పురుషాధిక్యరాజకీయం ఓడినట్టేనా?

ABN , First Publish Date - 2023-09-22T01:13:25+05:30 IST

అనితర సాధ్యుడు నరేంద్ర మోదీ. ఆయన ఉంటే ఏదీ అసంభవం కాదు (మోదీ హై తో మమ్ కిన్ హై). సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ‘చరిత్రాత్మక’ 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు...

పురుషాధిక్యరాజకీయం ఓడినట్టేనా?

అనితర సాధ్యుడు నరేంద్ర మోదీ. ఆయన ఉంటే ఏదీ అసంభవం కాదు (మోదీ హై తో మమ్ కిన్ హై). సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ‘చరిత్రాత్మక’ 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదం పొందింది. ‘బిల్ హమారా హై’ (మేము తీసుకువచ్చినదే ఆ బిల్లు) అని సోనియా గాంధీ వక్కాణించారు. చట్ట సభలలో మహిళలకు విధిగా 33 శాతం ప్రాతినిధ్యం కల్పించేందుకు దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ చేసిన కృషిని ఆమె జ్ఞాపకం చేసుకున్నారు. ఒక మహత్కార్యానికి ఘనత తమదేనని చాటుకోవడం రాజకీయ స్పర్ధలో భాగమేనని మరి చెప్పనవసరం లేదు. అయితే సత్యాన్ని మనం విస్మరించకూడదు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం వెనుక ఒక బలమైన కారణమున్నది. రాజకీయ జయాపజయాల నిర్ణేత మహిళా ఓటరు కావడమే అది. మహిళా ఓటర్లను ఉపేక్షించడమనేది ఇంకెంత మాత్రం సాధ్యంకాదు. ప్రతీ రాజకీయ పార్టీకి, ప్రతీ రాజకీయ నాయకుడికీ ఈ వాస్తవం బాగా తెలుసు. ఆమెను ఆకట్టుకున్నప్పుడే విజయం వరిస్తుందనేది రాజకీయుల సహేతుక ప్రగాఢ విశ్వాసం. అవును, నిశ్చితమైన ఒక మహిళా ఓటు బ్యాంకును కలిగి ఉండడమనేది ఏ రాజకీయ పార్టీకైనా ఒక మహా పెన్నిధి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి లోక్‌సభలో మెజారిటీ ఎప్పుడు లేదు కనుక? అయినా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టి, ఆమోదం పొందేందుకు ఆయన ప్రభుత్వం తొమ్మిదేళ్లు ఆగింది! ఈ లోగా తమ పార్టీ భావజాల అంశాలకే అధిక ప్రాధాన్యమిచ్చింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, అధికరణ 370 రద్దు మొదలైన వాటికి ఇచ్చిన ప్రాధాన్యం అంతా ఇంతాకాదు. మరి ఇప్పుడు కొద్ది నెలల్లో సార్వత్రక ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ‘నారీ శక్తి’ కేతనం ఎగురవేసిన రాజకీయ దురంధరుడిగా ప్రజల ముందుకు వెళ్లేందుకు మోదీ ఆరాటపడ్డారు. ఆయన ఆరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. అయినా మహిళలకు అండగా ఉండడంలో మోదీ సర్కార్ పులు కడిగిన ముత్యమేమీ కాదు. రెజ్లర్స్ సంఘం అధ్యక్షుడు, బీజేపీ ఎంపి అయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఒలింపిక్ పతకాల విజేతలు అయిన యువ మల్లయోధురాళ్లు ఎంతగా మొత్తుకున్నప్పటికీ మోదీ ప్రభుత్వం మౌనంగా ఉండిపోలేదూ? కారణమేమిటి? యూపీలో మరిన్ని సీట్లు సాధించుకోవడానికి బ్రిజ్ భూషణ్ మద్దతు తప్పనిసరి అవడం వల్లే బీజేపీ నేతలు మౌనంగా ఉండిపోయారు. ఆడపడుచుల గౌరవం ఏమయినట్లు? చెప్పవచ్చిన దేమిటంటే 2024 సార్వత్రక సమరంలో తిరుగులేని విజయం సాధించుకునేందుకై మహిళా ఓటు బ్యాంకు నుంచి గరిష్ఠ స్థాయిలో ప్రయోజనం పొందడమే మహిళా రిజర్వేషన్ బిల్లు పరమార్థం సుమా!

