ప్రజాస్వామ్యం కూడా ఒక ‘పథకం’ అయితే బాగుండు!

ABN , First Publish Date - 2023-10-12T02:22:57+05:30 IST

ఎక్కడో ఎవరో ఎంతమందో రహస్యంగా నేలమాళిగలోనో, కారులు దూరని ఫామ్‌హౌస్‌ లోనో, బారులు నిండిన బీచ్‌హౌస్ లోనో కూర్చుని పుస్తకం రాసేస్తున్నారట. దేశదేశాలలో ఉన్న ఉపాయాలను కాచి వడబోసి...

ప్రజాస్వామ్యం కూడా ఒక ‘పథకం’ అయితే బాగుండు!

ఎక్కడో ఎవరో ఎంతమందో రహస్యంగా నేలమాళిగలోనో, కారులు దూరని ఫామ్‌హౌస్‌ లోనో, బారులు నిండిన బీచ్‌హౌస్ లోనో కూర్చుని పుస్తకం రాసేస్తున్నారట. దేశదేశాలలో ఉన్న ఉపాయాలను కాచి వడబోసి పుటం పెట్టి దిగుమతి చేసుకుంటారట. దిమ్మతిరిగిపోయే పుస్తకం. అందులో ఏమున్నాయో తెలిసిన రోజున ఆశ్చర్యంతో ఆనందంతో ప్రజలు కేరింతలు కొడతారట, భయంతో బెంబేలుతో ప్రత్యర్థులు ఆర్తనాదాలు చేస్తారట. ఇప్పటికే సభాముఖంగా లీక్ అయిపోయిన కాంగ్రెస్ గ్యారంటీల తాత, ముత్తాత లాగా, జేజమ్మ లాగా ఉంటుందట. ఆ గ్రంథం పేరు బిఆర్ఎస్ మేనిఫెస్టో అట.

బిఆర్ఎస్ పూర్వరూపం టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం మొదటి ఎన్నికలలో పోటీచేసినప్పుడు కూడా మేనిఫెస్టో మీద ఇంత కుస్తీ పట్టలేదు. అప్పుడు ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఉత్సాహం, రోజులు మారిపోతాయన్న ఊహ కలిసి ప్రజలే తమ మనస్సుల్లో ఇష్టం వచ్చిన మేనిఫెస్టో రచించుకున్నారు. ఇప్పుడు రెండు దఫాలు పరిపాలించిన తరువాత, పాలన జనం అనుభవంలోకి వచ్చిన తరువాత కొత్తగా మేనిఫెస్టోలో చెప్పేదేముంటుంది? తుక్కుగూడ సభలో కాంగ్రెస్ వాగ్దానాలు జనాన్ని ఆకర్షించే ప్రమాదం ఉన్నదన్న బుగులు మొదలయ్యాక, కొత్త కొత్త ఆశలను ఎట్లా రూపొందించాలా అన్న సృజనాత్మక మథన బిఆర్ఎస్ పెద్దల్లో మొదలయింది. ఈ రెండు పార్టీల నడుమ తన స్థానాన్ని వెదుక్కుంటున్న బిజెపి, పాత వాగ్దానాలను, విభజన చట్టం విధివిధానాలను నెరవేరుస్తూ, కొత్తగా ఏవో ఇస్తున్నట్టు అభినయిస్తోంది. అంతమాత్రమే కాదు, కెసిఆర్ అవినీతి సొమ్ము ప్రజల చేతికి దక్కేట్టు కక్కిస్తానని నరేంద్రమోదీ ప్రతిజ్ఞ కూడా చేశారు. దీన్నివారి మేనిఫెస్టోలో చేరుస్తారో లేదో తెలియదు. స్విస్ నల్లధనం, ప్రతి ఒక్కరి ఖాతాలో లక్షలు వంటి పాత జ్ఞాపకాల దృష్ట్యా, ఈ శపథానికి జనం నుంచి ఎంత స్పందన దొరుకుతుందో చూడాలి!

ఎన్నికల షెడ్యూలు ప్రకటన సమీపిస్తుండగానే, చివరి నిమిషపు పనుల హడావిడి పెరిగిపోయింది. ఒకపంపుతోనే మెగా ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభం జరిగిపోయింది, ముఖ్యమంత్రి అనారోగ్య ప్రవాసంలో ఉండగానే పిల్లలకు ఉపాహారపథకం మొదలైపోయింది. ఇష్ట పత్రికలకు పేజీల కొద్దీ ప్రభుత్వ విజయాల ప్రకటనలు ప్రవహించాయి. కొత్తగా చేయబోయేది సరే, చేసినవాటిని చెప్పుకోవాలి కదా, షెడ్యూలు వస్తే ప్రభుత్వ ఖర్చుతో ప్రచారం చేసుకోవడం తప్పవుతుంది కదా?

