ఉపా పాపాన్ని కాంగ్రెస్ కడిగేసుకోగలదా?

ABN , First Publish Date - 2023-06-22T02:27:52+05:30 IST

‘‘..స్థూలంగా చెప్పాలంటే, బెయిల్ దొరకడాన్ని కష్టం చేస్తున్నాం, అంతే. ఇప్పుడు మాత్రం అన్ని కేసుల్లో బెయిల్ దొరుకుతోందా, పెద్ద నేరాల విషయంలో, పూర్తి దర్యాప్తు జరిగేదాకా కోర్టు బెయిల్ ఇవ్వడం లేదు కదా, ఇదేమంత అసాధారణం కాదు.’’ ఈ మాటలన్నది పి. చిదంబరం. 2008లో...

ఉపా పాపాన్ని కాంగ్రెస్ కడిగేసుకోగలదా?

‘‘..స్థూలంగా చెప్పాలంటే, బెయిల్ దొరకడాన్ని కష్టం చేస్తున్నాం, అంతే. ఇప్పుడు మాత్రం అన్ని కేసుల్లో బెయిల్ దొరుకుతోందా, పెద్ద నేరాల విషయంలో, పూర్తి దర్యాప్తు జరిగేదాకా కోర్టు బెయిల్ ఇవ్వడం లేదు కదా, ఇదేమంత అసాధారణం కాదు.’’ ఈ మాటలన్నది పి. చిదంబరం. 2008లో ఉపా చట్టం సవరణ సందర్భంగా చర్చలో చట్టసభలలో ఆయన ఊరడింపు అది. ఆరునెలలో, సంవత్సరాల తరబడో జైలుకు వీలుకల్పిస్తూ, బెయిల్‌ను అసాధ్యం చేసిన సవరణ అది. నిర్వచించిన ప్రకారం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సంఘాలను కట్టడి చేయడం దగ్గర నుంచి, వ్యక్తులకు ఉగ్రవాద హోదా ఇవ్వడం దాకా, ఏ కారణం చెప్పకుండా ఆరునెలలపాటు నిర్బంధించడం దగ్గర నుంచి, ప్రాథమిక సాక్ష్యాధారాల గురించిన కోర్టు సంతృప్తి, అసంతృప్తుల మీద బెయిల్ నిర్ణయం దాకా, నేరం చేయడమే కాదు, నేరం చేయాలనే ఉద్దేశ్యం కూడా నేరం కావడం నుంచి, భారతపౌరులకు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవలసి రావడం దాకా ఉపాచట్టం, కోరలూ కొమ్ములూ పెంచుకుంటూ బ్రహ్మరాక్షసిగా ఎదిగిపోయింది. పెంచిందీ పోషించిందీ కాంగ్రెస్ అయితే, వేటను వేగవంతం, ఉధృతం చేసింది బిజెపి.

వామపక్షాలవారో అప్పటికింకా మిగిలిన ప్రజాస్వామిక వాదులో ఎవరో కానీ, ఇటువంటి క్రూరచట్టం దుర్వినియోగం కావడం గురించి భయాలను పార్లమెంటులో పంచుకున్నారు. ఛ, ఛ, ఈ చట్టం చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే ఉపయోగించేది, దుర్వినియోగం ప్రశ్నే లేదు అని చిదంబరం బుజ్జగింపులు పలికారు. సవరణలు ఆమోదం పొందాయి. 2012లో కూడా మరోసారి సవరణలు ప్రవేశించాయి. బెయిల్ నిబంధనల సవరణలు. భయాలు మళ్లీ వ్యక్తమయ్యాయి. ఏవో అభయాలు లభించాయి. 2019లో హోంమంత్రిగా అమిత్ షా, ఉపాకు మరో సవరణ. సంస్థలే కాకుండా వ్యక్తులకు కూడా టెర్రరిస్టు కిరీటం. చిదంబరం లాగా చిద్విలాసపు మాటలు అమిత్ షాకు రావు. ఈ సవరణ చూసి భయపడవలసిన అవసరం టెర్రరిస్టులకే ఉంటుంది అని ముందరి కాళ్లకు బంధం వేశారు. క్రూర ఘోర చట్టం అంటూ చట్టసభలలో కాంగ్రెస్ చాలా గొడవ చేసింది. చివరకు ఓటు మాత్రం ఉబలాటంతో వేసి, బిల్లును గెలిపించింది.

