డిజిటల్ దునియాలో గుత్తాధిపత్యం

ABN , First Publish Date - 2023-04-05T03:20:05+05:30 IST

ప్రజల నిత్యజీవితంలో సెల్‌ఫోన్‌తో పాటు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాలు అత్యంత ప్రధాన భాగమయ్యాయి. సెల్ఫోన్లతో ఎవరు ఏమి మాట్లాడుతున్నారో వినడంతో పాటు సామాజిక మాధ్యమాలలో...

డిజిటల్ దునియాలో గుత్తాధిపత్యం

ప్రజల నిత్యజీవితంలో సెల్‌ఫోన్‌తో పాటు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాలు అత్యంత ప్రధాన భాగమయ్యాయి. సెల్ఫోన్లతో ఎవరు ఏమి మాట్లాడుతున్నారో వినడంతో పాటు సామాజిక మాధ్యమాలలో ఎవరేమి చేస్తున్నారో కూడా ప్రభుత్వాలు నిశితంగా పరిశీలిస్తాయనేది తెలిసిందే. వాటిలో ఏ సమాచారం ఉండాలో ఉండకూడదో కూడా నిర్దేశించే స్ధాయికి ప్రభుత్వాలు చేరుకున్నాయి. వాటికి ఇప్పుడు మౌలికంగా ఇంటర్నెట్ సేవలు సమకూర్చే సంస్థలు కూడా సర్కారుకు తోడవుతున్నాయి. ఇంటర్నెట్‌ను నియంత్రించడం ద్వారా ఆన్‌లైన్‌లో కేవలం తమ సామగ్రి మాత్రమే కొనుగోలు చేసే విధంగా బడా వ్యాపార సంస్థలు ప్రయత్నిస్తూ అందులో పెట్టుబడులు పెడుతున్నాయి. అత్యాధునిక సాంకేతికత 5–జి వస్తున్న నేపథ్యంలో భారత సమాచార సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థను గంపగుత్తగా తమ అదుపులో పెట్టుకోవడానికి వివిధ కార్పొరేట్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. భారత ఐటి దిగ్గజాలలో అగ్రగామి అయిన ‘రిలయన్స్ జియో’ శరవేగంతో ముందుకు వెళ్లుతోంది. సెల్ఫోన్లు, ఇంటర్నెట్ దిశా దశలను మార్చే అద్భుత పురోగమనమిది, సందేహం లేదు.

ఇప్పటికే టెలికం రంగంలో స్వల్ప ధరకు ఇంటర్నెట్ ద్వారా ఇతర కంపెనీలను దెబ్బతీస్తున్న రిలయన్స్ ఇక 5–జి ద్వారా వాట్సాప్ విధానంలో తన రిటైల్ వ్యాపారాన్ని విస్తరించుకోవడం ఖాయం. సరే, వాట్సాప్ ఆధారంగా రాజకీయాలు చేసే ఒక ప్రధాన రాజకీయ పక్షానికి ఈ బడా కంపెనీ చేదోడు వాదోడుగా ఉంటుందని మరి ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. సముద్ర తీరాన నిర్మించే ల్యాండింగ్ స్టేషన్ల నిర్మాణానికి పర్యావరణ నిపుణుల అభ్యంతరాలను ప్రక్కన పెట్టి కేంద్రం పర్యావరణ అనుమతిని కూడా ఇచ్చింది. ఫేస్‌బుక్ ఇప్పటికే రిలయన్స్‌లో రూ. 43 వేల కోట్లు పెట్టుబడి పెట్టగా, సౌదీ అరేబియా రూ. 9,555 కోట్లు మదుపు చేసింది. అంతే కాకుండా భారత్‌ను యూరోపియన్ దేశాలతో అనుసంధానం చేసే జలాంతర (సబ్‌మెరైన్ ఫైబర్ ఆప్టిక్) కేబుల్ వ్యవస్థలో కూడా మన దేశానికి భాగస్వామ్యం కల్పించింది. ఇప్పటి వరకు గూగుల్, ఫేస్‌బుక్ మాత్రమే ఈ రకమైన ప్రయోగాలు చేస్తుండగా ఇప్పుడు రిలయన్స్ ప్రవేశించింది.