హైదరాబాద్‌కు కొత్తరూపు ఇవ్వాలనుకున్నారట, చివరకు అది విశ్వనగరంగా అవతరించిందట. ఒక ప్రభుత్వ ప్రకటనలోని అతిశయం! అందులో హైదరాబాద్‌కు సంకేత భవనం అలనాటి చార్మినారో, ఐటీ హైటెక్ సిటీయో కాదు, కెసిఆర్ హయాంలో నిర్మించిన సచివాలయ భవనం! సచివాలయం, దాని ఎదురుగా అమరవీరుల స్మారకం, అదే దారిలో అంబేడ్కర్ మహా విగ్రహం. ఈ కట్టడాలను, తీగల వంతెనతో కలుపుకొని నగరం ఒక పార్శ్వంలో వెలసిన వరుస ఫ్లయ్ ఓవర్లను ప్రదర్శించి, హైదరాబాద్ విశ్వనగరంగా మారిందని చెబుతున్నారు. అంతా పైన పటారం అని పరుషంగా అనుకోనక్కరలేదు. హైదరాబాద్ కొత్తరూపును నిరాకరించనక్కరలేదు. కానీ, జల్లు పడితే చాలు నగరం నరకం అవుతుంది. విశ్వనగరాన్ని వెక్కిరిస్తుంది. సాయంత్రమైతే చాలు నగర సమ్మర్దం నత్తనడక నడుస్తుంది. ధగధగల నిట్టనిలువు అభివృద్ధి వెనుక దగా ముందు దగా అయి మెరుస్తుంటుంది.


హైదరాబాద్ మాత్రమే కాదు, తెలంగాణ మొత్తం కూడా ఇవే మెరుపులను మెరుగులను పొందింది. ఎక్కడ పడితే అక్కడ కనిపించే జలసమృద్ధి ఒక దృశ్యం. ఎత్తిపోతల బాహుబలి పంప్ హౌస్‌లు ఒక దృశ్యం. రిజర్వాయర్లు మరో దృశ్యం. యాదాద్రి పునర్నిర్మాణం ఒక భక్తి కథా చిత్రం. మహా రహదారుల పక్కనే తళుకుమనిపించే డబల్ బెడ్‌రూమ్‌ల వరుస నమూనా ఆశల చిత్రం. తెలంగాణ మొత్తం ఈ అభివృద్ధి దృశ్యమాలికలే. పెరిగిన ధాన్యం ఉత్పత్తి లెక్కలు, తలసరి ఆదాయం గొప్పలు, ప్రవహించిన పెట్టుబడుల కుప్పలు, చెప్పుకోవడానికి చాలా ఉంది. కానీ దీపం కింద చీకటీ ఉంది. శాంపిల్ సంక్షేమం కింద అందని ఎండమావులు ఉన్నాయి.

ఆత్మహత్యలు తగ్గలేదు. వ్యవసాయ సంక్షోభం సడల లేదు. పెట్టుబడుల కంపెనీలకు భూములు ఇవ్వడం తప్ప, మరో పారిశ్రామిక విధానమే లేదు, స్థానిక పారిశ్రామికులకు ప్రత్యేక ప్రోత్సాహమే లేదు. ఉపాధి కల్పనకు యోచనా లేదు, నిరుద్యోగులకు భృతీ లేదు.

వరి వెంట పరుగులు తప్ప అర్థవంతమైన పంటల విధానం లేదు. పండిన పంటలకు ప్రాసెసింగ్ వ్యవస్థలు లేవు. సాంస్కృతిక రంగంలోను, మతసామరస్య సహజీవనంలోను పదేళ్లుగా ప్రభుత్వం చేసిన కృషి, చూపిన సమర్థత మాత్రం ప్రశంసించదగ్గవి. ఎంత లోపభూయిష్టంగా జరిగినా, చెరువుల మరమ్మతుల ‘మిషన్ కాకతీయ’ను తెలంగాణ ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు.

భారీ నీటిపారుదల ప్రాజెక్టుల ఘనత గురించి చెప్పాలి కదా అన్న సందేహం రావొచ్చు. కానీ, తెలంగాణ రాష్ట్రం రాకపోయినా, వచ్చాక మరో ప్రభుత్వం ఉండినా ఈ ప్రాజెక్టులు కాస్త అటూ ఇటూగా నిర్మితం అయ్యేవేమో? ప్రాజెక్టుల నిర్మాణం నుంచి నీళ్లు మాత్రమే కాదు, రాజకీయ నిధులు కూడా వస్తాయని మొదట గ్రహించిన రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టారు. అవే ప్రోత్సాహకాలను అందరు నాయకులూ కోరుకుంటారు కాబట్టి, కాళేశ్వరం ప్రాజెక్టు వంటివి తెలంగాణ సాధన వల్ల, కెసిఆర్ వల్ల మాత్రమే వచ్చాయని అనుకోవడం కష్టం. నీళ్ళను వెనుకకు తిప్పి పోసే ప్రాజెక్టు, క్యాష్‌బ్యాక్ ప్రాజెక్టుగా మారడమే చమత్కారం. నీటి ప్రాజెక్టుల నిధులు ఎన్నికలలో డబ్బు నీళ్లలాగా ప్రవహించడానికి కారణం కావడం విచారకరమైన వైచిత్రి. పోరాటాల సంస్కృతి అని గొప్పగా చెప్పుకునే తెలంగాణ, మునుపెన్నడూ లేనంతగా తన ఓటును అంగడి సరుకు చేసుకుందా? ఆ పతనానికి ఉద్యమ నాయకుల పాలనే ప్రోత్సాహం ఇచ్చిందా?