గాంధీజీ జాతీయోద్యమంలో చేపట్టిన తొలి అంశాలలో రౌలట్‌ చట్టం ఒకటి. అత్యంత దుర్మార్గమైన చట్టం అది. దాన్ని నిరంకుశమైనది, పాపిష్ఠిదీ అని గాంధీ అభివర్ణించారు. కానీ, ఉపా ముందు రౌలట్ సాధుజంతువులాగా కనిపిస్తుంది. మరి, ఊపా సందర్భంలో కూడా గాంధీకి ప్రాసంగికత ఉందా?

ఇప్పుడు, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ సమావేశమవుతున్న వేళ, 70 మందికి పైగా అమెరికన్ ప్రజాప్రతినిధులు ఒక లేఖ రాశారు. భారత్‌లో భావప్రకటనా స్వేచ్ఛకు, మానవహక్కులకు తీవ్ర విఘాతం కలుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం లభిస్తున్నదని, దాని గురించి బైడెన్ ప్రస్తావించాలని వారు కోరారు. ఉభయ సమాజాలలో నైతిక ప్రభావాలు వేసిన గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌లను వారు ఆ లేఖలో ప్రస్తావించారు. ఉపా పేరు వారు నేరుగా తీయలేదు కానీ, భారత్‌లో మానవహక్కుల గురించి ఉపాను మినహాయించి మాట్లాడలేము.

గాంధీ వారసత్వాన్ని చెప్పుకుంటున్న పార్టీ, ఉపా మీద సత్యాగ్రహం కాదు కదా, పెదవి విప్పడం కూడా భాగ్యమై పోయింది. ఓటింగ్ సమయంలో ఏమి చేసినా, చర్చలో విలువల గురించి మాట్లాడుతున్నారు కదా అని సంతోషించాలి. స్టాన్ స్వామి చనిపోయినప్పుడు, ప్రతిపక్ష నాయకులతో కలసి సోనియాగాంధీ కూడా రాష్ట్రపతికి లేఖరాసి, రాజకీయ ఉద్దేశ్యాలతో బంధించిన ఖైదీలను విడుదల చేయాలని కోరినందుకు, ఉపా చట్టం దుర్వినియోగాన్ని ఖండించినందుకు సంబరపడాలి. నిజానికి ఒక జాతీయ పాత్రికేయుడు వ్యాఖ్యానించినట్టు, ఉపాకు వినియోగం, దుర్వినియోగం అంటూ రెండు లేవు. ఉన్నది ఒక్కటే, దుర్వినియోగం. అయితే, ఉపాను రద్దు చేయాలన్న డిమాండ్ ఆ లేఖలో లేకపోవడానికి కాంగ్రెస్ మాత్రమే కారణం కానక్కరలేదు. అనుబంధపార్టీలు, ప్రాంతీయ పార్టీలు తక్కువ తినలేదు. ఇప్పుడు హరగోపాల్ పైనా, మరో అయిదుగురి పైనా కేసు ఉపసంహరించిన కెసిఆర్ పార్టీ కూడా 2019లో ఆ ప్రమాదకర సవరణలను ఆమోదించినదే.

