ఆత్మన్యూనత వదిలితే, ‘అదానీ’ ఒక అవకాశం!

ABN , First Publish Date - 2023-02-02T00:48:37+05:30 IST

పదేపదే ఎదుటివారిదే పై చేయి అవుతుంటే, అణగారిపోతున్నవారిలో ఎటువంటి భావాలు కలుగుతాయి? కొందరికి నిస్పృహ కలుగుతుంది...

ఆత్మన్యూనత వదిలితే, ‘అదానీ’ ఒక అవకాశం!

పదేపదే ఎదుటివారిదే పై చేయి అవుతుంటే, అణగారిపోతున్నవారిలో ఎటువంటి భావాలు కలుగుతాయి? కొందరికి నిస్పృహ కలుగుతుంది. తమ శక్తి ఇంతే, ఇక ఎప్పుడూ గెలవలేము అన్న నిరాశ ఆవరిస్తుంది. మరి కొందరికి, తాము అన్నీ తప్పులు చేస్తున్నాము, ఎదుటివాడు అన్నీ సరిగ్గా చేయడమే కాక, తెలివీ బలమూ అపారంగా ఉన్నాయి అన్న న్యూనత కలుగుతుంది. కొద్దిమందికి మాత్రం, ఎక్కడ పొరపాటు జరుగుతున్నదో, శత్రువు బలం ఎక్కడ ఉన్నదో సరిగ్గా తెలుసుకుని, ఈ సారి గట్టిగా పోరాడాలని అనిపిస్తుంది. అతి కొద్దిమందికి మాత్రం ఆశావాదంతో పాటు, ఆత్మవిశ్వాసం కూడా అమితంగా ఉంటుంది. వాళ్లు పొరపాట్ల గురించి ఆలోచించడమే పొరపాటు అనుకుని, ఒకే పద్ధతిలో పోరాడుతూ ఉంటారు. వరుస గెలుపులు గెలుస్తున్నవాడిని గెలిపిస్తున్న అంశాలలో, పరాజితులలోని వైరభక్తి, ఆత్మన్యూనత ముఖ్యమైనవి.

నరేంద్రమోదీ పరిపాలనలో దేశానికి హాని జరుగుతోందని, దాన్ని నిలువరించాలని కోరుకుంటున్న అనేకమంది ఇప్పుడు అటువంటి రకరకాల మానసిక స్థితులలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏమి చేయాలో, ఏమి కూడదో, ఎవరితో కలవాలో, ఎవరితో విడిపోవాలో తెలియక అల్లాడిపోతున్నారు. దేశం ఫాసిస్టు ప్రమాదంలో పడిందని, దానికి ఒక ప్రతివ్యూహం రూపొందించాలని చిత్తశుద్ధితో తర్జన భర్జనలు పడుతున్న వారు కూడా, తమ బాట, మాట ఏ తీరున ఉండాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. అందరినీ ఆవరించిన ఒకే ఒక్క సంశయవాతావరణం ఎలా ఉందంటే, తామేమి చేసినా మోదీకే బలం చేకూరుతుందని, తాము సంధించే బాణాలన్నీ అతని అమ్ములపొదికే చేరతాయని అందరూ ఏదో ఒకస్థాయిలో భయపడుతూ ఉన్నారు. తప్పు చేస్తున్నవాడికి తేలు కుడితే, ఏడ్వడానికి కూడా ఉండదట. వీళ్లు చేయాలనుకుంటున్నది ఒప్పే అయినా, అరిస్తే ఏమవుతుందోనని కిక్కురమనకుండా ఉంటున్నారు.

