Share News

పతన విలువలతో పరిమళిస్తున్న ప్రజాస్వామ్యం!

ABN , First Publish Date - 2023-11-02T02:10:11+05:30 IST

అన్నా వో వంద దాంక ఉంటావే.. అని ఆప్యాయంగా అడిగాడు ఆ సీనియర్ నాయకుడు, ఒక వర్ధమాన నాయకుడిని. ఆ సీనియర్ అప్పటికే వో వెయ్యి దాకా ఉంటాడు. ‘అంతలేదు గాని, వో పదిరువై తక్కువ’ అని చెప్పాడు జూనియర్, ఎదుగుతున్నాను సుమా, గుర్తించమన్నట్టు. ఈ సంభాషణ ఓ పదేళ్ల కిందట జరిగింది. ఇందులోని వందా వేయీ పదీ ఇరువై అన్నీ కోట్ల లెక్కలే. తెలంగాణ సమాజంలో ఆర్థికంగా ఎదుగుతున్న శ్రేణిలో పరస్పర కుశల ప్రశ్నలు, ఒకరినొకరు వేసుకునే అంచనాలూ ‘సీఆర్ల’ లోనే జరగడం అప్పటికే బాగా అలవాటయింది. పోరాటాల గర్వాలు కారుస్టీరియోల్లోకి, స్విమ్మింగ్ పూళ్లు ఇళ్ల పెరళ్లలోకి ప్రవహించడం కూడా మొదలైపోయింది. ఎంత నిర్బంధమూ, కల్లోలమూ చేయలేని పని డబ్బు చేసింది. ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ ఎగువ మధ్య తరగతి, ఆ పైని జనజీవితంలోకి ధనమూ విలాసమూ మధుమేహం లాగా ఆవరించాయి. అట్టడుగు మనుషులని మాత్రం మద్యం, సుషుప్తి, నిర్లిప్తత దెయ్యాల్లాగా పట్టుకున్నాయి. అధోజగత్తు ఎప్పుడూ ఉన్నది. జులాయి తనమూ బాధ్యతారాహిత్యమూ కొత్తవేమీ కాదు. కానీ, అంతకు మించి ఏవో శక్తులు మనుషులని, సమాజాన్ని పతనంలోకి ఆకర్షిస్తున్నాయి. గొప్ప చరిత్ర కలిగిన నేలలో ప్రలోభాన్ని, బానిసత్వాన్ని, నేరపూరిత లాలసత్వాన్ని విత్తనాలుగా చల్లుతున్నారు. బహుశా, అన్నిచోట్లా ఇదే పరిస్థితి కావచ్చు. సంస్కారాలు అడుగుముట్టడం లోకమంతా ఉంది కాబోలు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, నాయకులు గెలుస్తారు ఓడతారు, కానీ ప్రజలే కలుషితమయ్యే కాలం వచ్చినప్పుడు విషవృక్షాలే పెరుగుతాయి. అభివృద్ధి, సంక్షేమం, పథకాలు అంటూ వినిపించే పడికట్టు మాటల వెనుక రాజకీయమైన కపటత్వం, సాంస్కృతికమయిన డొల్లతనం ధ్వనిస్తూనే ఉంటాయి. ఎవరిని ఎన్నుకోవాలి జనం? ఇంకా మూడు స్తంభాలాట సాగుతూనే ఉన్నది. ఎక్కడా గిట్టుబాటు కానప్పుడు నాలుగోదీ అయిదోదీ ఏదో ఒక పందిరి గుంజ అయినా దొరుకుతుంది. వంగివంగి రంగురంగుల శాలువాలు కప్పుకుని వీరికి మెడలు వంగిపోయాయి. ఈ అభ్యర్థులెవరికీ చిన్నపాటి కట్టుబాటు కూడా లేదు. ప్రజల కోసం ఫలానా మంచి పనిచేయాలన్న తపన లేదు. ఒక పార్టీ నుంచి దానికి పూర్తి వ్యతిరేకమైన పార్టీకి, ప్రాంతీయం నుంచి