ఒక న్యాయమూర్తి ప్రస్తావవశంగా అన్నట్టు, నేర విచారణా ప్రక్రియే శిక్షగా పరిణమించడానికి పెద్ద ఉదాహరణ ఉపాచట్టం. ఈ చట్టం ద్వారా అరెస్టయిన వారికి చివరకు శిక్షలు పడడం చెప్పుకోదగ్గ శాతంలో లేదు. కానీ, రెండు దశాబ్దాల దాకా ఈ ప్రక్రియలో బాధితులైన వారున్నారు. ఢిల్లీ హింసాకాండ పేరుతో నమోదయిన ఉపా కేసుల్లో అత్యధికులకు ఇంకా మూడేళ్ల నుంచి బెయిల్ రానేలేదు, పోనీ విచారణ ప్రక్రియ మొదలయిందా అంటే అదీ లేదు. ఈశాన్య రాష్ట్రాలతో, కశ్మీర్‌తో, అస్సాం, ఝార్ఖండ్, కేరళ లతో పోలిస్తే కూడా తెలంగాణలో ఉపా కేసులు తక్కువే కావచ్చును కానీ, ఈ కేసులు సమాజంలో క్రియాశీల ఆచరణలో ఉన్న ప్రజాస్వామిక వాదులందరినీ ఆవరించాయి. ఉపా కేసులకు ఎన్ఐఎకు ఉన్న ముడి కారణంగా, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలలో ఎవరి ప్రమేయం ఎంతో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులను మధ్యలో ఎన్ఐఎ స్వాధీనం చేసుకోగలదు, విచారణలో పాలుపంచుకోగలదు. గతంలో ఉన్నట్టు, శాంతిభద్రతల విషయంలో రాష్ట్రాలకు పరిధి, స్వతంత్రత లేదు. ఫెడరలిజానికి ఇంతటి నష్టం చేయడంలో కాంగ్రెస్ పాత్రే మొదటిది, ఘనమైనది. ఈ రోజు దేశంలో ఏర్పడిన వాతావరణానికి కావలసిన ప్రాథమిక సదుపాయాలన్నీ కాంగ్రెస్ పార్టీయే సమకూర్చిపెట్టింది. ఈ విషయంలో బిజెపియే నయం. 2008లో చిదంబరం సవరణ చేస్తున్నప్పుడు, దాన్ని వ్యతిరేకించకపోగా, మరింత కఠిన నిబంధనలు ఉండాలని కోరింది. యుపిఎ హయాంలో అవతరించిన ఎన్ఐఎను స్వాగతించి, తన పాలనలో మరింత విస్తృతంగా లాభదాయకంగా ప్రయోగించసాగింది.

ఇదంతా రాజకీయ తీవ్రవాదులను, తీవ్ర అసంతృప్తులను, మిలిటెంట్ ప్రజాకార్యకర్తలను మాత్రమే కాదు, తనను కూడా నష్టపరుస్తున్నదని కాంగ్రెస్ గుర్తించేసరికి పుణ్యకాలం గడచిపోయింది. భ్రష్టులైన మిత్రపక్షాలు, ప్రాంతీయపక్షాలు, అవకాశవాదంతోనో, భయంతోనో కేంద్రానికి సాగిలపడుతున్నాయి. ఆర్థికరంగంలోను, శాంతిభద్రతల రంగంలోను దర్యాప్తుసంస్థల కొరడాలకు మునుపటి పెద్దమనుషులు కూడా కుంగిపోయారు. ఎదురులేనితనం పెరిగిపోయింది. కొనప్రాణంతో ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యం ఆర్తనాదం వినిపించలేదు. ఈ మధ్య కాలంలో ప్రజాస్వామిక స్వరం కాంగ్రెస్ నుంచి తరచుగా వినిపిస్తున్నది. ఉపా వంటి చట్టాన్ని, తరువాత కాలంలో టాడాను రూపొందించి, అమలు చేసినందుకు కనీసం పశ్చాత్తాపాన్ని ప్రకటించి ఉండవలసింది. చిదంబరం, కపిల్ సిబల్ వంటి వారు తమ పత్రికావ్యాసాలలో గతంలో చేసిన నేరాలను ఒప్పుకున్నా బాగుండేది. కనీసం కొన్ని తప్పులనైనా అంగీకరించిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉన్నది.

