ఎల్‌ఐసికి నష్టం అవాస్తవం!

ABN , First Publish Date - 2023-02-02T00:37:57+05:30 IST

హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌ రిపోర్ట్‌ దేశ స్టాక్‌ మార్కెట్‌, అదాని కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నది...

ఎల్‌ఐసికి నష్టం అవాస్తవం!

హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌ రిపోర్ట్‌ దేశ స్టాక్‌ మార్కెట్‌, అదాని కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నది. కేవలం రెండు ట్రేడింగ్‌ సెషన్లలోనే నాలుగు లక్షల కోట్లకు పైగా అదాని గ్రూప్‌ కంపెనీలు మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కోల్పోయే స్థాయిలో ప్రకంపనలకు గురిచేసింది. అదాని గ్రూప్‌ కంపెనీలలో పెద్ద ఎత్తున ఎల్‌ఐసి పెట్టుబడులను పెట్టి నష్టాన్ని చవిచూసిందనే ప్రచారాల నేపథ్యంలో ఇది కేవలం ఊహాజనితమేనని, ఎల్‌ఐసి నష్టపోలేదని కొద్దిపాటి విశ్లేషణతో అవగతమవుతుంది.

స్టాక్‌ మార్కెట్‌ సమాచారం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా అదాని గ్రూప్‌లో ఎల్‌ఐసి పెట్టిన పెట్టుబడుల విలువ రూ.28,400 కోట్లు. హిండెన్‌బర్గ్‌ నివేదిక బహిర్గతమవటానికి ముందు అదాని గ్రూప్‌ కంపెనీలలో ఎల్‌ఐసి పెట్టుబడుల మార్కెట్‌ విలువ రూ.72,200 కోట్లు. నివేదిక బహిర్గతమై అదాని గ్రూప్‌ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పడిపోయిన అనంతరం వీటి మార్కెట్‌ విలువ రూ.55,700 కోట్లుగా ఉంది. అంటే షేర్ల విలువ తగ్గిన తర్వాత కూడా ఎల్‌ఐసి అదాని గ్రూప్‌ కంపెనీల పెట్టుబడులపై నికరంగా రూ.27,300 కోట్లు లాభాలతోనే ఉన్నది.

అదాని గ్రీన్‌ ఎనర్జీలో ఎల్‌ఐసి ఒక శాతం షేర్లు కొన్నప్పుడు షేరు విలువ రూ.380. హిండెన్‌బర్గ్‌ నివేదిక అనంతరం కూడా ఈ షేరు విలువ రూ.3,772 ఉంది. రెండేళ్ళ సమయంలో ఎల్‌ఐసి తన పెట్టుబడిపై 10 రెట్లు లాభాన్ని గడించింది. మార్కెట్‌ ఒడుదుడుకులలో లాభాల శాతంలో క్షీణత ఉండవచ్చు తప్ప, ఎల్‌ఐసి పెట్టిన పెట్టుబడి విలువలో నష్టం అనే అంశానికి తావేలేదు. అదాని గ్రూప్‌ డెట్‌ సెక్యూరిటీలలో ఎల్‌ఐసికి ఉన్న సెక్యూరిటీలు క్రెడిట్‌ రేటింగ్‌ (ఏఏ), అంతకుమించి రేటింగ్‌ కలిగి ఉన్నవే. అదాని గ్రూప్‌లో ఎల్‌ఐసికి ఉన్న పెట్టుబడుల మొత్తం విలువ ఎల్‌ఐసి నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల (ఎసెట్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌) విలువలో కేవలం 0.975 శాతం మాత్రమే.

భారత ప్రజాస్వామ్యంపై తమకు విశ్వాసం ఉందని, భవిష్యత్‌లో భారత్‌ ఒక సూపర్‌ పవర్‌గా మారుతుందని, కానీ అదాని గ్రూప్‌ మాత్రం ఒక పథకం ప్రకారం దేశాన్ని కొల్లగొడుతోందని హిండెన్‌బర్గ్‌ పరిశోధనా సంస్థ చేసిన తీవ్ర ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలి. బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరిపి, నియంత్రణ వ్యవస్థల పాత్రకు పదునుపెట్టి వాస్తవాలను ప్రజల ముందుంచాలి.

జి. కిషోర్‌ కుమార్‌

జాయింట్‌ సెక్రటరీ, ఎల్‌ఐసి ఉద్యోగ సంఘం

Updated Date - 2023-02-02T00:37:59+05:30 IST