ఆయన నాయకత్వంలో అందరం సిగ్గుపడదాం!

ABN , First Publish Date - 2023-07-27T02:44:26+05:30 IST

మణిపూర్‌కూ మనకూ ఉన్న సంబంధమేమిటి? అన్న ప్రశ్న వేసుకుంటే, అదీ మనమూ ఒకే దేశం వాళ్లమని వెంటనే జవాబు చెప్పగలం. ఆ తరువాత అదనంగా మరొక్క ప్రశ్న ఎదురయితే తెల్లమొహం...

ఆయన నాయకత్వంలో అందరం సిగ్గుపడదాం!

మణిపూర్‌కూ మనకూ ఉన్న సంబంధమేమిటి? అన్న ప్రశ్న వేసుకుంటే, అదీ మనమూ ఒకే దేశం వాళ్లమని వెంటనే జవాబు చెప్పగలం. ఆ తరువాత అదనంగా మరొక్క ప్రశ్న ఎదురయితే తెల్లమొహం వేయవలసి వస్తుంది. అక్కడెక్కడో ఈశాన్యం మూలన ఉన్న కొండలూ లోయలతో ఉన్న ఒక రాష్ట్రం. భారత్‌లో భాగమా కాదా అన్న పెనుగులాటలో ఉండిన ప్రాంతం. తిరుగుబాట్లు, సైన్యం అణచివేతలు, నిర్బంధాలు, నిరసనలు, వగైరా వగైరా ప్రాంతం. ఒక సమస్యగా మాత్రమే స్ఫురించే భూభాగం. ఆ మనుషులు కనిపిస్తే, వాళ్లు నేపాల్ వాళ్లో, సిక్కిం వాళ్లో, భూటాన్ వాళ్లో, చైనా వాళ్లో కూడా మనకు గట్టిగా తెలియదు. ఢిల్లీ లాంటి చోట్ల అయితే, వాళ్లంటే హేళన. సోదరులుగా గుర్తించలేనంత పలచన. మణిపూర్ ఒక్కటే కాదు, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్‌ ప్రదేశ్, మేఘాలయ, అస్సాం... అంతా అంతే.

అటువంటి మణిపూర్, మూడునెలల నుంచి మండిపోతుంటే, మనకు చాలాకాలం చీమ కుట్టినట్టు కూడా లేకపోవడానికి దేశసమగ్రతలో ఉన్న అసంపూర్ణతలు ప్రధాన కారణం. దేశప్రజల మధ్య సోదరభావం, మమకారం ఏర్పడేట్టుగా నవభారతం రూపొందలేదు. ఇక, న్యూ ఇండియా అయితే, ఉన్న కాసింత ఐకమత్యాన్ని పెటాకులు చేసేదాకా నిద్రపోయేట్టు లేదు.

మణిపూర్ నిప్పునుంచి మన ఆకాశం నిండా పొగ అలుమున్నతరువాత కూడా, అక్కడ ఎవరు ఎవరో తెలుసుకోవాలని, ఎవరి హింసను ఎవరు అనుమతిస్తున్నారో గమనించాలని, న్యాయం ఎవరి వైపున ఉందో అర్థం చేసుకోవాలని తక్కిన దేశంలోని మధ్యతరగతి రాజకీయాసక్తులకు పెద్దగా అనిపించలేదు. అక్కడ రెండు రకాల జనసమూహాల మధ్య గొడవ జరుగుతోందన్న తటస్థ కథనంతో అతి సౌకర్యవంతంగా, సంతృప్తి చెందసాగారు. సత్యం తెలిసినవారు లేకపోలేదు. తెలియజెప్పేవారు కూడా లేరని కాదు. ఆదివాసీల అభాగ్యత గురించి, వారికి సంభవించగల తీవ్ర అన్యాయం గురించి హెచ్చరించినవారున్నారు. ఆ ఆదివాసీలు అధికం క్రైస్తవులైతే, ఎదుటి పక్షం ప్రధానంగా మెజారిటీ మతస్థులైతే ఎటువంటి సన్నివేశం రూపొందుతుందో గ్రహించినవాళ్లు ఉన్నారు. మైనారిటీలుగా ముస్లిమ్ వేదన అర్థమైనంతగా ఈ దేశపు పౌరసమాజానికి ఇంకా క్రైస్తవ కష్టం తెలియలేదని గుర్తు చేసినవారున్నారు. ఉన్నారు కానీ, వారు అతి కొద్దిమంది, వారు చేరగలిగినవారూ కొద్దిమందే. అందుకే, దౌర్జన్యం, దౌష్ట్యం వాటి తీవ్రాతితీవ్రరూపాలలో ఎదురైతే తప్ప, భారతీయ సామాజిక ప్రధాన స్రవంతి నిద్రాభంగానికి గురికాలేదు, కల్లోల పడలేదు.


