Share News

Everyone is a child, the same blood and the same tears! : అందరూ పిల్లలే కదా, అదే నెత్తురూ అవే కన్నీళ్లూ!

ABN , First Publish Date - 2023-10-26T01:22:06+05:30 IST

యువల్ నోవహ్ హరారీ అనే ప్రసిద్ధ రచయిత ఇట్లా అంటున్నాడు: ఈ గాజా యుద్ధం ముగిసేదాకా మానవత్వాన్ని కాపాడుకోవాలి, ఇజ్రాయిలీలలో అధికసంఖ్యాకులు ఇప్పుడు పాలస్తీనియన్లల స్థితికి...

Everyone is a child, the same blood and the same tears! : అందరూ పిల్లలే కదా, అదే నెత్తురూ అవే కన్నీళ్లూ!

యువల్ నోవహ్ హరారీ అనే ప్రసిద్ధ రచయిత ఇట్లా అంటున్నాడు: ఈ గాజా యుద్ధం ముగిసేదాకా మానవత్వాన్ని కాపాడుకోవాలి, ఇజ్రాయిలీలలో అధికసంఖ్యాకులు ఇప్పుడు పాలస్తీనియన్లల స్థితికి సానుభూతి చూపించగలిగే మానసిక బలంతో లేరు. సొంత వేదనతోనే వారి మనస్సంతా నిండిపోయింది, ఇంకొకరి నెప్పి గురించి ఆలోచించగలిగే స్థితే లేదు. పాలస్తీనీయులూ అంతే, వారి బాధతోనే వారికి సరిపోతోంది, ఇతరుల సంగతి ఎక్కడ చూస్తారు? ఈ పరిస్థితికి బయట ఉన్నవారు, ఈ భీకర వాస్తవికతలోని ఒకపార్శ్వాన్ని యథాలాపంగా చూడడం కాకుండా, అందరు బాధితులతో సహానుభూతి చెందాలి, శాంతి కోసం చోటు మిగల్చడానికి సహాయపడాలి. ఈ శాంతి స్థలాన్ని మేం ఇప్పుడు నిర్వహించలేం. మీకు అప్పగిస్తున్నాం, ఈ గాయాలన్నీ మానిపోవడం మొదలయ్యాక, ఇజ్రాయిలీలు, పాలస్తీనియన్లు ఆ స్థలంలో జీవించడం మొదలుపెడతారు.

చాలా ఉదాత్తంగానూ, మానవత్వపు సంవేదనలతోనూ చెబుతున్నట్టు ఉన్నాయి ఆ మాటలు! ‘‘సేపియన్స్’’ దగ్గర నుంచి ‘‘అన్ స్టాపబుల్ అజ్’’ దాకా అనేక పుస్తకాలలో మానవుల పరిణామాన్ని, మానవుల ఘనవిజయాలను ఎంతో ఆసక్తికరంగా రాసి ప్రసిద్ధి పొందిన ఈ యూదు రచయిత, మనోభావాలలో రాజకీయ స్పందనలలో మాత్రం సగటు యూదు మేధను దాటలేకపోయారు. ‘గాయాలన్నీ మానిపోవడం’ అంటే, గాజా ఆసాంతం నేలమట్టం అయిపోయి, చావగా మిగిలిన జనమంతా గుడారాల కింద జీవించే స్థితి రావడమన్న మాట! సమస్య అంతా అక్టోబర్ 7 నాడు హమాస్ చేసిన దాడులతోనే మొదలయిందని హరారీ కూడా అనుకుంటున్నారు, చెబుతున్నారు. హమాస్ మీద యుద్ధంలో ఇజ్రాయిల్ తన భూభాగాన్ని, ప్రజలను రక్షించుకోవలసిన కర్తవ్యం ఉన్నదని నమ్ముతున్నారు. హమాస్ లేని వెస్ట్ బ్యాంక్‌లో కూడా శాంతి లేదని, ఇజ్రాయిల్ సైనికుల హింసకు పాలస్తీనా పిల్లలు బలి అవుతూనే ఉన్నారని ఆయన హాయిగా విస్మరించారు. శాంతియుత సహజీవనానికి అవకాశం లేకుండా ఆక్రమణాధిపత్యానికి కారకులెవరో చూడడం ఆయనకు ఇష్టం ఉండదు. అయితే, కర్తవ్యనిర్వహణ చేయడంతో పాటు మానవత్వాన్ని కూడా ఇజ్రాయిల్ నిలబెట్టాలని, హమాస్‌కు పాలస్తీనియన్లకు తేడా చూడాలని ఆయన హితవు చెబుతున్నారు. ఇజ్రాయిల్ అట్లా చూడడం లేదని, చూడబోదని కూడా ఆయనకు తెలుసు. యుద్ధాంతాన హమాస్ పూర్తిగా నిరాయుధమై గాజా పట్టీ, నిస్సైనికం అవుతుందని, అప్పుడు గాజా సరిహద్దుకు ఈ ఒడ్డున ఇజ్రాయిలీలు, ఆ ఒడ్డున పాలస్తీనియన్లు సుఖశాంతులతో వర్థిల్లుతారని హరారీ ఆశపడుతున్నారు, ఆశ పెడుతున్నారు కూడా. మంచి కాలం ముందు ఉందని, అప్పటిదాకా చంపుకోనివ్వమని అడుగుతున్నారు! ‘టైమ్’ పత్రికలో హరారీ రాసిన వ్యాసం, సుమారు ఇరవైరోజులుగా పాలస్తీనా, ఇజ్రాయిల్ హింసల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న కథనాల స్వభావాన్ని ప్రతిఫలిస్తున్నది. కొనసాగనున్న తీవ్ర మారణకాండకు రకరకాల సమర్థనలను రూపొందే క్రమాన్ని తెలియజేస్తున్నది.


