పదినెలల పాటు ఇక ప్రమాదరుతువు!!

ABN , First Publish Date - 2023-08-03T01:20:53+05:30 IST

చూస్తూ ఉండండి, 2024 ఎన్నికలలోపు ఇంకా చాలా చూస్తారు, అన్నారు సత్యపాల్ మాలిక్. ఆ తానులోని ముక్కే. ఏదో తేడా వచ్చింది. అప్పటినుంచి పంతం పట్టినట్టు అన్నీ కఠోర సత్యాలే మాట్లాడుతున్నాడు...

పదినెలల పాటు ఇక ప్రమాదరుతువు!!

చూస్తూ ఉండండి, 2024 ఎన్నికలలోపు ఇంకా చాలా చూస్తారు, అన్నారు సత్యపాల్ మాలిక్. ఆ తానులోని ముక్కే. ఏదో తేడా వచ్చింది. అప్పటినుంచి పంతం పట్టినట్టు అన్నీ కఠోర సత్యాలే మాట్లాడుతున్నాడు.

హర్యానా హింస దృష్టిలో పెట్టుకుని ఆ హెచ్చరిక.

రోజులేమీ బాగోలేవు. ద్వేషాన్ని ఇంధనం లాగా చల్లారు నేల నేల అంతా. పచ్చగడ్డి కూడా భగ్గుమంటోంది. ఆవుల్ని రక్షించడం పేరుతో ఇద్దరు మనుషులను చంపాడని ఆరోపణ ఉన్న ఒక అనుమానితుడు, పెద్ద ఊరేగింపులో ఊరేగబోతున్నాడని వదంతి వ్యాపించడంతో, మృతుల వర్గీయులు నిరసనలకు దిగారు. ఉద్రేకాలు పెరిగిపోయాయి. ఒక పూజామందిరంలో భక్తులు భయంతో చిక్కుపడిపోయారు. ఒక ప్రార్థనామందిరంలో దాడులు జరిగాయి. ఒక మతపెద్దను చంపేశారు. పోలీసులతో సహా అనేకమంది చనిపోయారు, గాయపడుతున్నారు. రోడ్డు మీద దుకాణాలు, కార్లు అన్నీ తగలబడిపోతున్నాయి. యథావిధిగా రాజధర్మం కునుకుతీస్తోంది. ఎవరు విజృంభిస్తున్నారో, ఎవరు బాధితులవుతున్నారో తరచి చూస్తే సులువుగానే తెలిసిపోతుంది. పక్కా స్క్రీన్‌ప్లేతో పకడ్బందీగా అమలు జరుగుతున్న వ్యూహమని సత్యపాల్ మాలిక్ అంటున్నారు.

పల్లెలన్ని కలసి పట్టణాలను చుట్టుముట్టడం గురించి విప్లవ కమ్యూనిస్టులు చెబుతుండేవారు. అదేమో కానీ, రాష్ట్రాలనుంచి ప్రవహిస్తున్న మతతత్వం ఇప్పుడు దేశరాజధానిని చుట్టుముడుతోంది. నూతన పార్లమెంటు ముందు కొత్త కరకుదనాన్ని పులుముకున్న అశోకసింహాలతో తాదాత్మ్యం చెందే ఉన్మాదులు ఇక చెలరేగిపోతారు. అక్కడెక్కడో ఈశాన్యంలో రాజ్యం కళ్లుమూసుకుని హింసకు పగ్గాలు అప్పగించిందని సర్వోన్నత న్యాయస్థానం దిగులుపడుతోంది కదా, చూసుకోండి, మీ ఊరికే వస్తుంది, మీ గడపకే వస్తుంది దౌర్జన్యం! ఏమి చేయగలవు న్యాయాధీశా?

