రాహుల్‌కు శిక్ష ఓ పన్నాగం!

ABN , First Publish Date - 2023-03-31T01:04:51+05:30 IST

సూరత్ కోర్ట్ ఈ నెల 23న రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష విధించడం, మరునాడే లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేయడం పథకం ప్రకారం జరిగిందని, ఒక ఛానెల్‌లో...

రాహుల్‌కు శిక్ష ఓ పన్నాగం!

సూరత్ కోర్ట్ ఈ నెల 23న రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష విధించడం, మరునాడే లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేయడం పథకం ప్రకారం జరిగిందని, ఒక ఛానెల్‌లో కేంద్ర హోమ్ మంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలను గమనిస్తే అర్థమవుతుంది. ఇంతకు ముందు అనర్హత వేట్లు అనేకం పడినప్పుడు జరగని రాద్ధాంతం ఇప్పుడెందుకని అమిత్ షా ప్రశ్నిస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతమై, అదానీపై హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడై ప్రధాని మోదీ నైతికతపై మేఘాలు కమ్ముకుంటున్న దశలో రాహుల్‌పై కేసును తెరపైకి తెచ్చారన్నది వాస్తవం.

2019 ఎన్నికల సభలో రాహుల్ గాంధీ ఏమన్నారు? ఈ దొంగలందరికీ మోదీ పేరు ఎలా ఉంది? అంటూ నీరవ్ మోదీ, లలిత్ మోదీ పేర్లను ఆయన ఉటంకించారు. ప్రసంగంలో ఎక్కడా కూడా మోదీలందరూ దొంగలని రాహుల్ అననేలేదు. కానీ, ఆయన అనని మాటలను అన్నట్టుగా బిజెపి విష ప్రచారం చేసింది. మోదీలందరూ ఓబీసీ వర్గానికి చెందిన వారన్నట్టు, రాహుల్ ఓబీసీలను కించపరచినట్టు వింత ప్రచారం మొదలెట్టింది. వాస్తవానికి మోదీ పేరు గల వారిలో ఓబీసీలతో పాటు అగ్రవర్ణాలకు చెందినవారూ ఉన్నారు. నరేంద్రమోదీ ఓబీసీ కావచ్చుకానీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ, లలిత్ మోదీ అగ్రవర్ణాలకు చెందినవారే.

రాహుల్ గాంధీ మాట్లాడింది కర్ణాటకలోని కోలార్‌లో. కేసు దాఖలైంది ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లోని సూరత్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో. ఏప్రిల్ 16, 2019న బిజెపి ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ ఈ కేసు పెట్టారు. సమన్లు జారీ చేస్తే రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారు కూడా. కానీ, ఆ తరువాత పూర్ణేశ్ మోదీ సూరత్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ కొనసాగనివ్వకుండా గుజరాత్ హైకోర్ట్ నుండి స్టే తెచ్చుకున్నారు. ఆ తర్వాత సూరత్ చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి బదిలీ అయి, కొత్త జడ్జీ నియమితులైనారు. రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేసిన వ్యక్తే హైకోర్టుకు వెళ్ళి విచారణపై ఎందుకు స్టే తెచ్చారన్న ప్రశ్న. ఇది ఎవరి సూచనల మేరకు జరిగిందో తెలియదు.

అయితే, ఫిబ్రవరి 7, 2023న రాహుల్ గాంధీ లోక్‌సభలో అదానీ, మోదీ మధ్య సంబంధాన్ని తీవ్రస్వరంతో ప్రశ్నించిన తర్వాత పూర్ణేశ్ మోదీ తిరిగి రంగప్రవేశం చేశారు. ఆగమేఘాల మీద గుజరాత్ హైకోర్టులోని తన స్టే అభ్యర్థనను ఫిబ్రవరి 16న ఉపసంహరించుకున్నారు. హైకోర్టులో స్టే ఉపసంహరించుకున్న 11 రోజులలోనే అంటే, ఫిబ్రవరి 27న కోర్టులో విచారణలు తిరిగి ప్రారంభమయ్యాయి. విచారణ ప్రారంభమైన 25 రోజులలో అంటే మార్చి 23న కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి, ఏకంగా రెండేళ్ళ గరిష్ట శిక్ష విధించింది. ఇది జరిగిన 24 గంటల్లోనే లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనను అనర్హుడిగా ప్రకటించింది. అమిత్ షా జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో, రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన కాపీని సదరు ఫిర్యాదుదారు అదేరోజు ఆన్‌లైన్‌లో లోక్‌సభ కార్యాలయానికి పంపించారని, దాని ఆధారంగానే మరునాడు అనర్హత వేటు పడిందని చెప్పుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో బిజెపి నాయకత్వం రాహుల్ గాంధీపై వేటు వేయడానికి ఎంత వ్యూహాత్మకంగా కృషి చేసిందో, ఎంత ఉత్సాహాన్ని, వేగాన్ని కనబరిచిందో తెలుస్తూనే ఉంది. ఈ కేసుపై సిట్టింగ్ జడ్జితో పూర్తి స్థాయిలో విచారణ జరిపినప్పుడు అధికారంలో ఉన్నవారు వ్యవస్థలను ఏ స్థాయిలో దుర్వినియోగం చేశారో తేలుతుంది. మోదీ మార్క్ ప్రజాస్వామ్యం మరింత స్పష్టమవుతుంది.

జి. నిరంజన్

సీనియర్ ఉపాధ్యక్షులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ

Updated Date - 2023-03-31T01:04:51+05:30 IST