Chandrababu Arrest: చెర వెనుక అతనే! తెర వెనుక ఎవరు?

ABN , First Publish Date - 2023-09-14T01:26:59+05:30 IST

చంద్రబాబు నాయుడు ఇట్లా అరెస్టు కాగలరన్న ఊహ ఎవరికైనా ఉండిందా అన్నది సందేహమే. అరెస్టు చేయాలన్న కోరిక జగన్మోహన్ రెడ్డికి చాలా కాలం నుంచి ఉండి ఉండవచ్చు..

Chandrababu Arrest: చెర వెనుక అతనే! తెర వెనుక ఎవరు?

చంద్రబాబు నాయుడు ఇట్లా అరెస్టు కాగలరన్న ఊహ ఎవరికైనా ఉండిందా అన్నది సందేహమే. అరెస్టు చేయాలన్న కోరిక జగన్మోహన్ రెడ్డికి చాలా కాలం నుంచి ఉండి ఉండవచ్చు. చేయాలని కొద్దిరోజుల నుంచి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉండొచ్చు. చివరికి చేయగలిగినందుకు ఆనందంతో పాటు, తన తెంపరి తనానికి తనే ఆశ్చర్యం పొంది ఉండవచ్చు. కానీ, జనం మాత్రం ఇదంతా జరుగుతుందని అనుకోలేదు. అంతెందుకు, తెలుగుదేశం పార్టీ కూడా ఈ పరిణామాన్ని ఊహించలేదు. ఊహించి ఉంటే, తగిన సన్నద్ధత సమకూర్చుకుని ఉండేది. అక్రమాస్తుల కేసులో జగన్‌రెడ్డి మళ్లీ జైలుకు పోతే, ఆయన భార్య అధికారం చేపట్టడానికి ఏర్పాట్లు జరిగాయని కథనాలు వచ్చాయి తప్ప, చంద్రబాబు నిర్బంధం జరిగితే, అనంతరం ఏమిటి? అన్న చర్చ మునుపెన్నడూ జరగలేదు.

అరెస్టు ఒక పెనుసంచలనమై రెండు తెలుగురాష్ట్రాల వారికి రెండు రోజుల పాటు మరో ధ్యాస లేకుండా చేసింది. జీ20 వార్తలు మీడియాలోనే కాదు, జనం ఊసులో కూడా లేకుండా పోయాయి. ఇదేదో ఒకటిరెండు రోజుల వ్యవహారం కాదని, చంద్రబాబుకి ఊరట ఇప్పుడప్పుడే దొరకదని అర్థమయి, ఉత్కంఠ సద్దుమణగడం మొదలయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు తమ కలవరాన్ని, నిరసనను ప్రకటించడం కొనసాగుతూనే ఉంటుంది కానీ, స్పందనలు తక్షణాగ్రహావేశాల నుంచి దీర్ఘకాలిక వ్యక్తీకరణగా మారిపోక తప్పదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యూహం కేవలం ఒక అరెస్టుతో ముగిసేది కాదు కాబట్టి, మునుముందు ఏమి జరుగుతుంది, ఈ మొత్తం పరిణామాలు ఎటువంటి పర్యవసానాలకు కారణమవుతాయి అన్న చర్చ ప్రారంభం కాక తప్పదు.

కేసు మంచిచెడ్డలు, అరెస్టు ప్రక్రియలోని సాంకేతికతలు న్యాయస్థానాలకు వదిలేస్తే, ప్రజలు అర్థం చేసుకుంటున్నది, చంద్రబాబు అరెస్టు ఒక ప్రతీకారచర్య. వైసిపి, తెలుగుదేశం మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధంలో ఇది ఒక భాగం. ఇందులో మర్యాదలు, నియమాలు, నీతి అవినీతి చర్చలు ఏమీ లేవు. ఈ పరిణామం వల్ల వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అధికారపార్టీ మీద ప్రతికూల ప్రభావం పడుతుందని కొందరు నమ్ముతుంటే, ప్రతిపక్షపార్టీ దిగ్భ్రాంతికి లోనై క్రియాశీలతను కోల్పోయి మరింత బలహీనపడుతుందని మరి కొందరు జోస్యం చెబుతున్నారు. రాజకీయ శిబిరాలను బట్టి అంచనాలు, లెక్కలు ఉంటున్నాయి.