కదలగానే, మన విలువల నాడీ వ్యవస్థను కలవరపరచగానే, కదిలిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. పట్టలేదు. ఒకసారి ఉద్వేగ గ్రంథులు చలించిపోగానే, స్పందనలు తీవ్రంగాను, విస్తృతంగానూ వెల్లువెత్తుతాయి. వెల్లువెత్తాయి. మే4 సంఘటన మీద చాలా గొప్ప ఆవేశాలు కవిత్వంగా మన ముందుకు వచ్చాయి. జరిగిన ఒక అమానుషానికి సమాజం కుమిలిపోయింది, కించపడింది, క్రోధంతో రగలిపోయింది. కవిత్వం గొప్ప విషయమే! కానీ, మనసు కలచివేసే సంఘటనతో మాత్రమే ఆ స్పందన సాధ్యమయింది. మనకు శతాబ్దాలుగా సహస్రాబ్దాలుగా పరిచితమైన, అందరం కథలుకథలుగా నిరసించిన అనాది నేరం తిరిగి ప్రత్యక్షమైతేనే మణిపూర్ లో జరుగుతున్నదేమిటో మనకు అర్థమయింది. సాధారణీకరణ చెందిన అత్యాచారానికి, సాధారణీకరణ చెందిన దుఃఖానికీ మాత్రమే స్పందిస్తున్నాము. అవగాహనతో వివేకంతో మాత్రమే అర్థం చేసుకోగల హింస విశ్వరూపాన్ని ఆ క్రమంలో విస్మరిస్తున్నాము.

దేశం దేశమంతా సిగ్గుపడాలి అన్నారు ప్రధాని మోదీ. మూడునెలలు కావస్తున్నా ఎందుకు పెదవి విప్పలేదో, అందరి అభ్యర్థనలు, విజ్ఞాపనలు అరణ్యరోదనలెందుకయ్యాయో, ముందాయన జవాబు చెప్పుకుని, ప్రభుత్వ సారథిగా తానే సిగ్గుపడడంలో నాయకత్వం వహించాలి. బాధపడవలసింది కానీ, సిగ్గుపడవలసింది కానీ, కేవలం నడిరోడ్డు మీద స్త్రీలను దిగంబరం చేసి తరిమినందుకో, అడ్డుపడబోయిన కుటుంబసభ్యులను చంపినందుకో, అందరి సాక్షిగానే పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసినందుకో మాత్రమే కాదు. ఆర్తనాదాలను హింసలోనే ఖననం చేసినందుకు, అసహాయులను ఆధిపత్య హింసావాదులకు అప్పగించి అంతటా నిశ్శబ్దం విధించినందుకు సిగ్గుపడవలసిన వాళ్లు సిగ్గుపడాలి. ఆదివాసీల ప్రతిపత్తినో, దానితో వచ్చే ప్రత్యేక రక్షణలనో వివాదాస్పదమైన రీతిలో మరో పక్షానికి పంపకానికి పెట్టి, దాని ఫలితంగా ఉత్పన్నమయిన ఉద్రిక్తతల ఉప్పు బయటకు అందకుండా సమాచారాన్ని నాకాబందీ చేసి నిర్వహించాలనుకున్న కార్యానికి కర్త భారత కేంద్ర ప్రభుత్వం. గతంలో కశ్మీర్‌లోనూ ఇదే జరిగింది. ఇప్పుడు మణిపూర్‌లోనూ అదే జరుగుతోంది. ఇది యాదృచ్ఛికం కాదు. సంకల్పిత ప్రయోగం.