ద్వేషభక్తి దావానలంలాగా వ్యాపిస్తున్నది. నడుస్తున్న రైలులో పోలీసుకు మతి ఉండో మతిలేకో కోపం వస్తుంది. ముందు పై అధికారి ప్రాణం పోతుంది. తరువాత, ఎదురుగా భిన్నంగా కనిపించే ముగ్గురు ప్రయాణికులు కుప్పకూలిపోతారు. నెత్తురూ కళేబరాల సాక్షిగా, హంతకుడు ఒక ప్రసంగం దయచేయిస్తాడు. మోదీ, యోగీ వారి చేతిలో దేశం భద్రంగా ఉంటుందని విశ్వాసం ప్రకటిస్తాడు. పాపం, ఆ ఇద్దరు నాయకులకు ప్రత్యక్షంగా ఏ సంబంధమూ లేదు, దేశం రక్తనాళాల్లో విషం అతి పీడనంతో ప్రవహిస్తున్నప్పుడు అర్ధాంగీకార అంగీకారాలతో అనుమతించడం తప్ప పెద్దలకు ఏ సంబంధమూ ఉండదు. కానీ, ఎక్కడైనా, ఏ మారుమూలనైనా, ఏ వీధిలో అయినా, కొండల మీద అయినా లోయలలో అయినా, రైల్లో బస్సులో విమానంలో ఎక్కడైనా సరే సర్వాంతర్యామి వలె బుసకొట్టే ఒక మహాసర్పం తిరుగుతున్నదన్న స్ఫురణే భయానకమైనది!

అధికారపు అతిశయం నుంచి తీవ్రంగా వ్యవహరించేవారు, చేజారుతుందన్న అభద్రతనుంచి మరెంత విధ్వంసకరంగా ప్రవర్తించగలరు? ఈ సందేహం నుంచే సత్యపాల్ మాలిక్ దేశానికి ముసళ్ల పండుగ ముందుంది అన్న ప్రమాదసూచన చేసి ఉంటారు.

మరి, దేశముఖచిత్రంలో వస్తున్న మార్పులను, జాతి ఆకాశం మీద కమ్ముకుంటున్న మబ్బులను బాధ్యత కలిగిన వారు గుర్తిస్తున్నారా? ఏ ఒక్కరో కొందరో కాక, ఆ సేతు హిమాచలం సకల వర్గాల శ్రేణుల వారికీ ముప్పు తేగల పరిణామాలను నిరోధించడానికి ఏమైనా చేస్తున్నారా?

చేస్తున్నారు. సహచరులు కూడదంటున్నా, ‘ఇండియా’ శరద్ పవార్ నరేంద్రమోదీతో వేదిక పంచుకున్నారు. అడగకముందే అత్రంగా జగన్‌రెడ్డి దాసోహం అంటూ అవిశ్వాసంలో ఓటు కప్పం చెల్లిస్తానన్నారు. ఢిల్లీ బిల్లును పాస్ చేయిస్తానని నవీన్ పట్నాయక్ ఉబలాడపడ్డారు. అనేక ప్రాంతీయ, జాతీయ పార్టీల్లో నిద్రాణశక్తులుగా ఉన్న ఏకనాథ్ షిండేలు సేవచేసుకోగల అవకాశం తమకు ఎప్పుడు దొరుకుతుందా అని తహతహలాడుతున్నారు.

మరి, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మాన్యశ్రీ కెసిఆర్ ఏమి చేస్తున్నారు? మహారాష్ట్రలో బరాక్ ఒబామా గురించి ఉపన్యాసం ఇస్తున్నారు. మరాఠీ దళిత కవికి భారతరత్నను డిమాండ్ చేస్తున్నారు. ఏదో ఒక కూటమిలో ఎందుకు చేరాలి, ఇద్దరికీ సమాన దూరం అని విధానప్రకటన చేస్తున్నారు. తనతోనూ నడిచే మిత్రులున్నారని ఆశ్చర్యపరిచే రహస్యాన్ని వెల్లడిస్తున్నారు.

తెలంగాణలో ముఖ్యమైన మంత్రి కెటిఆర్ మంత్రివర్గ సమావేశం వివరాలు చెబుతూ, రెండు కూటములకు సమానంగా దగ్గర అనే అర్థం వచ్చేట్టు మాట్లాడారు. వచ్చే పార్లమెంటులో ఎవరు అధికారానికి వచ్చినా బిఆర్ఎస్ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయలేరని, తెలంగాణ కేటాయింపుల సంగతి అప్పుడు చూసుకుంటామని ఆయన అన్నారు. కెసిఆర్ మాటల్లో, స్వతంత్రత వ్యక్తం అయితే, కెటిఆర్ మాటల్లో ఎటువైపైనా మొగ్గగల ధోరణి కనిపించింది.