రాహుల్ గాంధీ జోడోయాత్రలో దేశంనాడిని తెలుసుకోవడానికి ప్రయత్నించినట్టే కనిపించింది. అతనికి రెండు బాధ్యతలున్నాయి. కాంగ్రెస్‌ను బతికించుకోవడం, భవిష్యత్తులో ఇటువంటి విపత్కర పరిస్థితి రాకుండా, ఏకస్వామ్యపు, మతస్వామ్యపు అవలక్షణాలను తొలగించి, సామరస్య సహజీవన విలువలను పునరుద్ధరించడం. ఆ కర్తవ్యాన్ని అతను గుర్తించాడా? గుర్తించినా నెరవేర్చగలడా? కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో, అక్కడ అప్పటి బిజెపి ప్రభుత్వం దూకుడుగా అనుసరిస్తున్న విభజన విధానాలను ఎదుర్కొనడం గురించి చర్చలో, జోడో యాత్రలో పాల్గొంటున్న యోగేంద్ర యాదవ్ ఒక మాట అన్నారు. ‘ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడడానికి, చేయడానికి అతి కొద్ది అవకాశం మాత్రమే ఉన్నది, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ, అవకాశాన్ని పెద్దది చేసుకోవాలి’. నిజమే కావచ్చు, స్వయంగా తన ఉనికే ప్రశ్నార్థకమైనప్పుడు జాగ్రత్తలు అవసరం కావచ్చు. కానీ, అనేక కీలక సందర్భాలలో కాంగ్రెస్ మౌనం కానీ, మతతత్వంతో రాజీపడడం కానీ, వ్యూహమో, ద్రోహమో అర్థం కాదు. మరి అతి పెద్ద అంశమయిన ఉపా రద్దు అన్న నినాదాన్ని కాంగ్రెస్ బాహాటంగా స్వీకరించగలదా? పోనీ, ఆ ఆకాంక్షను సానుభూతితో మాత్రమే కాదు, స్వచర్మ రక్షణ కోసం కూడా పరిశీలనలో ఉంచగలదా? దేశంలోని వివిధ ప్రజాస్వామిక సంస్థలు, ఉద్యమాలు, దళిత బహుజన ప్రజాశ్రేణులు మెరుగైన హక్కుల వాతావరణానికి ప్రతీకగా ఉపా రద్దు డిమాండ్‌ను ప్రతిపక్షాల ముందు, ప్రజల ముందు పెట్టగలవా?

హైదరాబాద్ గుండా జోడోయాత్ర వెడుతున్నప్పుడు, ప్రొఫెసర్ హరగోపాల్ రాహుల్ గాంధీని అడిగారు, ఉపా చట్టం మీద మీరు ఒక వైఖరి తీసుకుని ప్రజాస్వామిక శక్తులకు బలం ఇవ్వాలని. అప్పటికే హరగోపాల్‌ మీద ఉపా ఉన్నది కానీ, అది పోలీసులకు తప్ప ఆయనకు తెలియదు. రాహుల్ గాంధీ సాలోచనగా విన్నారు. బహుశా, దేశంలో ఇంకా అనేక చోట్ల పౌరసమాజ ప్రతినిధులు ఇదే ఆకాంక్షను, ఇతర సమస్యలను రాహుత్‌తో పంచుకుని ఉంటారు. ఆ చట్టాన్ని చూసి భయపడేవాళ్లు, దాన్ని వ్యతిరేకించేవాళ్లు, టెర్రరిస్టులు కానక్కరలేదని గ్రహించి ఉంటారు.

కె. శ్రీనివాస్

Updated Date - 2023-06-22T02:27:52+05:30 IST