అవమానం కాదు కామ్రేడ్స్, ఇది ఒక అవకాశం!

ABN , First Publish Date - 2023-08-24T02:31:21+05:30 IST

‘‘ఆముక్క లెక్కెట్టుకోక ముందు చెప్పాలి’’ కేసీఆర్ పచ్చి అవకాశ వాది అని, మిత్ర ధర్మం మరిచాడని, అతన్ని ఓడించి తీరతామని ఇప్పుడు వీరంగం వేయడం కాదు, పిలుపుకోసం చాతకపక్షిలా...

అవమానం కాదు కామ్రేడ్స్, ఇది ఒక అవకాశం!

‘‘ఆముక్క లెక్కెట్టుకోక ముందు చెప్పాలి’’

కేసీఆర్ పచ్చి అవకాశ వాది అని, మిత్ర ధర్మం మరిచాడని, అతన్ని ఓడించి తీరతామని ఇప్పుడు వీరంగం వేయడం కాదు, పిలుపుకోసం చాతకపక్షిలా ఎదురుచూస్తున్నా ఏ చినుకూ విదల్చనప్పుడే తెగించి తెగదెంపులు చెప్పి ఉండవలసింది. ఇప్పుడు, జరగవలసినదంతా జరిగాక, మిమ్మల్ని వుట్టి వెర్రిజెండా పార్టీలుగా లోకానికి ప్రకటించాక, నినద భీషణ శంఖము దేవదత్తమే అని రాగం తీస్తే ఏమి ఉపయోగం?

మీకు ఐదు సీట్లు ఆరు సీట్లు కాదు కదా, ఒక్క సీటు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు, మీ దారి మీరు చూసుకోండి అని మర్యాదగా చెప్పి ఉంటే, అయ్యి, ఎమ్మూకి కొంచెమన్నా మర్యాద ఇచ్చినట్టు ఉండేది. ఒకపక్కవీళ్లేమో, ఇంకా మునుగోడు కాలపు మెరమెచ్చుమాటలను తలచుకుంటూ వెచ్చటి కలలు కంటున్నారు. ఒక్కసారిగా కేసీఆర్ జాబితా ప్రకటించేసి, వామహస్తమును అత్యంత మొరటుగా వామపక్షములకు ప్రదర్శించినవాడయ్యెను. ఇప్పుడు విలపించిన ఏమి లాభము, ఆక్రోశమున ఆక్రందించిన ఏమి ప్రయోజనము?

ఉపకారికి అపకారం చేయరాదని, స్నేహంలో ద్రోహం కూడదని, మాట తప్పకూడదని అనుకోవడమంత సత్యకాలం మరొకటి ఉండదు. వామపక్షాలలో ఇంకా ఆ పాతకాలం పోకడలు ఉండబట్టే, శిరచ్ఛేదకులను నమ్మే గొర్రెల వలె మిగిలిపోయారు. కేసీఆర్ తప్పేమీ లేదు. మునుగోడు సమయంలో అవసరం పడింది, వామపక్షాలు పనికివచ్చాయి, వాడుకున్నారు. ఇప్పుడు అవసరం లేదు. కమ్యూనిస్టులు కన్నెర్ర చేసి, విడిగా పోటీ చేసి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎంతో కొంత చీలిస్తేనే ఆయన పార్టీకి ఉపయోగం! ఆ పని పెద్ద ఎత్తున చేయడానికి బీజేపీ ఉంది కదా, మళ్లీ వీళ్లు కూడా ఎందుకు? ఒక్కొక్క సీటు దండగ! ఆయన మనసు ఈ మాత్రం అర్థం అయి ఉంటే, చేతులు కాలి ఉండేవి కావు!