రెండు పక్షాల మధ్య పోరాటాన్ని ప్రేక్షకుల వలె వీక్షించడానికి, ఎక్కువ బలం చూసినవారి పక్షాన నిలబడి అధికారం పంచుకోవడానికి ఉత్సాహపడుతున్న శక్తులు బిఆర్ఎస్ ఒక్కటే కాదు, దేశంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల విషయంలో వారికి ఎటువంటి ఆందోళనా ఉండదు. సరిదిద్దవలసిన బాధ్యతా తీసుకోరు. ఫలితం సిద్ధిస్తే మాత్రం భాగం కోరతారు. ప్రతిపక్ష కూటమి విషయంలో మాత్రమే ఈ తటపటాయింపులు. కేంద్రంలోని ప్రభుత్వం నుంచి మేళ్లు పొందడానికి, ఎదురుమేళ్లు చేయడానికి, చాటుమాటు స్నేహాలు చేస్తూ బహిరంగ పోరాటం ప్రదర్శించడానికి ఎటువంటి సంకోచాలూ లేని ఇటువంటి పక్షాలవల్ల దేశానికి ఏమిటి ఉపయోగం?

ఒకపక్కన కార్చిచ్చులాగా వ్యాపిస్తున్న ద్వేష వాతావరణం, మరో వైపు కల్లోల జలాలలో చేపలవేట చేస్తున్న అవకాశవాదులు, దేశ రాజకీయం బీభత్స ప్రహసనంలాగా కనిపిస్తోంది. అధికారాన్ని మూడోసారి చేజిక్కించుకోవడానికి భారతీయ జనతాపార్టీ, దాని పరివారం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేకపోవడం వల్లనే అదనపు ‘పరిశ్రమ’ అవసరం అవుతోంది.

జులై 26వ తేదీన ఒక సమావేశంలో మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఇట్లా అన్నారు, ‘‘ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా, మా మూడో హయాంలో, భారత్ రూపొందుతుందని నేను వాగ్దానం చేస్తున్నాను... 2024 తరువాత మా మూడో పరిపాలనా కాలంలో భారత్ ఆర్థికాభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని హామీ ఇస్తున్నాను’’.. ఇంతమాత్రమే అని ఊరుకుంటే, ‘‘మా’’ అని బహువచనంలో మాత్రమే అని ఉంటే పెద్ద విశేషమేమీ లేదు. ఆ తరువాతి వాక్యం ఏమిటంటే, ‘‘నా మూడో పదవీకాలంలో మీ కలలు సాకారం కావడాన్ని మీరు కళ్లారా చూస్తారు’’. అంటే, మూడోసారి కూడా తానే ప్రధాని కావాలని మోదీ అనుకుంటున్నారా?

ఈ ప్రశ్న అమాయకమైనదని వేరే చెప్పనక్కరలేదు. 75 ఏళ్ల తరువాత పదవుల్లో ఉండకూడదన్న అలిఖిత నియమం మోదీకి వర్తిస్తుందని, వర్తించాలని ఆయన పార్టీలో ఎవరూ ఆశిస్తున్నట్టు మనకు తెలియదు. ఆ నియమం పాటించాలంటే, 2024లో ప్రధాని కావచ్చును కానీ, మొత్తం ఐదేళ్లూ పూర్తిచేయడానికి ఉండదు. కానీ, దేశం కోసం, ధర్మం కోసం ఎన్నో మినహాయింపులు ఇస్తున్నప్పుడు, మోదీ ప్రధానమంత్రిత్వానికి మాత్రం ఎందుకు పట్టింపు? అమిత్ షా, ఆదిత్యనాథ్ యోగి మరి కొంత కాలం వేచి ఉంటారు, వయస్సులో చిన్నవారే కదా?

వచ్చే ఏడాది ఎన్నికలలో నెగ్గడానికి మూడు ముఖ్యమైన అవాంతరాలు మోదీ ప్రభుత్వానికి ఉన్నాయని పాత్రికేయులు శేఖర్ గుప్తా అంటున్నారు. ఈ సారి ప్రతిపక్ష ఓటు చీలకపోయే అవకాశం, దేశవ్యాప్తంగా ముస్లిం ఓటు బిజెపికి వ్యతిరేకంగా సంఘటితం కావడం, జాతీయ భద్రత, భూభౌగోళిక రాజకీయాలు 2019లాగా సానుకూలంగా లేకపోవడం. ఈ ప్రతికూలతలను బిజెపి కూడా ముందే గ్రహించినట్టుంది. అందుకు తగ్గ ప్రతిక్రియలు ప్రారంభించినట్టు కనిపిస్తోంది. ఈ సారి అదనంగా ఒక కొత్త బ్రహ్మాస్త్రాన్ని ఎన్నికల రంగం మీదికి సంధించే అవకాశం ఉంది. ఇది కొత్త అస్త్రమేమీ కాదు కానీ, బ్రహ్మాస్త్రంగా మాత్రం కొత్తదే. అది మోదీ జనాకర్షణ. ఆయన ప్రతిష్ఠే తురుఫు ముక్క అయినప్పుడు, రిటైరు కమ్మని అడిగేదెవరు? జిన్‌పింగ్ లాగా, పుతిన్ లాగా యావజ్జీవం కిరీటం తొడగాలి కానీ!

