కుబేరుల రాజ్యంలో కూటికిలేనివారే ఎక్కువ!
ABN , First Publish Date - 2023-04-05T03:17:54+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి భారతదేశంలో, పెరుగుతున్న అసమానతల గూర్చి ఇటీవల ఆక్స్‌ఫామ్ తన నివేదికలో ఆందోళన వెలిబుచ్చింది. పారిశ్రామిక వర్గం విపరీతంగా సంపదను...
ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి భారతదేశంలో, పెరుగుతున్న అసమానతల గూర్చి ఇటీవల ఆక్స్‌ఫామ్ తన నివేదికలో ఆందోళన వెలిబుచ్చింది. పారిశ్రామిక వర్గం విపరీతంగా సంపదను కూడగట్టడం, తద్వారా ధనికులకు పేదవారికి మధ్య తీవ్రమవుతున్న ఆదాయ అసమానతలను అరికట్టడంలో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ఘోరంగా విఫలమైన ప్రమాదకరమైన వాస్తవాన్ని అది తెలియజేసింది. ప్రపంచ సంపదలో 45శాతం వాటా సంపన్న వర్గంలోని ఒకశాతం వారికి చెందగా, అట్టడుగు పేదవారిలో సగం ప్రజానీకం కేవలం 0.75శాతం కలిగి ఉన్నారని ఈ నివేదిక పేర్కొంది. వ్యక్తిగత స్థాయిలో చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సగం జనాభాకి చెందిన సంపదకన్నా అధిక సంపద కేవలం 81 మంది అపర కుబేరులు అనుభవిస్తున్నారు. కార్పొరేటు సంస్థలు కట్టే పన్నులు నానాటికీ తగ్గడం కూడా అపరకుబేరుల ఆస్తులు విపరీతంగా పెరగడానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి. పారిశ్రామిక వర్గాన్ని మెప్పించేందుకు కార్పొరేటు పన్నులను తగ్గించడం వల్ల సహజంగానే కొద్దిమంది సంపన్నుల చేతుల్లో సంపద కేంద్రీకృతమై, ధనికులు పేదల మధ్య అంతరం తీవ్రమయింది.
భారతదేశంలో, ఎగువనున్న 5శాతం సంపన్నులు మొత్తం సంపదలో 62శాతాన్ని కలిగి ఉంటే, ఎగువనున్న కేవలం ఒకశాతం వారు మొత్తం దేశ సంపదలో 40.6శాతం కలిగి ఉన్నారు. ఇలా దేశంలో కేంద్రీకృతమైన సంపద కులాంతరాలకు అనుగుణంగా కూడా సాగిందని ఆక్స్‌ఫామ్ తెలియజేసింది. కుల వ్యవస్థలో దిగువనున్న కులాల వారికి దేశ సంపదలో ఉన్న వాటా కన్న అగ్రవర్ణాలవారు అత్యధిక వాటాను కలిగి ఉన్నారు. దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే పేరిట భారత ప్రభుత్వం కార్పొరేట్ పన్నురేట్లను 30 నుంచి 22 శాతానికి తగ్గించినందున రూ. 1.84 లక్షల కోట్ల నష్టం వచ్చింది. ఇలాంటి శక్తులకు ప్రభుత్వ రాయితీలతో పాటు, ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు కూడా పెద్దమొత్తాల్లో అతి తక్కువ వడ్డీ రేటుకు ఋణాలు ఇచ్చాయి. గత ఆరేళ్లలో సగటు వినియోగదారులపై వడ్డీరేటు భారం పెరిగిన సమయంలో, కార్పొరేట్లకు సుమారు రూ.11లక్షల కోట్ల ఋణాలు (నాన్ పెర్ఫార్మింగ్ అస్సెట్స్, మొండి బాకీలను) మాఫీ అయ్యాయి. దీనితోపాటు, 1951–80 కాలంలో 1.7శాతం ఉన్న సగటు వయోజనుల వాస్తవ వార్షిక ఆదాయ వృద్ధి 1980–2015 కాలంలో 3.3శాతానికి పెరిగిందని 2017లో లూకస్ చాన్సెల్, తామస్ పికెట్టి చేసిన పరిశోధనలు వెల్లడించాయి. దీనికి భిన్నంగా ఇదే కాలంలో అతితక్కువ ఆదాయ శ్రేణుల్లోని 50శాతం వారి ఆదాయవృద్ధి 2.2శాతం నుంచి 1.9శాతానికి తగ్గిందని, అత్యంత సంపన్నుల్లో ఎగువన ఉన్న ఒక శాతం వారి ఆదాయ వృద్ధి 0.2శాతం నుంచి 6.6శాతానికి పెరిగిందని వెల్లడైంది.