జాతీయానికి, అటూ ఇటూ కూడా దొర్లుకుంటూ వెళ్లగలరు. ఎటువైపు దుంకాలో తేల్చుకోలేదంటూ గోడమీదనే నిలబడి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టగలరు. శాసనసభ్యులు అయితే ఏమి చేయాలో, ఏమి చేయగలరో కూడా వారికి తెలియదు. పార్టీ విధానాలు వాళ్లకు అక్కరలేదు. కొంత భూభాగంలో సామాజిక అధికారాన్ని, జనప్రాతినిధ్యం ద్వారా నిర్ణయాధికారాన్ని సమకూర్చుకుని, వాటిని ధనంలోకి, మరింత ధనంలోకి అనువాదం చేసుకోవడమొక్కటే వారి కార్యక్రమం. మునుపు సమకూర్చుకున్నవాటిని, మున్ముందు సంపాదించుకునేవాటిని కాపాడుకోవడమే అసలు లక్ష్యం. ప్రజల ఉమ్మడి సంపదకు కాపలాదారులుగా ఉండవలసినవారు, కంచె చేను మేసినట్టు బలిసిపోవడమే రాజకీయంగా మారిపోయింది. ఎక్కడయినా ఉలిపికట్టెలు, మినహాయింపులూ ఉంటాయి కానీ, మొత్తం మీద దృశ్యంచూస్తే అన్నిపార్టీలలోనూ ఒకేపరిస్థితి. పార్టీలలోపల చూస్తే దాదాపు అందరూ ఒకే దాహంతో ఆవురావురు మంటున్నారు. అధికార భారత రాష్ట్ర సమితిలో వివిధ అంచెల నాయకుల ఆర్థిక, తదితర స్థితిగతులు గత పదేళ్లలో ఎంతగా పురోభివృద్ధి చెందాయో ఎవరన్నా పరిశోధిస్తే ఆసక్తికరమైన వాస్తవాలు బయటకు వస్తాయి. ప్రజలు వారి అనుభవం నుంచి, వారి కంటికి కనిపించేవాటి నుంచి ఏర్పరచుకున్న అభిప్రాయం మాత్రం స్పష్టమే. ప్రజల జీవనప్రమాణాలు మాత్రం ఆ నిష్పత్తిలో ఆవగింజంత కూడా పెరగలేదు. గొప్పగా చెప్పుకుంటున్న తలసరి ఆదాయంలో పెద్దతలల సగటు వేరు. ఉద్యమపార్టీగా అధికారంలోకి వచ్చిన చంద్రశేఖరరావు ఏ కారణం చేతనో, ప్రజల విచక్షణ మీద ఆధారపడే రాజకీయ స్పర్థను మొదటి నుంచి ఇష్టపడలేదు. 2014 మొదటి ఎన్నికలలో కూడా ఉద్యమం, రాష్ట్రసాధనవిజయం, చివరకు తన జనాకర్షణ గట్టెక్కించి తీరతాయని ఆయన గట్టిగా నమ్మలేదు. సామాజిక సమీకరణలు సరే, ధనప్రవాహమే విజయాలను గ్యారంటీ చేస్తుందని ఆయన అనుకున్నారు. గెలిచే గుర్రాలను ఎంచుకుని తన దొడ్లో కట్టేసుకున్నారు. తక్కువ పడిన బలాన్ని కొనుక్కున్నారు. ప్రజలకు తనకూ మధ్య సంక్షేమ సంబంధం ఉంటే చాలు అనుకున్నారు. ఈ ఆలోచనాచట్రం 2018 ఎన్నికలలో, ఆ తరువాత ఉప ఎన్నికలలో డబ్బు ఏరులై ప్రవహించడానికి కారణమైంది. ఓటుకు రేటు భారీగా పెరగడమే తెలంగాణ సాధించిన గొప్ప తలసరి విలువ. విధాన అంశాల మీద ప్రజలను ఒప్పించి గెలుచుకోవడం కాక, ఆశ పెట్టడం, ఆవేశాలను రగిలించడమే పరిపాలనగా మారింది. ప్రశ్నించే గొంతులను, ఉద్యమ సహచరులను నయానో భయానో నోరుమూయించాక, తక్కిన ప్రజానీకాన్ని జోలపాడి నిద్రపుచ్చడం తేలిక అయింది. ఇంతగా చెడ్డా, బీఆర్ఎస్ పాలనలో కొంత మంచి జరిగింది. అయితే, అది పాలకుడు దయదలిచి చేసిన మంచి తప్ప, ప్రజల భాగస్వామ్యంతో జరిగిన మంచి కాదు. నగదుబదిలీ పథకాలను ఉధృతంగా అమలుచేస్తున్న రాష్ట్రాలలో ఒకటిగా ఉన్న తెలంగాణ, మరే దీర్ఘకాలిక, మౌలిక ప్రాజెక్టులు, కార్యక్రమాలు చేపట్టలేని దుస్థితిలో పడిపోయింది. ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అవే సంక్షేమ నగదుబదిలీ వాగ్దానాలను, మరికొన్ని జోడించి, రంగంలోకి దిగింది. వాగ్దానాలైతే చేయగలదు కానీ, కాంగ్రెస్ తెలంగాణ తలసరి ఓటు బేరాన్ని తట్టుకోగలదా? తెలంగాణ ఉద్యమకాలంలోను, ప్రత్యేక రాష్ట్రంలోని తొలి రెండు ప్రభుత్వాల హయాంలోను కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితితో పోటీపడలేకపోయింది. తమ హైకమాండే అనుకూలంగా ఉన్నప్పుడు, క్షేత్రస్థాయిలో మరింత విజృంభించి ఉద్యమనాయకత్వాన్ని చేతిలోకి తీసుకుని ఉండవలసింది, రాష్ట్రం వచ్చాక అది ఇచ్చింది తామేనని బలంగా చెప్పుకుని ఉండవలసింది. అన్నిటికి మించి కాంగ్రెస్ జెండా కింద ఉన్నవారు అంత సులువుగా అమ్ముడుపోకుండా ఉండవలసింది. ఇప్పుడు తమకు తెలంగాణ గెలుపు ప్రాణావసరం కాబట్టి, అంగ అర్థ బలాలున్నవాళ్లను నేరుగా పేరా గ్లైడర్లతో రంగం మీదకు దింపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ‘పెద్ద’ వ్యక్తులను చూస్తుంటే, వీరందరికి చివరి నిమిషంలో టికెట్లు ఎట్లా దొరుకుతున్నాయో అర్థం కాదు. కొన్ని స్థానాలలో ఇంకా అభ్యర్థులను ఖరారు చేయకపోవడం ఎందుకంటే, ఆయా చోట్ల ఎవరో ఫిరాయింపు కోసం మీనమేషాలు లెక్కబెడుతున్నారన్న మాట! ఇటువంటి విలువలున్నవాళ్లు, బీఆర్ఎస్‌కు ఒకటీ అరా తక్కువ పడితే, అటువైపు దూకుతారు కదా? అయినా ఈ పాత దొరలంతా కలిసి దొరల తెలంగాణ స్థానంలో ప్రజల తెలంగాణ ఎట్లా తెస్తారు? బీసీలకు ఎక్కువ సీట్లు అని చెప్పి మొండిచెయ్యి చూపడం, ఉద్యమకారులకు కనీసప్రాతినిధ్యం లేకపోవడం, పొత్తు కూడడానికి సిద్ధంగా ఉన్న కమ్యూనిస్టుల స్థానాల్లోనే చివరినిమిషపు అభ్యర్థులను దించడం.. ఇవన్నీ అధిష్ఠానానికి తెలియకుండానే జరుగుతున్నాయని అనుకోవడానికి లేదు. కొత్తగా చేరుతున్నవారు పార్టీకి బాగా ‘సహాయ’పడబోతున్నారట. ఎట్లాగో అట్లాగ గెలవడమే ముఖ్యమైనప్పుడు, పరిణామాలు