పదేళ్ల తెలంగాణలో ప్రజలు ఎంత బాగుపడ్డారు, నాయకులెంత లాభపడ్డారు అన్నది వేసి తీరవలసిన ప్రశ్న. ప్రజాప్రతినిధులలో అత్యధికులు అధిక సంపన్నులయ్యారు. తలసరి ఆదాయమే కాదు, ఆదాయ అంతరాలు కూడా తెలంగాణలో విపరీతంగా పెరిగాయి. కింది నుంచి పైదాకా అవినీతి విశృంఖలంగా కనిపిస్తున్నది. అక్రమంగా సంపాదించుకోవడం ఒక విలువగా మారిపోయింది. రాజకీయ నేతలకు, ముఖ్యంగా అధికార పార్టీ ఛత్రం కింద ఉన్న ఎగువ, మధ్య శ్రేణుల నేతలు, కార్యకర్తలలో తమ నైతికత మీద, ఆర్జన పద్ధతుల మీద ఎటువంటి అపరాధభావనా లేదు, జవాబుదారీతనమూ లేదు. ఉద్యమకాలంలో ఎంతో ఉన్నతంగా కనిపించిన తెలంగాణ ఆదర్శవాదం, ఇప్పుడు విచ్ఛిన్నమై, శిథిలమై, అనైతికమై, నిర్లిప్తమై పోవడం విషాదం.

తెలంగాణ ఉద్యమం ప్రధానంగా కోరుకున్నది ప్రజాస్వామ్యాన్ని కదా? ప్రాంత ప్రజల ఆకాంక్షలు, ప్రాధాన్యాలు నెరవేరడం లేదని, విధాన రచనలో భాగస్వామ్యం లేదని కదా ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నది! రాష్ట్రం వచ్చిందంటే ప్రజాస్వామ్యం కూడా వచ్చిందనుకోవడం వల్లనే కదా, మేనిఫెస్టోల్లో దాన్ని ఒక వరంగా, పథకంగా ప్రత్యేకంగా ఆశించలేదు? మానవహక్కుల రక్షణకు కట్టుబడి ఉంటామని టిఆర్ఎస్ 2014 నాటి మేనిఫెస్టోలో చెప్పుకుంది. ప్రభుత్వం పని తీరు మీద పౌరసమాజం నుంచి సమీక్షను, సలహాలను తీసుకుంటామని కెసిఆర్ అనేక సందర్భాలలో అన్నారు. మరి ఎక్కడ ఏర్పడింది, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానం? అసలు పౌరసమాజం ఎక్కడ? ఊరూరా గృహనిర్బంధాలేమిటి? తలుపులు పగులగొట్టి ప్రవేశించడాలేమిటి? ధర్నాచౌక్‌ను మూసేయడమేమిటి? అనుమతులు నిరాకరించడాలేమిటి, ఊపాలేమిటి, వేధింపులేమిటి, అడపాదడపా ఎన్‌కౌంటర్లేమిటి? కోదండరామ్ మీద, హరగోపాల్ పైన దౌర్జన్యాలేమిటి?

సచివాలయంలోకి విలేఖరులకు ప్రవేశం లేదు. ముఖ్యమంత్రిని కలవడానికి మార్గమేమిటో తెలియదు. పిలుపు లేకపోతే మంత్రులైనా ప్రగతి భవనం ముందు పడిగాపులే. తమ శాఖ వ్యవహారాలపై ఏ మంత్రికీ సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల గురించి పాలకుడి దృష్టికి తీసుకువెళ్లే ధైర్యం ఏ అధికారికీ లేదు. గుట్టలుగుట్టలుగా పేరుకుపోయే ప్రజాసమస్యల దస్త్రాలు! వారాల తరబడి నిద్రావస్థలో ఉండే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంతో తమ సంబంధమేమిటో ప్రజలు మరచిపోయారు. లబ్ధిదారులుగా ఉండాలి, ఎన్నికల వేళ అదనంగా ఓటుకు రెండో నాలుగో, రేటు పెరిగితే ఐదో పదో వేల బోనస్‌కు ఆశపడాలి.


