వీరారాధన విడ్డూరాలు!

ABN , First Publish Date - 2023-03-26T00:25:08+05:30 IST

శ్రీలంకలో తమిళుల విముక్తికోసం పోరాడుతూ మరణించిన ‘లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం’ అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్ జీవించే ఉన్నాడనీ, తనతో తరచు సంభాషిస్తుంటాడని...

వీరారాధన విడ్డూరాలు!

శ్రీలంకలో తమిళుల విముక్తికోసం పోరాడుతూ మరణించిన ‘లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం’ అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్ జీవించే ఉన్నాడనీ, తనతో తరచు సంభాషిస్తుంటాడని తమిళ జాతీయవాది నెడుమారన్ ఇటీవల ఒక సంచలన ప్రకటన చేశారు. ప్రభాకరన్‌కు అత్యంత సన్నిహితుడిగా సుప్రసిద్ధుడైన వ్యక్తి నెడుమారన్. అయితే శ్రీలంక సైన్యం చేతిలో ప్రభాకరన్‌ హతుడైన పదమూడేళ్ల తరువాత, ఆయన ఇంకా జీవించే ఉన్నాడని, తనతో తరచూ సంభాషిస్తున్నాడని, త్వరలోనే ప్రజల ముందుకు వస్తాడని నెడుమారన్‌ ప్రకటించడం అమితాశ్చర్యం కలిగించే విషయం. ప్రభాకరన్ మరణాన్ని శ్రీలంక సైన్యం, ప్రభుత్వం ధ్రువీకరించాయి. అంతర్జాతీయ మీడియా సంస్థలు, మానవ హక్కుల సంఘాలు నాటి మారణకాండను గర్హిస్తూనే ప్రభాకరన్ మరణాన్ని నిర్ధారించాయి. ఒకవేళ ప్రభాకరన్ సజీవంగా ఉండివుంటే పలు దేశాలు ఆయనకు ఆశ్రయమిచ్చేవి కూడా. అంతెందుకు, ఈ పదమూడేళ్లలో ఆయన ఏదో ఒక మీడియా సంస్థ కంట పడేవాడు. నేటి శాటిలైట్ పరిజ్ఞానం ఆయన ఉనికిని ఇట్టే కనిపెట్టేయగలిగేది. ఆయన మరణం వాస్తవం. అయినా నెడుమారన్ లాంటి చైతన్యవంతుడైన వ్యక్తి ఈ విధంగా ప్రకటించడం రాజకీయ ఎత్తుగడా? లేక మితిమీరిన వీరారాధనా?

19వ శతాబ్ది బ్రిటిష్ రచయిత థామస్ కార్లైల్ (1795–1881) ‘హీరో వర్షిప్’ అన్న భావనను ‘ఆన్ హీరోస్, హీరో వర్షిప్ అండ్ ది హీరోయిక్ ఇన్ హిస్టరీ’ (1841) అన్న సుప్రసిద్ధ గ్రంథంలో నిర్వచించాడు. అనంతరం వీరారాధానపై చాలా పరిశోధనలు జరిగి విద్వత్ గ్రంథాలు వెలువడ్డాయి. తమలో లేని గుణగణాలు, సమర్థత, నైపుణ్యం ఉన్న వారిపైన, లేదా తాము చేయలేని అద్భుతమైన కార్యాలు చేయగలిగేవారిపైనా సామాన్యులు విపరీతమైన మోజు పెంచుకోవడం సర్వసాధారణం. అది అవధులు దాటితే ఆరాధనకు దారితీస్తుంది. సాధారణ ప్రజలు ఆరాధించేవారిలో గాయకులు, నటులు, క్రీడాకారులు, రచయితలు, కవులు వంటివారు ఎక్కువగా ఉంటారు. ప్రజల పక్షాన నిలిచి పోరాడే నాయకుల పట్ల, సాయుధ పోరాటంతో రాజ్యాన్ని ప్రతిఘటించే వారి పట్లా ఆరాధనాభావం హెచ్చుస్థాయిలో ఉండటం సహజమే. ఇది తీవ్రమైనప్పుడు అభిమానులు నిజాన్ని కూడా ఆమోదించని స్థితిలోకి జారిపోతారు. ఉద్దండుల మరణాన్ని అభిమానులు నిరాకరిస్తారు. ముఖ్యంగా తమ ‘హీరో’ మృతికి బలమైన ఆధారాలు లేకపోయినా, హఠాత్తుగా అదృశ్యమైనా, వారు జీవించే ఉన్నారన్న భావనతో తమను తాము తృప్తిపరచుకుంటూ గడిపేస్తారు. ఈ ధోరణిని మనోవైజ్ఞానిక శాస్త్రంలో ‘బిరీవ్‌మెంట్ హెలుసినేషన్’ అంటారు. ఇంతకూ నెడుమారన్–ప్రభాకరన్ తరహా సంఘటనలు చరిత్రలో అనేకం.