ఇట్లాగే ఉంటాయి! బీఆర్ఎస్ అభ్యర్థులను చాలా ముందుగానే ప్రకటించారు. దాని వెనుక కేసీఆర్ ముందుజాగ్రత్త ఏదో ఉండవచ్చు. కానీ, ఎంపికైన కొందరు అభ్యర్థులు తమకు లభించిన అదనపు సమయాన్ని అనేక విధాలుగా సద్వినియోగం చేసుకుంటున్నారట. అందులో ముఖ్యమైనపని ప్రత్యర్థులను ఎంచుకోవడం. తమ మీద ఏ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీచేస్తే తమకు సదుపాయంగా ఉంటుందో గుర్తించి, వారికి టికెట్ రావడానికి వీళ్లు ప్రయత్నిస్తారన్నమాట. ప్రత్యర్థి గెలిస్తే, ఆ పార్టీలోకి పోవడానికి ఒక దారి ఉంటుంది. ప్రత్యర్థి ఓడిపోతే, అతన్ని తన పార్టీలోకి తీసుకువెళ్లవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మారిపోయింది, కట్టుదిట్టంగా ఉంటోంది, రేవంత్ రెడ్డి సిఫార్సులు కూడా పనిచేయవు అంటున్నారు కదా అన్న ప్రశ్నలు రావచ్చు. కానీ, అంతమాత్రం తెలియదా, పేరా గ్లైడింగ్ మార్గం ఉంటుంది కదా అని వాళ్లు జాలిగా నవ్వుతారు. ఏ పార్టీ నుంచి గెలిచినా అధికారపార్టీయే అంతిమలక్ష్యంగా తెలంగాణ రాజకీయ వర్గం పనిచేస్తుందని తెలిసి మనం ఆనందపడవచ్చు. కనుగోలు జాబితాలకు, కొనుగోళ్ల జాబితాకు నడుమ రేఖ చెదిరిపోయిందని అనుమానపడవచ్చు! కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ మధ్య లోలకాల్లా తిరుగుతున్న రాజకీయనేతల్లో చాలామంది కొంత కాలం పాటు బీజేపీలో తమను తాము పార్క్ చేసుకున్నారు. ప్రయాస పడి అవినీతి భారం మోస్తున్నవారిని తమ వద్దకు రమ్మని, ప్రశాంతిని కలుగజేతునని అచ్ఛేదిన్ స్వచ్ఛ రాజకీయాల పార్టీ వాళ్లను ఆహ్వానించడమే అన్యాయం. వాళ్లు ఏ పార్టీలోకి అయినా ఎందుకు వస్తారో తెలుసును కదా, ఆ అధికారాన్నే వాళ్లకు దూరంచేస్తే ఎట్లా? గెలిచే అవకాశం ఎట్లాగూ లేదు కానీ, కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వకూడదని బీజేపీ స్వయంగా నిర్ణయించుకున్నదని తెలిసేసరికి, ధైర్యం చేసి వాళ్లు రామ్ రామ్ చెబుతున్నారు. ఈడీ సీబీఐ ఎన్ఐఏల భయం ఉన్నప్పటికీ, గెలువు జీవుడా అంటూ కొత్త గమ్యాలు చేరుకుంటున్నారు. వీళ్ల చేతిలో రాష్ట్రాల భవితవ్యం, దేశ భద్రత సురక్షితంగా ఉంటాయా? పతనమైపోయిన, కుళ్లిపోయిన, దుర్గంధభూయిష్ఠమైన ఇటువంటి రాజకీయ వేదికల నుంచి ఏవేవో అద్భుతాలను ఇంకా ఆశిస్తూనే ఉన్నాము. ఈ చెత్తలోనుంచే, కాసింత మెరుగైన చెత్త కోసం చూస‍్తున్నాము. గత్యంతరం లేదు మరి....

