ఇటు భయం తగ్గింది, అటు మొదలైంది!

ABN , First Publish Date - 2023-07-06T03:01:42+05:30 IST

మోదీఅంటే భక్తి అయినా ఉండాలి, ఈడీ అంటే భయమైనా ఉండాలి. ఈ రెండూ పనిచేయడం లేదంటే, కథ అడ్డం తిరుగుతోందన్న మాటే. భయమే ఎదురు కౌన్సెలింగ్ ఇస్తోందన్న మాట...

ఇటు భయం తగ్గింది, అటు మొదలైంది!

మోదీఅంటే భక్తి అయినా ఉండాలి, ఈడీ అంటే భయమైనా ఉండాలి. ఈ రెండూ పనిచేయడం లేదంటే, కథ అడ్డం తిరుగుతోందన్న మాటే. భయమే ఎదురు కౌన్సెలింగ్ ఇస్తోందన్న మాట. ఈటల రాజేందర్‌కు అప్పగించిన పదవో, బాధ్యతో అడిగితేనో వేచిచూస్తేనో వచ్చినది కాదని, హెచ్చరిస్తే మాత్రమే వచ్చినదని పింక్ మీడియా ఒక్కటే కాదు, పెంకి మీడియా అంతా రాస్తూనే ఉన్నది. అది నిజమేనేమో అన్నట్టు, బుధవారం నాడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని బిజెపి జాతీయ కార్యవర్గసభ్యత్వం హుటాహుటిన, హడావిడిగా వరించింది. తెలంగాణ బిజెపి అధ్యక్ష స్థానంలో మార్పు జరగగానే, ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు. సందేశం వ్యక్తమైంది.

ఇంత బేలగా మారిపోయిందేమిటి బిజెపి? కర్ణాటక ఫలితాలు ఇంతగా కుంగదీశాయా? కాంగ్రెస్ ముక్త్ భారత్ కల కాస్తా చెదిరిపోయి, ఆరడుగుల లోతున పాతిపెట్టిన ఎన్డీయేకు ప్రాణం పోసి ముస్తాబు చేయవలసిన అవసరం వచ్చింది. మెజారిటీకి తక్కువ అయ్యే లెక్కను కూడగట్టడానికి చాలా కష్టం పడవలసి వస్తోంది. అన్నిటికి మించి, భయపడవలసివస్తోంది, ఎందుకోసమైనా, ఒకసారి మొదలుకావాలే కానీ, భయం లోలోపలినుంచి తొలిచేస్తుంది.

బండి సంజయ్‌ను విమర్శించడానికి, కొండొకచో హేళన చేయడానికి కూడా ఆయనే అనేక అవకాశాలిస్తారు. కానీ, ఆయన నాయకత్వంలో తెలంగాణ బిజెపిలో ఉత్సాహం, చురుకుదనం వచ్చాయని ఎవరైనా ఒప్పుకుంటారు. ఆయనను తప్పించడం మంచిది కాదని పార్టీలో ఎన్నో వేడికోళ్లు వెళ్లాయి. చివరకు, పరివార సంస్థల నుంచి కూడా అభ్యంతరాలు వెళ్లాయి. పోనీ, ఆ ‘కిరీటం’ ఎవరికి పెడుతున్నారో వారు సంతోషంగా ఉన్నారా అంటే అదీ లేదు! ముసిరిన అసమ్మతి నుంచి ఇంతకాలం సంజయ్‌ను కాపాడుతూ వస్తున్న అభయహస్తం ప్రధాని మోదీయే అన్నారు. అయినా, ఇన్ని అండదండలున్నా, ఆయనను తప్పించక తప్పలేదు. మాతృసంస్థ కన్నా, మోదీ ఆశీస్సులకన్నా బలమైన శక్తీ, అవసరమూ ఏమై ఉంటాయి? ఊహలకేం అనేకం చేయవచ్చు, కానీ ఒక్క పేరు మాత్రమే వాస్తవానికి దగ్గరగా వస్తుంది.