కేంద్రంలో ఒక సంకీర్ణ ప్రభుత్వ సారథిగా కాంగ్రెస్ పార్టీ సై‍తం పది సంవత్సరాలు అధికారంలో ఉన్నది. 2010లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం లోక్‌సభలో విఫలమయింది. హిందీ రాష్ట్రాలకు చెందిన మిత్ర పక్షాల నాయకులు మహిళా రిజర్వేషన్లపై తీవ్ర అభ్యంతరాలు తెలుపడమే ఆ వైఫల్యానికి కారణమని మరి చెప్పనవసరం లేదు. పార్లమెంటు ఉభయ సభలలోనూ సంఖ్యాబలాన్ని గణనీయంగా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మహిళా ఓటర్ మద్దతు మునుపెన్నడూ లేని విధంగా చాలా చాలా అవసరం మరి.

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె కవిత విషయాన్నే తీసుకోండి. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయమై ఆందోళనలో ఆమె అగ్రగామిగా ఉన్నారు. ఈ సంవత్సరాంతంలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 115 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీఆర్‌ఎస్‌ విడుదల చేసింది. ఆ 115 మందిలో కేవలం ఏడుగురు మాత్రమే మహిళలు. చట్టసభలలో మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించడం పట్ల కవిత, బీఆర్‌ఎస్‌కు అంత నిబద్ధత ఉంటే మహిళలకు తమ పార్టీ టిక్కెట్లు మరిన్ని ఎందుకు కేటాయించలేదు?


నిజానికి బిజూ జనతా దళ్ (బీజేడీ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎమ్‌సి) మినహా మరే పార్టీ కూడా మహిళా రిజర్వేషన్లను అమలుపరచడంలో చిత్తశుద్ధి చూపడం లేదు. ఒడిషాలోని 21 లోక్‌సభ స్థానాలలో మూడో వంతు సీట్లను 2019లో మహిళలకే బీజేడీ కేటాయించింది. 33 శాతం లక్ష్యాన్ని నెరవేర్చింది. పశ్చిమ బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాలలో 17ను 2019లో మహిళలకే టిఎమ్‌సి కేటాయించింది. అంటే 41శాతం సీట్లు మహిళలకు దక్కాయి. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికలలో సైతం టిఎమ్‌సి తరఫున 50 మంది మహిళలు పోటీ చేశారు.

మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం, బీజేపీ దశాబ్దాలుగా అధికారంలో ఉన్న గుజరాత్ విషయాన్ని చూద్దాం. ఆ రాష్ట్ర శాసనసభలో 182 స్థానాలు ఉన్నాయి. గత ఏడాది జరిగిన ఆ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ కేవలం 18 మంది మహిళలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చింది! ప్రియాంక గాంధీ నాయకత్వం విషయమై కాంగ్రెస్ పార్టీ ‘లడ్కీ హూన్, లడ్కీ శక్తి హూన్’ (నేను ఒక మహిళను, నేను పోరాడగలను) అనే నినాదాన్ని ఇచ్చింది. గత ఏడాది ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ప్రియాంక సారథ్యం వహించారు. ఆమె నేతృత్వంలో యూపీలో మహిళలకు 40 శాతం టిక్కెట్లు కేటాయించిన కాంగ్రెస్ ఈ ఏడాది కర్ణాటక శాసనసభ ఎన్నికలలో పోటీ చేసేందుకు కేవలం 11 మంది మహిళలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చింది. ఈ వాస్తవాల దృష్ట్యా ‘నారీశక్తి’ గురించి మన రాజకీయ నాయకుల గంభీరోపన్యాసాలలో చిత్తశుద్ధిలేదని స్పష్టంగా చెప్పవచ్చు. తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసమే మహిళా ఓటరుకు అన్ని రాజకీయ పక్షాలు ప్రాధాన్యమిస్తున్నాయనడం సత్యదూరం కాదు.

మహిళా ఓటర్లు 1952లో 46 శాతం నుంచి 2019లో 67 శాతానికి పెరిగారు. భారతదేశ ఎన్నికల రాజకీయాలలో కొట్టవచ్చినట్టు కన్పించే మార్పు ఇది. ఓటు ఏ పార్టీకి వేయాలనే నిర్ణయాన్ని సొంతంగా తీసుకొంటున్న మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరగనున్నది. దీంతో రాజకీయ పార్టీలు తమ ఎన్నికల వ్యూహాలను ఎప్పటికప్పుడు పునః రూపొందించుకోవడం అనివార్యమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరుస్తోన్న వివిధ సంక్షేమ పథకాల ప్రధాన లబ్ధిదారులు మహిళలే కావడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కర్ణాటకలో కాంగ్రెస్, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీతో సహా ప్రతీ రాజకీయ పక్షమూ మహిళా ఓటర్లకు ప్రత్యక్ష నగదు బదిలీ లబ్ధిని సమకూర్చుతోంది. తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుసరించిన మహిళా కేంద్రిత రాజకీయ వ్యూహాన్ని ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతీ రాష్ట్రంలోనూ అనుసరిస్తున్నారు.

