గ్లోబల్ నేతగా నవ భారత్

ABN , First Publish Date - 2023-09-06T02:21:43+05:30 IST

సాధారణ పరిపాలన వ్యవహారాలలో భాగంగా నిర్వహించే వివిధ కార్యక్రమాల గురించి కూడా అట్టహాసంగా ప్రచారం చేయడం నేటి పాలకులకు ఒక పరిపాటి. తద్వారా వారు రాజకీయ ప్రయోజనాలు...

గ్లోబల్ నేతగా నవ భారత్

సాధారణ పరిపాలన వ్యవహారాలలో భాగంగా నిర్వహించే వివిధ కార్యక్రమాల గురించి కూడా అట్టహాసంగా ప్రచారం చేయడం నేటి పాలకులకు ఒక పరిపాటి. తద్వారా వారు రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నించడం సహజమే. అయితే ఇటీవలి కాలంలో ప్రతీ సాధారణ అంశాన్ని కూడ అనూహ్యమైన సాహసోపేత చర్యగా అభివర్ణిస్తూ విస్తృతంగా ప్రచారం చేయడం మామూలు అయిపోయింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే జరుగుతున్నట్లుగా ప్రతీ కార్యక్రమాన్ని ప్రస్తుత పాలకులు ప్రచారం చేస్తున్నారు! ఈ దిశగా గత కొద్ది నెలలుగా జీ20 శిఖరాగ్ర సదస్సు విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రచార పటోటాపాలను చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. రాబోయే లోక్‌సభ సాధారణ ఎన్నికలకు ప్రచార వేదికగా జీ20 సదస్సును మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తోందన్న ప్రతిపక్షాల అరోపణలలో సహేతుకత లేకపోలేదు. జీ20 శిఖరాగ్ర సదస్సు, పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అనంతరం జమిలి ఎన్నికలు జరిగే అవకాశాలు– ఈ మూడూ ఒక దాంతో మరొకటి ముడిపడి ఉన్న రాజకీయాంశాలు కావడం ఇక్కడ గమనార్హం.

ప్రధాని మోదీ కృషి ఫలితంగా భారత్‌కు జీ20 అధ్యక్ష పదవి లభించినట్లుగా ప్రచారం జరుగుతోంది. భారత్ కంటే ముందుగా ఈ కూటమి అధ్యక్ష పదవిని అనేక ఇతర దేశాలు చేపట్టడం జరిగింది. జీ20 అధ్యక్ష పదవి ప్రతీ సభ్య దేశానికీ వంతు ప్రకారం దక్కుతుంది. ఆ మేరకు ఇండోనేసియా నుంచి ఇండియా స్వీకరించింది. అంతకు ముందు సౌదీ అరేబియా అధ్యక్ష స్ధానంలో ఉంది. సౌదీ అరేబియా నుంచి ఇండోనేసియాకు అధ్యక్ష బాధ్యతలను బదిలీ చేసే క్రమంలో రియాద్‌లోను, ఆ తర్వాత ఇండోనేసియా నుంచి ఇండియాకు అధ్యక్ష పదవిని అప్పగించే సందర్భంగా బాలిలోను జీ20 శిఖరాగ్ర సదస్సులు జరిగాయి. బాలి సదస్సులో భారత్ అనేక ప్రతిపాదనలతో క్రియాశీలంగా వ్యవహరించింది. ఒక రకంగా చెప్పాలంటే మన విదేశాంగ మంత్రిత్వ శాఖ గత సంవత్సర కాలంగా న్యూ ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సు సన్నాహక యత్నాలలో పూర్తిగా నిమగ్నమై ఉంది. ఈ శిఖరాగ్ర సదస్సు ద్వారా అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠ పెరుగుతుందని కూడ మోదీ ఘంటాపథంగా చెబుతున్నారు.