పతన విలువలతో పరిమళిస్తున్న ప్రజాస్వామ్యం!

అన్నా వో వంద దాంక ఉంటావే.. అని ఆప్యాయంగా అడిగాడు ఆ సీనియర్ నాయకుడు, ఒక వర్ధమాన నాయకుడిని. ఆ సీనియర్ అప్పటికే వో వెయ్యి దాకా ఉంటాడు. ‘అంతలేదు గాని, వో పదిరువై తక్కువ’ అని చెప్పాడు జూనియర్, ఎదుగుతున్నాను సుమా, గుర్తించమన్నట్టు. ఈ సంభాషణ ఓ పదేళ్ల కిందట జరిగింది. ఇందులోని వందా వేయీ పదీ ఇరువై అన్నీ కోట్ల లెక్కలే. తెలంగాణ సమాజంలో ఆర్థికంగా ఎదుగుతున్న శ్రేణిలో పరస్పర కుశల ప్రశ్నలు, ఒకరినొకరు వేసుకునే అంచనాలూ ‘సీఆర్ల’ లోనే జరగడం అప్పటికే బాగా అలవాటయింది. పోరాటాల గర్వాలు కారుస్టీరియోల్లోకి, స్విమ్మింగ్ పూళ్లు ఇళ్ల పెరళ్లలోకి ప్రవహించడం కూడా మొదలైపోయింది. ఎంత నిర్బంధమూ, కల్లోలమూ చేయలేని పని డబ్బు చేసింది. ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ ఎగువ మధ్య తరగతి, ఆ పైని జనజీవితంలోకి ధనమూ విలాసమూ మధుమేహం లాగా ఆవరించాయి. అట్టడుగు మనుషులని మాత్రం మద్యం, సుషుప్తి, నిర్లిప్తత దెయ్యాల్లాగా పట్టుకున్నాయి.

అధోజగత్తు ఎప్పుడూ ఉన్నది. జులాయి తనమూ బాధ్యతారాహిత్యమూ కొత్తవేమీ కాదు. కానీ, అంతకు మించి ఏవో శక్తులు మనుషులని, సమాజాన్ని పతనంలోకి ఆకర్షిస్తున్నాయి. గొప్ప చరిత్ర కలిగిన నేలలో ప్రలోభాన్ని, బానిసత్వాన్ని, నేరపూరిత లాలసత్వాన్ని విత్తనాలుగా చల్లుతున్నారు. బహుశా, అన్నిచోట్లా ఇదే పరిస్థితి కావచ్చు. సంస్కారాలు అడుగుముట్టడం లోకమంతా ఉంది కాబోలు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, నాయకులు గెలుస్తారు ఓడతారు, కానీ ప్రజలే కలుషితమయ్యే కాలం వచ్చినప్పుడు విషవృక్షాలే పెరుగుతాయి. అభివృద్ధి, సంక్షేమం, పథకాలు అంటూ వినిపించే పడికట్టు మాటల వెనుక రాజకీయమైన కపటత్వం, సాంస్కృతికమయిన డొల్లతనం ధ్వనిస్తూనే ఉంటాయి.

