పోరునారి వీరగున్నమ్మ!

ABN , First Publish Date - 2023-03-31T01:06:55+05:30 IST

బ్రిటిష్‌ సామ్రాజ్యంలో ఉత్తరాంధ్ర గడ్డపై తెల్లదొరలను ఎదిరించి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించి తర్వాత తరాలకు స్ఫూర్తిగా నిలిచింది వీరనారి గున్నమ్మ. సిక్కోలు జిల్లా మందస ఎస్టేట్‌ జమీందారుకు...

పోరునారి వీరగున్నమ్మ!

బ్రిటిష్‌ సామ్రాజ్యంలో ఉత్తరాంధ్ర గడ్డపై తెల్లదొరలను ఎదిరించి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించి తర్వాత తరాలకు స్ఫూర్తిగా నిలిచింది వీరనారి గున్నమ్మ. సిక్కోలు జిల్లా మందస ఎస్టేట్‌ జమీందారుకు వ్యతిరేకంగా సాగిన రైతుల పోరాటాలకు, కూలీ–నాలి జనం పోరుకు బాసటగా గున్మమ్మ చూపిన తెగువ భారత స్వాతంత్య్ర పోరాటానికి, కిసాన్‌ ఉద్యమాలకు ఒక ఉత్తేజాన్ని ఇచ్చింది. తాడిత, పీడిత వర్గాలకు, కొండ కోనల్లోని జనాలకు, రైతుకూలీలకు ఒక విప్లవ మార్గాన్ని, అభ్యుదయజ్వాలను అందించింది.

1940 మార్చి 27న అఖిలభారత రైతు మహాసభలు శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగాయి. దానికి దేశవ్యాప్తంగా పలువురు జాతీయ నేతలు, స్వాతంత్య్ర సమరాన చురుకుగా పాల్గొంటున్న ప్రముఖులు వచ్చారు. స్వామి సహజానంద సరస్వతి, బంకించంద్‌ ముఖర్జీ, ఇందులాల్‌ యాగ్నిక్‌, సోహన్‌సింగ్‌ భిక్నా, ఆచార్య ఎన్‌.జి.రంగా వంటి కిసాన్‌ నేతలు ఇచ్చిన సందేశాలకు స్ఫూర్తి చెందిన మందస ఎస్టేట్‌ ప్రాంత రైతులు జమీందారుపై తిరుగుబాటు ప్రకటించారు. తమ అడవిని, తమ పంటను తామే అనుభవించాలని తలచి ఏకంగా దండయాత్రే జరిపారు. దీనికి భయకంపితుడైన జమీందారు, తెల్లదొరలను ఆశ్రయించడంతో పెద్దఎత్తున బ్రిటిష్‌ పోలీసులు డబారు, గుడారి రాజమణిపురం గ్రామ సరిహద్దులకు చేరుకున్నారు. అయితే వారి బెదిరింపులకు అదరని అక్కడి రైతులు మార్చి 31 అర్ధరాత్రి గ్రామ పొలిమేరలో కిసాన్‌ సభ జరిపారు. దీంతో ఆగ్రహించిన నాటి జిల్లా ఎస్పీ మానిలాల్‌ సూచనల మేరకు, ఏప్రిల్‌ ఒకటిన మందస ఎస్టేట్‌ పరిసర గ్రామాల్లో రైతులను టెక్కలి ఠాణాకు తరలించేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. రైతులు, రైతుకూలీల చేతులకు బేడీలు వేసేందుకు గుడారి రాజమణిపురం గ్రామంలోకి అడుగుపెట్టారు. రైతులకు, పోలీసులకు ఆ సమయంలో వాగ్వివాదం జరిగి పెనుగులాటకు దారితీసింది. గ్రామస్తులు, అక్కడి రైతులు కూడా బ్రిటిష్‌ పోలీసులకు ఎదురు తిరిగారు. కర్రలు, కత్తులే ఆయుధాలుగా వారిపైకి ఉరికారు. గున్నమ్మ సైతం పోలీసులపై ఎదురుదాడి చేసింది. పరిస్థితిని గమనించిన పోలీసులు, రైతులపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నిండు గర్భిణి అయిన గున్నమ్మ నేలకొరిగింది. గున్మమ్మ పోరుకు స్ఫూర్తిగా రైతులు తమ తెగువను ప్రదర్శించగా పోలీసులు కాల్పుల్లో గుంట బుదియాడు, కర్రి కళియాడు, గొర్లె జగ్గయ్య, గుంట చిన నారాయణ అనే రైతులు కూడా అమరులయ్యారు. దీంతో రణక్షేత్రం రక్తసిక్తమయ్యింది.

స్వాతంత్య్ర సమరాన తెలుగు నేలలోనూ, ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిన ఈ తెగువ తర్వాత కాలంలో భారతావనికి పోరుబాటను చూపింది. పలాస కొండల్లో పుట్టిన సాయుధ పోరాటం, గిరిజనోద్యమం, జమీందారి వ్యతిరేక ఉద్యమాల నుంచి నిన్నటి బీల, సోంపేట, కాకరాపల్లి ఉద్యమాలు, ఆ చైతన్యవంతమైన నేలలు గున్నమ్మ పుట్టిన ప్రాంతానికి అత్యంత సమీపమైనవే. వీరనారి గున్నమ్మ సాగించిన ఉద్యమానికి స్మారకార్థంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమె పుట్టిన గ్రామమైన గుడారి రాజమణిపురాన్ని వీరగున్నమ్మపురంగా మార్చింది. అక్కడ నిర్మించిన స్మారక స్థూపాన్ని ఉమ్మడి ఏపీ గవర్నర్‌ కుముద్‌బెన్‌ జోషి 1988 సెప్టెంబరు 10న ప్రారంభించారు.

వీరనారి గున్నమ్మ చరిత్రను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశంగా చేసినట్లయితే ఆమె స్ఫూర్తిని నేటితరం అందుకుంటుంది. అదేవిధంగా ఆమె జయంతిని గాని, పోరాట పటిమ ఘటననుగాని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించి గున్నమ్మ సేవలకు గుర్తుగా తపాలాబిళ్లను విడుదల చేస్తే అదే ఆమెకు మనం ఇచ్చిన నివాళి అవుతుంది.

జి. లీలావరప్రసాదరావు

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డా. బి.ఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం

Updated Date - 2023-03-31T01:06:55+05:30 IST