చంద్రబాబు చిన్ననాయకుడు కాదు. మూడున్నర దశాబ్దాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోను, దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోను క్రియాశీలంగా ఉన్న రాజకీయవేత్త. మొత్తం పధ్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఢిల్లీ స్థాయిలో కూడా ప్రభావం వేశారు. రాజకీయ వ్యవహార సరళి, అభివృద్ధి ప్రాధాన్యాలు చంద్రబాబును ప్రత్యేకంగా నిలిపాయి. ఆయనది ఒక నమూనా. అట్లాగే, ఇంత కాలం నాయకుడిగా, పాలకుడిగా ఉన్న వ్యక్తి మీద విమర్శలు లేకుండానూ ఉండవు. ఆరోపణలు రాకుండా ఉండవు. తీవ్రమయిన వ్యతిరేక భావనలు కలిగిన సమూహాలు కూడా గణనీయంగా ఉన్నాయి. తీవ్రమయిన రాగద్వేషాలను పొందగలిగిన వ్యక్తిగా, ఆయన అరెస్టుకు రకరకాల స్పందనలను గమనించవచ్చు. వ్యక్తిగత అవినీతి ఆరోపణలు పెద్దగా ఎదుర్కొనని వ్యక్తి కాబట్టి, చంద్రబాబుకు ఇటువంటి స్థితి ఎదురుకావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వ్యతిరేకులు, తమకు ఉన్న అనేక ఫిర్యాదుల కారణంగా, ఈ పరిణామం సహజమేనని, లేదా, జరగవలసిందేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఎంతటివారినైనా బోనెక్కించగలిగిన శక్తి మన ప్రజాస్వామ్యానికి, న్యాయప్రక్రియకు ఉన్నదని మరి కొందరు ఆనందిస్తున్నారు. ఇవన్నీ పాక్షికమైన, తక్షణ స్పందనలు. చంద్రబాబు స్థాయి ఉన్న వ్యక్తికే ఇంతటి అన్యాయమైన పద్ధతిలో అరెస్టు, వెసులుబాటు దొరకని నిర్బంధం విధించగలిగితే, సామాన్యుల విషయంలో అధికారయంత్రాంగం మరెంత కర్కశంగా, నిర్దాక్షిణ్యంగా ఉండగలదు? అన్న ప్రశ్న కూడా వేసుకోవలసి వస్తుంది. ప్రభుత్వం ఎవరినైనా బందీగా చేసుకున్న వెంటనే, ఆ క్రమాన్ని, బందీకి అమలుజరుగుతున్న హక్కుల గురించి వేయికళ్లతో పరిశీలించవలసి ఉంటుంది. చంద్రబాబు అరెస్టుతో ఆయనకు ఏమి హాని జరిగింది, జగన్‌కు ఏమి మేలు జరిగింది అన్నచర్చ కాక, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమి కానున్నది అన్నది కీలకమయిన ప్రశ్న. అరెస్టు, అనంతర పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ పరిధికి మించి ఉత్పన్నమయ్యే పర్యవసానాలేమిటి అన్నది ఆసక్తికరమైన చర్చ.


ఈ సన్నివేశం మొత్తంగా జగన్నాటకమేనా? సూత్రధారీ పాత్రధారీ అన్నీ అతనేనా? లేక, మూడో పక్షం ఉన్నదా? చంద్రబాబు స్థాయి వ్యక్తిని, పైగా రాబోయే ఎన్నికలలో పొత్తు కలిసే అవకాశం ఉన్నదని భావిస్తున్న పార్టీ నాయకుడిని అరెస్టు చేస్తుంటే కేంద్రప్రభుత్వం, అక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఏమి చేస్తున్నాయి? శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం, మాకేమీ సంబంధం లేదు అని కేంద్రం చెబితే, సాంకేతికంగా సరే, కానీ, అది నిజమని నమ్మగలమా? తెలుగు రాష్ట్రాలకు చెందిన భారతీయ జనతాపార్టీ నాయకులు చంద్రబాబు అరెస్టును లేదా అరెస్టు జరిగిన తీరును ఖండించారు. నిజమే, కానీ, జాతీయస్థాయిలో స్పందన లేదు. కేంద్రంలోని పెద్దలకు, ముఖ్యంగా ప్రధానికి, హోంమంత్రికి సమాచారం ఇవ్వకుండా, వారినుంచి అనుమతి లేకుండా జగన్ ఈ పని చేసి ఉంటారని నమ్మబుద్ధి కావడం లేదు. కొన్ని విషయాలలో జగన్ ప్రభుత్వం స్వతంత్రంగానే వ్యవహరిస్తుంది, కేంద్రం కూడా అనుమతిస్తుంది, కానీ, ఈ విషయం వేరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సొంతంగా పెద్దబలం లేకపోయినా, బలమైన పార్టీలన్నీ విధేయంగా ఉంటున్న పార్టీ బిజెపి. 2024 ఎన్నికలలో అవసరాల రీత్యా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఆ పార్టీకి చాలా ఆసక్తి ఉన్నది. తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని, అదే వైసిపికి గట్టిప్రత్యామ్నాయమని అంతా అనుకుంటున్నప్పుడు, అయితే గియితే ఈ డిసెంబర్‌లోనే సాధారణ ఎన్నికలు కూడా జరగవచ్చుననుకుంటున్న తరుణంలో, చంద్రబాబును అరెస్టు చేయడం అంటే హద్దుమీరడమే కదా? పైగా, అరెస్టు చేసి రెండు రోజులు నిర్బంధంలో ఉంచి, ప్రజల సానుభూతి వెల్లువెత్తడానికి ఆస్కారం ఇవ్వడం కాకుండా, ప్రతిపక్ష పార్టీని నాయకత్వలోపంతో బలహీనపరచడానికి, నామమాత్రం చేయడానికి ప్రయత్నించడం అంటే జగన్ ఆడుతున్నది ప్రమాదకరమైన క్రీడనే కదా? ఈ ఆటలో బిజెపి క్రియాశీల ప్రమేయమో లేక మౌన అంగీకారమో ఉన్నాయా లేదా అన్నది ‘నేషన్ వాంట్స్ టు నో’.