ఎవరిని ఎన్నుకోవాలి జనం? ఇంకా మూడు స్తంభాలాట సాగుతూనే ఉన్నది. ఎక్కడా గిట్టుబాటు కానప్పుడు నాలుగోదీ అయిదోదీ ఏదో ఒక పందిరి గుంజ అయినా దొరుకుతుంది. వంగివంగి రంగురంగుల శాలువాలు కప్పుకుని వీరికి మెడలు వంగిపోయాయి. ఈ అభ్యర్థులెవరికీ చిన్నపాటి కట్టుబాటు కూడా లేదు. ప్రజల కోసం ఫలానా మంచి పనిచేయాలన్న తపన లేదు. ఒక పార్టీ నుంచి దానికి పూర్తి వ్యతిరేకమైన పార్టీకి, ప్రాంతీయం నుంచి జాతీయానికి, అటూ ఇటూ కూడా దొర్లుకుంటూ వెళ్లగలరు. ఎటువైపు దుంకాలో తేల్చుకోలేదంటూ గోడమీదనే నిలబడి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టగలరు. శాసనసభ్యులు అయితే ఏమి చేయాలో, ఏమి చేయగలరో కూడా వారికి తెలియదు. పార్టీ విధానాలు వాళ్లకు అక్కరలేదు. కొంత భూభాగంలో సామాజిక అధికారాన్ని, జనప్రాతినిధ్యం ద్వారా నిర్ణయాధికారాన్ని సమకూర్చుకుని, వాటిని ధనంలోకి, మరింత ధనంలోకి అనువాదం చేసుకోవడమొక్కటే వారి కార్యక్రమం. మునుపు సమకూర్చుకున్నవాటిని, మున్ముందు సంపాదించుకునేవాటిని కాపాడుకోవడమే అసలు లక్ష్యం. ప్రజల ఉమ్మడి సంపదకు కాపలాదారులుగా ఉండవలసినవారు, కంచె చేను మేసినట్టు బలిసిపోవడమే రాజకీయంగా మారిపోయింది.

ఎక్కడయినా ఉలిపికట్టెలు, మినహాయింపులూ ఉంటాయి కానీ, మొత్తం మీద దృశ్యంచూస్తే అన్నిపార్టీలలోనూ ఒకేపరిస్థితి. పార్టీలలోపల చూస్తే దాదాపు అందరూ ఒకే దాహంతో ఆవురావురు మంటున్నారు. అధికార భారత రాష్ట్ర సమితిలో వివిధ అంచెల నాయకుల ఆర్థిక, తదితర స్థితిగతులు గత పదేళ్లలో ఎంతగా పురోభివృద్ధి చెందాయో ఎవరన్నా పరిశోధిస్తే ఆసక్తికరమైన వాస్తవాలు బయటకు వస్తాయి. ప్రజలు వారి అనుభవం నుంచి, వారి కంటికి కనిపించేవాటి నుంచి ఏర్పరచుకున్న అభిప్రాయం మాత్రం స్పష్టమే. ప్రజల జీవనప్రమాణాలు మాత్రం ఆ నిష్పత్తిలో ఆవగింజంత కూడా పెరగలేదు. గొప్పగా చెప్పుకుంటున్న తలసరి ఆదాయంలో పెద్దతలల సగటు వేరు.

ఉద్యమపార్టీగా అధికారంలోకి వచ్చిన చంద్రశేఖరరావు ఏ కారణం చేతనో, ప్రజల విచక్షణ మీద ఆధారపడే రాజకీయ స్పర్థను మొదటి నుంచి ఇష్టపడలేదు. 2014 మొదటి ఎన్నికలలో కూడా ఉద్యమం, రాష్ట్రసాధనవిజయం, చివరకు తన జనాకర్షణ గట్టెక్కించి తీరతాయని ఆయన గట్టిగా నమ్మలేదు. సామాజిక సమీకరణలు సరే, ధనప్రవాహమే విజయాలను గ్యారంటీ చేస్తుందని ఆయన అనుకున్నారు. గెలిచే గుర్రాలను ఎంచుకుని తన దొడ్లో కట్టేసుకున్నారు. తక్కువ పడిన బలాన్ని కొనుక్కున్నారు. ప్రజలకు తనకూ మధ్య సంక్షేమ సంబంధం ఉంటే చాలు అనుకున్నారు. ఈ ఆలోచనాచట్రం 2018 ఎన్నికలలో, ఆ తరువాత ఉప ఎన్నికలలో డబ్బు ఏరులై ప్రవహించడానికి కారణమైంది. ఓటుకు రేటు భారీగా పెరగడమే తెలంగాణ సాధించిన గొప్ప తలసరి విలువ. విధాన అంశాల మీద ప్రజలను ఒప్పించి గెలుచుకోవడం కాక, ఆశ పెట్టడం, ఆవేశాలను రగిలించడమే పరిపాలనగా మారింది. ప్రశ్నించే గొంతులను, ఉద్యమ సహచరులను నయానో భయానో నోరుమూయించాక, తక్కిన ప్రజానీకాన్ని జోలపాడి నిద్రపుచ్చడం తేలిక అయింది.

