Share News

పటేల్ స్ఫూర్తితో ‘మేరా యువ భారత్’

ABN , First Publish Date - 2023-10-31T03:24:08+05:30 IST

ఏ దేశంలోనైనా యువత కీలక భాగస్వామ్యం లేకపోతే జాతి నిర్మాణం ఫలవంతం కానేరదు. ఈ ఉద్దేశంతోనే అక్టోబర్ 31న సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి...

పటేల్ స్ఫూర్తితో ‘మేరా యువ భారత్’

ఏ దేశంలోనైనా యువత కీలక భాగస్వామ్యం లేకపోతే జాతి నిర్మాణం ఫలవంతం కానేరదు. ఈ ఉద్దేశంతోనే అక్టోబర్ 31న సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ వ్యాప్తంగా ‘మేరా యువ భారత్’ అనే వేదికను ప్రారంభిస్తున్నారు. దేశాన్ని సమైక్యం చేయడంలో సర్దార్ పటేల్ తిరుగులేని పాత్ర పోషించినందువల్ల ఆయన పుట్టిన రోజును జాతీయ సమైక్యతా దినంగా మనం పాటిస్తున్నాం. జాతి నిర్మాణ కార్యక్రమాల్లో యువత కీలక పాత్ర పోషించేందుకు అవకాశం కల్పించేందుకు సర్దార్ పటేల్ జయంతి రోజున ‘మేరా యువభారత్’ వేదికను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. యువత ఆధ్వర్యంలో అభివృద్ధి సాగడం కోసం టెక్నాలజీ అండతో ఒక అద్భుత యంత్రాంగాన్ని రూపొందించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది. ఇది నినాదప్రాయ వేదిక కాదు. కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ‘మేరా యువ భారత్’ పేరుతో ఒక స్వతంత్ర ప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

దేశ జనాభాలో నాలుగోవంతు మంది 15–29 ఏళ్ళ మధ్య వయస్సు గలవారే. యువకులకు నిర్ణయాధికారం, నాయకత్వం వహించగల సామర్థ్యం రావాలంటే అందుకు అనుభవం కూడా అవసరం. వారి వినూత్నమైన ఆలోచనలను సమాజ ప్రయోజనాలకు అనువైనట్లుగా మలుచుకున్నప్పుడే ఆ ఆలోచనలకు సార్థకత ఏర్పడుతుంది. యువత తమ నాయకత్వ నైపుణ్యాన్ని పెంచుకోవడం, సామాజిక ఆవిష్కర్తలుగా మారడం, అభివృద్ధిలో వారు క్రియాశీలక భూమిక పోషించేలా చేయడమే ‘మేరా యువభారత్’ లక్ష్యం. అంటే యువత ఆకాంక్షలకు, సమాజ అవసరాలకు మధ్య వ్యత్యాసాన్ని ఈ వేదిక పూరిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే దేశ భవిష్యత్‌ను నిర్దేశించడంలో భారతీయ యువత కీలక పాత్ర పోషించాలని మోదీ భావిస్తున్నారు.

కాంగ్రెస్ హయాంలో యువతకు దారీతెన్నూ కనిపించేది కాదు.. మావోయిస్టు శిబిరాల్లో అనేక మంది యువతీ యువకులు చేరేవారు. ఇవాళ యువత అటువైపు తొంగి చూడడం లేదు. యూనివర్సిటీల్లో విద్యార్థులు చదువు, తమ భవిష్యత్‌పై అధికంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. 2009లో కాంగ్రెస్ హయాంలో 2259 మావోయిస్టు హింసాత్మక ఘటనలు జరిగితే గత ఏడాదికి ఈ సంఘటనలు 500కు తగ్గిపోయాయి. నిరుద్యోగ సమస్య నివారిస్తే, మెరుగైన రహదారులు, నీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పిస్తే యువతకు ఆయుధాలు చేపట్టవలిసిన అవసరం ఉండదని స్పష్టమైంది. ఈ విశ్వాసంతోనే 2024 నాటికి మావోయిజం అనే సమస్య ఉండదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