తెలంగాణలో కల్వకుంట్ల కవిత అరెస్టు కాకపోవడం అంటే బిజెపికి, బిఆర్ఎస్‌కు మధ్య అవగాహన ఉండడమే అని అర్థం చెబుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అరెస్టు కావడం అంటే బిజెపి వైసిపి కలసి పనిచేస్తున్నట్టే అని సామాన్యులు అర్థం చేసుకుంటారు. ఏపీలో రాష్ట్ర ఏజెన్సీలు కేసుపెట్టాయన్నది నిజమే కానీ, కేంద్ర ఏజెన్సీలు కూడా ఈ కేసును దర్యాప్తుచేస్తున్నాయి. ఏదో రకమయిన సమన్వయం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదో ఉమ్మడి ప్రయోజనం లేకపోతే, ఈ పరిణామాలు ఇట్లా జరిగి ఉండేవి కావనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రాంతీయ పార్టీలలో ఒకదాన్ని ముందు దెబ్బతీసి, తన ప్రాబల్యం పెంచుకోవాలని, ఆ తరువాత రెండోపార్టీ సంగతి చూడవచ్చునని తన జాతీయ వ్యూహంలో భాగంగా బిజెపి భావిస్తోందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. జాతీయ రాజకీయ దృశ్యం నుంచి ప్రాంతీయ పార్టీలు, నాయకులు ఎవరూ ప్రభావశాలురుగా మిగలకపోవడం ఆ వ్యూహం లక్ష్యం. ఇప్పటి సంఘటనలు ఆ పథకానికి అనువుగా కనిపిస్తున్నాయి.

చంద్రబాబు అరెస్టుకు బిజెపి జాతీయనాయకుల నుంచి ఖండనలు రాకపోగా, ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్ మినహా వివిధ ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీల నేతల నుంచి సంఘీభావం లభిస్తోంది. బిజెపితో సత్సంబంధాలతో ఉంటే జగన్ మరీ చెలరేగిపోకుండా ఉంటాడన్న ఆశతో, తెలుగుదేశం పార్టీ అనుసరిస్తూ వస్తున్న వైఖరి అంతిమంగా అనుకున్న ఫలితం ఇవ్వలేదు. పైగా, జాతీయంగా ఏ కూటమికీ చెందకుండా ఒంటరి కావడానికి కూడా కారణమయింది. కానీ, చంద్రబాబుకు జాతీయంగా ఒక స్థానం ఉన్నదని, అవసరం కూడా ఉన్నదని ‘ఇండియా’ కూటమి సంఘీభావ ప్రకటనలు సూచిస్తున్నాయి.


తెలుగుదేశం శ్రేణులు భయపడుతున్నట్టుగా, చంద్రబాబు మీద మరిన్ని కేసులు పెట్టడం, ద్వితీయ నాయకత్వం మీద కూడా నిర్బంధం ప్రయోగించడం వంటివి జరిగితే, అప్పుడిక ఉనికికి సంబంధించిన సమస్య అవుతుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీది జీవన్మరణపోరాటమే అవుతుంది. ప్రతిపక్ష పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా ఏ అధికారపార్టీ పనిచేసినా అది ప్రజాస్వామ్యానికి, ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకమైనవి. దాన్ని అనుమతించకూడదు. చంద్రబాబు విధానాల మీద కానీ, ఆయన పాలన మీద కానీ అభ్యంతరాలు, విమర్శ, వ్యతిరేకత ఉండవచ్చు. అవి, జగన్ ప్రభుత్వ చర్యకు సమర్థనలు కాలేవు. దేశవ్యాప్తంగా దర్యాప్తు సంస్థలన్నీ అవినీతి ఎదురుమాట మాట్లాడే శక్తి లేకుండా చేయడానికి ప్రభుత్వాలు ప్రయోగించే దమనకాండను అనుమతించకూడదు. అవి బిజెపి, బిఆర్ఎస్, వైసిపి ప్రభుత్వాలైనా కావచ్చు, రేపు అధికారంలోకి వస్తే టిడిపి ప్రభుత్వమైనా కావచ్చు.

కె. శ్రీనివాస్

Updated Date - 2023-09-14T12:23:14+05:30 IST