తరతరాలుగా తమ నెలవులుగా ఉన్న ప్రాంతాలన్నిటిని కమ్యూనిస్టులు క్రమంగా కోల్పోతున్నారు. కమ్యూనిస్టులలో ఉండిన వాడీ వేడీ కూడా తరతమ భేదాలతో చల్లబడుతూ వస్తున్నాయి. ప్రజాసంఘాల సభల్లో చూస్తే, అంతా నలభైలు యాభైలు దాటినవారే కనిపిస్తున్నారు. యువకులెవరూ కొత్తగా పార్టీలోకి రావడం లేదని నాయకులు బాధపడుతున్నారు. పైగా, మరోవైపు బీజేపీ వంటి పార్టీలలో కుర్రవాళ్ల సంఖ్య పెరిగిపోతున్నది. ఎట్లా, తమ ప్రాసంగికతను పెంచుకోవాలో తెలియని అయోమయం. బెంగాల్‌లో మూడో స్థానానికి పడిపోయారు. కేరళ మాత్రం నిలబెట్టుకోగలుగుతున్నారు. బిహార్‌లో కొత్తగా పుంజుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పూజ్యం అవుతున్నారు.

1999–2004 మధ్య కాలంలో వామపక్షాలు, ముఖ్యంగా మార్క్సిస్టు పార్టీ ప్రజారంగంలో ఎంతో క్రియాశీలంగా పనిచేసింది. ఆ కృషి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదపడింది. ఆ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టుపార్టీలు కలిసి 15 స్థానాలు గెలుచుకున్నాయి. అవి ఎవరినో దేబిరిస్తేనో, ఎవరో భిక్ష పడేస్తోనో వచ్చిన స్థానాలు కావు. కమ్యూనిస్టుల బలం ఆధారంగా వచ్చిన విజయాలు, ఉద్యమాలను ఓట్లలోకి మారకం చేసుకోగా వచ్చిన స్థానాలు. మరి ఈ ఇరవై ఏళ్లలో ఎందుకు ఉభయులూ అట్టడుగుకు పడిపోయారు? వాళ్ల బలం ప్రభావశాలిగా ఎందుకు లేదు? ఒకనాడు ఉభయతారకంగా ఉండిన ప్రధానపార్టీలతో పొత్తు, ఇప్పుడు ఏకపక్షంగా ఎందుకు మారిపోయింది? క్షేత్రస్థాయిలో ఉద్యమాలు నిర్మించగలిగి, ప్రజాభిప్రాయాన్ని మలచగలిగే శక్తే తమ అసలు రాజకీయమూలధనమన్న గుర్తింపు ఈ ఇరవై ఏళ్లలో ఎందుకు లోపించింది?

కొన్ని కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల రాజకీయాలకే దూరంగా ఉంటాయి. కానీ, ఎన్నికల అవకాశాన్ని ఉపయోగించుకుని పార్టీ లక్ష్యాలను ప్రచారం చేస్తామని, బలపరుచుకోవడానికి కృషి చేస్తామని ఉభయ కమ్యూనిస్టుపార్టీలు చెబుతుంటాయి. కానీ, ఎన్నికల రాజకీయాల లోతుపాతులేవీ వారికి అర్థం కాలేదు. డబ్బు, కులం, మతం వంటి అంశాలకు ప్రాబల్యం పెరుగుతున్నప్పుడు వారు నిరాయుధులయ్యారు. అంటే, వారిలో ఆ జాడ్యాలేవీ లేవని కాదు, వాటితో రాజకీయం చేయడంలో పోటీపడలేకపోయారు. అంతే కాదు, ప్రజలలో అస్తిత్వ ఆకాంక్షలు పెరుగుతున్నప్పుడు వాటిని గుర్తించి, వాటికి రాజకీయరూపం ఇవ్వడంలోనూ విఫలమయ్యారు. చైతన్యస్థాయి అధికంగా ఉండి, నిబద్ధతతో, ప్రగతిశీల దృక్పథంలో ఉండేవారే కమ్యూనిస్టు సంస్థలతో నిలకడగా ఉంటున్నారు. బయటప్రపంచంలో వస్తున్న మార్పులు కమ్యూనిస్టు పార్టీల శ్రేణులను కూడా ప్రభావితం చేసి, సాధారణ రాజకీయబృందాలలో ఉండే అవలక్షణాలు వారిలో పెరిగిపోసాగాయి.


