స్థానాలలో గెలవడం, మరి కొన్ని స్థానాలలో 20 వేల నుంచి 30 వేల ఓట్లను సంపాదించి, ఫలితాలను ప్రభావితం చేయడం బీజేపీ వ్యూహం కావచ్చు. వీలయిన చోట్ల తాను గెలవడంతో పాటు, తక్కిన చోట్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం బీజేపీ రాష్ట్ర, జాతీయ లక్ష్యాలకు అనుగుణమైన వ్యూహం.

ఈ సమయంలో కాంగ్రెస్ కీలకమయిన బీసీ ఓట్లను దూరం చేసుకుంటున్నది. సీనియర్ బీసీ నేతలను అవమానిస్తున్నది. బీసీలకు ఎక్కువ సీట్లు కావాలని పోరుపెడుతున్న నేతలను ఈసడించుకుంటున్నది. నాయకత్వ స్థానాలలో ఉంచి, కీలకబాధ్యతలు అప్పగించిన బీసీ నేతలలో కూడా చొరవను ప్రోత్సహించలేకపోతున్నది. కర్ణాటకలో విజయానికి దోహదం చేసిన పౌరసమాజ, ప్రజా, సామాజిక న్యాయ సంస్థల సమన్వయాన్ని పూర్తిగా విస్మరించింది. ఒకవైపు ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటంగా ప్రకటితమవుతున్నది. తన వైపు మళ్లించుకోవలసిన గాలిని తెలంగాణ కాంగ్రెస్ మరో వైపు తరుముతున్నదా?

హైదరాబాద్‌లోని మజ్లిస్ సంప్రదాయ స్థానాల సంగతేమో కానీ, గ్రామీణ తెలంగాణలోని ముస్లిములలో మాత్రం జాతీయ ప్రాధాన్యాల రీత్యానే రాష్ట్రంలో ఓటు చేయాలన్న అభిప్రాయం బలపడుతున్నది. ఒక బలమైన మతసామాజిక వర్గం గుండుగుత్తగా ఒకవైపు మొగ్గుతుంటే, అధికార బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ చూస్తూ ఊరుకుంటాయనుకోవడం అమాయకత్వం. వాళ్లు ప్రతివ్యూహాలు రచిస్తారు. కాంగ్రెస్ కంటె మెరుగైన యంత్రాంగం, అంగ అర్థ బలం ఉన్నవారు ఆ వ్యూహాలను సమర్థంగా అమలుజరుపుతారు కూడా.

తెలంగాణ సమాజం ఇంకా మునుపటి వలెనే పాత దొరలకు, కొత్త దొరలకు గొడుగులు పడుతుందనుకుంటే పొరపాటు. రాష్ట్ర అధికారశ్రేణి మీద జనంలో విముఖత ఏర్పడడానికి కారణం, విచ్చలవిడిగా పెరిగిన ధనసంస్కృతి, అవధులు మీరిన భూస్వామ్య అహంకారం. పదే పదే ప్రజల ఆత్మగౌరవానికి ఎదురవుతున్న పరాభవం. ఇవే, ఈనాటి రాజకీయ వాతావరణానికి నేపథ్యాలు. ఎంచుకోబోయే పార్టీ కూడా, జుగుప్స కలిగించేంత సంపదకు, కులబలానికి పెద్ద పీటలు వేస్తే, దానిని ఎందుకు ఎంచుకోవాలి?

కె. శ్రీనివాస్

Updated Date - 2023-10-19T08:58:58+05:30 IST