అక్టోబర్ 7 నాడు, అనేక మార్గాలలో సరిహద్దులను దాటుకుని ఇజ్రాయిలీ గ్రామాలపై, పట్టణాలపై మెరుపుదాడి చేసి, అడ్డం వచ్చినవారిని హతమార్చి, అనేకమందిని బందీలుగా తీసుకుని హమాస్ భీతావహం సృష్టించింది. దాడి జరిగిన తరువాత మిగిలిన దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. పిల్లల మీద, వృద్ధుల మీద జరిగిన మారణకాండ క్షమార్హం కానిది. పసిపిల్లలను కూర్చోబెట్టి నడిపించే క్రిబ్స్ మీద, ఆటబొమ్మల మీద అంటిన నెత్తుటి మరకలు మనసులను కలచివేశాయి. ఎవరు మాత్రం నిస్సహాయుల మీద దాడిని హర్షించగలరు? ఇజ్రాయిల్ సమాజం తీవ్రమయిన దిగ్ర్భాంతికి, వేదనకు గురికావడం సహజం. కోపంతో ఆవేశంతో ఊగిపోవడమూ సహజమే. ఏ ఫలితాలను, ప్రయోజనాలను ఆశించి హమాస్ ఆ దాడులకు పాల్పడిందో, వాటిని నెరవేర్చుకుందో, లేక, పాలస్తీనా ప్రజానీకానికి తీరని అపకారం చేసిందో భవిష్యత్తు చెబుతుంది. ఈ చర్యలకు హమాస్ ఒక సంస్థగా బాధ్యత వహించవలసి ఉంటుంది. ఏ ఘోరాన్నీ మరో ఘోరంతో పోల్చి ఎక్కువ చేయడం, తక్కువ చేయడం సరికాదు కానీ, ఇజ్రాయిల్ ఎదుర్కొన్న హింస ఆ సమాజానికి అరుదైనదే. హిట్లర్ చేతిలో అనుభవించిన ‘హోలోకాస్ట్’ తరువాత ఇంత పెద్ద సంఖ్యలో యూదులకు ప్రాణనష్టం జరగడం ఇదే! అన్ని రకాలుగా సురక్షితంగా ఉండే భద్రజీవులు, బలవంతులు ఒక ప్రత్యేక సందర్భంలో బాధితులయినప్పుడు, ఆ బాధ జగత్ప్రళయంగా కనిపిస్తుంది..

