రాజ్యాంగాన్ని కూల్చివేస్తున్న మెజారిటీవాదం

ABN , First Publish Date - 2023-02-03T01:28:35+05:30 IST

దేశపాలన కలవరం కలిగిస్తోంది. బాబాసాహెబ్ అంబేడ్కర్ మాటలు జ్ఞాపకమొస్తున్నాయి: ‘రాజ్యాంగం ఎంత మంచిదైనా, దానిని అమలుపరిచేవాళ్లు...

రాజ్యాంగాన్ని కూల్చివేస్తున్న మెజారిటీవాదం

దేశపాలన కలవరం కలిగిస్తోంది. బాబాసాహెబ్ అంబేడ్కర్ మాటలు జ్ఞాపకమొస్తున్నాయి: ‘రాజ్యాంగం ఎంత మంచిదైనా, దానిని అమలుపరిచేవాళ్లు చెడ్డ వాళ్లయితే అది కూడా చెడ్డదైపోవడం ఖాయం, రాజ్యాంగం ఎంత చెడ్డదయినా దానిని అమలుపరిచేవాళ్లు మంచివాళ్లయితే అది మంచిదవడం కూడా అంతే ఖాయం’. దేశ పౌరులు అందరినీ సమదృష్టితో చూచే, క్రియాశీల రాజ్యాంగాన్ని భారత్ ఔదలదాల్చింది. రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమతౌల్యతకు; కార్యనిర్వాహక, శాసన నిర్మాణ, న్యాయ నిర్ణయ వ్యవస్థలు ధర్మశీలంగా ప్రవర్తించేలా చేసేందుకు మన సంవిధాన మౌలిక నిర్మాణం (బేసిక్ స్ట్రక్చర్) పూచీపడుతోంది. అయితే దేశ పాలనకు సారథ్యం వహిస్తున్నవారు ఆ సమతౌల్యతకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యుఎస్) వారికి విద్యా ఉద్యోగాలలో పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఒక జనాకర్షక చర్య. దానిని సర్వోన్నత న్యాయస్థానం మెజారిటీ తీర్పుతో సమర్థించింది. కేంద్రం తన నిర్ణయాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు నుంచి తీర్పులను రాబట్టుకుంటున్నదని చెప్పడానికి ఇది మరొక నిదర్శనం. సామాజిక అణచివేతకు గురైన వారి అభ్యున్నతికి తోడ్పడడం రిజర్వేషన్ల లక్ష్యం. మరి సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఆర్థికంగా పేదలు అయినంత మాత్రాన రిజర్వేషన్ల సదుపాయాన్ని కల్పించాలా? కల్పించనవసరం లేదని 1992లో తొమ్మిది మంది సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంగా అభిప్రాయపడింది.

1980వ దశకం తుది సంవత్సరంలో వి.పి. సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫారసులను అమలుపరిచేందుకు సంకల్పించినప్పుడు సామాజికంగా అణచివేతకు గురైన వారికి మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని నాటి ధర్మాసనం గట్టిగా అభిప్రాయపడింది. అయితే, ఇప్పుడు ఆర్థిక వెనుకబాటుతనం ప్రాతిపదికన అగ్ర వర్ణాలలోని పేదలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఇది రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కును పూర్తిగా ఉల్లంఘించడం మినహా మరేమీ కాదు. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ముగ్గురు న్యాయమూర్తులు మాత్రమే సమర్థించారు. 1992 తీర్పులో తొమ్మిదిమంది సభ్యుల ధర్మాసనంలో ఆరుగురు న్యాయమూర్తులు రిజర్వేషన్లకు ఆర్థిక వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకోకూడదని స్పష్టం చేశారు. నియమాల ప్రకారం తొమ్మిది మంది కంటే ఎక్కువ మంది సభ్యులు గల ధర్మాసనం మాత్రమే 1992 తీర్పును తోసిపుచ్చవలసి ఉంది.

షెడ్యూల్డు కులాల వారు శతాబ్దాలుగా అన్యాయాలకు గురవుతూ వస్తున్నారు. భారత గణతంత్ర రాజ్య నిర్మాతలు వారికి ఆ వివక్షలను అధిగమించేందుకే రిజర్వేషన్లు కల్పించారు. మరి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు హేతుబద్ధత ఏమిటి? చెప్పవచ్చిన దేమిటంటే మెజారిటీవాద (అత్యధిక సంఖ్యాక వర్గం అభిప్రాయాన్ని మన్నించడం) పాలనలో భాగమే ఈ రిజర్వేషన్లు.