ఇంతగా చెడ్డా, బీఆర్ఎస్ పాలనలో కొంత మంచి జరిగింది. అయితే, అది పాలకుడు దయదలిచి చేసిన మంచి తప్ప, ప్రజల భాగస్వామ్యంతో జరిగిన మంచి కాదు. నగదుబదిలీ పథకాలను ఉధృతంగా అమలుచేస్తున్న రాష్ట్రాలలో ఒకటిగా ఉన్న తెలంగాణ, మరే దీర్ఘకాలిక, మౌలిక ప్రాజెక్టులు, కార్యక్రమాలు చేపట్టలేని దుస్థితిలో పడిపోయింది. ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అవే సంక్షేమ నగదుబదిలీ వాగ్దానాలను, మరికొన్ని జోడించి, రంగంలోకి దిగింది. వాగ్దానాలైతే చేయగలదు కానీ, కాంగ్రెస్ తెలంగాణ తలసరి ఓటు బేరాన్ని తట్టుకోగలదా?


తెలంగాణ ఉద్యమకాలంలోను, ప్రత్యేక రాష్ట్రంలోని తొలి రెండు ప్రభుత్వాల హయాంలోను కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితితో పోటీపడలేకపోయింది. తమ హైకమాండే అనుకూలంగా ఉన్నప్పుడు, క్షేత్రస్థాయిలో మరింత విజృంభించి ఉద్యమనాయకత్వాన్ని చేతిలోకి తీసుకుని ఉండవలసింది, రాష్ట్రం వచ్చాక అది ఇచ్చింది తామేనని బలంగా చెప్పుకుని ఉండవలసింది. అన్నిటికి మించి కాంగ్రెస్ జెండా కింద ఉన్నవారు అంత సులువుగా అమ్ముడుపోకుండా ఉండవలసింది. ఇప్పుడు తమకు తెలంగాణ గెలుపు ప్రాణావసరం కాబట్టి, అంగ అర్థ బలాలున్నవాళ్లను నేరుగా పేరా గ్లైడర్లతో రంగం మీదకు దింపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ‘పెద్ద’ వ్యక్తులను చూస్తుంటే, వీరందరికి చివరి నిమిషంలో టికెట్లు ఎట్లా దొరుకుతున్నాయో అర్థం కాదు. కొన్ని స్థానాలలో ఇంకా అభ్యర్థులను ఖరారు చేయకపోవడం ఎందుకంటే, ఆయా చోట్ల ఎవరో ఫిరాయింపు కోసం మీనమేషాలు లెక్కబెడుతున్నారన్న మాట! ఇటువంటి విలువలున్నవాళ్లు, బీఆర్ఎస్‌కు ఒకటీ అరా తక్కువ పడితే, అటువైపు దూకుతారు కదా? అయినా ఈ పాత దొరలంతా కలిసి దొరల తెలంగాణ స్థానంలో ప్రజల తెలంగాణ ఎట్లా తెస్తారు? బీసీలకు ఎక్కువ సీట్లు అని చెప్పి మొండిచెయ్యి చూపడం, ఉద్యమకారులకు కనీసప్రాతినిధ్యం లేకపోవడం, పొత్తు కూడడానికి సిద్ధంగా ఉన్న కమ్యూనిస్టుల స్థానాల్లోనే చివరినిమిషపు అభ్యర్థులను దించడం.. ఇవన్నీ అధిష్ఠానానికి తెలియకుండానే జరుగుతున్నాయని అనుకోవడానికి లేదు. కొత్తగా చేరుతున్నవారు పార్టీకి బాగా ‘సహాయ’పడబోతున్నారట. ఎట్లాగో అట్లాగ గెలవడమే ముఖ్యమైనప్పుడు, పరిణామాలు ఇట్లాగే ఉంటాయి!

