కలత పెడుతున్న ‘కలల తీరం’

ABN , First Publish Date - 2023-10-04T01:31:31+05:30 IST

మెరుగైన అవకాశాలకై వర్తమాన భారతీయ యువత ప్రవాసాన్ని ఎంచుకొంటోంది. గల్ఫ్ దేశాలలో విస్తృత ఉపాధి అవకాశాలున్నా శాశ్వత నివాసానికి అవకాశం లేదు. ఈ కారణంగా పాశ్చాత్య దేశాలు...

కలత పెడుతున్న ‘కలల తీరం’

మెరుగైన అవకాశాలకై వర్తమాన భారతీయ యువత ప్రవాసాన్ని ఎంచుకొంటోంది. గల్ఫ్ దేశాలలో విస్తృత ఉపాధి అవకాశాలున్నా శాశ్వత నివాసానికి అవకాశం లేదు. ఈ కారణంగా పాశ్చాత్య దేశాలు ప్రత్యేకించి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలకు వెళ్ళడానికే భారతీయ యువజనులు మొగ్గు చూపుతున్నారు. అమెరికాలో ఉన్న కోటా నిబంధనలు, సుదీర్ఘ కాలం పాటు ఓపిక పట్టలేని యువత ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియా, కెనడాలకు వెళ్లుతోంది. అమెరికా, ఆస్ట్రేలియాలలో కంటే కెనడాలోనే సునాయసంగా శాశ్వత నివాసాన్ని సాధించుకునేందుకు అవకాశముండడంతో భారతీయులు పెద్ద సంఖ్యలో కెనడాకు బారులు తీరుతున్నారు.

అమెరికాలో భారతీయులు అందునా తెలుగువారు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ దేశానికి పొరుగునే ఉన్న కెనడాకు వెళ్తున్న తెలుగు వారి సంఖ్య గత కొంత కాలంగా గణనీయంగా పెరిగిపోతోంది. వెళ్లుతున్న వారందరూ తొలుత పి.జి. చేయడానికి వెళ్ళి ఆ తర్వాత దాని ఆధారంగా ఆ దేశంలో శాశ్వత నివాసం ఏర్పర్చుకోవడానికి ఆరాటపడేవారే. ఏమిరేట్స్, ఎత్తేహాద్, ఖతర్ ఏయిర్‌వేస్‌లు భారత్ నుంచి నడిపే విమానాలలో గల్ఫ్ మీదుగా కెనడాకు వెళ్లే ప్రయాణికులు అనునిత్యం దుబాయి, ఆబుధాబి, దోహా విమానాశ్రయాలలో దర్శనమిస్తారు. తమ ఉన్నత విద్యార్హతలు, కష్టపడి పని చేసే స్వభావం కారణాన తెలుగువారికి ప్రపంచ వ్యాప్తంగా ఒక ఆదరణీయమైన గుర్తింపు ఉంది.

కెనడా ఏ నాటి నుంచో పంజాబీలు ముఖ్యంగా సిక్కులకు ఒక ఆశల తీరంగా ఉన్నది. భారత్‌లోని పంజాబ్ తర్వాత సిక్కులు అధిక సంఖ్యలో నివసిస్తున్నది కెనడాలోనే అన్నది విస్మరించలేని వాస్తవం. కెనడాలో స్థిరపడిన సిక్కులు భారత స్వాతంత్ర్యోద్యమంలో కూడా ప్రముఖ పాత్ర వహించారు. ఇరవయో శతాబ్ది తొలినాళ్ల నుంచి కెనడా రాజకీయాలలో సిక్కులు ఒక బలమైన వర్గంగా ఉన్నారు. క్రమంగా కెనడా ప్రభుత్వ ప్రభుత్వ విధానాలను సైతం ప్రభావితం చేసే స్ధాయికి ఎదిగారు. కెనడా ప్రస్తుత ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో 2018లో కుటుంబ సమేతంగా న్యూఢిల్లీని సందర్శించారు. ఆ సందర్భంగా ఆ గౌరవనీయ అతిథుల ఆహార్యాన్ని కెనడా ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రభావితం చేశాయనడం సత్య దూరం కాదు. మత ఛాందసవాద సిక్కులు ఇప్పటికీ ఖలిస్తాన్‌ను స్వప్నిస్తున్నారు. కెనడా, ఇతర పాశ్చాత్య దేశాలలోని ఖలిస్తాన్ మద్దతుదారులు భారతదేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలో వివిధ దేశాలలోని భారతీయ దౌత్య కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాలను అవమానపరిచే నైచ్యానికి దిగుతున్నారు. విదేశాలలోని సిక్కు సోదరులు ఇలా చేయడం స్వదేశంలో ప్రతీ ఒక్కరిని దిగ్భ్రాంతిపరుస్తోంది.

కెనడాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని న్యూఢిల్లీ గుర్తించి ఆ దేశ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ వస్తోంది. ఆ అరాచక ఆగడాలను అరికట్టాలని కూడ ఎప్పటికప్పుడు గట్టిగా డిమాండ్ చేస్తోంది. అయితే ఇది బధిరుని చెవిలో శంఖం ఊదిన చందమే అవుతోంది! ఎయిర్ ఇండియా విమానం కనిష్క దుర్ఘటన మొదలు ఇటీవల ఇందిరాగాంధీ హత్యోదంతంలో ఒక సన్నివేశాన్ని బహిరంగంగా ప్రదర్శించడం దాకా కెనడా వ్యవహరించిన తీరు ఏ మాత్రం సమంజసంగా లేదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే కెనడాలో భారత్ వ్యతిరేక ప్రదర్శనల నిర్వహణ ఒక నిత్యకృత్యమై పోయింది.


అతిథిని దేవునిగా భావించి మర్యాదలు చేయడం భారతీయుల స్వతస్సిద్ధ స్వభావం. ఈ సంప్రదాయ స్ఫూర్తితోనే న్యూఢిల్లీలో అధికారిక పర్యటనకు వచ్చే విదేశీ ప్రభుత్వాధినేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసాధారణంగా అతిథి మర్యాదలు చేస్తుంటారు. అయితే 2018లో న్యూఢిల్లీని సందర్శించిన కెనడా ప్రధాని ట్రూడో పట్ల మాత్రం మోదీ ఆ రకమైన ఆప్యాయత, ఆదరణ చూపలేదు. మొక్కుబడిగా అధికారిక మన్ననలు, మర్యాదలకు మాత్రమే పరిమితమయ్యారు. తద్వారా, కెనడాలో ఖలిస్తాన్ అనుకూల కార్యకలాపాలను అరికట్టడంలో ట్రూడో ప్రభుత్వ అలక్ష్య వైఖరి పట్ల భారత్ అసంతృప్తిని మోదీ పరోక్షంగా వ్యక్తీకరించారు. ఇటీవల న్యూఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సుకు వచ్చినప్పుడు కూడా ప్రధాని ట్రూడోతో భారత్ – కెనడా ద్వైపాక్షిక సంబంధాల విషయమై ఆయనతో మోదీ ఒక్కసారి కూడా ప్రత్యేకంగా సమావేశమవ్వలేదు.

ఈ నేపథ్యంలో కెనడాలోని ఒక గురుద్వారా వద్ద ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది. ఈ ఘటనపై సిక్కులు అనేక మంది నిరసన వ్యక్తం చేసారు. నిజ్జర్‌ను ఎవరు హత్య చేసారనే విషయమై ఇప్పటి వరకు కెనడా ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. అయితే ఈ హత్య వెనుక భారత ప్రభుత్వాధికారుల ప్రమేయమున్నదని కెనడా పార్లమెంటులో ప్రధాని ట్రూడో ఆరోపించడంతో ద్వైపాక్షిక సంబంధాల పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. విదేశాలలోని భారతీయ ఎంబసీలలో నిఘా సంస్ధ ‘రా’ అధికారులు పని చేస్తుండడం మాములు విషయమే. అన్ని దేశాల ఎంబసీలలోనూ కొందరు అధికారులు తమ దేశాల నిఘా విభాగం పక్షాన పని చేయడం కద్దు. కెనడాలోని భారతదేశ ఎంబసీలో పని చేస్తున్న పంజాబ్ పోలీసు శాఖ అధికారి పేరును సైతం ఈ సందర్భంగా కెనడా ప్రభుత్వం మీడియాకు వెల్లడించింది. ఇది దౌత్య మర్యాదలకు విరుద్ధం. దీంతో భారత్ –కెనడా సంబంధాలలో ఒక విధమైన ప్రతిష్టంభన నెలకొన్నది. కీలకమైన వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కూడ ఆగిపోయాయి. ఈ వివాదంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చాల జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తోంది. ఈ సహేతుక దౌత్య స్ఫూర్తిని చివరివరకు కొనసాగిస్తుందో లేక మధ్యలో ఏమైనా ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుంటుందో ఇప్పుడే చెప్పలేము.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2023-10-04T01:31:31+05:30 IST