చంద్రుడి రెండో చెక్కిలి మీద చిరుముద్దు

ABN , First Publish Date - 2023-08-17T03:45:24+05:30 IST

పరమాణువు గర్భంలోని/పరమ రహస్యాలూ/మహాకాశ వాతావరణంలోని/మర్మాలూ తెలుసుకున్నాక సరాసరి నీదగ్గరకే/ఖరారుగా వస్తాంలే/అప్పుడు మా రాయబారుల్ని/ఆదరిస్తావు కదూ నువు? (శరచ్చంద్రిక...

చంద్రుడి రెండో చెక్కిలి మీద చిరుముద్దు

పరమాణువు గర్భంలోని/పరమ రహస్యాలూ/మహాకాశ వాతావరణంలోని/మర్మాలూ తెలుసుకున్నాక

సరాసరి నీదగ్గరకే/ఖరారుగా వస్తాంలే/అప్పుడు మా రాయబారుల్ని/ఆదరిస్తావు కదూ నువు? (శరచ్చంద్రిక, శ్రీశ్రీ)

అని అడిగాడు శ్రీశ్రీ చంద్రుడిని 1950ల్లో. అప్పటికి ఇంకా రష్యా వాడు అంతరిక్షానికి వెళ్లలేదు, అమెరికా వాడు వ్యోమ యుద్ధం మొదలుపెట్టలేదు. భారతదేశం ఆ ఊహ కూడా చేయడం లేదు. ఆ తరువాత రెండు దశాబ్దాలు పోటాపోటీగా మనుషుల్ని, నౌకల్ని చంద్రుడి మీదికి పంపి అగ్రరాజ్యాలు అలసిపోయాయి. సహస్రాబ్ది చివరకు తొలిఅడుగులు వేయడం మొదలుపెట్టాయి చైనా, ఇండియా. రెండు దశాబ్దాలుగా భారత్ చంద్రుని వైపు గురిపెట్టి పనిచేస్తోంది. చిరువిజయాలు, అపజయాలు కలగలసిన ఈ ప్రయాణంలో ఇప్పుడు మూడో దశ. మానవ రాయబారులు కాదు కానీ, భారత్ తరఫున యాంత్రిక ప్రతినిధులు తరలివెడుతున్నాయి. ఈ బుధవారం అతి సమీప కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్–3 చోదకనౌక నుంచి గురువారం నాడు విడివడి విక్రమ్ అనే అవరోహణ నౌక, ప్రజ్ఞాన్ అనే అన్వేషిక వాహనం చంద్రతలం మీదికి దిగడం మొదలుపెడతాయి. ఒక వారం తరువాత, ఆగస్టు 23వ తేదీన, పూరెక్కల మీద తుమ్మెద వాలినంత మృదువుగా, అవి చంద్రుని దక్షిణ ధ్రువ తలాన్ని స్పృశిస్తాయి.

అంతా సజావుగా జరుగుతుందని, చంద్రయాన్–2 అనుభవాన్నుంచి అలవరచుకున్న జాగ్రత్తలు ఈ ప్రయోగాన్ని సఫలం చేస్తాయని, ప్రజ్ఞాన్ వేయికళ్లతో, బుడిబుడి నడకలతో చంద్రరహస్యాలను ఆకళింపు చేసుకుంటుందని దేశమంతా ఆశగా, నమ్మకంగా ఉన్నది.