పాలస్తీనా అనుభవంలో మాత్రం ఈ హింస అనుదిన వాస్తవం. మంగళవారం నాడు గాజామీద జరిగిన దాడులలో కూడా 700 మంది చనిపోయారు. అందులోనూ పసిపిల్లలు ఎందరో ఉన్నారు. వెస్ట్ బ్యాంక్‌లో సగటున వారానికి ఒకరు చొప్పున పాలస్తీనా పిల్లలు ఇజ్రాయిలీ భద్రతాదళాల చేతిలో చనిపోతూనే ఉన్నారు. 2008 నుంచి 2020 దాకా ఎందరు పాలస్తీనియన్లు పోరాటంలో చనిపోయారో, గత ఇరవై రోజుల్లో గాజా పట్టణంలో అందరు చనిపోయారు. గాజాభవనాల శిథిలాల కిందట ఇంకా రెండువేల మంది ఉన్నారు. అందులో పసిపిల్లలు ఎందరో? 1400 మందిని హతమార్చిన దుర్మార్గం కలిగించే ఆక్రోశం, ఈ ఆరువేల మంది విషయంలో ఎందుకు కలగదు? పౌరుల హత్య ఉగ్రవాదమైనప్పుడు, ఒక్కరినే ఉగ్రవాదులనడం ఎందుకు? ఆత్మరక్షణహక్కు ఇజ్రాయిల్‌కు ఉన్నప్పుడు, తమ దేశంలో తాము పరాయిలైపోయి, ఆక్రమణదారుల చేతిలో అణగారిపోతున్న పాలస్తీనియన్లకు ప్రతిఘటించేహక్కు ఉండదా?

వీర యూదువాదుల సంగతి సరే. పాలస్తీనా ఒక అణగారిన మైనారిటీగా దేశంలో ఒక మూలన పడి ఉండాలి తప్ప రెండు రాజ్యాలను వాళ్లు ఒప్పుకోరు. ఇక ఇజ్రాయిల్‌నే గుర్తించము పొమ్మనే హమాస్‌ను వాళ్లు అంగీకరించే ప్రశ్నే ఉండదు. ఇప్పుడు హమాస్ చేసిన మూర్ఖపు హింస వల్ల, పాలస్తీనియన్లను మరింతగా అంచులకు తరిమివేసే అవకాశం కలిగింది. పాలస్తీనియన్లలోని మిలిటెంట్లను యథేచ్ఛగా, ప్రపంచపు అనుమతితో అణచివేసే అనుమతి దొరికింది. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, తాజాగా చైనా, అందరూ ఇజ్రాయిల్ ఆత్మరక్షణ హక్కును పోటీలు పడి మరీ గుర్తించారు. హమాస్ చేసిన దుర్మార్గపు దాడుల కారణంగా, ఇజ్రాయిల్ ప్రతిదాడులు చేయవలసి వస్తున్నదని నిస్సహాయత ప్రకటిస్తున్నారు. ఒక్కటంటే ఒక్క పశ్చిమదేశమూ కాల్పుల విరమణ గురించి మాట్లాడడం లేదు. ఇంకా ఆకాశదాడులే కాలేదు, భూతల దాడులు కూడా జరిగాక కానీ, ప్రతీకారభూతం ఉపశమించదని వాళ్లే సూచనలు చేస్తున్నారు. కాకపోతే, ‘‘మరీ ఎక్కువ దాడులు వద్దు, మధ్యలో కాస్త ‘మానవీయ విరామం’ ఇచ్చి విమాన దాడులు చేయండి. సహాయకార్యక్రమాల అందుబాటుకు అవరోధం లేకుండా మీ న్యాయమైన ప్రతీకారం తీర్చుకోండి.’’ అంటూ సున్నితంగా సూచనలు చేస్తున్నారు. ఇటువంటి లాలనలు, అనునయాలు మునుపెప్పుడూ ఏ యుద్ధంలోనూ వినిఉండము.


మీడియాలో చర్చలూ ఇంటర్వ్యూలూ నిర్వహిస్తున్నప్పుడు, మానవహక్కుల గురించి మాట్లాడేవారికి, యుద్ధ వ్యతిరేకతను ప్రకటించేవారికి ముందరి కాళ్లకు బంధాలు వేస్తున్నారు, హమాస్ దాడులమీద వైఖరి చెప్పమని. పాలస్తీనా సమస్య లోకి ప్రవేశించాలంటే ముందుగానే హమాస్‌ను ఖండించి కానీ అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. బైడెన్‌ను కానీ, మాక్రన్‌ని కానీ ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయిల్ వైదొలగడం గురించి ఒక్క ప్రశ్న అడిగినవారు లేరు. అసలు సమస్య ఎక్కడ నుంచి, ఎప్పటి నుంచి మొదలైందని చర్చించే అవకాశాలనే నిరోధిస్తున్నారు.