మునుగోడులో తనకు ఎన్ని ఓట్లు ఉన్నాయో సీపీఐకి తెలుసు. తెలంగాణ అంతటా కలిపి ఎన్ని ఉన్నాయో తెలుసునా? మునుగోడులో బీఆర్ఎస్‌ను గెలిపించినట్టు, ఎన్ని స్థానాలలో గెలిపించగలదు? ఎన్ని స్థానాలలో ఓడించగలదు? కనీసం ఈ లెక్కలయినా ఆ పార్టీ దగ్గరున్నాయా? ఎన్నికల రాజకీయాలలో బేరసారాల శక్తి కలిగి ఉండాలంటే, ఈ వివరాలు, అందుకు తగ్గ ఆలోచనా సరళి ఉండాలి. నిజంగానే, ప్రభావమూ వేయలేని సంఖ్యలో తమ బలం ఉంటే, ఏ ఉద్యమాల ద్వారా, కార్యాచరణ ద్వారా బలాన్ని పెంచుకోగలమో ఆలోచించాలి. నిన్నగాక మొన్న పార్టీ పెట్టిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఉదాహరణ చూడండి, విరామం లేకుండా ఆయన ఎంతగా పర్యటించాడు, ఎంత మందిని కలిశాడు? ఆయన పార్టీకి తెలంగాణలో అంతకు మునుపు ఉన్న ఉనికి నామమాత్రమే కదా? ఇప్పుడు కూడా పెద్దగా పెరిగిందో లేదో తెలియదు. కానీ, సున్నా నుంచి మొదలుపెట్టి అయినా పనిచేయాలనే దృష్టి ఆ నాయకుడికి ఉన్నది. తప్పనిసరిగా, తెలంగాణలో బీఎస్పీ ఇప్పుడు కొంత ప్రభావశీలత కలిగి ఉన్నది. ఎన్ని చోట్ల గెలుస్తుంది, ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది, వంటి అంశాలకు ప్రాముఖ్యం లేదు. దానికొక స్థాయి శక్తి సమకూరింది, అది ముఖ్యం. ఎందుకు కమ్యూనిస్టుపార్టీలు తమను తాము తిరిగి కూడగట్టుకోవు?

ఆశ్చర్యకరంగా, తెలంగాణ సాయుధపోరాట ప్రాంతాలపై భారతీయ జనతాపార్టీ గురిపెట్టింది. భూస్వాములకు, పేదరైతుకూలీలకు నడుమ జరిగిన పోరాటంగా కాక, ముస్లిం రాజుకు, హిందూ ప్రజలకు మధ్య జరిగిన ఘర్షణగా చిత్రించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది, సందేహం లేదు. ఆ ప్రయత్నం కూడా తీవ్రశ్రమతో కూడుకున్నదే. ఆ పోరాట ప్రాంతాలన్నీ సాంప్రదాయికంగా కమ్యూనిస్టుల ప్రభావ ప్రాంతాలు. తమకాళ్లకింది పునాదులు చెదిరిపోకుండా ఏమి చేయాలో కమ్యూనిస్టులకు పాలుపోవడం లేదు.

కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉండడం, ఆ పార్టీలకు కాదు, ప్రజలకు అవసరం. ప్రజల కోసం పోరాటాలో, ఆందోళనలో, నివేదనలో ఏవో చేయడానికి నిజాయితీ కలిగిన కార్యకర్తలు, నాయకులు కావాలి. ప్రజల్లో ద్వేషభావాలను అనుమతించకుండా, ప్రగతిశీలతకు దోహదం చేసే వాతావరణం కావాలి. ఇవి కమ్యూనిస్టులు ఇవ్వగలరు. కమ్యూనిస్టుల ప్రభావశీలత, వారు ప్రజలలో చేస్తున్న పనికి, నిబద్ధత స్థాయికి తగిన నిష్పత్తిలో మాత్రమే ఉంటుంది. పెద్దపార్టీలకు చెలికత్తెలుగా మెలిగితే ఆ నిష్పత్తి తరిగిపోతూ ఉంటుంది. జరుగుతున్న పరిణామాలలో వారు భాగంగా ఉండకుండా, నిస్సహాయ ప్రేక్షకులుగా మారిపోతారు.