దేని దారి దానిదే, నవరసాలతో ఏకకాలంలో జీవించగలగాలి. మూడుపాతికల స్వాతంత్ర్య అమృతోత్సవం ముగిసిన వేళ, ఎన్ని బీభత్స విషాదాలు, నిరాశానిస్పృహలు కుంగదీస్తున్నప్పటికీ, పొంగిపోగలిగినవి కూడా అ‍‍సలూ లేకుండా పోలేదు. అంతరిక్ష శాస్త్ర శోధనలో దేశీయ విజయాలు ఆ కోవలోకే వస్తాయి. ఇంత వ్యయప్రయాసలతో మనకు ఈ పరిశోధనలు అవసరమా, విచక్షణాయుతమైన ప్రాధాన్యాలు ఉండనక్కరలేదా అన్న ప్రశ్నలు వస్తాయి, ఈ పరిశోధనల, ప్రయోగాల ఫలితాలు అశేష ప్రజానీకం జీవితాలను మెరుగు చేయడానికి ఉపయోగిస్తున్నారా అన్న లోతైన వివేచనకు ఆ ప్రశ్నలు అవకాశం ఇస్తాయి కూడా. కానీ, ఏక కాలంలో అనేక కాలాలు, ఒకే సమయంలో ఆకాశపాతాళాలు, పక్క పక్కనే కనీసాలు విలాసాలు, అంధవిశ్వాసాలూ ఆధునికభావాలూ ఉనికిలో ఉండే అనివార్యతలు మనకు సంక్రమించాయి. అణువిజ్ఞానంలోను, అంతరిక్ష శాస్త్రంలోనూ భారతదేశపు ఘనత శాస్త్ర రంగానికే కాదు, జాతీయతాగర్వానికి కూడా ఇంధనంగా పనిచేస్తున్నది.


భూమి చుట్టూ సూర్యుడు పరిభ్రమిస్తాడనుకోవడం ప్రాచీన భారతీయ ఖగోళ విజ్ఞానంలోని ఒక పరిమితి కావచ్చు. రాహు కేతువులతో సహా, చంద్రుడిని కూడా కలుపుకుని నవగ్రహాల లెక్కలు వేసినా గ్రహణాలను, ఉదయాస్తమయాలను సరిగ్గా లెక్కవేయగలిగిన ప్రతిభ కూడా సంప్రదాయ పంచాంగానిది. శతాబ్దాల ఆకాశపరిశీలన నుంచి, అనేక పొరుగు సంస్కృతులతో ఆదానప్రదానాల నుంచి రూపొందిన కాలగణన, జ్యోతిష్యంతో ముడిపడడం ఒక వైచిత్రి. హేతబద్ధతకు, తార్కికతకు దేశచరిత్రలో కొదవ లేదు. కానీ, కాలక్రమంలో అవి కొన్నిసార్లు విశ్వాసాలతో మిశ్రితమయ్యాయి. గమనంలో ఉన్న చంద్రుడు సూర్యుడి నుంచి కిరణాలను గ్రహిస్తాడు– అని రుగ్వేదం (1.84.15) చెబుతుంది. ‘చంద్రుడు పెళ్లిచేసుకోవాలనుకుంటాడు, రాత్రింబవళ్లు అతిథులుగా వస్తారు, సూర్యుడు తన కూతురు కిరణాన్ని చంద్రుడికి కానుకగా ఇస్తాడు’ అని మరో రుక్కు (10.85.9) వర్ణిస్తుంది. చంద్రుడు స్వయం ప్రకాశుడు కాదన్న అవగాహన రుగ్వేద కాలానికే ఉన్నది.