1857లో జరిగిన ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో చురుకైన పాత్ర పోషించిన నానా సాహెబ్ (నానా దొండు పంత్) కాన్పూర్ సమీపంలో బితూర్ సంస్థానాధీశుడు. అప్పటి గవర్నర్ జనరల్ డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం కారణంగా నానా సాహెబ్ తన రాజ్యాన్ని కోల్పోయి, ఇతర బాధిత సంస్థానాధీశులతో కలసి ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ధ్వజమెత్తాడు. ఓటమి పాలై బితూర్‌ విడిచిపోయిన నానా సాహెబ్ ఆచూకీ ఆ తరువాత ఎవరికీ తెలియరాలేదు. ఆయన నేపాల్‌లో తల దాచుకున్నాడని పలువురు విశ్వసించారు. పులి బారిన పడి చనిపోయాడని కొందరు అన్నారు కాన్‌స్టాంటినోపుల్ (ఇప్పుడు ఇస్తాంబుల్)లో అగుపించాడని, యోగీంద్ర దయానంద్ మహారాజ్‌గా అవతారమెత్తి గుజరాత్ తీర పట్టణం సిరోహిలో 1903లో తనువు చాలించాడని, నైమిశారణ్యంలో వానప్రస్థానాన్ని గడిపి 1906లో మరణించాడని –ఇలా లెక్కకు మించిన వదంతులకు ఆయన అదృశ్యం తావిచ్చింది. నానా సాహెబ్ మరణాన్ని లేదా అదృశ్యాన్ని హిందీ ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేకపోయారన్నది వాస్తవం. రిచెపిన్ అనే ఫ్రెంచ్ నాటక రచయిత ‘నానా సాహెబ్’ అనే రసవత్తరమైన నాటకాన్ని 1883లోనే రచించాడు.

