కేంద్రం మెడలు వంచే అద్భుత అవకాశం

ABN , First Publish Date - 2023-08-02T01:24:33+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్రం మెడలు ఇప్పుడు వంచే అవకాశం వచ్చింది. ఎన్నికలకు ముందు 25 మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని గొప్పలు చెప్పిన జగన్‌రెడ్డి...

కేంద్రం మెడలు వంచే అద్భుత అవకాశం

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్రం మెడలు ఇప్పుడు వంచే అవకాశం వచ్చింది. ఎన్నికలకు ముందు 25 మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని గొప్పలు చెప్పిన జగన్‌రెడ్డి, నేడు హోదా ముగిసిన అధ్యాయం అని కేంద్రం చెబుతున్నా నోరు మెదపడం లేదు. ప్రతిపక్ష నాయకుడుగా యూనివర్సిటీలకు వెళ్లి యువభేరుల పేరుతో యువతను రెచ్చగొట్టిన జగన్, నేడు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టరు? కనీసం కేంద్రంలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇచ్చి, అవిశ్వాస చర్చలోనైనా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఎందుకు నిలదీయరు?

తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని జగన్ తన భుజాలపై మోయడానికి కారణం ఏమిటి? ఇప్పుడు కేంద్రంలో ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాసం, రాజ్యసభలో మైనార్టీలకు వ్యతిరేకమైన యూనిఫాం సివిల్‌ కోడ్‌కు సంబంధించిన బిల్లుల రూపంలో ప్రత్యేక హోదా సాధించుకునే అద్భుత అవకాశం వచ్చింది. రాజ్యసభలో బీజేపీ పెట్టబోయే బిల్లులు నెగ్గాలంటే వైసీపీ ఎంపీల మద్దతు అవసరం అవుతుంది. కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తేనే బిల్లులకు మద్దతు ఇస్తామని డిమాండ్ చేసి హోదా సాధించాలి. రాష్ట్ర విశాల ప్రయోజనాలకు, యువత ఉద్యోగ, ఉపాధికి ఉపకరించే ప్రత్యేక హోదా కోసం పట్టుపట్టేలా ఈ అవకాశాన్ని జగన్ రెడ్డి ఉపయోగించుకోవాలి. కేంద్రంలో ప్రతిపక్షాల అవిశ్వాసానికి మద్దతు ఇచ్చి, రాజ్యసభలో బిల్లులు వ్యతిరేకించి జగన్‌రెడ్డి తన చిత్తశుద్ధిని రుజువు చేసుకొనే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే ప్రత్యేక హోదాపై మీరు చేసిన గర్జనలు, చెప్పిన ప్రవచనాలు అన్ని ఉత్తిత్తివిగానే ప్రజలు పరిగణించాల్సి ఉంటుంది.


తనపై ఉన్న సీబీఐ కేసులకు భయపడకపోతే జగన్‌రెడ్డి బీజేపీ బిల్లులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక వేళ బిల్లులకు మద్దతు ఇవ్వాల్సి వస్తే, ఏ కారణంతో మద్దతు ఇస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం 22 మంది ఎంపీలు, తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు వుండి కూడా ప్రత్యేక హోదా కోసం పట్టుపట్టి లోక్‌సభ, రాజ్యసభను ఎన్నడూ స్తంభింపచేయలేదు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా రాష్ట్రానికి కేంద్రం చేసిందేమిటని ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. రాజధానిపై స్పష్టత లేదు. పోలవరానికి నిధులు, దుగ్గరాజపట్నం పోర్టు, పెట్రో కారిడార్‌, పరిశ్రమల ఏర్పాటు, విశాఖ–చెన్నై కారిడార్‌ వంటి వాటిలో కదలిక లేదు. అంతర్జాతీయ విమానాశ్రయాలు, మెట్రో రైళ్లు తీర్మానాలకే పరిమితమయ్యాయి. అభివృద్ధిలో టాప్‌–5లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 15 స్థానానికి చేరుకుంది. కడపలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని కేంద్రం చెప్పినా, రాయలసీమను ఎండబెట్టే విధంగా కర్ణాటక ఎగువభద్ర ప్రాజెక్టు నిర్మాణంతో సీమ ఎడారి కాబోతున్నా, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేసే ప్రయత్నం ఆపకపోయినా, రైల్వే జోన్ అతీగతీ లేకపోయినా జగన్‌రెడ్డి మౌనంగా ఉండటంలో ఆంతర్యం ఏమిటి?

ప్రత్యేక హోదా తెస్తానంటే రాష్ట్ర ప్రజలు నమ్మి అత్యధిక స్థానాలు ఇచ్చి అధికారం కట్టబెడితే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని ప్రశ్నించకుండా రాజీపడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్‌ను, ఆత్మగౌరవాన్ని కేంద్రానికి తాకట్టుపెట్టడం సమర్ధనీయం కాదు. జగన్‌ తనపై ఉన్న సీబీఐ కేసుల భయంతో, వివేకా హత్య కేసులో సోదరుడు అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయకుండా కాపాడుకునేందుకు కేంద్రం వద్ద మోకరిల్లుతున్నారని ప్రజలే అంటున్నారు. ఇప్పటి వరకు రాజ్యసభలో వైసీపీ ఎంపీలంతా కేంద్రం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు మద్దతిస్తున్నారంటే కేంద్రంలోని బీజేపీతో జగన్‌ ఏ మేరకు లాలూచీ పడుతున్నారో అర్థమవుతోంది.

నీరుకొండ ప్రసాద్

Updated Date - 2023-08-02T01:24:33+05:30 IST