ఇంటర్నెట్ బందుల్లో భారత్‌కు ఘనకీర్తి వచ్చేసింది. ప్రధానస్రవంతి మీడియా అని చెప్పుకునే పత్రికలు, టీవీఛానెళ్ల కంటె, సామాజిక మాధ్యమాల మీదనే ఆధారపడుతూ, రాజకీయ సామాజిక లాభాలు సాధిస్తున్న శక్తులకు ఆయా సందర్భాన్ని బట్టి పగ్గాలు వదలడం, నిషేధాలు విధించడం అలవాటై పోయింది. సత్యాన్ని మూసేయడం, అసత్యాన్ని తెరవడం ఒకే వ్యూహంలో భాగం. ఎంత కట్టడి చేసినా వాస్తవాలు బయటకు పొక్కకుండా ఉండవు. అప్పుడేమి చేయాలి? నరేంద్రమోదీ లాగా మౌనం వహించాలి. ఎవరు ఎన్నిసార్లు అడిగినా భీష్మించుకుని నోటికి తాళం వేసుకోవాలి. ఆఖరుకు యూరోపియన్ యూనియన్ పార్లమెంటు తీర్మానం చేసినా వాళ్లనే షటప్ అనాలి కానీ సీరియస్ గా తీసుకోగూడదు. జాతీయమహిళా కమిషన్ రేఖాశర్మ లాగా, చెవినిబడ్డ ఆక్రందనలను తప్పుడు చిరునామాకు ఫార్వర్డ్ చేయాలి. నా పని అంతేగా అని చేతులు దులుపుకోవాలి. అన్ని రాష్ట్రాలకు తానే రాష్ట్ర హోంమంత్రి అని భావించే కేంద్రహోంమంత్రిలాగా చిద్విలాసంగా చిరునవ్వులు చిందించాలి.


మణిపూర్ హింస ప్రమాదవశాత్తూ జరిగినది కాదు. లేదా, ద్వైపాక్షికమూ కాదు. ప్రభుత్వ ప్రోద్బలంతోనో, ఆశీస్సులతోనో, కుమ్మక్కుతోనో ఆధిక్యవర్గం బలహీనుల మీద చేస్తున్న దాడి. బాధిత పక్షం నుంచి కూడా చెదురుమదురు దాడులు జరిగి ఉండవచ్చు. కానీ, మొత్తంగా ఈ పరిణామానికి స్క్రీన్ ప్లే ముందుగా రూపొందించినదే. ఇద్దరు పాత్రధారులు మెయితీలు, కుకీలు. మొదటివారు హిందువులు. రెండోవారు క్రైస్తవులు. ఇది మరీ గీత గీసినట్టు ఉండదు. మెయితీలలో కూడా క్రైస్తవులు ఉన్నారు. కుకీలలో క్రైస్తవం తీసుకోని ఆదివాసీ విశ్వాసులు ఉన్నారు. మెయితీలు లోయలలో, మైదానాల్లో నివసిస్తారు. కుకీలు కొండప్రాంతాల్లో జీవిస్తారు. కుకీలు మాత్రమే ఆదివాసీలు. కొండప్రాంతాలలో వారి భూములకు రాజ్యాంగ రక్షణ ఉండేది. మెయితీలకు కూడా కుకీల మాదిరిగా ఎస్టీ హోదా కల్పిస్తూ కోర్టు ఆదేశించింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా అందుకు అనుకూలంగా ఉన్నది. దాని ఫలితంగా, మెయితీలు కూడా కొండప్రాంతాల్లో భూములు కొనడానికి నివసించడానికి అర్హత పొందుతారు. అధికారంతో సాన్నిహిత్యం, మెరుగైన ఆర్థిక సామాజిక వనరులు ఉన్న మెయితీలకు, కొండప్రాంతాలలో ప్రధానంగా సంప్రదాయ ఆదివాసీ పద్ధతులలో జీవించే కుకీలకు మధ్య జరిగే ‘ఘర్షణ’లు వాస్తవానికి ఎవరు ఎవరిమీద చేసే దాడులో మే4 నాటి సంఘటన నిరూపించింది. కుకీలు నివసించే కొండప్రాంతాలలో అపారమైన ఖనిజవనరులు ఉన్నాయని, వాటిని పరులకు హక్కుభుక్తం చేయడానికి మెయితీలను ఉపయోగించుకుంటున్నారని బలమైన వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కుకీలు చుట్టు పక్కల రాష్ట్రాలలో కూడా ఉనికి కలిగిన తెగ. బంగ్లాదేశ్, మైన్మార్ లలో కూడా వీరి జనాభా ఉన్నది. అందుకని, వీరిమీద చొరబాటు దారులన్న ముద్ర, క్రైస్తవం ఎక్కువ కాబట్టి దానికి సంబంధించిన ముద్రలు ఉన్నాయి. రాష్ట్రాన్ని పాలిస్తున్న బిరేన్ సింగ్ సామరస్యానికి కాకుండా, ఒక పక్షం వైపు పనిచేస్తున్నాడని స్పష్టం అవుతోంది.