విచిత్రంగా, ‍‍హేతువుతో ముడిపడిన సైన్స్ చుట్టూ కూడా అనేక విశ్వాసాలు ఉంటున్నాయి. చంద్రయాన్ ప్రయోగానికి ముందు జరిగిన పూజలు పునస్కారాల మీద ఎన్నెన్నో వ్యాఖ్యానాలు విన్నాము. మన దేశంలోనే కాదు, అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో కూడా అంతరిక్ష ప్రయోగాలకు ముందు ప్రార్థనలు, తతంగాలు చేస్తారట. మన దేశంలో ఈ ధోరణి మరి కాస్త ఎక్కువే. ఆయా శాస్త్రజ్ఞులకు వ్యక్తిగతంగా విశ్వాసాలు ఉండడం లేకపోవడం అన్నది ఇక్కడ ప్రస్తుతం కాదు. రాజకీయవాదులు వివిధ విశ్వాసాల ప్రజల సమ్మతి పొందడానికి రకరకాల పనులు చేస్తున్నట్టే, శాస్త్రవిజ్ఞాన సంస్థలు కూడా చేస్తాయేమో అనిపిస్తుంది. అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులందరూ తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకోవడంలో భక్తి లేదనలేము కానీ, ఏదో సమ్మతి, ఆమోదనీయత వారికి, వారి విధినిర్వహణకు ఆ దర్శనాల నుంచి లభిస్తుంది. ఒక్కోసారి అతీతశక్తి వైపు చూడడం కేవలం విశ్వాసం కాదేమో, అదొక సామాజిక చర్యనేమో అనిపిస్తుంది. దైవిక ఆజ్ఞ కోసం ఎవరూ మానవ ప్రయత్నాన్ని విరమించరు. గాలిలో దీపం పెట్టి, దేవుడి మీద భారం వేయకూడదని విశ్వాసులు కూడా నమ్ముతారు. చంద్రయాన్–2 రోవర్ దెబ్బతిన్నది. దైవానుగ్రహం లోపించడం వల్ల అట్లా జరిగిందని శాస్త్రజ్ఞలు అనుకోలేదు. మానవ తప్పిదమే అనుకుని సమీక్షించుకుని, మెరుగైన సాంకేతికతతో ఈ సారి ప్రయత్నిస్తున్నారు. మానవప్రయత్నానికి, దైవవిశ్వాసానికి నడుమ వైరుధ్యాన్ని కాక, పరస్పరతను లేదా, ఆనుషంగికతను చూడడం భారతదేశ ఆలోచనా వ్యవస్థలో కనిపిస్తుంది. నాస్తికవాదులు విశ్వాసాల మంచిచెడ్డల మీద ఎక్కువగా పట్టించుకుంటారు కానీ, భారతీయ సమాజానికి ప్రమాదకరంగా మారిన మతోన్మాదానికి, మూకమనస్తత్వానికి... సాధారణ దైవ విశ్వాసానికీ సంబంధం ఉందనిపించదు. విశ్వాసానికీ హేతువుకీ మధ్య స్నేహపూర్వక స్పర్థ, శాంతియుత సహజీవనం సాధ్యపడితే, ఇప్పుడున్న పరిస్థితులలో, అంతకు మించి కావలసినదేమున్నది?

చంద్రుడి దగ్గరకు ప్రయాణాలు మొదలైన కాలంలో, అందరి కంటె ఎక్కువగా కవులు కలవరపడ్డారు. కవిత్వానికి ముఖ్యదినుసు అయిన చంద్రుడూ వెన్నెలా ఇక భావుకత్వం నుంచి వేరవుతాయని బాధపడ్డారు. రాళ్లూరప్పల చంద్రతలంతో స్త్రీల ముఖాలను పోల్చడం ఎట్లా అని ప్రశ్నించుకున్నారు. మానవ ప్రగతిని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న ఛాందసవాదులు, చంద్రుని మీదికి మానవుడి ప్రయాణమే అబద్ధమని వాదనలు చేశారు కానీ, ఆధునిక కవులు పాపం సైన్సును కాదనలేక, కాల్పనికతను కాపాడుకోలేక బాధపడ్డారు. ఈ సమస్యను కాలమే పరిష్కరించింది. ‍ సైన్సు దారి సైన్సుదే, కవిత్వం దారి కవిత్వానిదే అనుకుని, చంద్రుడికి వెన్నెలకు మానవసృజనలో ఉండిన ప్రతిపత్తిని కొనసాగించారు. చంద్రుడిలోపల నూలువడికే ముసలమ్మ ఉన్నదని, కుందేలు పిల్ల ఉన్నదనీ చెప్పుకునే కథలకు కూడా చంద్రయానం వల్ల చెలామణీ తగ్గలేదు. రాహువు కోరలు తాకి చంద్రుడికి గాయం అయిందని, పాలసముద్రం చిలుకుతుంటే మందరపర్వతం ఒరుసుకుపోయి మచ్చపడిందని చేసే కవుల ఊహలు కూడా ఇప్పటికీ ఆనందం కలిగిస్తూనే ఉన్నాయి.