భారత్, ఐరోపాకు మధ్య గల్ఫ్ దేశాలు సముద్ర వారధిగా ఉన్నాయి. యూరోప్ నుంచి ఇంటర్నెట్, డేటా మార్పిడికి సంబంధించి, సముద్రంలో ఉండే జలాంతర కేబుళ్ళు (అండర్ సీ కేబుళ్ళు) గల్ఫ్ దేశాల గుండా భారత్, ఆ పై ఇతర ఆసియా దేశాలను అనుసంధానం చేస్తాయి. ఇండియా– యూరోప్ ఎక్స్‌ప్రెస్ (ఐఇఎక్స్)లో గల్ఫ్ దేశాల మీదుగా యూరోప్‌కు, ఇండియా– ఆసియా ఎక్స్‌ప్రెస్ (ఐఏఎక్స్)లో తూర్పు ఆసియా దేశాలకు కేబుల్ వ్యవస్థను రిలయన్స్ రూపొందిస్తోంది. 16 వేల కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ రెండు కేబుల్ వ్యవస్థల ద్వారా 200 టిబిపియస్ డేటా బదిలీ అవుతుంది. యూరోప్ నుంచి ఆఫ్రికన్ దేశమైన ఈజిప్ట్ మీదుగా సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్రం తీర ప్రాంతాల గూండా అరేబియా సముద్ర తీరాన ఉన్న ముంబైకి, ఆ తరువాత ఇతర ఆసియన్ దేశాలకు ఈ డేటా బదిలీ జరుగుతుంది. మున్ముందు అమెరికాకు కూడ ఈ సదుపాయాన్ని విస్తరించడానికి ఆవకాశం ఉంది. శాటిలైట్ విధానం కంటే సముద్ర మార్గ కేబుళ్ళ వ్యవస్థ నిర్వహణ వ్యయం తక్కువ. అంతే కాకుండా నిలకడ, స్పీడ్ ఎక్కువగా ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా అండర్ సీ కేబుళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

భారత్, థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా, జపాన్ మొదలైన ఆసియా దేశాలన్నీ కూడ అరబ్బు రాజ్యాలైన సౌదీ అరేబియా, ఒమాన్, ఈజిప్ట్‌ల మీదుగా యూరోప్‌కు ఈ కేబుళ్ళ ద్వార అనుసంధానమై ఉన్నాయి. తద్వారా డేటా రవాణా అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల టెలికం సంస్థలు ఈ కేబుళ్ళను అద్దె ప్రాతిపదికన వినియోగించుకోవడం జరుగుతోంది. ఈ రకంగా గల్ఫ్ దేశాలలో కొన్ని ల్యాండింగ్ స్టేషన్లను టాటా, రిలయన్స్ సంస్థలు అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నాయి. రిలయన్స్ సంస్థ కాస్త ముందుకు వెళ్లి అద్దె ప్రాతిపాదికన కాకుండా ఈ కేబుళ్ళ యాజమాన్యంలో భాగస్వామి కావడానికి ప్రయత్నిస్తోంది. యూరోప్ నుంచి భారత్‌కు మార్గమధ్యంలో కీలకమైన సౌదీ అరేబియాతో ఈ కంపెనీ ఒక వ్యూహాత్మక ఒప్పందాన్ని చేసుకున్నది. దేశంలోని ఏ ఇతర టెలికం కంపెనీలకు లేని విధంగా యస్.ఏ. (స్టాండ్ అలోన్) విధానంలో 5–జి టెక్నాలజీని రిలయన్స్ ప్రవేశపెట్టింది. వాట్సాప్ ద్వారా ఆర్థిక లావాదేవీలను కూడ ప్రవేశపెడుతోంది. దీని ద్వారా రిలయన్స్ మార్టుల షాపింగ్ మరింత పెరిగి ఇప్పటికే కుదేలయిన రిటైల్ రంగం ఇక రానున్న కాలంలో మరింత దివాలా తీస్తుంది. సినిమాల నుంచి మందుల వరకు ప్రతి రంగాన్ని మున్ముందు గుత్తాధిపత్య విధానం అమితంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సామాజిక మాధ్యమాల ద్వారా తమ రాజకీయ ప్రత్యర్ధుల సమాచారాన్ని నియంత్రించడం సరేసరి. అందుబాటులోకి వస్తోన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికి అందించాలి. ఆ నవీన సాంకేతికతలపై గుత్తాధిపత్య పెడ ధోరణులను నియంత్రించినప్పుడే సామాన్యులకు వాటి ప్రయోజనాలు సమకూరుతాయి.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2023-04-05T03:20:05+05:30 IST