జాతీయ రాజకీయాలలో ఇవాళ కమ్యూనిస్టులకు ఒక చారిత్రక పాత్ర ఉన్నది. దానిని నిర్వహించడం వారికి గొప్ప అవకాశం కూడా. కానీ, తెలుగురాష్ట్రాలలో కమ్యూనిస్టుల ధోరణి, వారి జాతీయ ప్రాధాన్యాలకు భిన్నంగా కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారపార్టీ తన దుష్పరిపాలనతో ప్రజాందోళనలకు అనేక అవకాశాలు కల్పిస్తున్నది, అన్నిపార్టీలు బీజేపీ విషయమై మౌనంగా ఉండడం కూడా కమ్యూనిస్టులకు సొంత ఎజెండాకు ఆస్కారం కల్పిస్తున్నది. అయినా, వారి తీరు అక్కడ నిస్పృహనే కలిగిస్తున్నది.


దక్షిణాది రాష్ట్రాలలో భారతీయ జనతాపార్టీ ప్రాబల్యం తక్కువే అయినా, భావరంగంలో ప్రభావాన్ని పెంచగలుగుతోంది. వారి ప్రచారంలో కమ్యూనిస్టు వ్యతిరేకత కూడా ఒక ముఖ్య అంశంగా ఉంటోంది. అదేదో కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం వంటిది కాదు. చరిత్ర, వివిధ మానవీయ, సాంఘిక శాస్త్రాలలో ఉన్న ఆధునిక ఆలోచనలను, ‍సాంఘిక, రాజకీయ సంస్కార ఉద్యమాల ద్వారా ఇక్కడి సమాజం సమకూర్చుకున్న విలువలను వ్యతిరేకించడం. నూరేళ్ల ప్రయాణంలో కమ్యూనిస్టులు సాధించిన అనేక విజయాలు వరుసగా అణగారిపోతున్నాయి. మైనారిటీల తరువాత, ‘దేశద్రోహుల’ జాబితాలో కమ్యూనిస్టులే ఉన్నారు. ఈ ప్రమాదం గురించి కమ్యూనిస్టులు పెద్దగా ఖాతరు చేస్తున్నట్టు లేదు.

బలం తగ్గినంత మాత్రాన కుంగిపోనక్కరలేదు. ప్రయత్నిస్తే తిరిగి పుంజుకోవచ్చు. క్షేత్రస్థాయిలో పనిచేస్తూ అనేక ఉద్యమప్రాంతాలను తీర్చిదిద్దిన చరిత్ర కమ్యూనిస్టులది. ఆ ప్రయాణంలోనే బెంగాల్‌లో దీర్ఘకాలం అధికారంలో ఉన్నారు. చరిత్ర ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వల్లనే అక్కడ ఉనికికే ప్రమాదం వచ్చిందేమో? శక్తిమంతమైన మనుగడకు అధికారమే ఉండనక్కరలేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు కాకపోయినా తిరుగులేని ప్రభావం వేయగలిగిన వ్యక్తులు, సంస్థలు ఉంటున్నాయి. కేసీఆర్ వల్ల ఎదురైనది భంగపాటు అనుకోకుండా, దీన్ని ఒక అవకాశంగా తీసుకోవాలి. ఎండమావుల వెంట ఎంత దూరం పరిగెత్తినా దాహం తీరదు. తమ శక్తిని తాము తెలుసుకోవడం, దాన్ని వివేకవంతంగా వినియోగించుకోవడం చేస్తే, అదే వృద్ధికి కూడా దారితీస్తుంది.

అసెంబ్లీల్లో పార్లమెంటులో ఉనికి ముఖ్యమే కావచ్చు, కానీ, అంతకంటె ముఖ్యమైనది జనంలో ఉనికి.

కె. శ్రీనివాస్

Updated Date - 2023-08-24T02:31:21+05:30 IST