సమాజంలో అసంఖ్యాకుల జీవితాలను ప్రభావితం చేసే విషయాలు, అందునా గత తీర్పులు లేదా న్యాయ నిర్ణయాలను నిశితంగా పరిశీలించడంపై విస్తృత ధర్మాసనాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో ఆరుగురు న్యాయమూర్తుల తీర్పు కంటే ముగ్గురు న్యాయమూర్తుల తీర్పే ప్రాధాన్యం పొందింది. ఇలా అయితే రాజ్యాంగ మౌలిక స్ఫూర్తి ఏమవుతుంది? స్వార్థ ప్రయోజనాలకు అసంగత విషయాలను ఆమోదిస్తే ఎలా? న్యాయస్ఫూర్తి కొరవడడం లేదా? ఇదే పరిస్థితి కొనసాగితే మూడు రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమతౌల్యత దెబ్బ తింటుంది. మెజారిటీ వాదానికి అనుగుణంగా కార్యనిర్వాహక, శాసననిర్మాణ వ్యవస్థలు పనిచేస్తాయి. ఇది నిరంకుశ పాలనకు దారితీస్తుంది. న్యాయవ్యవస్థ పరోక్షంగా దాని నియంత్రణలోకి వస్తుంది. మెజారిటీవాద పాలన మన ప్రజాస్వామ్య మనుగడకు ఒక సవాల్‌గా పరిణమించిందన్న వాస్తవాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

ప్రభుత్వ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణంగా తీసుకుని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పరారయిన పారిశ్రామికవేత్తలపై చర్య చేపట్టకపోవడం ఎలాంటి ప్రజాస్వామిక సంప్రదాయం? ఆశ్రిత పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వ నియమాలను మార్చడం అనుచితం కాదా? షెడ్యూల్డు ప్రాంతాలలో విచక్షణా రహితంగా గనుల తవ్వకాలకు అనుమతినివ్వడం సబబేనా? పర్యావరణ చట్టాలను ఉపేక్షించి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి దారుల ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా ప్రమాదకరం. ప్రభుత్వం సామాన్యుల ప్రయోజనాలను పరిరక్షించే వైఖరి చూపడం లేదు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు, నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు ప్రభావశీలమైన చర్యలు లేకపోతున్నాయి. కార్మిక జనవాళి, ముఖ్యంగా వలసకార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారా?

ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య పద్ధతులకు స్వస్తి చెప్పుతున్నారు. ప్రతిపక్షాల వారిని అణచి వేస్తున్నారు. లేదంటే పరిహసిస్తున్నారు. పార్లమెంటులో ఏ సమస్యమీద అయినా అవగాహనతో కూడిన చర్చలు జరుగుతున్నాయా? అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట వేలాది కుటుంబాలను నిర్వాసితులను చేస్తున్నారు. నిస్సిగ్గుగా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసిన వారిని నిర్బంధిస్తున్నారు. పౌరహక్కుల సంఘాల నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడం, వారిని సంవత్సరాల తరబడి నిర్బంధించడం ఉంచడం దేనికి సంకేతం? మెజారిటీవాదం మన ప్రజాస్వామ్యానికి ఒక ప్రధాన సవాల్‌గా ఉన్నది. దేశ పాలకులు ప్రజాస్వామ్య విలువలను అలక్ష్యం చేస్తున్నారు. ఇది నిరంకుశపాలనకు దారితీస్తోంది. ఈ పరిణామం రాజ్యాంగ స్వరూపాన్ని మార్చివేస్తోంది. దీనివల్ల కార్యనిర్వాహక, శాసన నిర్మాణ, న్యాయ నిర్ణయ వ్యవస్థల విధి నిర్వహణలో సమన్వయం, సమతౌల్యత సమసిపోయే ప్రమాదమెంతైనా ఉన్నది.

ఆలూరి సుందర్ కుమార్ దాస్

విశ్రాంత ఐపీఎస్ అధికారి

Updated Date - 2023-02-03T01:28:37+05:30 IST