ఎంతటి అమానుషమైపోయావు, మనిషీ!

ABN , First Publish Date - 2023-06-15T01:56:33+05:30 IST

యువసినీనటుడు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి అనే సినీనటిని పెళ్లి చేసుకుంటున్నాడనే సరికి, కుతూహలం కలగడం సాధారణం. ఒకరినొకరు ఎంచుకుని, ఇష్టపడి పెళ్లి...

ఎంతటి అమానుషమైపోయావు, మనిషీ!

యువసినీనటుడు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి అనే సినీనటిని పెళ్లి చేసుకుంటున్నాడనే సరికి, కుతూహలం కలగడం సాధారణం. ఒకరినొకరు ఎంచుకుని, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారంటే మరొక ఆసక్తి కూడా వెంటనే పొడుచుకురావడం కూడా మన సమాజంలో సహజం. వరుణ్ తేజ్ సామాజిక నేపథ్యం ఏదో రకరకాల కారణాల వల్ల సుప్రసిద్ధమైపోయింది. ఇక ఆ అమ్మాయి కులం ఏమిటో తెలియాలి. త్రివేదీలు, త్రిపాఠీలు ఏ కులమో ఉత్తరాది సామాజిక పరిజ్ఞానం ఉన్నవారికి సులువుగానే స్ఫురిస్తుంది కానీ, అసంఖ్యాకులైన, సకలశ్రేణుల సినీప్రేక్షకులు గూగుల్ చేయక తప్పింది కాదు, తెలుసుకునే దాకా ఏదో ఒక అస్పష్టత, మసక, గజిబిజితనం. తెలిశాక, అంతా వెల్లడి. మబ్బు తునకే లేని ఆకాశం. పరిష్కృతమైన ప్రహేళిక. తమ దగ్గర ఉన్న తూకానికి సరిపోతే హ్యాపీ. లేకపోతే ఏదో అసంతృప్తి. ఇది మన సమాజపు గొప్ప అభిరుచో, జాడ్యమో తెలియదు.

సినిమా సమాచారం అంటే ఏదో సరదా అని కొట్టిపారేయొచ్చు. కానీ, ఒక హత్య జరిగితే కూడా అదే కుతూహలం. మగవాడు ఒక అమ్మాయిని దారుణంగా చంపేసి, ముక్కలు ముక్కలుగా నరికి డ్రైనేజిలో పారేసినా, ఆ వెంటనే హతుడిదే కులం, హతురాలిదే కులం అన్న అన్వేషణ మొదలవుతుంది. మరీ తీసిపారేయదగ్గ శోధన ఏమీ కాదు. సమాన కులాల మధ్య హింస ఒకరకంగా ఉంటుంది. హెచ్చు తగ్గుల కులాల మధ్య మరో రకంగా ఉంటుంది. ఒకే కులం లోపల హింస వేరుగా ఉంటుంది. ఆడవాళ్ల మీద చేసే హింస, ఆడవాళ్లు చేసే హింస ఇట్లా అనేక అమరికల్లోనుంచి విషయాలను చూడవచ్చు. చూసేవాడి చూపును బట్టి, ప్రతిపదార్థ తాత్పర్యం ఉంటుంది.

కులమే కాదు, హింసకు మతపరిమళం కూడా ఉంటుంది. గాంధీగారిని చంపేసినప్పుడు, చంపిన ‘దేశభక్తుడు’ హిందువే అని తెలుసుకున్నాక నెహ్రూ ఊపిరిపీల్చుకున్నాడట. ఇందిరను చంపినప్పుడు, హంతకుల మతమేమిటో తెలిశాక, మహావృక్షం కూలిపోయినప్పుడు ఏమి జరగాలో అది జరిగింది. హంతకులు ఏ మతమన్నది భారతదేశంలో అనేక విపరిణామాలకు దారితీసింది, అనేకమంది హతులను అవతరింపజేసింది.

రాజకీయ హత్యలు సరే, సోకాల్డ్ వ్యక్తిగత హత్యలు అయినా అంతే. మీడియా పెరిగిపోయి, ఇతరుల జీవితాల్లోకి తొంగిచూడడానికి చెలామణి వచ్చాక, జడ్జిమెంట్లు పెరిగిపోయాయి. ఆడామగా ముడిపడిన నేరం జరిగిందనుకోండి, వాసన చూసే జాగిలాలు, ఫోరెన్సిక్ నిపుణులు, డిటెక్టివ్‌లు ఇంకా ఏ అంచనా ఇవ్వకముందే, ఈ ప్రేక్షకులు, శ్రోతలు, చదువరులు తమ తమ జేబులలో నుంచి సున్నితపు త్రాసులు తీసి సిద్ధంగా ఉంటారు. ఎక్కవసార్లు ఆడ మీదనే మగ హింస జరుగుతుంది, ఎప్పుడన్నా ఒకసారి ఆడహింస కూడా చెలరేగుతుంది. ఏది జరిగినా, ఆ వెంటనే నీతిశతకాలు, సామాజిక విశ్లేషణలు అన్నీ ముసిరిపోతాయి. వాక్యాలన్నీ మగవాసనతో పరిమళిస్తుంటాయి. ఆడది అదుపులో ఉండడం గురించి సన్నాయినొక్కులు మోగుతాయి.

