రష్యాకు చైనా కరెన్సీలో భారత్ చెల్లింపులు

ABN , First Publish Date - 2023-07-26T01:29:25+05:30 IST

ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ ఇటీవలి కాలంలో విదేశాలలో రూపాయి మారకంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. ప్రవాస భారతీయులు అధికంగా...

రష్యాకు చైనా కరెన్సీలో భారత్ చెల్లింపులు

ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ ఇటీవలి కాలంలో విదేశాలలో రూపాయి మారకంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. ప్రవాస భారతీయులు అధికంగా నివసిస్తున్న, భారతీయ పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో సందర్శించే దేశాలలో రూపాయి మారకంలో కొనుగోళ్ళు చేయడానికి రూపే కార్డును వినియోగించే విధంగా మన దేశం ఒప్పందాలు చేసుకొంటోంది. ఈ మేరకు యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌తో సహా వివిధ గల్ఫ్ దేశాలతో భారత్ ఒప్పందాలు చేసుకున్నది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల సందర్భంగా దీన్ని భారత్ సాధిస్తున్న విజయంగా కూడ ప్రచారం చేస్తున్నారు. అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలకు మూలమైన అమెరికా డాలర్‌కు క్రమేణా ప్రత్యామ్నాయ కరెన్సీగా భారతీయ రూపాయి అవతరిస్తుందని కూడ కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు, ఆ దిశగా అడుగులు వడివడిగా ముందుకు పడుతున్నట్లుగా కూడ విశ్వసిస్తున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులలో భారత్ ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించిందని ఒక వర్గం భజన చేస్తోంది. అదే విధంగా చైనాను పూర్తిగా కట్టడి చేయడం ద్వారా ప్రధాని మోదీ భారత్‌ను విశ్వగురువుగా తీర్చిదిద్దారని వారు ఢంకా బజాయించి మరీ చెబుతారు. నిజానికి ఈ అంశాలతో పాటుగా అన్నింటా భారత్ సఫలీకృతం కావాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నాడు.


మరి వాస్తవాలు ఎలా ఉన్నాయి? దుబాయి లేదా సింగపూర్‌లో దుకాణాలు భారతీయ రూపే కార్డులను స్వీకరించడమేమో గానీ చమురు దిగుమతులకు గాను రష్యాకు మన దేశం రూపాయిల్లో కాదు కదా, విదేశీ మారకం అందునా చైనా కరెన్సీ యువాన్లలో చెల్లింపులు చేస్తోంది! ఒక్క చైనా యువానే కాదు, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ కరెన్సీ అయిన దిర్హాంలలో కూడా రష్యాకు చెల్లింపులు చేస్తున్నదనేది ఒక పచ్చి నిజం. భారతీయ రూపాయిను దేశం వెలుపల కూడ స్వీకరించే విధంగా కృషి చేస్తున్నానంటున్న ప్రభుత్వమే సాక్షాత్తు విదేశీ కరెన్సీ అందునా చైనా మారకంలో చైనాకు కాకుండా మరో దేశానికి చెల్లింపులు చేస్తుందంటే దిగ్ర్భాంతి కల్గించక మానదు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన అనంతరం అమెరికా, ఐరోపాల ఆంక్షల నేపథ్యంలో రష్యా తన విదేశీ మారకంగా చైనా యువానును అనధికారికంగా వాడుకొంటోంది. రష్యా నుంచి చౌక ధరలకు అందరి కంటే ఎక్కువగా చమురు దిగుమతి చేసుకుంటున్నామంటున్న సర్కారు మరి ఎందుకు తక్కువ ధరకే సామాన్యుని బండిలో పెట్రోలు పోయడం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. అలాగే రష్యా చమురుకు విదేశీ మారకంలో అందునా చైనా కరెన్సీలో ఎందుకు చెల్లింపులు చేస్తున్నారన్న ప్రశ్నకూ జవాబు లేదు. భారతీయ రూపాయి మారకంలో రష్యాకు చెల్లింపులు చేశారనేది కూడా నిజమే కానీ రూపాయి మారకంలో స్వీకరిస్తే, భారత్ నుంచి పెద్దగా దిగుమతులు లేనందున రూపాయి తమకు గుదిబండగా మారుతుందని రష్యా భావిస్తోంది. అందుకే రూపాయిల్లో చెల్లింపులను అంగీకరించడం లేదు. ఇది, మన రూపాయి పరిస్థితికి అద్దం పడుతోంది. అసలు రూపాయి మారకం విలువ ఎందుకు క్షీణిస్తోంది? పాలకులు చెప్పలేకపోతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారతీయ రూపాయి మారకం విలువ క్షీణించిందన్నది ఒక వాస్తవం.

అంతర్జాతీయంగా ఏకాకిని చేయడం ద్వారా చైనాను కట్టడి చేసినట్లుగా చెబుతున్న సర్కారు మరి ఏ విధంగా యువాన్లలో రష్యాకు చెల్లింపులు చేస్తోంది? ఒక్క యువాన్లే కాదు. సరిహద్దు వివాదం, ఉద్రిక్తతల మధ్య సర్కారు గంభీర ప్రకటనలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో సరిహద్దు వద్ద కానీ దేశంలోని వర్తక రంగంలో గానీ చైనాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నది. చైనాతో భారత వాణిజ్య లోటును పరిశీలిస్తే ఈ నిజం అవగతమవుతుంది. చమురు దిగుమతుల వలన రూపాయిపై భారం పడుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఆత్మనిర్భర్, మేక్ ఇన్ ఇండియాను విజయవంతంగా అమలు చేస్తున్నామంటున్న సర్కారు మాములు వస్తువులను సైతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని ఏమనుకోవాలి? 2013–14లో 36 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ వాణిజ్య లోటు క్రమేణా హెచ్చుతూ 2022–23 ఆర్థిక సంవత్సరాంతానికి 135 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. ఆత్మనిర్భర్, మేక్ ఇన్ ఇండియా అంటున్న మోదీ సర్కార్ చైనా ఉత్పత్తులను తగ్గిస్తాం, వీలయితే బహిష్కరిస్తామని కూడ పలు మార్లు ఉద్ఘాటించింది. వాస్తవానికి అది ఆచరణ సాధ్యం కాదని చైనా దిగుమతుల గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామాలలోనూ నగరాలలోనూ వెలుస్తున్న చైనా బజార్లు మన మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో చెప్పడానికి ఒక తార్కాణం మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు దేవుళ్ళ పూజ సామాగ్రి వరకు మన దేశీయ అవసరాలను తీర్చడానికి మనం పూర్తిగా చైనా ఉత్పత్తులపై ఆధారపడుతున్నాం. దేశీయ అవసరాలతో పాటు వివిధ పారిశ్రామిక ఉత్పత్తుల ఉత్పాదకత కోసం సైతం చైనా నుంచి ముడి పదార్థాల దిగుమతులపై ఆధారపడుతున్నాం. ఆర్థిక వ్యవస్థను అంతర్గతంగా ఈ రకంగా కుదేలుపరుస్తున్న సర్కారు బయట మాత్రం గొప్పలు చెప్పుకొంటుంది, దురదృష్టవశాత్తు భావోద్వేగాల రచ్చలో కీలకమైన ఈ మౌలిక ఆర్థికాంశాలను భారతీయ సమాజం విస్మరించడం మరింత విచారకం.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2023-07-26T01:29:25+05:30 IST