అయితే వాస్తవాలు విచిత్రంగా ఉండడం కద్దు. మహిళా ఓటరు మద్దతు సాధించుకునేందుకు ప్రతీ రాజకీయ పక్షమూ మున్నెన్నడూ లేని విధంగా పోటీ పడుతున్న ప్రస్తుత తరుణంలోనే కార్మిక జనాభాలో మహిళల శాతం తగ్గుతోందని ప్రామాణిక సమాచారం సూచిస్తోంది. కార్మిక శ్రేణులలో పని నైపుణ్యాలు ఉన్న స్త్రీలు కేవలం 19.2 శాతం మంది మాత్రమే ఉండగా పురుషులు 70.1 శాతం మంది ఉన్నారు. కార్మిక జనాభాలో ఈ జెండర్ తారతమ్యత 50 శాతానికి పైగా ఉండడం ఆందోళన కలిగించే విషయమే. మహిళా ఓటర్లకు పాలక పక్షాలు ధన సహాయం అందించడమనేది సమాజంలో నిజమైన జెండర్ సమానత్వాన్ని సృష్టించేందుకు తోడ్పడే మార్గం కానేకాదు.


మహిళా రిజర్వేషన్లను కచ్చితంగా ఎప్పటి నుంచి అమలుపరచనున్నది ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజనతో దానిని ముడిపెట్టారు. కారణమేమిటి? మహిళా ఓటర్ల మద్దతును సాధించుకోవడంలో అనివార్యంగా ఎదురయ్యే పోటీలో మీ రాజకీయ భవిష్యత్తు అపాయంలో పడబోదనే భరోసాను పురుష రాజకీయవేత్తలకు కల్పించేందుకు తగు సమయాన్ని తీసుకునేందుకేనన్న వివరణ వస్తోంది. ఇలా అయితే పురుషాధిక్య రాజకీయ ప్రపంచాన్ని మహిళా రిజర్వేషన్లు మౌలికంగా మార్చి వేయగలుగుతాయా? ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒకసారి మహిళలకు ప్రత్యేకించే నియోజకవర్గాలు మారుతుంటాయి. తాము శ్రద్ధ వహించి అభివృద్ధి పరిచిన నియోజకవర్గాలు ఆ రొటేషన్ పద్ధతిలో తమకు కాకుండా పోతాయని, వాటిని స్వాయత్తం చేసుకున్న మహిళా అభ్యర్థులు భవిష్యత్తులో తమకు పోటీదారులు అవుతారనే వ్యాకులత చాలా మంది పురుష రాజకీయవేత్తలలో వ్యక్తమవుతోంది. ఈ కలవరపాటే, స్థానిక స్వపరిపాలనా సంస్థలలో మహిళా రిజర్వేషన్లను తొలుత అమలుపరిచినప్పుడు ‘సర్పంచ్ పతి’ (ఎన్నికైన మహిళల భర్తలే ఆ పాలనా బాధ్యతలను నిర్వర్తించడం) పరిణామానికి దారితీసింది.

పురుష రాజకీయవేత్తలలోని ఈ తొట్రుపాటు లేదా మానసిక ఆందోళన ఎలా, ఎప్పటికి సమసిపోతుంది? అసలే పితృస్వామిక ధోరణులు ప్రబలంగా ఉన్న సమాజం మనది. ఈ దృష్ట్యా మహిళా రిజర్వేషన్లు రాజకీయ పార్టీలకు, వాటి నాయకులకు పెను సవాళ్లుగా పరిణమించనున్నాయనడంలో సందేహం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రూపొందించిన ‘నారీశక్తి వందన–2023’ చట్టం అనంతర తేదీతో ఇచ్చిన ఒక పోస్ట్–డేటెడ్ చెక్ లాంటిది. దానిని తక్షణమే ఎన్నికల లబ్ధిగా మార్చుకోగలమని భారతీయ జనతా పార్టీ గట్టిగా నమ్ముతోంది. ఇతర వెనుకబడిన వర్గాలకూ ఉప కోటాను డిమాండ్ చేయడం మినహా ప్రతిపక్షానికి మరో గత్యంతరం లేదు. భారత ప్రజాస్వామ్యంలో ఒక నవోదయాన్ని సృష్టించనున్న ఈ అపూర్వ శాసనంపై కోలాహలం ముగిసిన అనంతరం జెండర్ ఆధారిత కయ్యాలు మళ్లీ ప్రారంభమవుతాయి. చట్టానికి సంబంధించి మరిన్ని రాజకీయ లోపాలు, లొసుగులను అవి తప్పక బహిర్గతం చేస్తాయి.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2023-09-22T01:13:25+05:30 IST