అమెరికా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, బ్రిటన్‌లు జీ7 కూటమిగా ప్రపంచ వాణిజ్యంలో కీలకపాత్ర వహించడం విదితమే. వాస్తవానికి చైనా, భారత్, బ్రెజిల్ దేశాల ఆర్థిక వ్యవస్ధల ప్రభావం 1990 దశకంలో ప్రపంచవ్యాప్తంగా అనూహ్య స్థాయిలో పెరిగింది. అయినా ఆ దేశాల మాటకు మన్నన లభించే వేదిక అంటూ లేకపోయింది. ప్రపంచ ఆర్ధిక సంక్షోభ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో 1999లో జీ20 కూటమిని నెలకొల్పడానికి కెనడా చొరవ చూపింది. నాటి ప్రధానమంత్రి వాజపేయి ప్రభుత్వంలోని ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హా కెనడా ప్రతిపాదనకు పూర్తి మద్దతు తెలిపారు. భారత్ తోడ్పాటుతోనే జీ20 కూటమి ఆవిర్భవించింది. యశ్వంత్ సిన్హాతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రి జస్వంత్ సింగ్ కూడా జీ20 ఆవిర్భావంలో ముఖ్య భూమిక పోషించారు. నూతన కూటమి సమావేశాన్ని భారత్ అధ్యక్షతన 2001లో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే సరిగ్గా అదే సమయంలో అమెరికాలో భయానక ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ కారణంగా అమెరికాకు సంఘీభావంగా జీ20 వేదికను వాషింగ్టన్‌కు మార్చి అక్కడ నిర్వహించారు. వాజపేయి ప్రభుత్వం ఈ విషయాల గురించి ప్రచారం చేసుకోలేదు. అంతకు ముందు 1983లో ఇరాక్‌లో జరగవల్సిన అలీన రాజ్యాల శిఖరాగ్ర సదస్సును ఇరాన్‌తో యుద్ధం కారణంగా చివరి క్షణంలో బాగ్దాద్‌లో కాకుండా న్యూ ఢిల్లీలో నిర్వహించాలని నిర్ణయించారు. సమయాభావం ఉన్నా నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆ సదస్సును అత్యంత విజయవంతంగా నిర్వహించింది. ఆ శిఖరాగ్రంలో వందకు పైగా అలీన దేశాల ప్రభుత్వాధినేతలు పాల్గొన్నారు. మన దేశంలో ఇప్పటి వరకు ఆ స్ధాయిలో ఏ సదస్సు కూడ జరుగలేదు. విజ్ఞత కల్గిన పాలనా దురంధరులకు, అన్నింటా ప్రచారమే లక్ష్యంగా వ్యవహరించే సగటు రాజకీయ నాయకులకు మధ్య ఉండే వ్యత్యాసం ఏమిటో ఆ అలీన సదస్సు సాఫల్యత నుంచి అర్థం చేసుకోవచ్చు.

న్యూ ఢిల్లీలో జీ20 దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సుకు ముందు విద్యుత్, వైద్యం, వ్యవసాయం, వాణిజ్యం మొదలైన కీలక రంగాలపై మంత్రుల స్థాయి, ఉన్నతాధికారుల స్ధాయి సమావేశాలను హైదరాబాద్ సహా దేశంలోని వివిధ నగరాలలో నిర్వహించారు. ఈ సమావేశాల గురించి మన విదేశాంగ శాఖ విస్తృతంగా ప్రచారం చేసింది. ఇప్పటి వరకు జీ20 శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించిన ఏ దేశమూ ఈ రకమైన ప్రచారం చేసుకోలేదు. అగ్రరాజ్యాల పెత్తనానికి నిదర్శనంగా నిలిచిన జీ7 కూటమికి ప్రత్యామ్నాయంగా వివిధ అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల వైవిధ్య కూటమి జీ20. అంతర్జాతీయ వ్యవహారాలు, సంబంధాల చరిత్రలో ఈ కూటమి నిస్సందేహాంగా ఒక మైలురాయి. అయితే నెహ్రూ ప్రతిపాదించిన అలీన విధానాన్ని అనుసరించిన దేశాలు ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ప్రపంచ శాంతికి తోడ్పడిన విధంగా వర్తమాన యుగంలో మానవాళి సమస్యల పరిష్కారానికి ఈ జీ20 దోహదం చేయగలదా? ఇంట ఎన్ని అసత్యాలు వెదజల్లినా నెహ్రూను మహోన్నత భారతీయ రాజనీతిజ్ఞుడుగా ప్రపంచం ఇప్పటికీ గౌరవిస్తుందనేది వాస్తవం.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2023-09-06T02:21:43+05:30 IST