ఎందుకు ఎవరూ తమ మేనిఫెస్టోలో ప్రజాస్వామ్యాన్ని వాగ్దానం చేయరు? సభలు పెట్టుకోవడానికి, సమస్యల మీద ఊరేగింపులు జరపడానికి అవరోధాలు ఉండవని, ముఖ్యమైన విధాన నిర్ణయాల మీద ప్రతిపక్షాన్ని, పౌరసమాజాన్ని సంప్రదిస్తామని ఎందుకు భరోసా ఇవ్వరు? కార్యక్రమాలను రూపొందించేటప్పుడు వేరే వేరే దేశాల్లో రాష్ట్రాల్లో ఉన్న పథకాలను కాపీ కొట్టడం కాక, ప్రజల అవసరాలను, ఆకాంక్షలను గ్రహించి వ్యవహరిస్తామని ఎందుకు వాగ్దానం చేయరు? అక్రమ నిర్బంధాలు ఉండవని, నల్ల చట్టాలను ఉపయోగించబోమని ఎందుకు మాట ఇవ్వరు? మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే, స్థానిక సంస్థలు పూర్తి స్థాయిలో స్వతంత్రంగా వ్యవహరించడానికి అనుమతిస్తామని, నిధులు ఇస్తామని ఎందుకు వాగ్దానం చేయరు? అన్ని పథకాల లబ్ధిదారులను పారదర్శక పద్ధతిలో గ్రామసభల ద్వారానే ఎంపిక చేస్తామని ఎందుకు చెప్పరు? అధికారం ఆశిస్తోంది కదా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో అప్రజాస్వామికతను తొలగిస్తామని, ప్రజలను పాలనలో భాగస్వాములను చేస్తామని ఎందుకు తన మేనిఫెస్టోలో చెప్పకూడదు? పదేళ్లుగా ఊపిరాడకుండా, అణగారిపోయిన అనేక ప్రజాశ్రేణులు వారిని ఇష్టపడతారు!

ఉచితాలో అనుచితాలో నగదు బదిలీ చేసే పథకాలు పాలనలో ప్రధానం కాకముందు, అడపాదడపా ప్రజాస్వామ్యం, హక్కులు వంటి అంశాలు ఎన్నికల వాగ్దానాలు అయిన చరిత్ర ఉన్నది. 1977 ఎన్నికలు సరేసరి. తెలుగుదేశం తొలిగెలుపులో అనేక ఇతర అంశాలతో పాటు కాంగ్రెస్ అప్రజాస్వామికత మీద ప్రజలలో ఉన్న వ్యతిరేకత, ఎన్టీఆర్ ప్రచారంలో గుప్పించిన విమర్శల పాత్ర కూడా ఉన్నది. 1989లో చెన్నారెడ్డి నక్సలైట్ల మీద, వారి ప్రజాసంఘాల మీద నిర్బంధాన్ని సడలిస్తామని చెప్పారు. 1994లో ఎన్టీఆర్ కూడా తను గతంలో చేసిన పొరపాట్ల విషయంలో పునరాలోచనలో పడ్డారు. ప్రజల మీద నిర్బంధం ఎక్కువ ఉన్న సందర్భాలలో స్వేచ్ఛను వాగ్దానం చేయడం కూడా ఓటర్లను దగ్గర చేస్తుంది.

ఏ యే చిట్కాలతో కాంగ్రెస్ గ్యారంటీల మీద పైచేయి సాధించాలోనని ప్రయత్నించడం కాకుండా, బిఆర్ఎస్ తన మేనిఫెస్టోలో ప్రజాస్వామ్యాన్ని ప్రత్యేకంగా వాగ్దానం చేస్తే బాగుంటుంది. కెసిఆర్ తన పనితీరును మార్చుకుంటానని, పార్టీ సహచరులతో, మంత్రివర్గ సహచరులతో ప్రజాస్వామ్యయుతంగా నడుచుకుంటానని, సాధారణ ప్రజలు కూడా అధికార కేంద్రాలను ఆశ్రయించడానికి మార్గాలు కల్పిస్తానని మేనిఫెస్టోలో చెబితే ఎంత బాగుంటుంది? రైతుబంధు రెట్టింపుచేయండి, కౌలుదారులకు కూడా ఇవ్వండి, రైతు కూలీలకు కూడా ఇవ్వండి, స్త్రీలకు బస్సుప్రయాణం మీరు కూడా కల్పించండి, ఇవన్నీ చేయడంతో పాటు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను పూర్తిస్థాయిలో తెలంగాణలో కల్పిస్తామని చెప్పండి, మూడోసారి గెలవకపోతే అడగండి!

కె. శ్రీనివాస్

Updated Date - 2023-10-12T02:22:57+05:30 IST