మల్టీ జోన్ వ్యవస్థతో సరికొత్త సమస్యలు!
ABN , First Publish Date - 2023-02-25T03:53:35+05:30 IST
తెలంగాణ రాష్ట్రం సిద్ధించి, కొత్త జిల్లాలు ఏర్పడ్డాక, స్థానికులకే ఉద్యోగాలు అందుతాయన్న ఆశలు నిరుద్యోగుల్లో రేకెత్తాయి. పదోన్నతి సౌకర్యాలు స్థానిక ఉద్యోగులకే...
తెలంగాణ రాష్ట్రం సిద్ధించి, కొత్త జిల్లాలు ఏర్పడ్డాక, స్థానికులకే ఉద్యోగాలు అందుతాయన్న ఆశలు నిరుద్యోగుల్లో రేకెత్తాయి. పదోన్నతి సౌకర్యాలు స్థానిక ఉద్యోగులకే అందుతాయని చిరుద్యోగులు కూడా ఆశపడ్డారు. అయితే జోన్లు, మల్టీ జోన్ల వ్యవస్థ ఆ ఆశలకు నీళ్లొదిలేలా చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయ పదోన్నతులను ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతోంది.
స్థానిక యువతకు ఉద్యోగాలు అందాలనే ఆశయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు ప్రతిపాదించింది. నూతనంగా ఏర్పాటైన జిల్లాల ప్రాతిపదికన 95శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే అందేలా నూతన రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో భాగంగానే కొత్త జోన్ల వ్యవస్థను రూపొందించినది. తొలిదశలో 31 జిల్లాలతో కొత్త జోనల్ వ్యవస్థను రూపొందించారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి 2018 ఆగస్టు 29న ఆమోదం తెలిపారు. దాంతో కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చినట్టైంది. ఆ తర్వాత నారాయణపేట, ములుగు జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఈ రెండు జిల్లాలతో పాటు జోగులాంబ జోన్లో ఉన్న వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలుపుతూ సవరణలను రాష్ట్ర ప్రభుత్వం 2019లో కేంద్రానికి పంపింది. ఈ సవరణలపై 371డీలోని 1, 2 క్లాజుల కింద తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్–2018 సవరణలకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. తర్వాత కేంద్ర హోం మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పాత జోనల్ విధానంలో ఉన్న జనరల్ కోటాను అప్పటి ప్రభుత్వాలు స్థానికేతర కోటా కిందికి మార్చాయి. తెలంగాణ నిరుద్యోగులకు దక్కాల్సిన ఉద్యోగాలు ఈ విధంగా స్థానికేతరులు పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఆరు జోన్లు ఉండగా, తెలంగాణలో 5, 6 జోన్లు ఉండేవి. ఉద్యోగ నియామకాలలో 20శాతం ఓపెన్ కోటా కింద నియామకాలు జరిగేవి. ఓపెన్ కోటా కింద ఈ 20శాతం నియామకాలు చేపడితే స్థానిక, స్థానికేతరులందరికీ సమన్యాయం జరిగేది. కానీ వాస్తవానికి అలా జరగలేదు. తెలంగాణలో 95శాతం రాష్ట్ర యువతకే ఉద్యోగాలు వచ్చేలా జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేసి, ఓపెన్ కోటాను 5 శాతానికి పరిమితం చేశారు. మల్టీ జోన్–1 కింద కాళేశ్వరం, బాసర, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి జోన్లు వస్తాయి. మల్టీజోన్–2 కింద యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లు వస్తాయి. దీంతో ఆయా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పరిధిలో ఉన్న నిరుద్యోగులకే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అందరూ భావించారు.
ఈ వ్యవస్థకు అనుగుణంగా విద్యాశాఖ కూడా కొన్ని మార్పులు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2009 జనవరి 23న వెలువడ్డ 10వ నెంబరు జీవోకు సరిగ్గా 14 సంవత్సరాల తర్వాత 2023 జనవరి 23వ తేదీన సవరణ చేస్తూ జీవోఎంఎస్ నెంబరు 3ను విడుదల చేసింది. ఈ సవరణ ప్రకారం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయ పోస్టులను మల్టీ జోనల్ పరిధిలోకి తెచ్చింది. నియామకాలు, సీనియారిటీ, బదిలీలు మొదలైనవాటన్నింటికీ ఈ జీవో వర్తిస్తుంది. ఈ జీవో ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని రెండు మల్టీ జోన్లుగా విభజించారు. పై విధంగానే మల్టీ జోన్–1 కిందికి కాళేశ్వరం, బాసర, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి జోన్లను; మల్టీజోన్– 2 కిందికి యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లను తెచ్చారు.