నాలుగు గోడల మధ్య బంధించి హింసిస్తే తిరగబడే పిల్లిలాగా, మణిపూర్ లో అదిమిపెట్టి, అణచిపెట్టిన సత్యం విస్ఫోటించింది. సాధారణంగా వెనువెంటనే ప్రతివాదనలు గుప్పించవలసిన వాట్సాప్ యూనివర్సిటీ రెండు రోజుల పాటు దిగ్భ్రాంతిలో పడిపోయింది. ప్రధానమంత్రి మౌనమే దోషిగా బోనులో నిలబడేసరికి, ఏమి చేయాలో అసత్యవాదులకు పాలుపోలేదు. మరోవైపు, మణిపూర్ దారుణానికి దేశవ్యాప్తంగా ఒక్కసారిగా స్పందన పెరిగి, ప్రభుత్వ వ్యతిరేకతగా వ్యక్తం కాసాగింది. రెండు రోజులు సమయం తీసుకున్న తరువాత, మొదట సంప్రదాయ పద్ధతిలోనే ఫేక్ న్యూస్ మొదలయింది. మే4 సంఘటనలో ప్రముఖంగా కనిపిస్తున్న నిందితుడు ముస్లిమ్ అని ఒక వాదన చేయబోయారు. దానికేమంత విశ్వసనీయత రాకపోవడంతో, బెంగాల్‌లో జరిగినట్టు చెబుతూ ఒక బాధిత స్త్రీ విడియోను సంధించారు. నిజానికి అది ఉత్తరప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన విడియో అని తరువాత తెలిసింది. మణిపూర్‌ను ఖండించినప్పుడు, బెంగాల్‌ను ఎందుకు ఖండించరు? అన్నది వాదన. మణిపూర్ సమస్యకు నెహ్రూయే కారణం, కాంగ్రెసే కారణం అనే అరిగిపోయిన రికార్డు మళ్లీ ప్లే చేశారు. ఇక పరవాలేదు, ఆ అఘాయిత్యం వార్త బయటపడి వారం గడిచిపోయింది, ఉద్వేగాలు చల్లారి ఉంటాయి అనుకుని, కుకీల మీద ప్రతికూల ప్రచారం ప్రారంభించారు. వాళ్లు, క్రైస్తవం కలిసి చేస్తున్న ద్రోహాలు, చర్చిలు కేంద్రంగా జరిగే ఘోరాలు, సరిహద్దుల ఆవలినుంచి కుకీల చొరబాట్లు ఇవన్నీ పుంఖానుపుంఖంగా గుప్పిస్తున్నారు. అన్నిటికంటె ఘోరం, మణిపూర్ లో పోలీసుల మీద దాడులు చేయడానికి ఉద్యమకారులు నగ్నదళాలు ఏర్పాటు చేశారట! అత్యాచారాలు జరిగిన విడియో దృశ్యాలను అటువంటి నగ్నదళాల ప్రదర్శన అనుకోవాలని వారి ఉద్దేశం. వాస్తవం బయటకు పొక్కకుండా మొదట కట్టడి చేయడం, వెల్లడి అయినా అవి ప్రభావవంతం కాకుండా ఉండడానికి బాధితులనే దోషులుగా చేసే ప్రతివాదనలను నిర్మించడం ఇదీ క్రమం. అరణ్యరోదనం, సమాజం నడివీధిలోకి వచ్చినా ఉపయోగం ఉండదు!

మనలోనే భాగమైన వారి గురించి మనకు తెలియవలసినంత తెలియకపోవడం ఒక అన్యాయం. అదొకరకం సమాచార పరిమితి అనుకుంటే, ఆ అణగారిన ప్రాంతాలలోని, అణగారిన తెగలకు సంబంధించిన జీవన్మరణ సమస్యలను, వాటినుంచి ఉత్పన్నమయిన సంఘటనలను, చెలరేగే హింసను ఇతరులకు తెలియకుండా, దేశాన్నంతటినీ కౌరవసభగా మార్చివేయడం క్షమించరాని అన్యాయం. జరిగిన ఘటన అత్యాచారమో హత్యో కావచ్చు, కానీ, అమలు జరుగుతున్నది అంతకంటె మించిన వ్యూహమని గుర్తింపు కలగకపోవడం మరో విషాదం. ఇదంతా మన జ్ఞానేంద్రియాలను నిష్ఫలంచేసి, అజ్ఞాన సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసమే!

కె. శ్రీనివాస్

Updated Date - 2023-07-27T02:44:26+05:30 IST