‘బాహుబలి మోదీ’యే మిగిలిన బ్రహ్మాస్త్రం!!

ABN , First Publish Date - 2023-07-13T03:16:58+05:30 IST

ఇండియా గనుక ఉక్రెయిన్‌లో శాంతికి పనిచేస్తే అంతకంటె కావలసిందేముంది? అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మేథ్యూ మిల్లర్ అన్నాడు. భారత్‌కు రష్యా దగ్గర ఏదో పలుకుబడి ఉన్నదని, దాన్ని ఉపయోగించి పుతిన్ చెవిలో మోదీ...

‘బాహుబలి మోదీ’యే మిగిలిన బ్రహ్మాస్త్రం!!

ఇండియా గనుక ఉక్రెయిన్‌లో శాంతికి పనిచేస్తే అంతకంటె కావలసిందేముంది? అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మేథ్యూ మిల్లర్ అన్నాడు. భారత్‌కు రష్యా దగ్గర ఏదో పలుకుబడి ఉన్నదని, దాన్ని ఉపయోగించి పుతిన్ చెవిలో మోదీ సంధిమంత్రం ఊదాలని అమెరికా గతంలో కూడా ఒకసారి అన్నది. ప్రపంచంలో అనేక ఇతర దేశాలు కూడా అటువంటి సూచనలు చేసి ఉండవచ్చు. అటువంటి ఆశాభావాలన్నిటిని నిజమని నమ్మి, ఛాతీని మరింత విస్తరింపజేసుకుంటే నవ్వులపాలు కావడం తప్ప మరేమీ జరగదు. ప్రపంచమంతా సుడిగాలిలా తిరుగుతూ, వెళ్లిన చోటల్లా ప్రవాస భారతీయుల సభల్లో జేజేలు పొందిన భారత ప్రధాని, అంతర్జాతీయ వివాదాలలో చక్రం తిప్పగలరని అనుకోవడం బాగానే ఉంటుంది కానీ, అగ్రరాజ్యాల దగ్గరికి, సంపన్న దేశాల దగ్గరికి వెళ్లి, వేలకోట్ల డాలర్ల కొనుగోలు ఆర్డర్లు ఇవ్వడమే తప్ప, మరేమీ జరగడం లేదు. కావలిస్తే, తాజాగా మొదలవుతున్న ఫ్రాన్స్ పర్యటన చూడవచ్చు. మనం బోలెడు డబ్బు పెట్టి వాళ్ల దుకాణంలో సరుకులు కొంటున్నాము కాబట్టి, కాస్త అట్టహాసం చేసి తివాచీలు పరుస్తున్నారు తప్ప, ఎవరి దౌత్యశక్తి మీదా, సమర్థత మీదా ఎవరికీ నమ్మకం లేదు. విమానాల భారీ ఆర్డర్, తద్వారా లక్షలాది పనిరోజుల లబ్ధి పొందుతూ కూడా అమెరికాలో మోదీకి నిరసనలు తప్పలేదు. అంత కప్పం చెల్లించి కూడా, ఇండియాలో ఒబామా మీద విమర్శలూ ఆగలేదు. చమురు కొంటున్నారని పుతిన్ మనతో మర్యాదగా ఉంటాడేమో కానీ, యుద్ధం మానుకో అని చెబితే వింటాడా?

నరేంద్రమోదీ జగదేకవీరుడు అని నమ్మే అమాయక భక్తులు ఉన్నారు కాబట్టే, ఆయన నోబెల్ శాంతి బహుమతికి ప్రధాన పోటీదారు అని, ప్రకటన ఒక్కటే తక్కువని అంటూ, వదంతికి తక్కువ, ఫేక్ న్యూస్‌కు ఎక్కువ అయిన కబురు వ్యాప్తిలోకి రాగానే నిజమే అనుకుని సంబరపడ్డారు. సోషల్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీలో చెలామణి అయిందంటే అర్థం చేసుకోవచ్చు, ఎఎన్ఐ, టైమ్స్ నౌ కూడా ఆ ‘శుభవార్త’ను ప్రచారంలో పెట్టాయి. నోబెల్ బహుమతుల కమిటీ ముఖ్యసభ్యుడు ఒకరు అప్పుడు దేశంలో పర్యటిస్తున్నాడు. ఆయన మాటలకు అతిశయోక్తులను దట్టించి ప్రచారంలో పెట్టారు. అంతా అబద్ధమని ఆయన చెప్పుకోవలసి వచ్చింది. మీ ప్రధానమంత్రి పోటీలో లేరు అని చెప్పడం, పాపం, ఆయనకు ఎంత ఇబ్బంది?

ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత అంటారు కానీ, నరేంద్రమోదీ కొంతకాలం పాటు ఇంటా బయటా పల్లకీలోనే ఊరేగారు. ట్రంప్ దిగిపోయాక, ప్రపంచ రాజకీయాలలో కొన్ని ఇతర మార్పులు కూడా వచ్చాక, తేడా వచ్చింది. ఇంట్లో పరిస్థితి కూడా మునుపటిలాగా లేకపోవడంతో, ప్రధానమంత్రి ఆడంబరాల గురించి, ప్రచార చాపల్యం గురించి జనం చలోక్తులు కూడా వేసుకుంటున్నారు. ‘మన్ కీ బాత్’ వంద ఎపిసోడ్లు కావడం ఒక వేడుక, వందే భారత్‌లు అన్నిటికీ తానే జెండా ఊపడం, ప్రతిచోటా తన బొమ్మలే, రోడ్లకు భవనాలకు పార్కులకు స్టేడియాలకు తన పేర్లే. ఇక ఆయన ఫోటోషూట్‌ల గురించి చెప్పనక్కరలేదు. మోదీ ఫోటో ప్రదర్శించలేదని ఒక రేషన్ షాపు ముందు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ యాగీ చేయడం వ్యక్తి పూజ నిర్మాణంలో కేంద్రప్రభుత్వం, అధికారపార్టీ చూపే ఆత్రుతకు ఒక ఉదాహరణ. సభలలో ‘‘మోదీమోదీ’’ అంటూ జనం నిరంతరం నినాదాలు ఇస్తూ ఉండడం ఒక మనోవైజ్ఞానిక క్రీడ. ఇదంతా ఆషామాషీగా జరుగుతున్నది కాదు. నిజానికి, వ్యక్తిగత ప్రచారాన్ని వ్యక్తిపూజ స్థాయికి చేర్చడం, అన్ని వేళలా ప్రతిష్ఠా నిర్వాహకుల కనుసన్నలలో వ్యవహారాలను నడిపించడం మోదీకి కూడా వ్యక్తిగతంగా సహించకపోయి ఉండవచ్చు. కానీ, రాజకీయంగా ఆయనకు అది అవసరం. మోదీ అనే ఒక నాయకుడి ఇమేజ్‌ను తీర్చి దిద్దుతూ ఉండడానికి పెద్ద వ్యవస్థే పనిచేస్తూ ఉన్నది.

మోదీకి నేపథ్యశక్తి, సైద్ధాంతిక మార్గదర్శి అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, సంఘ నిర్మాణంతో పాటు వ్యక్తి నిర్మాణం గురించి కూడా మాట్లాడుతుంది. వ్యక్తిపూజకు ఆ సంఘ వ్యవహారసరళిలో ఆమోదం ఉండదు. అటల్ బిహారీ వాజపేయికి జనాదరణ ఉన్నదంటే, అందుకు ఆయన సమకూర్చుకున్న గౌరవం ఒక కారణం. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన అత్యధిక కాలం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వాజపేయికి, అద్వానీకి ఉన్న జనాకర్షణను మోదీకి ఉన్న జనామోదంతో పోల్చలేము. అభిమానుల మాటల్లో చెప్పాలంటే, మోదీది ఒక వేవ్. ఒక కల్ట్. ఆర్ఎస్ఎస్ నైతిక నియమావళికి భిన్నంగా ఒక వ్యక్తిని బాహుబలిగా ఎదగనివ్వడం, ఆ వ్యక్తి లేదా బీజేపీ చేస్తున్న ధిక్కారం కాదు. అందరూ కలిసి, అనుకుని, అనుసరిస్తున్న వ్యూహం కావచ్చు. ముంబై నేరప్రపంచం, నేరపాత్రికేయం, పోలీసుల మధ్య సంచరించే కథతో రూపొందించిన ‘స్కూప్’ అనే వెబ్ సిరీస్‌లో మాలెగావ్ పేలుళ్ల నిందితురాలు సాధ్వి ప్రగ్యను పోలిన పాత్ర ఒకటి ఉంటుంది. ‘‘మంచి కోసం ఒక్కోసారి చెడు చేయాల్సివుంటుంది’’ అని ఆ పాత్ర తన నేరాన్ని వివరించడానికి నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తుంది.

బహుశా, నరేంద్ర మోదీ వ్యక్తి పూజ కూడా ఒక మంచి కోసం అనుసరిస్తున్న చెడు అని సంఘపరివారం భావించి ఉంటుంది. అద్వానీ అంతటివాడిని అవసరమనుకున్నప్పుడు అప్రధానం చేయగలిగినప్పుడు నరేంద్రమోదీ ఒక లెక్కా అని అనుకుని ఉండవచ్చు. వారి అంచనా తప్పు అయ్యే అవకాశమే ఎక్కువ. ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు అవసరం లేని దశకు మోదీ తనను తాను పెంచుకుంటున్నారు. అయితే, ఆయన ఆర్ఎస్ఎస్ లక్ష్యాల నుంచి తప్పుకుంటారని అనుకోలేము. ఇంతకీ, ఏ మంచి కోసం ఈ వ్యక్తి పూజ? మొదటిసారి ఒక ఎజెండాతో, రెండోసారి మరో ఎజెండాతో నెగ్గుకు రాగలిగినా, దేశమూ దానిలోని సకల వ్యవస్థలూ ఇంకా స్వాధీనం కావని, మూడోసారి గెలవడానికి ప్రభుత్వ వ్యతిరేకత అవరోధంగా నిలుస్తుందని ఊహించి ఉంటారు. విధాన వైఫల్యాలు, పాలనా వైఫల్యాలు ప్రభుత్వాన్ని బోనులో నిలబెడితే, మోదీ తన చెక్కు చెదరని ఉక్కు ప్రతిష్ఠతో ఆ ప్రమాదాన్ని అధిగమించగలుగుతారు.