కులమేమిటని చాట్ జీపీటీని అయినా అడగవలసిరావచ్చు కానీ, పేరు వినగానే, చదవగానే మతం తెలిసిపోతుంది. శ్రద్ధావాకర్‌ను అఫ్తాబ్ పూనావాలా 35 ముక్కలు చేసి, ఫ్రిజ్‌లో ఇరవై రోజులు దాచాడు. సహజీవన సంబంధం, ఒకరు హిందువు, ఒకరు ముస్లిమ్. వాట్సాప్ యూనివర్సిటీ అత్యంత వేగంగా ప్రకంపించింది. ఆ హింసను లవ్ జిహాద్‌గా వ్యాఖ్యానించింది. మొన్న జూన్ 7 నాడు ముంబైలో సరస్వతి వైద్య అనే మహిళ ఖండఖండాల కళేబరం దొరికింది. ఆమెతో సహజీవనంలో ఉన్న మనోజ్ సానే ఆ ఘాతుకం చేశాడు. అఫ్తాబ్ కానీ, మనోజ్ గానీ, తమతో మానవసంబంధంలో ఉన్న స్త్రీని చంపి, రంపంతో ముక్కలుగా కోశారు. రెండు రోజుల కిందట బెంగుళూరులో ఒక ఒంటరి మహిళను ఆమె ఆస్తిని కాజేసేందుకు అద్దెదారులు చంపి, ముక్కలు ముక్కలు చేసి వేర్వేరు చోట్ల పడేశారు. దారుణమయిన హింసాధోరణి కొన్ని సామాజిక వర్గాలలోనే ఉంటుందని, మానవ సంబంధాల సమస్యలు కొన్ని సామాజికార్థిక శ్రేణులలోనే ఉంటాయని అనుకోవడం తప్పని అనేక సంఘటనలు రుజువు చేస్తుంటాయి. అయినా, గిరిగీతలు, మూసపోతలు బాగా స్థిరపడి ఉన్నాయి కాబట్టి, ప్రతి సంఘటనకూ మనకు పరగడుపే.

సమాజంలో వ్యవస్థీకృత హింస తెలిసిందే. ఎన్ని రకాల తేడాలు సమాజంలో కనిపిస్తున్నాయో, ఆ తేడాలను కొనసాగించడానికి ఎంతో వ్యవస్థాగత హింస ప్రయోగితమవుతూ ఉంటుంది. తేడాలను తొలగించడానికో, తగ్గించడానికో జరిగే ప్రయత్నాల మీద జరిగే దాడులు, అణచివేత మరో రకం హింస. శ్రమకు దొరకని ప్రతిఫలం హింస. హింసను చూస్తూ కూడా నిశ్శబ్దంగా ఉండడం, ఉండవలసిరావడం హింస. పెళ్లి, కుటుంబం, స్నేహం, సంస్థ, బడి, ఆస్పత్రి, కోర్టులు, జైళ్లు అన్నీ ఒకరికి కాకపోతే మరొకరికి తెలిసివచ్చే హింస, తప్పించుకోలేని హింస. అన్ని హింసలూ నెత్తుటితో తడిసి ఎర్రగా కనిపించవు.

ఈ హింసాచట్రం లోపలే, వ్యక్తిగత హింసలుగా మాత్రమే కనిపించే ఘటనలు జరుగుతుంటాయి. ప్రియుడితో కలిసి కన్న కొడుకును చంపిన తల్లి, భార్యతో కలిసి ప్రియురాలిని చంపిన భర్త, తల్లిని గొంతుపిసికి చంపిన కూతురు, కొడుకులు చూడడం లేదని చితిపేర్చుకు చనిపోయిన తండ్రి, ర్యాంకు రాలేదని ఆత్మహత్య చేసుకున్న పరీక్షార్థి.. ఇటువంటి శీర్షికలతో పత్రికలలో అనేక వార్తలు మనలను ప్రతిరోజూ పరామర్శిస్తూ ఉంటాయి. వీటిని తెలుసుకున్నప్పుడు బాధో జాలో సానుభూతో ఏవో కలుగుతాయి, అదే సమయంలో వాటి మీద విలువల చర్చ కూడా జరుగుతుంది. బాధితులు, పీడకులలో ఎవరి తప్పు ఎంత అన్న మదింపు ముందుకు వస్తుంది.