మన అర్నబ్ గోస్వామి, ఇజ్రాయిల్ పక్కన చేరి యుద్ధాన్ని తానే నడిపిస్తున్నారు. ‘‘ఇది మన యుద్ధం’’ అంటారాయన. హమాస్ చర్యలు చూస్తుంటే అల్ ఖాయిదా సాధుసంస్థ అనిపిస్తోందని బైడెన్ అన్నారు, ఐసిస్‌కు ఏమీ తక్కువ కాదని ఇంకొందరు దేశాధినేతలు అన్నారు. అర్నబ్ గోస్వామి మాత్రం హమాస్ లాంటి వాళ్లు మన సరిహద్దుల్లో ఉన్నారు, వారికి మద్దతు ఇచ్చే వాళ్లు మనదేశంలోనూ ఉన్నారు, హమాస్‌ను ఓడించడంలోనే భారతదేశ భద్రత ఉన్నది, అని ప్రతిరోజూ వీరంగం వేస్తూనే ఉన్నారు. ఇజ్రాయిల్ మీద మన దేశంలోని మితవాద రాజకీయపక్షాలకు ఆకర్షణ వెనుక ఏ మతతత్వం, దేశీయ జియోనిజం ఉన్నాయో తెలిసిందే. రెండు దశాబ్దాల కిందట కూడా భారతీయ ప్రధాని ఇజ్రాయిల్‌కు బాహాటంగా సంఘీభావం చెప్పాలంటే సంకోచించి ఉండేవారు. భారతీయ మీడియా ఇజ్రాయిల్ పక్కన నిలబడే ఆస్కారమే ఉండేది కాదు. పాలస్తీనాకు సంఘీభావం కానీ, దక్షిణాఫ్రికా పోరాటానికి సమర్థన కానీ భారతీయ సమాజానికి నైతిక భూషణాలుగా ఉండేవి. ఇప్పుడు కాలం మారింది. కరుకుగా ఉండడం, కర్కశంగా ఆలోచించడం, మైనారిటీలకు, నిస్సహాయులకు వ్యతిరేకంగా ఆలోచించడం కుడివాద ప్రపంచపు ధోరణి అయింది. ఎన్నడూ లేనిది, అంతర్జాతీయ అంశాలు కూడా మితవాద, ఉదారవాద శిబిరాల మధ్య తీవ్ర విభజన కలిగిస్తున్నాయి. హమాస్ మీద దాడులు విజయవంతం కావాలని తెలుగులో కూడా కవిత్వం వస్తోంది.

పాలస్తీనాలో శాంతి కావాలి. పాలస్తీనా సమాజానికి ప్రాతినిధ్యం వహించే పోరాట సంస్థలు ఆమోదించిన రీతిలో పరిష్కారం జరగాలి. పశ్చిమాసియాలో అగ్రరాజ్యాల ప్రమేయం తగ్గితే తప్ప, అందుకు మార్గం ఏర్పడదు. ఇప్పుడు ఇజ్రాయిల్ అని పిలుస్తున్న దేశం, అందులో పాక్షిక ప్రతిపత్తితో ఉన్న గాజా, వెస్ట్‌బ్యాంక్ భూభాగాలు, పొరుగుదేశాల అధీనంలో ఉన్న పాత పాలస్తీనా ప్రాంతాలు అన్నీ 75 సంవత్సరాల కిందట పాలస్తీనియన్లు నివసించే ప్రాంతాలే. ఓస్లో ఒప్పందాల ప్రకారం రెండు దేశాలుగా ఏర్పాటు జరిగినా, లేక కేవలం ఒకేదేశంలో అందరూ సమభాగస్వాములుగా ఉన్నా, పరస్పర గౌరవం ఆధారంగా జరగాలి. అక్టోబర్ 7 వంటివి తిరిగి జరగకూడదంటే, మరింత అణచివేత, మరిన్ని మరణాలు అందుకు మార్గాలు కావు. పాలస్తీనియన్లకు గౌరవప్రదమైన ఉనికి, మనుగడ ఉంటేనే ఇజ్రాయిలీల భద్రతకుపూచీ ఉంటుంది.

కె. శ్రీనివాస్

Updated Date - 2023-10-26T01:22:39+05:30 IST