ఒక సినీనటి యూట్యూబ్ ఇంటర్వ్యూలో అంటున్నారు-‘2014 కంటె ముందు హిందువులం అణగారిపోయి ఉన్నాం కదా, ఇప్పుడిప్పుడే మనలో చేతన మేల్కొంటున్నది కదా, ఆ ఘనత నరేంద్రమోదీదే కదా?’ అని ధార్మిక విషయాలలోను, చరిత్ర అంశాలలోను ఒక ప్రత్యేకమైన ధోరణి సమాజంలో విస్తృతంగా వ్యాపించింది. దాని ప్రకారం, మోదీ ఒక రక్షకుడు, ఉద్ధారకుడు, ప్రభుత్వ మాలిన్యాలు ఆయనకు అంటవు. ఆయనకు సాటి మరే నాయకుడూ లేరు. మన దేశాన్ని ప్రపంచంలో గొప్ప చేయడానికి, ప్రపంచానికి మన దేశాన్ని గురుస్థానంలో నిలపడానికి ఆయన తాపత్రయపడుతున్నారు. ఇదంతా నమ్ముతున్నవాళ్లు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

తనకో గొప్పపేరును నిర్మించుకోవడంలో మోదీ సఫలమయ్యారు కానీ, మన వ్యవస్థలో ఒక సమస్య ఉన్నది. మన ఓటర్లు ప్రధానమంత్రిని నేరుగా ఎన్నుకోరు. కేంద్రంలోను, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ఉన్నప్పుడు దేశ్ కీ నేతాలు సులువుగా రూపొందుతారు. నరేంద్రమోదీకి ఎంత పేరున్నప్పటికీ, మమత, కేసీఆర్ వంటి ప్రాంతీయ నాయకులతో నేరుగా పోటీపడి నెగ్గలేరు. ప్రాంతీయ స్థాయిలోను మోదీకి ఒక జనాకర్షక ప్రతినిధి ఉండాలి. ఈ సమస్య ఉండబట్టే, జమిలి ఎన్నికలని, అధ్యక్ష తరహా పాలన అని ప్రతిపాదనలు వినబడుతూ ఉంటాయి.

2024 ఎన్నికలకు దాచుకున్న బ్రహ్మాస్త్రాలలో ఉమ్మడి పౌరస్మృతి ఒకటి. అది అంతగా ఫలితాన్ని ఇచ్చేట్టు కనిపించడం లేదు. దాని మంచిచెడ్డల చర్చను పక్కన పెడితే, అందులో ఇమిడి ఉన్న సంక్లిష్టత లక్షలాది నివేదనలు అందడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎంతగా ముందుకు తోసినా, అరకొర, ఆపద్ధర్మ, నామ్ కే వాస్తే బిల్లు ఏదో రూపొందవచ్చు. దాని వల్ల ఆశించిన ప్రయోజనం రాకపోవచ్చు. ప్రభుత్వ వాదన, ప్రతివాదన కూడా ఇంకా ఒక రూపు తీసుకోలేదు. ఆవేశకావేశాలు ఏర్పడి, ఒక విభజన సాధించాలని అనుకుంటే కనుక, అది నెరవేరే అవకాశం కనిపించడం లేదు. అనేక అంతర్జాతీయ సంస్థలు ఇండియాలో ప్రజాస్వామ్యం మీద రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్న దశలో, మతపరమైన ఉద్రిక్తతల ఆధారంగా ఓట్ల సమీకరణ చేయడానికి వాతావరణం అనువుగా లేదు. ఇక మిగిలింది, పాలనను అందించడంలో తాము సాధించినవి ఉంటే వాటిని బాగా ప్రచారం చేసుకోవడం, మోదీ వ్యక్తిగత ప్రతిష్ఠ ఆధారంగా ఒక సానుకూల ప్రభంజనాన్ని సృష్టించడం.

మోదీ ఇమేజ్‌ను నిర్మించడంలో ముఖ్యపాత్ర పోషించినవి సోషల్, డిజిటల్ మీడియాలు. కానీ, మోదీ ప్రత్యర్థులు కూడా ఆ రంగంలో ప్రవేశించి ఆరితేరారు. ప్రతికూల ప్రచారాలు కూడా ఉధృతంగానే ఉండబోతున్నాయి. నాయకుడి గురించి తమ విమర్శను ప్రచారంలో పెట్టి, అతను ప్రతినాయకుడని నిరూపించవచ్చును కానీ, అంత మాత్రమే ప్రజలకు సరిపోదు. వారికి ఆ స్థానంలో తాము నమ్మదగిన నాయకుడు కావాలి. ప్రతిపక్ష శిబిరంలో నాయకులు లేకపోతే, రాజకీయ యుద్ధంలో గెలవడం కష్టం.

కె. శ్రీనివాస్

Updated Date - 2023-07-13T03:19:32+05:30 IST