ఆ ఒక్కరితో సంధి కావడమో, లేదా ప్రలోభపడడమో, బెదరడమో ఎందుకు? సామదానభేద దండోపాయాలు పనిచేయని శక్తి కాదు కదా? ఆ ఒక్కరి గుప్పిట్లో ఏదో మంత్రదండం ఉండి ఉండాలి. మద్యం కేసుకు మించిన మహాకేసు మరేదైనా అవతలిపక్షం దగ్గర ఉన్నదా? లేదా, ఆ ఒక్కరితో ఏదో ఉమ్మడి ప్రయోజనం ఉండాలి. కర్ణాటక ఇద్దరినీ బాగా భయపెట్టి ఉండాలి. కాంగ్రెస్ బలపడడంలో ఇద్దరికీ ఏదో ప్రమాదం తోచి ఉండాలి.

రాజేందర్ కోసమే సంజయ్‌ను తొలగించారని మాత్రం అనుకోలేము. ఎన్నికల నిర్వహణ కమిటీ పదవి పరవాలేదు. చేరికల కమిటీ కంటె నయమే కాబట్టి, రాజేందర్, ఆయన అనుచరులు సంబరంగా ఉండడంలో తప్పు లేదు. ఈటల నుంచి బిజెపి అధిష్ఠానం దీర్ఘకాలంలో ఏమి ఆశిస్తోందో తెలియదు కానీ, తక్షణం ఆయన పార్టీ మారకుండా ముందరి కాళ్లకు బంధం పడింది. మొత్తం వ్యవహారంలో అంతో ఇంతో లబ్ధిదారుడు ఆయనే కాబట్టి, వెంటనే ఎనిమిదో తేదీ మోదీ సభను జయప్రదం చేయవలసిన మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఆ హడావిడిలో పడి, సభ ప్రధానంగా కిషన్ రెడ్డి బాధ్యత కిందికి వస్తుందని మరచిపోకూడదు. అసలే, ఇంటిపోరుకు మారుపేరని రాష్ట్ర బిజెపికి చెడ్డపేరు పడింది!

తెలంగాణ బిజెపి గొడవల్లో జాతీయ నాయకులు కూడా పవిత్రంగా మిగలకపోవడం ఆశ్చర్యం. బండి సంజయ్‌కు, తరుణ్ ఛుగ్‌కు ఉన్న దగ్గరితనం గురించి ఏవేవో కథనాలు వస్తున్నాయి. తెలంగాణ పార్టీపై పట్టు కోసం తరుణ్ ఛుగ్‌కు, సునీల్ బన్సల్‌కు మధ్య నడచిన నిశ్శబ్ద యుద్ధం చిన్నదేమీ కాదని చెబుతున్నారు. ఇన్ని గొడవల మధ్య బి.ఎల్. సంతోష్ పేరు కూడా అప్పుడప్పుడు వినిపిస్తోంది. బిజెపి జాతీయస్థాయిలో కానీ, రాష్ట్రాల స్థాయిలో కానీ, సంస్థాగత వ్యవహారాలలో ఇట్లా ఉండేది కాదని ఆ పార్టీ సీనియర్లే బాధపడుతున్నారు. మహారాష్ట్ర పరిణామాలను చూసి అజిత్ పవార్ పదవీ లౌల్యాన్ని, శరద్ పవార్ ద్వంద్వత్వాన్ని అందరూ నిందిస్తున్నారు కానీ, రాష్ట్రాలను చేజిక్కించుకోవడం కోసమని, అప్పటిదాకా అవినీతిపరులుగా నిందించినవారినే పిలిచి పీటలు వేస్తున్నందుకు తమ పార్టీ అగ్రనేతలే సిగ్గుపడాలని పాతతరం బిజెపి అభిమానులు అనుకుంటున్నారు.