బీబీసీ డాక్యుమెంటరీపై ప్రభుత్వం విధించిన నిరోధాంక్షల గురించి మాటవరసకు ఏదో ప్రకటన ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఊరుకున్నది. ఏమి మాట్లాడితే ఏమవుతుందో అన్న భయం కాంగ్రెస్‌ను కొద్దికాలంగా బాధిస్తూనే ఉన్నది. ఇప్పుడు గుజరాత్ గాయాన్ని తిరిగి చర్చలోకి తెస్తే, అది అంతిమంగా విభజనను తీవ్రం చేసి, బిజెపికి అనుకూలంగా పరిణమిస్తుందన్నది సంకోచానికి కారణం. కాంగ్రెస్ వెనుకంజ అకారణమేమీ కాదు. ఏదో ఒక వివాదాంశాన్ని చర్చలోకి తెచ్చి, లబ్ధిపొందే వ్యూహం బిజెపి అనుసరిస్తూనే ఉన్నది. అనేక సందర్భాలలో, బిజెపి రూపొందించిన బాణీలోనే నాట్యమాడి పరాభవం పొందిన అనుభవం ప్రతిపక్షాలకు ఉన్నది. ఈ సందర్భం వేరు కదా? బీబీసీ డాక్యుమెంటరీ కూడా బిజెపి ప్రభుత్వం రంగం మీదకు వదిలినదేనని కొందరు అనుమానించారంటే, భయానుమానాలు ఏ స్థాయికి చేరాయో ఊహించుకోవచ్చు. ఇట్లా అనుమానించడం మొదలుపెడితే, ప్రతిపక్షాలు ఏ విషయంలోనూ మాట్లాడలేక నోరు కట్టేసుకోవలసి వస్తుంది.

దాదాపుగా కొత్త విషయాలేమీ లేని బీబీసీ డాక్యుమెంటరీలో ఉన్న ఒకే ఒక విస్ఫోటక అంశం, 2002 హింసాకాండ సమయంలోనే బ్రిటిష్ ప్రభుత్వం సొంతంగా ఒక నిజనిర్ధారణ జరిపించడం. అందులో, అల్లర్లు కొనసాగడాన్ని అనుమతించడంలో నరేంద్రమోదీ ప్రమేయాన్ని నిర్ధారించడం. డాక్యుమెంటరీపై ఆంక్షలను గట్టిగా ఖండించినవారు కూడా, ఈ నిర్ధారణ విషయంలో మౌనం పాటించారు.

అనుకున్నట్టుగానే బీబీసీ విషయంలో జాతీయవాదం, వలసవాదం వగైరాలన్నీ తరలివచ్చాయి. దానితో, సెక్యులర్, ప్రత్యామ్నాయ శక్తులు మరింత గుంజాటనలో పడిపోయాయి. మన దేశంలో జాతీయవాదం, మతజాతీయవాదంగా మలుపు తీసుకుంటున్నప్పుడు మౌనంతో, సహభాగత్వంతో అనుమతించిన మధ్యేవాద, వామపక్షాలకు ఇటువంటి సందర్భాలలో ఏమిచేయాలో తెలియదు. మన దేశానికి ఇంతకాలానికి లభించిన దృఢనాయకత్వాన్ని బదనామ్ చేయడానికి, బలహీనపరచడానికి అంతర్జాతీయ కుట్ర జరుగుతోందన్న కథనం మెల్లగా రూపొందసాగింది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా వైపు మొగ్గినందుకో, రష్యా చమురు చవకగా కొంటున్నందుకో అమెరికా, ఇంగ్లండ్‌ మన మీద కత్తికట్టాయని, చైనా ఫోన్లు, యాప్స్‌ నిషేధించినందుకు ఆ దేశం తరఫున కమ్యూనిస్టులు, సెక్యులరిస్టులు దుష్ప్రచారానికి తెగబడ్డారని వాట్సాప్‌ పోస్టులు అవతరించసాగాయి. చిత్రం ఏమిటంటే, మానవ హక్కులు వగైరా మాటలన్నీ భారతీయమైనవి కాకపోవడమో, విభిన్నార్థంలో ఉండడమో కుదురుతుంది కానీ, సామ్రాజ్యవాదం, వలసవాదం వంటి మాటలు అవసరమైనప్పుడు భారతీయ పరిభాషలోకి చొచ్చుకు వస్తాయి. బీబీసీ డాక్యుమెంటరీనీ భావప్రకటనాస్వేచ్ఛనీ కలిపిచూస్తే, విజాతీయమైన హక్కుల భావనతో దేశభక్తిని పణం పెట్టినవాళ్లమవుతాము.