బీఆర్ఎస్ అభ్యర్థులను చాలా ముందుగానే ప్రకటించారు. దాని వెనుక కేసీఆర్ ముందుజాగ్రత్త ఏదో ఉండవచ్చు. కానీ, ఎంపికైన కొందరు అభ్యర్థులు తమకు లభించిన అదనపు సమయాన్ని అనేక విధాలుగా సద్వినియోగం చేసుకుంటున్నారట. అందులో ముఖ్యమైనపని ప్రత్యర్థులను ఎంచుకోవడం. తమ మీద ఏ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీచేస్తే తమకు సదుపాయంగా ఉంటుందో గుర్తించి, వారికి టికెట్ రావడానికి వీళ్లు ప్రయత్నిస్తారన్నమాట. ప్రత్యర్థి గెలిస్తే, ఆ పార్టీలోకి పోవడానికి ఒక దారి ఉంటుంది. ప్రత్యర్థి ఓడిపోతే, అతన్ని తన పార్టీలోకి తీసుకువెళ్లవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మారిపోయింది, కట్టుదిట్టంగా ఉంటోంది, రేవంత్ రెడ్డి సిఫార్సులు కూడా పనిచేయవు అంటున్నారు కదా అన్న ప్రశ్నలు రావచ్చు. కానీ, అంతమాత్రం తెలియదా, పేరా గ్లైడింగ్ మార్గం ఉంటుంది కదా అని వాళ్లు జాలిగా నవ్వుతారు. ఏ పార్టీ నుంచి గెలిచినా అధికారపార్టీయే అంతిమలక్ష్యంగా తెలంగాణ రాజకీయ వర్గం పనిచేస్తుందని తెలిసి మనం ఆనందపడవచ్చు. కనుగోలు జాబితాలకు, కొనుగోళ్ల జాబితాకు నడుమ రేఖ చెదిరిపోయిందని అనుమానపడవచ్చు!

కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ మధ్య లోలకాల్లా తిరుగుతున్న రాజకీయనేతల్లో చాలామంది కొంత కాలం పాటు బీజేపీలో తమను తాము పార్క్ చేసుకున్నారు. ప్రయాస పడి అవినీతి భారం మోస్తున్నవారిని తమ వద్దకు రమ్మని, ప్రశాంతిని కలుగజేతునని అచ్ఛేదిన్ స్వచ్ఛ రాజకీయాల పార్టీ వాళ్లను ఆహ్వానించడమే అన్యాయం. వాళ్లు ఏ పార్టీలోకి అయినా ఎందుకు వస్తారో తెలుసును కదా, ఆ అధికారాన్నే వాళ్లకు దూరంచేస్తే ఎట్లా? గెలిచే అవకాశం ఎట్లాగూ లేదు కానీ, కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వకూడదని బీజేపీ స్వయంగా నిర్ణయించుకున్నదని తెలిసేసరికి, ధైర్యం చేసి వాళ్లు రామ్ రామ్ చెబుతున్నారు. ఈడీ సీబీఐ ఎన్ఐఏల భయం ఉన్నప్పటికీ, గెలువు జీవుడా అంటూ కొత్త గమ్యాలు చేరుకుంటున్నారు. వీళ్ల చేతిలో రాష్ట్రాల భవితవ్యం, దేశ భద్రత సురక్షితంగా ఉంటాయా?

పతనమైపోయిన, కుళ్లిపోయిన, దుర్గంధభూయిష్ఠమైన ఇటువంటి రాజకీయ వేదికల నుంచి ఏవేవో అద్భుతాలను ఇంకా ఆశిస్తూనే ఉన్నాము. ఈ చెత్తలోనుంచే, కాసింత మెరుగైన చెత్త కోసం చూస‍్తున్నాము. గత్యంతరం లేదు మరి.

కె. శ్రీనివాస్

Updated Date - 2023-11-02T02:10:11+05:30 IST