కానీ, మనిషి మరో మనిషిని, తోటిమనిషిని, తెలిసిన దగ్గరి మనిషిని ఎట్లా చంపగలుగుతున్నాడు, ఎట్లా మాంస శకలాలుగా మార్చగలుగుతున్నాడు? అన్న ప్రశ్న కూడా రావాలి. ఆవేశంలో నేరం చేస్తారు, శిక్ష భయం కలుగుతుంది, ఆధారాలు చెరిపేయడానికి ఏవో పిచ్చి ప్రయత్నాలు చేస్తారు, అందులో భాగమే ఈ రంపపు కోతలు అని వింటుంటాము. అన్నిసార్లూ ఆ వివరణ నిజం కాకపోయినా కొన్నిసార్లు నిజమే. కానీ, అసలు సమస్య చంపుకునేవరకు ఎందుకు వస్తున్నది? ఎందుకు మానవసంబంధాలు జీవన్మరణ సమస్యలుగా మారుతున్నాయి? సర్దుబాటు లేదంటే వేర్పాటు అన్న సూత్రాన్ని ఎందుకు అనుసరించలేకపోతున్నారు? సహచరుడో సహచరో జీవితాధారమో, జీవనాధారమో ఎందుకు కావాలి? మిగుల్చుకోవడానికి తెగింపే ఎందుకు అవసరం కావాలి?

స్త్రీపురుష సంబంధాలే కాదు, యావత్ మానవసంబంధాలు, సామాజిక సంబంధాలు అన్నీ భరించలేనంత ఒత్తిడితో కొనసాగుతున్నాయి. అసంతృప్తులు విస్ఫోటించకుండా, పెదవి బిగువున ఓపిక పడుతున్నది అన్ని సందర్భాలలోనూ బాధితులే. అయినా కొన్ని చోట్ల నోరుజారుతుంది, మాట పెగులుతుంది, అసహనం ఆవేశం అవుతుంది, లేదా అహంకారానికి ఆధిపత్యానికి సవాల్ ఎదురవుతుంది, ఏదో ఒకటి, ఉనికి మూలాలు కదిలిపోతాయి, ఘర్షణ తప్పనిసరి అవుతుంది, నేరం జరిగిపోతుంది.

పేదరికానికి మించిన హింస లేదన్నాడు గాంధీ. కళ్ళెదుట జిగేల్మంటున్న ఇంతటి సంపదను చూస్తూ అరకొర జీవితాలతో నెట్టుకువస్తున్న సామాన్యుల సహనం ఎంతటి ఒత్తిడితో సమానం? సాధించవలసిన ర్యాంకు, పూర్తి చేయవలసిన ప్రాజెక్ట్, అందుకోవలసిన లక్ష్యం ఎంతటి ఒత్తిడి విధిస్తాయి? సాటివారి ఎదుట సరితూగలేకపోవడం ఎంతటి ఒత్తిడి? కోల్పోతామన్న భయం, భరించవలసి వస్తుందన్న భయం, పరువు చెరిగిపోతుందన్న భయం, ఎన్నెన్నిటికి మనిషి బందీ?

మనసు కలచివేసే నేరవార్తలను విననంత వరకు అంతా బాగానే ఉన్నట్టుంటుంది. గాలులు వీచును, పూవులు పూచును. కానీ, పైకి ఏమీ కనిపించని వినిపించని రోజున కూడా హింసాభాండం కుతకుత ఉడుకుతూ ఉంటుంది. నిశ్శబ్దం కింద ఆర్తనాదం ఖననమవుతూ ఉంటుంది. ఎవరి మనసులోనో మరొకరిపై ద్వేషం ప్రతీకారం రగిలిపోతూ ఉంటాయి. మరొకరి బుర్రలో స్వీయ హింస ప్రలోభపెడుతూ ఉంటుంది. ఒకరి స్వార్థం మరొకరి దీనత్వం కలిసి కబేళాకత్తికి పదునుపెడుతూ ఉంటాయి. రేపటి హంతకులు నేటి సామాన్యులుగా సంచరిస్తూ ఉంటారు.

మానవప్రవృత్తి స్వతహాగా హింసాప్రియత్వమే అనేవారున్నారు. లేదు, మానవ పరిణామం ఇంకా పూర్తికాలేదు కాబట్టి, ఇంత మొరటుగా ఉంటున్నామనే ఆశావాదులూ ఉన్నారు. ఎందుకో రానురాను, మందగమనానికి, మలయమారుతానికి, చిరుసవ్వడికి, మృదు స్పర్శకి మనిషి దూరమవుతున్నాడు. తడి అందని వడగాడ్పుల మధ్య సతమతమవుతున్నాడు. తనలోపల ఎవరెవరో రాజేసే నిప్పులకు తానే కాలిపోతున్నాడు. ఒకరికొకరు ఒదిగి జీవించడానికి, సమష్టిలోనే భాగమై పోవడానికి ఎందుకు భయం? తగవును తెగేదాకా లాగకుండా, తెంపుకున్నా నొప్పి లేకుండా జీవించలేమా? ప్రపంచం విధించిన పోటీకి సమిధలం కాకుండా, ఎవరి గెలుపును వారే నిర్వచించుకోలేమా? ఎందుకు చచ్చిపోవాలి, ఎందుకు చంపాలి?

కె. శ్రీనివాస్

Updated Date - 2023-06-15T01:56:33+05:30 IST