నిజానికి, బీబీసీ విషయంలో బీజేపీ దాని పరివారమూ కూడా ఆత్మరక్షణలోనే పడ్డాయి. ప్రత్యర్థి బలం మీద అపరిమిత విశ్వాసం పెంచుకున్న న్యూనశక్తులు ఆ మార్పును చూడలేకపోయాయి. ఆత్మరక్షణలో పడిన కీలకసందర్భాలలో, నరేంద్రమోదీతో సహా ప్రముఖ నాయకులందరూ మౌనం వహిస్తారు, సంవాదం తామనుకున్న పద్ధతిలో రూపొందేవరకు వేచిచూస్తారు. తమ విమర్శకులు చేసే తప్పులకోసం ఎదురుచూసి, తగిన ఆయుధం అందగానే ఎదురుదాడి చేస్తారు. బీబీసీ డాక్యుమెంటరీని పట్టుబట్టి ప్రదర్శించడానికి ప్రయత్నించిన విశ్వవిద్యాలయాలలో కొన్ని నిర్బంధ చర్యలు చేపట్టారు కానీ, దేశవ్యాప్తంగా దాని ప్రచారాన్ని, రహస్య వినిమయాన్ని కేంద్రప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు కంటె బీబీసీ గొప్పదా అన్న విచిత్రమైన పోటీని ప్రభుత్వపక్షీయులు చర్చలోకి తీసుకువచ్చారు. సుప్రీంకోర్టు పరిధిని నియంత్రించేందుకు ఒక వైపు ప్రయత్నం జరుగుతున్న సమయంలోనే, అది చేసిన ఒక ధ్రువీకరణను ఆశ్రయించడం విశేషం.

బీబీసీ సందర్భంలో మొదలయిన కథనం, అదానీ వివాదంతో ఒక రూపం తీసుకున్నది. భారతప్రభుత్వం మీద లేదా, కనీసం ప్రస్తుత భారత నాయకత్వం మీద అంతర్జాతీయంగా ఏదో కుట్ర జరుగుతున్నదనే కథనానికి, మదుపు మార్కెట్ల మీద నిఘాపెట్టే ఒక అమెరికన్ సంస్థ నివేదిక ఆధారమైంది. ఏ కారణమూ లేకుండా ఎందుకు రెండు విదేశీ సంస్థలు ఒకేసారి భారత సంబంధిత విషయాలలో ‘ప్రతికూల’ ప్రచారానికి పాల్పడతాయి అన్నది న్యాయంగా కనిపించే అన్యాయమైన ప్రశ్న. బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్‌కు పాశ్చాత్య అనుకూల భౌగోళిక రాజకీయ, సాంస్కృతిక దృష్టి లేదని ఎవరూ అనరు. కానీ, సమాచార విశ్వసనీయత, అందించడంలో సమపాక్షిక దృష్టి ఆ సంస్థ అనుసరించే ప్రమాణాలు, సాధారణ మీడియా కంటె మెరుగైనవి. దాని స్వతంత్ర ప్రతిపత్తి కూడా చాలా ప్రైవేటు వార్తాసంస్థల కంటె విస్తృతమైనది. భౌగోళిక రాజకీయాలలో వస్తున్న మార్పుల కారణంగానే ఈ విమర్శలు వస్తున్నాయంటే, ఇంతకాలం రాకపోవడానికి కూడా ఆ భౌగోళిక రాజకీయాలే కారణం అయి ఉండాలి కదా? ఆరోపణలలోని అంశాలను పూర్వపక్షం చేయలేనివారే ఉద్దేశాల ఆధారంగా తగాదాకు దిగుతారని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