ఇప్పుడు తెలంగాణ బిజెపి ముందు, దాని బిటీమ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రాష్ట్రసమితి ముందు ఒక ప్రధాన కర్తవ్యం ఉన్నది. తామిద్దరి మధ్యా ఏ అవగాహనా, పొత్తూ, ఒప్పందమూ, ఏర్పాటూ లేవని జనాన్ని నమ్మించగలగాలి. ఎట్లా? వాస్తవాలు ఏమైనప్పటికీ, ప్రజలలో ఆ అభిప్రాయం బలంగా ఉన్నది. రాహుల్ గాంధీ మొన్న ఖమ్మంలో తన ప్రసంగంలో కూడా బిజెపి బంధువుల సంస్థ అని బిఆర్ఎస్‌ను అన్న తరువాత, ఆ ఆరోపణకు మరింత బలం చేకూరింది. బిజెపితో బాహాటపు చెలిమి రాజకీయంగా నష్టదాయకమని బిఆర్ఎస్‌కు తెలుసు. ఆ ఇద్దరూ ఒకటి అని ఎంత బలంగా నిర్ధారణ అవుతే, ద్విముఖపోటీ భావన అంతగా బలపడుతుంది. ద్విముఖపోటీలో ఫలితం తనకు అనుకూలంగా ఉంటుందో ఉండదో అన్న అనుమానం కెసిఆర్‌కు కూడా ఉన్నది. అందుకే ఇంతకాలంగా, బిజెపి, కాంగ్రెస్ లను ఒకరిని పెంచుతూ, మరొకరిని తగ్గిస్తూ తంటాలు పడ్డారు. కానీ, ఇప్పుడు పెరగడానికి బిజెపి సుముఖంగా లేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అసమ్మతి ఇంకా సజీవంగా, చురుకుగా ఉండగా, తనకే ఆసక్తి లేని బాధ్యతను కిషన్ రెడ్డి మాత్రం విజయవంతంగా నెరవేర్చగలరా? పెరగడానికి బిజెపికి నిజంగా ఆసక్తే ఉంటే, అసలు ఈ తొలగింపులు, నియామకాలు ఎందుకు?

తెలంగాణ చేజిక్కించుకోవాలన్న ఆశను బిజెపి ఇక ఈ ఎన్నికలకు వదిలేసిందన్న అభిప్రాయాన్ని రాజేందర్ ఒప్పుకోకపోవచ్చు. తను పెరిగిన వాతావరణంలో, తనచుట్టూ ఉండే మనుషులలో అప్రదిష్ట వస్తుందని తెలిసినా ఆయన బిజెపిలో చేరింది కెసిఆర్‌కు గుణపాఠం చెప్పాలన్న బలమైన కోరిక వల్ల! దానికి ఇప్పుడు ఆస్కారం లేదన్నమాట ఆయనను బాధించడం సహజం. ఈ ఊహలన్నీ చేస్తున్నవారు నాలిక కరుచుకోవలసి వస్తుందా, లేక, రాజేందరే పశ్చాత్తాపపడవలసి వస్తుందా? ఎన్నికలు బాగా సమీపించాక కానీ తెలియదు.

అయితే గియితే లోపాయికారీ ఒప్పందం ఎట్లా ఉండవచ్చు? బహిరంగ పొత్తులు ఉండే సమస్య లేదు. అసెంబ్లీ ఎన్నికలలో మేము ఉదాసీనంగా ఉంటాము, పార్లమెంటు ఎన్నికల్లో ఐదారుసీట్లతో కనికరించాలని బిజెపి అడిగినట్టు, అందుకు అవతలిపక్షం అంగీకరించినట్టు అంతా అనుకున్నారు. అంత మాత్రమే కాకపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా క్రియాశీల ‘సహకారం’ ఉండవచ్చు. ఫార్ములా ఒకటే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. దాన్ని చీల్చాలి. కాంగ్రెస్ బలంగా పోటీ ఇచ్చే చోట ఇద్దరూ బలమైన ప్రత్యర్థులే ఉంటారు, ధనబలంతో, అంగబలంతో. కొంచెం మార్పు చేర్పులతో ఇదే వ్యూహం ఖాయమని చెప్పుకుంటున్నారు. మరి, రాజేందర్ తనను బయటకు గెంటి ఇబ్బందులు పెట్టిన పార్టీ విజయానికే పనిచేస్తారా?