యువతను సరైన దారిలోకి మళ్లించినప్పుడే దేశ భవిష్యత్తు మెరుగుపడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశ్వసిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలోనే ఆయన యువత నైపుణ్యాన్ని మెరుగుపరచడం కోసం రూపొందించిన స్కిల్ డెవలప్‌మెంట్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అనుకరించాయి (ఆంధ్రలో జగన్ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్‌ను కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వాడుకోవడం దురదృష్టకరం). నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఆయన యువత నైపుణ్యం, ప్రమాణాలు పెరిగేందుకు స్కిల్ ఇండియా పథకం అమలును వేగవంతం చేశారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే నైపుణ్యాభివృద్ధి, యాజమాన్య మంత్రిత్వ శాఖను నెలకొల్పారు. యువతలో వృత్తి నైపుణ్యాలను పెంచడం ద్వారా వారి విద్యకూ, పరిశ్రమల అవసరానికీ మధ్య వ్యత్యాసాన్ని పూరించగలమని భావించినందువల్లే ఆయన జాతీయ స్కిల్ అభివృద్ధి మిషన్‌ను వేగవంతం చేశారు. నైపుణ్య అభివృద్ధికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టేందుకు ‘మేక్ ఇన్ ఇండియా’ను మోదీ ప్రకటించారు. ఉత్పత్తి, మౌలికసదుపాయాలు, సేవలకు సంబంధించి 25 రంగాలను గుర్తించారు. రక్షణ ఉత్పత్తి, నిర్మాణం, రైల్వే మౌలికసదుపాయాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని పెంచారు. తద్వారా నైపుణ్యం పొందిన యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరిగింది.

యువత దైనందిన జీవితంలో భౌతిక శ్రమ, వ్యాయామం, క్రీడలు ముఖ్యమని తెలియజేసేందుకు మోదీ స్వయంగా ‘ఫిట్ ఇండియా’ ప్రచారాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జాబ్ మేళాలను నిర్వహించి పది లక్షలమంది యువకులకు నియామక ఉత్తర్వులను అందజేశారు. 4 లక్షల మంది జనాభా ఉన్న అండమాన్‌లోనే పదివేలమందికి నియామక ఉత్తర్వులను అందజేశారు. ఏడు కొత్త ఐఐటిలు, ఐఐఎంలను ప్రారంభించడమే కాకుండా యూనివర్సిటీల సంఖ్యను 720 నుంచి 1120కి పెంచారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కళాశాలల సీట్లను పెంచారు. క్రీడారంగంలో ఒలింపిక్స్ స్థాయి క్రీడా సముదాయాన్ని నిర్మించేందుకు రూ. 632 కోట్లు కేటాయించారు. రూ. 700 కోట్లతో మీరట్‌లో ఒక క్రీడా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా వేయికి పైగా ‘ఖేలో ఇండియా’ కేంద్రాలను తెరిచారు. 2500 మంది ఖేలో ఇండియా క్రీడాకారులకు నెలకు రూ. 50వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తున్నారు. దేశంలో క్రీడాకారులకు అనువైన వాతావరణం కల్పిస్తున్నందువల్లనే ఇవాళ వారు అత్యద్భుతమైన ఫలితాలను అందిస్తున్నారు. ఇదే కాంగ్రెస్ హయాంలో ఏమి జరిగిందో అందరికీ తెలుసు.

కాంగ్రెస్ హయాంలో అవినీతిని, వ్యవస్థలు కుప్పకూలిపోవడాన్ని సహించనందువల్లే దేశ యువతలో అత్యధికులు గత పదేళ్లుగా నరేంద్రమోదీకి పట్టం కడుతున్నారు. 17వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 13.30 కోట్ల మంది యువకులు మొదటిసారి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 27 శాతం మంది యువ వోటర్లు ఓటువేయగా, 2014 నాటికి యువత ఆ పార్టీని చీదరించుకున్నట్లు స్పష్టమవుతోంది. 2019లో కాంగ్రెస్‌కు 20 శాతం మంది మాత్రమే యువత ఓటర్లు ఓటువేయగా, బీజేపీ వైపు భారీ ఎత్తున 41 శాతం మంది యువ ఓటర్లు మొగ్గు చూపారు. 2014తో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. గడచిన రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ యువ ఓటర్లు బీజేపీకి ఒక కొత్త ఓటు బ్యాంకుగా మారారు. గత ఎన్నికల్లో 18–22 ఏళ మధ్య వయస్సు ఉన్న ఓటర్లలో 51శాతం, 23–25 ఏళ్ల మధ్య వయస్సున్న ఓటర్లలో 51శాతం, 26–35 మధ్య వయస్సున్న వారిలో 48 శాతం బీజేపీని ఆదరించారు. మధ్య వయస్సు, ఆ పైన ఉన్న వారికంటే ఎక్కువగా యువతీ యువకులే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల ఆకర్షితులవుతున్నట్లు స్పష్టమవుతోంది. యువ ఓటర్లలో 50 శాతం మందికి పైగా మోదీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తేలింది. ప్రపంచంలో మోదీ ఎక్కడకు వెళ్లినా పెద్ద సంఖ్యలో యువత ఆయనకు నీరాజనాలు పడుతున్నారు. 2024లో కూడా యువత భారతీయ జనతా పార్టీని అక్కున చేర్చుకుంటారనడంలో సందేహం లేదు.

వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

(నేడు సర్దార్ పటేల్ జయంతి)

Updated Date - 2023-10-31T03:24:08+05:30 IST