ప్రతిపక్షాలకు తటపటాయింపులకు ఆస్కారం లేని అంశం అదానీ. పాపం, జాతీయతను అదానీ తోడు తెచ్చుకున్నారు కానీ, అదంతా హాస్యాస్పదంగా మారింది. భారతీయులుగా ఉండడం, భారతీయ సరుకులను కొనడం వంటి నినాదాలను ఇచ్చిన వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు గతంలో ఉన్నారు కానీ, ఏ కారణం వల్ల అయినా కావచ్చు, అదానీ నుంచి అటువంటి సూక్తులు జనం ఇష్టపడరు. వెగటు కలిగించే సంపద కేంద్రీకరణను ప్రజలు హర్షించరు. అదానీపై ఆరోపణల వెనుక భారత్‌ను బలహీనపరిచే కుట్ర ఉన్నదని, అదానీ అభివృద్ధియే భారత్ అభివృద్ధి అని అమాయకంగా వాదిస్తూ, సామాజిక మాధ్యమాలలో వీరంగం వేస్తున్నవారున్నారు. అదంతా పసలేని వాదన. ఎట్లాగో అష్టకష్టాలు పడి, ఫాలోఆన్‌ పబ్లిక్ ఇష్యూను పూర్తిగా సబ్‌స్క్రయిబ్ చేయించుకున్నా, చివరకు దానిని రద్దుచేసుకోవాల్సి వచ్చింది. ఈ ఎదురుగాలి ఇంతటితో ఆగేట్టులేదు. నూతన బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో ప్రాథమిక సదుపాయాల కోసం చేసిన కేటాయింపులు అనివార్యంగా, అదానీకి స్టాక్ మార్కెట్‌లో సానుకూలత కలిగించాలి కానీ, బడ్జెట్ రోజున కూడా షేర్లు జారుడుబండ మీద దొర్లిపోతున్నాయి. బడ్జెట్ ప్రసంగం అయిపోయిన వెంటనే స్విజర్లండ్ సంస్థ ‘క్రెడిట్ సూయిస్ గ్రూప్’ అదానీ కంపెనీల బాండ్లను తనఖాకు అంగీకరించబోమని ప్రకటించింది. ఆస్ట్రేలియాలోని కార్పొరేట్ వ్యవహారాల నియంత్రణ సంస్థ తాము కూడా హిండెన్ బర్గ్ నివేదికను సమీక్షిస్తామని చెబుతోంది. మూడీస్ రేటింగ్ సంస్థ ఐసిఆర్ఎ తన క్లయింట్ అదానీ గ్రూప్ పోర్ట్ ఫోలియో మీద ప్రస్తుత వివాదం ప్రభావాన్ని గమనిస్తున్నామని చెప్పింది.

అదానీ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలెవరూ ఇప్పటివరకూ పెదవి విప్పలేదు. బడ్జెట్ అనంతర పత్రికా సమావేశంలో కూడా ఎవరూ ఆర్థికమంత్రిని ఇబ్బందిపెట్టే ప్రశ్నలు వేయలేదు. పార్లమెంటు సమావేశాలలో ప్రతిపక్షాలు ఈ విషయమై ఎటువంటి వైఖరి అనుసరిస్తాయన్నది జాగ్రత్తగా గమనించవలసిన అంశం. ఈ వివాదాన్ని కూడా జాతీయవాద అంశంగా మార్చి లబ్ధిపొందుతుందేమోనన్న అనుమానం ప్రతిపక్షాలను పీడించకుండా ఉంటే, సార్వత్రక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ మీద జరిగే చర్చా సమావేశాలలో, అదానీ వివాదం ఒక మంచి ఆరంభానికి ఆస్కారమిస్తుంది.

కొన్ని సున్నితమయిన అంశాలలో తీవ్రమైన సంవాదం ఎదుటి పక్షానికే ఉపకరించే అవకాశం ఉన్నప్పుడు, చర్చాంశాన్ని మరొకదానికి మళ్లించడంలో తప్పు లేదు. కానీ, అది సంకల్పితంగా, పూర్తి అవగాహనతో జరగాలి తప్ప, భయంతో న్యూనతతో కాదు. అలాగే, మత సాంస్కృతిక అంశాలలో ప్రజలలో పేరుకుపోయిన పాక్షికతను సడలించే, తొలగించే ప్రయత్నాలు పూర్తిగా విరమించుకోవడం కూడా పద్ధతి కాదు. దేన్ని, ఏ స్థాయిలో, ఏ వేదికల ద్వారా, ఏ తీవ్రతతో చేయాలనేది రంగంలో ఉన్నవారు తేల్చుకోవలసిందే. అనుకూల పరిస్థితులను భయంతో కాలదన్నుకోకూడదు. ప్రతికూలతలను అవివేకంతో పెంచుకోగూడదు. ప్రభావాన్ని కలిగించే, ఫలితాలను ఇచ్చే కార్యాచరణకు రానున్న ఏడాది ఒక అవకాశం.

కె. శ్రీనివాస్

Updated Date - 2023-02-02T00:48:37+05:30 IST