ముచ్చటగా మూడోసారి కూడా ప్రధానిగా కొనసాగాలని మోదీ, ఆయన పార్టీ అనుకుంటున్నప్పుడు, వారి ఆశకు, వాస్తవానికి నడుమ ఏ అవరోధం వచ్చినా దాన్ని వారు తీవ్రంగానే పరిగణిస్తారు. 2024లో బిజెపి పూర్తి స్థాయిలో అధికారంలోకి రాకుండా నిరోధించగలిగే, కనీసం సామంత మిత్రపక్షాల సాయంతో పూర్తి మెజారిటీ సాధనకు ఆటంకంగా ఉండే పరిణామాలను, శక్తులను బలహీనపరచాలని ప్రయత్నించడం సహజం. 2019లో విజయానికి సరిహద్దు ఉద్రిక్తతలు తోడ్పడ్డాయని, ఈ సారి ఆ అవకాశం లేదని గ్రహించడమంటే, ఉద్వేగాలను మరొక రంగంలో సాగుచేసుకోవాలని అర్థం. అది ఎట్లా చేస్తారన్నది ఊహలకే వదిలివేయాలి, లేదా సత్యపాల్ మాలిక్ లాంటి వారి అంచనాలకు వదిలివేయాలి.

పర్యవసానాలను పక్కనబెట్టి ఆవేశ ఉద్రేకాల మీద రాజకీయ సవారీ చేస్తున్నప్పుడు, నియంత్రణ లేని పరిణామాలు ఏర్పడతాయి. ఒక విశాల దేశంలో, విశాల హృదయాలున్న మనుషుల సమాజంలో గోడలు, కందకాలు, కార్పణ్యాలు, ప్రాణాలు తీసే అమానుషాలు మొలిచినప్పుడు, అణువుల గొలుసుకట్టు విచ్ఛిత్తి జరిగినట్టు వరుస విస్ఫోటనాలు చూస్తాము. అంతర్యుద్ధం అన్నమాట పెద్దది కానీ, మరేదైనా మాట వెదుకుదాము. ప్రళయమే పురుడు పోసుకుంటున్నప్పుడు పేరులో ఏముంది?

జనం మీద తప్ప మరెవరి మీదా ఆశపెట్టుకోలేము. నైతికత, ఆత్మగౌరవం, బాధ్యత తెలియని రాజకీయ పక్షాలు, నాయకులు, వీళ్ల వల్ల లాభం లేదు. మాయ చేస్తున్నారని, ప్రేమలను మరిపించి ద్వేషాన్ని మప్పుతున్నారని, సత్యం నుంచి ఆకర్షక అసత్యాల దారి పట్టిస్తున్నారని, గురిపెట్టవలసిన ఆగ్రహాన్ని దారి తప్పిస్తున్నారని తెలుసుకోకుండా ప్రజలను ఎంతో కాలం ఆపలేరు.

దురదృష్టవశాత్తు, ఏ జనాకర్షణ ద్వారా 2024ను గట్టెక్కుదామని బిజెపి అనుకుంటోందో, దానికే మణిపూర్ పరిణామాలు గండికొట్టాయి. దానిని అనుసరిస్తూ దేశంలో జరుగుతున్న వరుస సంఘటనలు కూడా మోదీ ప్రతిష్ఠను మరింతగా బలహీనపరుస్తున్నాయి. ఏలిక మౌనం దుస్సహంగా, బాధ్యతారహితంగా, క్రూరంగా ధ్వనిస్తున్నప్పుడు, జనం మనస్సులో ఒక నిర్ణయం క్రమంగా రూపుదిద్దుకుంటుంది!

కె. శ్రీనివాస్

Updated Date - 2023-08-03T01:20:53+05:30 IST