ఇక నేతాజీ సుభాస్ చంద్రబోస్ 1945లో తైవాన్ లోని తైపే విమానాశ్రయం సమీపంలో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో మరణించారన్న విషయాన్ని లక్షలమంది ఆయన అభిమానులు అంగీకరించని విషయం తెలిసిందే. సుభాస్‌కు 1997లో వందేళ్లు నిండిన వరకూ కూడా ఆయన బతికే ఉన్నారన్న నమ్మకం కోట్లాది మందిలో బలంగా ఉండేది. అంతర్జాతీయ సంబంధాల దృష్ట్యా సుభాస్ మరణ వివరాలు గోప్యంగా ఉంచడం కూడా దీనికి కారణం. సుభాష్ చంద్రబోస్ జీవించే ఉన్నారని ఆయన సహచరుడు, ప్రముఖ పార్లమెంటేరియన్ హరి విష్ణు కామత్ 1950వ దశకం ప్రథమార్ధం వరకు వాదిస్తూనే ఉండేవారు. అయితే ఆ తరువాత ఆయన మరణ రహస్యాన్ని బహిర్గతం చేయడానికి దర్యాప్తు జరపాలని నెహ్రుపై కామత్ ఒత్తిడి తేవడంతో షానవాజ్ ఖాన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. ఖాన్‌తో పాటు ఐసిఎస్ అధికారి ఎస్ఎన్ మైత్ర, బోసు సోదరుడు సురేష్ చంద్రబోస్‌లు ఆ సంఘంలో సభ్యులు. ఈ కమిటీ సుభాష్‌తో పాటు తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో గాయపడినవారిని, ఆయన అనుయాయుడైన హబీబ్ ఉర్ రెహ్మాన్‌ను, బోస్‌కు చికిత్స చేసిన తైపేలోని ఆసుపత్రి సిబ్బందిని విచారించి, బోసు అగ్ని ప్రమాదానికి గురై చనిపోయారని నిర్ధారించింది. అయితే, తన సోదరుడు బతికే ఉన్నారని గాఢంగా నమ్మిన సురేష్ బోస్ తుది నివేదికపై సంతకం చేయలేదు. 1970లో ఇందిరా గాంధీ ప్రభుత్వం నియమించిన జీడీ ఖోస్లా కమిటీ కూడా సుభాస్ మరణాన్ని ధృవీకరించింది. ప్రజాసోషలిస్టు ఎంపీగా రెండుసార్లు గెలిచిన ఒకనాటి బోసు అనుంగు శిష్యుడు సమర్ గుహ, తన నాయకుడు బతికే ఉన్నారని రకరకాల కథనాలతో సంచలనం సృష్టించేవారు. గుమ్నామీ బాబాగా ఉత్తర బెంగాల్‌లో ఉన్నారని, చైనాలో రెడ్ ఆర్మీకి సలహాదారుగా ఉన్నారని, కాదు సోవియెట్ రష్యాలో కులాసాగా జీవిస్తున్నారని, లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ పర్యటనలో ఆయనను కలిశారని, నెహ్రు, ఇందిర ఒత్తిడిమేరకు రష్యా ఆయనను బందీగా ఉంచిందని – ఇలా పలు వాదనలతో బోసు అభిమానులు, నెహ్రు వ్యతిరేకులు ప్రజలను దశాబ్దాల పాటు తికమకపెట్టారు. ఆ మహా నాయకుడు కనుక జీవించివుంటే మాతృభూమిపై అడుగుపెట్టకుండా కట్టడి చేయగల శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. దేశవిముక్తికై భూగోళాన్ని అలవోకగా చుట్టిన ఆ విప్లవకారుడు ఎక్కడెక్కడో తలదాచుకున్నాడని నమ్మడం అవివేకమే. జపాన్ ప్రభుత్వం 1956లోనే ఆయన దుర్మరణాన్ని ధ్రువీకరించింది. జపాన్‌లోని రెంకోజీ ప్రార్ధనా మందిరంలో భద్రంగా ఉన్న బోసు చితాభస్మానికి డీఎన్ఏ పరీక్షలు జరిపితే గాని నేతాజీ ఆ ప్రమాదంలోనే చనిపోయారా లేదా అన్నది స్పష్టమవదు.

మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ పోలీసులు హతమార్చలేదని, ఆయన అనుచరుడైన ఉప్పరపల్లి వీరవెంకటచారిని కాల్చిచంపి రామరాజును మట్టుపెట్టామని బ్రిటిష్ పోలీసులు భ్రమపడ్డారన్న కథనం ప్రచారంలో ఉంది. రామరాజు అన్నవరం సమీపంలో బెండపూడి గ్రామంలో శ్రీ పరమహంస చిద్వెంకట రామబ్రహ్మానంద మహర్షిగా మనుగడ సాగించి 1968లో కాలం చేశారని చాలామంది విశ్వసిస్తారు. అది నిజమే అయితే స్వాతంత్ర్యానంతరం కూడా రామరాజులాంటి ఓ పోరాటయోధుడు అజ్ఞాతంగా ఎందుకు బతుకు వెళ్లదీస్తాడన్న ప్రశ్న రాకమానదు. నేటికీ ఎల్విస్ ప్రెస్లీ, బ్రూస్‌లీ, మార్లిన్ మన్రో లాంటి లబ్ధప్రతిష్టులు మరణించలేదనే వారి ఆరాధకులు విశ్వసిస్తారు. తమ పక్షాన పోరాడిన యోధుల విషయంలో ఆదివాసీ సమాజాల్లోనూ, స్థానిక సమాజాల్లోనూ ఇటువంటి ఆలోచనా ధోరణులు అనేకం కనిపిస్తాయి.

కొట్టు శేఖర్

Updated Date - 2023-03-26T00:25:08+05:30 IST