ఇక మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ దగ్గర నుంచి అనేక మైనర్ పార్టీలు వాటి గేమ్ అవి ఆడతాయి. మజ్లిస్ బిఆర్ఎస్‌కు తోడుగా ఉంటూ వచ్చింది. బిఆర్ఎస్, బిజెపి రెండూ ఒకటే అనేది నిజమే అయితే, మజ్లిస్‌కు పెద్ద నైతిక సమస్య ఉండదు. ఆ రెండూ ఒకటి కాకపోతే కూడా మజ్లిస్‌ను తమకు అనుకూలంగా పనిచేయించుకోగలిగిన చాకచక్యం, చాణక్యం బిజెపికి ఉంది. ఈ పక్షాలన్నీ, అసెంబ్లీ ఎన్నికలలోనే తమ సర్వశక్తులూ ఒడ్డి, బిజెపి శక్తిని యథాతథంగా నిలిపి, 2024 సాధారణ ఎన్నికలలో ఏ తేడా రాకుండా చూస్తాయి కాబోలు. ప్రజల నాడి భిన్నంగా ఉండి, అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్ సరళి ప్రత్యామ్నాయాల ఎంపికగా ఉంటే, ఈ అవకాశవాద మైనర్ పార్టీలే, అటువైపు చేయిచాస్తాయి!

ఈ చర్చలో మనం ఇంకో ముఖ్యమైన పాత్రధారిని తక్కువ అంచనా వేస్తున్నాం. తనను తాను ఓడించుకునే విచిత్రమైన క్రీడలో బిజెపి తాజాగా మాత్రమే ప్రవేశించింది. కాంగ్రెస్ అందులో సెంచరీలు కొట్టింది. ప్రజలలో కొద్దోగొప్పో సమకూరుతున్న మద్దతును, ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని తామే భగ్నం చేసుకోగల ఆత్మ వినాశ విద్యలో నేర్పరులు కాంగ్రెస్ నేతలు! దేశమంతా దడదడలాడిస్తున్న బిజెపినే బేరాలకు దింపగలిగిన కెసిఆర్, కాంగ్రెస్‌ను దాని మానాన దాన్ని వదిలేస్తారా? ఆయనకు అన్ని పార్టీలలోనూ శ్రేయోభిలాషులుంటారు. తమలోతాము కలహించుకుని, మేలు చేసేవారుంటారు.

కాంగ్రెస్‌కు ఏ మాత్రం ప్రయోజనం కలగకుండా చేయడం కోసమే, తెలంగాణలో బిజెపి సంస్థాగతంగా తన ప్రయోజనాలకు ప్రతికూలమైన నిర్ణయం తీసుకున్నది. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్‌కు విజయావకాశాలు అంత ఖచ్చితమైనవేమీ కావు. ఇప్పుడిప్పుడు ఆ పార్టీ చుట్టూ జనాభిప్రాయం కూడుతున్నది. ఈ ఏడాది తెలంగాణలో అయినా అధికారంలోకి రావచ్చునేమో కానీ, 2024లో కేంద్రంలో అధికారానికి రావడం దుస్సాధ్యం. తమ బలం మునుపటికంటే తగ్గుతుందన్నదే బిజెపి భయం. మితిమీరిన మెజారిటీకి అలవాటుపడడం ఏ పార్టీకైనా మంచిది కాదు. పెరుగుతూపోయేది విరిగిపోతుంది కూడా!

కె. శ్రీనివాస్

Updated Date - 2023-07-06T03:01:42+05:30 IST