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయ పోస్టులను మల్టీ జోన్ పరిధిలోకి తీసుకురావడం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటివరకు జిల్లా స్థాయిలోనే ఉన్న ఈ పోస్టును ఒకేసారి మల్టీ జోన్ పరిధిలోకి తేవడం పదోన్నతుల జాబితాలో ఉన్న చాలా మంది ఆశలపై నీళ్లు చల్లింది. రెండు దశాబ్దాలు ఒకే క్యాడరులో పని చేసినా పదోన్నతి దక్కని పరిస్థితులు ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల పాఠశాలల్లో పదోన్నతులకు అర్హమైన వారు 189 మంది ఉండగా ఆ జిల్లాలో ప్రధానోపాధ్యాయ పోస్టులు 74 మాత్రమే ఉన్నాయి. కరీంనగర్‌లో అర్హులు 150 మంది ఉండగా పోస్టులు 41 మాత్రమే ఉన్నాయి. హనుమకొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఈ జిల్లాల నుంచి అర్హులైన వారు పదోన్నతి కోసం దూరప్రాంతాలకు వెళ్లవలసిందే.
ఇందుకు విరుద్ధమైన పరిస్థితి మరికొన్ని జిల్లాల్లో ఉంది. కామారెడ్డి జిల్లాలో ఖాళీ ప్రధానోపాధ్యాయ పోస్టులు 111 ఉండగా జాబితా ప్రకారం వెయ్యి లోపు సీనియారిటీలో ఉన్నవారు 20 మందే ఉన్నారు. నిజామాబాద్‌లో 90 ఖాళీలుండగా జాబితా ప్రకారం 46 మంది, మెదక్ జిల్లాలో 66 ఖాళీలుంటే 22 మంది మాత్రమే ఉన్నారు. ఈ జిల్లాలకు ఇతర జిల్లాల నుండి జాబితాలో ఉన్నవారు వెళ్ళవలసిందే. మెదక్, సిద్దిపేట వంటి జిల్లాలు రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండడం వల్ల జాబితాలో పై స్థానంలో ఉన్న ఇతర జిల్లాల వారు ఈ జిల్లాలలోని ఖాళీ పోస్టులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. తద్వారా ఈ జిల్లాలోని వారు జాబితాలో ఉండి, ఈ జిల్లాల్లో పోస్టులు ఉన్నా తప్పనిసరిగా ఇతర జిల్లాలకు వెళ్ళవలసిందే. ఇప్పటివరకు ఈ జిల్లాల్లో పదోన్నతులు వస్తాయని రెండు దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న వందలాది మంది ఉపాధ్యాయులు కనీసం జాబితాలో కూడా తమ పేరు లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు.
మల్టీ జోన్ కిందికి తీసుకోవడంతో ఆశావహులకు మరింతకాలం నిరీక్షణ తప్పడం లేదు. అధిక జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. ప్రధానోపాధ్యాయ పోస్టులు ఇతర జిల్లాల వారితో నిండిపోవడం వల్ల భవిష్యత్తులో కింది క్యాడర్లలో ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న వారి పదోన్నతి ఆశలు అడుగంటుతాయి. నిరుద్యోగులకు తర్వాతి డీఎస్సీలలో పోస్టులు భారీగా తగ్గిపోవడమో, అసలే లేకుండా పోవడమో జరుగుతుంది. అధికశాతం జిల్లాలకు, ఉపాధ్యాయులకు, నిరుద్యోగులకు ప్రతికూల ప్రభావాన్ని కలిగించే మల్టీ జోనల్ వ్యవస్థను ఉపాధ్యాయ వ్యవస్థకు వర్తించకుండా ప్రభుత్వం తగిన ఉత్తర్వులు తేవాలి. ప్రధానోపాధ్యాయ పోస్టులకు జిల్లా స్థాయిలోనే పదోన్నతి సౌకర్యాలు కల్పించాలి. తద్వారా కొత్త రాష్ట్ర ఆవిర్భావం వెనుక ఉన్న లక్ష్యం నెరవేరెందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్‌రావు