జీవనస్థితిమీద సంపద అసమానతలు కలిగించే దుష్ప్రభావాలు పలు రకాలు. దేశంలోని దాదాపు 70శాతం వారికి మౌలిక అవసరాలు అందకుండా పోతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారానికి నోచుకోక, ఆకలితో వచ్చే రోగాల వల్ల ఏటా 17లక్షల మంది చనిపోతున్నారు. 2020–21లో స్థూల దేశీయ ఉత్పత్తిలో 2.1శాతాన్ని మాత్రమే ప్రభుత్వం ఆరోగ్య రంగంపై ఖర్చు చేయడం కారణంగా దేశంలోని పేద, వెనుకబడిన వర్గాల వారు ధనికులతో పోల్చితే తక్కువ ఆయుర్దాయాన్ని కలిగి ఉన్నారు. ఒక పరిశోధన ప్రకారం దేశంలోని ధనికుల్లో అయిదోవంతు కుటుంబాల వారు సగటున 72.7ఏళ్లు జీవిస్తుండగా, పేదవారిలో అయిదో వంతు కుటుంబాలవారు సగటున 65.1 సంవత్సరాలు జీవిస్తున్నారు. ఆదాయ అంతరాల వల్ల వీరి జీవిత కాలం నికరంగా 7.6 సంవత్సరాలు తక్కువ కాగా, సాపేక్షంగా 11.7 శాతం ఆయుష్షును కోల్పోతున్నారు. ఇక, విద్యారంగానికి బడ్జెటు కేటాయింపులు తగ్గుతున్న కారణంగా బడులు, నాణ్యమైన విద్య అందుబాటులో లేకపోతున్నది. పేదరికం, అణచివేతల నుంచి విముక్తి చెందే విద్యార్థులకు ఇది శాపంగా మారుతున్నది. దేశంలోని అసమాన సామాజిక ఆర్థిక నిర్మాణం, ఆర్థిక విధానాల రూపకల్పన, అమలును కొన్ని సామాజికార్థిక వర్గాలు శాసించడం కూడా పెరుగుతున్న ఆదాయ అసమానతలకు కారణం.
పేద–సంపన్న వర్గాల మధ్య తీవ్రమవుతున్న ఆదాయ అసమానతలు ఆర్థికరంగంలో సమానావకాశాలను హరించివేయడమేకాక, ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నది. ఉపాధి అవకాశాల పంపిణీలో అసమానతలు కూడా భారత ఆర్థిక వ్యవస్థలో అసమానతలు పెరగడానికి కారణం. ఇటీవలి ప్రభుత్వ అధికారిక నేషనల్ సాంపిల్ సర్వే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ (పిఎల్ఎఫ్ఎస్) 2018–19 సర్వే గణాంకాలు దీనికి నిదర్శనం. దేశంలో సగటు నిరుద్యోగ రేటు 2018–19లో 5.8శాతం కాగా, ఇది షెడ్యూల్ కులాలలో 6.4శాతం, షెడ్యూల్ తెగలలో 4.5 శాతం, ఓబీసీలలో 5.9శాతం, ఇతర కులాలలో 5.9శాతం ఉంది.
దేశంలో అపర కుబేరుల సంఖ్య వేగంగా పెరుగుతున్న వైనాన్ని చూసి పరవశించిపోతున్న విధాన రూపకర్తలకు, మీడియాకి ఈ ఆక్స్‌ఫామ్ నివేదిక గొప్ప సవాలు విసిరింది. పేదరికాన్ని, సంపదను రెండు ధ్రువాల్లో పెంచడం పెట్టుబడిదారీ విధానం సహజలక్షణమని మార్క్స్ వివరించాడు. కనుక పేదరికాన్ని అధిగమించేందుకు సంపదను పెంచడమొక్కటే దివ్యౌషధం కాదు. నిజానికి పెట్టుబడిదారీ వర్గాల సంపద పెరిగిన నిష్పత్తిలో మరొకవైపు అశేష ప్రజల పేదరికాన్ని ఏక కాలంలో పెంచడమే తీవ్రమవుతున్న నేటి ఆదాయ అసమానతల వైపరీత్యం.
ఎగువనున్న ఒక్కశాతం అతిసంపన్నులపై (సూపర్ రిచ్) ప్రొగ్రెసివ్ పన్నులు వేయడం ద్వారా దేశంలో పెరుగుతున్న అసమానతలను తగ్గించి ఆరోగ్యం, విద్యా, గృహనిర్మాణం, పారిశుద్ధ్యం... వగైరా సూచికల మెరుగుదలకు ఈ నిధులను మళ్ళించవచ్చు అని పలువురు భావిస్తారు. అయితే ఈ చర్య రెండువైపుల పదునుగల కత్తిలాంటిది. అతిసంపన్నులపై అధిక మొత్తంలో ప్రొగ్రెసివ్ పన్నులు విధించడం పెట్టుబడి వర్గాలు ఇతర దేశాలకు మళ్ళేందుకు దారితీయొచ్చు. అట్లని పెట్టుబడి నిలిపేందుకు సుంకాలను మరింత తగ్గిస్తూపోతే అది పతనానికి పరుగును పెంచడమే. సంక్షోభాన్ని అరికట్టాలనుకొనే ఏ ప్రభుత్వమైనా ఆదాయ అసమానతలు తీవ్రం అవుతుంటే చోద్యం చూస్తూ ఊరుకోలేదు. ‘పేదవారికి తినడానికి ఇక ఏమీ లేనప్పుడు, వారు ధనికులనే తింటారు అన్న ప్రముఖ తత్వవేత్త, రాజకీయ సిద్ధాంతకర్త జీన్ జాక్ రూసో 18వ శతాబ్దంలో చెప్పిన భవిష్యవాణి మారుమోగుతున్నది.
జాదవ్ చక్రధర్
మామిడి భరత్ భూషణ్
(సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్)