ఉక్రోషవీరులతో ఉపద్రవం

ABN , First Publish Date - 2023-01-13T00:43:24+05:30 IST

కొంతమంది నాయకులు గెలిస్తే అహంకారం, ఓడిపోతే ఉక్రోషం ప్రదర్శిస్తారు. ఓడిపోయినప్పుడు తమలో తాము ఉడుక్కుంటే ఎవరికీ నష్టం లేదు...

ఉక్రోషవీరులతో ఉపద్రవం

కొంతమంది నాయకులు గెలిస్తే అహంకారం, ఓడిపోతే ఉక్రోషం ప్రదర్శిస్తారు. ఓడిపోయినప్పుడు తమలో తాము ఉడుక్కుంటే ఎవరికీ నష్టం లేదు. అలా కాకుండా గుండెలు బాదుకుంటూ వీలైనంత నష్టాన్ని అందరికీ కలిగించాలనుకుంటేనే ప్రమాదం. అలాంటి ధోరణిని తప్పుపట్టాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యానికి, ప్రజాభిప్రాయానికి విలువనివ్వని ధోరణి సమాజానికి చేటు. బ్రెజిల్‌లో నిన్నటిదాకా అధ్యక్ష పీఠంపై ఉన్న మితవాది బొల్సనారో అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాడు. కొత్త అధ్యక్షుడిగా లులాకి ప్రజలు పట్టం కట్టారు. ఓటమి రూఢి అయిన వెంటనే బొల్సనారో ఎన్నికల ప్రక్రియనే తప్పుపట్టాడు. అందరూ కలిసి కుట్ర చేసి తప్పుడు ఫలితాల్ని వెల్లడించారంటూ ప్రచారం చేశాడు. తన మద్దతుదారుల్ని రెచ్చగొట్టి తాను మాత్రం అమెరికా యాత్ర చేపట్టాడు. ఆ మహానుభావుడి అనుచరగణం అక్కడి పార్లమెంట్‌ని, సుప్రీంకోర్టుని చుట్టుముట్టి విధ్వంసం సృష్టించింది. అయినా వారిని వారించిన పాపాన పోలేదు. పైగా మిలటరీ కల్పించుకొని ఆయనకు మద్దతు ఇవ్వాలట. అమెరికాలో ట్రంప్ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన అనుచరులు కాపిటల్ హిల్ చేరుకొని ఇలానే రభస చేశారు. ఈ కోవకు చెందిన నేతలకు ప్రజాభిప్రాయం పట్ల గౌరవం ఉండదు. గెలిస్తే తమ గొప్ప, ఓడితే ఎదుటివారి కుట్ర. అంతే. తమ వాదనకు అనుగుణంగా అనుచరుల్ని సమాయత్తం చేస్తారు. ప్రత్యర్థుల్ని ప్రతినాయకులుగా భావించే విద్వేషపు విషాన్ని నింపుతారు. ప్రజాస్వామిక స్ఫూర్తి పాలనలోనూ కనబడదు, ఓటమిలోనూ కనబడదు. నాగరిక సమాజ స్థాపన పట్ల ఆశలున్న ఎవ్వరూ ఈ దుడుకు వైఖరిని సమర్ధించలేరు. అక్కడి లులా ప్రభుత్వం ప్రజల్లో అవగాహన పెంచుతూ బొల్సనారో చర్యల్ని ఎండగట్టి, నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఓటమి చెందిన నేత అనుచరగణం సాగించిన విధ్వంసాన్ని భారతదేశం ఖండించింది. ఎందుకంటే ఈ పెడధోరణి ప్రజాస్వామ్య విధానానికి పెను సవాల్ కాబట్టి.

డా. డి.వి.జి. శంకరరావు

మాజీ ఎంపీ, పార్వతీపురం

Updated Date - 2023-01-13T00:43:26+05:30 IST