చంద్రయాన్ విశేషమేమిటంటే, మనం ఇప్పుడు మనకు కనిపించని చంద్రముఖాన్ని చేరుకుంటున్నాము. స్థిరకక్ష్య అనకూడదేమో కానీ, చంద్రుడు, భూమి కదిలే వేగాల నిష్పత్తి వల్ల కాబోలు, భూమి నుంచి చందమామ ఒకవైపే కనిపిస్తుంది. సుమారు 60 శాతం చంద్రుడే మనకు కనిపిస్తాడు. తక్కిన నలభై శాతం చంద్రుడు – చీకటి చంద్రుడు. అది పేరు మాత్రమే, అక్కడ ఎక్కువ చీకటేమీ ఉండదు, కాకపోతే, ఆ చాటుకే ఉండే దక్షిణ ధ్రువంలో ఎక్కువ చలి ఉంటుంది. ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయడానికి కష్టమయ్యే చలి ఉంటుంది. అందువల్ల ఇప్పటి దాకా చంద్రలోకపు యాత్రలు అటువైపు సాగలేదు. చంద్రయాన్–1 ఒక ‘పేలోడ్’ను చంద్రుడి మీదకు విసిరేసింది. ఆ ప్రయోగమే చంద్రుడి మీద నీటి ఆనవాళ్లను కనిపెట్టింది. ఆ తరువాత 2, 3 దశలు చంద్రతలం మీదకు రోవర్‌ను పంపి, డేటాను, ఇమేజ్‌లను సేకరించడం. అతిశీతల దక్షిణ ధ్రువ ప్రాంతంలో నమూనాలు, చంద్రుడి మూలాలను, చారిత్రకంగా నీరు, ఆవిరి వంటి జీవాధారాల ఉనికిని తెలుసుకోవడానికి పనికివస్తాయి.‍ ఆవలివైపు చంద్రుడిని ఆవిష్కరించడంలోనే ‘ఇస్రో’ ఘనత ఉన్నది.


భూమి కన్నబిడ్డే చంద్రుడు అని బలంగా ఉన్న ప్రతిపాదనను సమర్థించే ఆధారాల గురించి ‘ఇస్రో’ ఇంతకుముందే చెప్పింది. రోవర్ విఫలమైనా, చంద్రయాన్ ఆర్బిటర్ (కక్ష్యలో పరిభ్రమించే) చంద్రుడి జననం గురించిన కొత్త అంశాలను వెలుగులోకి తెచ్చింది. చంద్రుడి మీద వాతావరణం లేనప్పటికీ, భూమికి ఉన్నట్టుగా బాహ్యావరణం (ఎక్సోస్పియర్) బలహీనంగానైనా ఉన్నదనడానికి ఒక ప్రాతిపదికను చంద్రయాన్–2 కనుగొన్నది. చంద్రుడి మీది మట్టి నుంచి, శిలల నుంచి సోడియం అణువులు ఉపరితలం మీదికి చేరుతున్నాయని ఆర్బిటర్ గుర్తించింది. భూమి మట్టి తత్వానికి, చంద్రుడి మట్టికి చుట్టరికం తెలిపే ఆధారమది.

ప్రపంచానికి మనమే పెద్ద దిక్కు అవుతామని, విజ్ఞానభిక్ష పెడతామని అనుకోవడం అతిశయం అవుతుంది కానీ, మనం సైతం లోకంతో పాటు ఒక ప్రయాణంలో ఉన్నామని, మనిషిని పంపకపోయినా, మన నేత్రాన్ని అంత దూరం సారించగలిగామని, సంతోషించడంలో తప్పు లేదు!

కె. శ్రీనివాస్

Updated Date - 2023-08-17T03:45:24+05:30 IST