గురజాడ బతికేడు మూడు యాభైలు!

ABN , First Publish Date - 2023-09-21T01:44:17+05:30 IST

‘...రెయిలు పడీవరకు ఎప్పుడు పడునని ఆసక్తితో యెదురు చూచు చుంటిమి. గాని రెయిలు పడ్డ తర్వాత కూడా గొణుగుడునకు కావలసినన్ని అవకాశములు రెయిల్వేవారు కల్పించినారు...

గురజాడ బతికేడు మూడు యాభైలు!

‘...రెయిలు పడీవరకు ఎప్పుడు పడునని ఆసక్తితో యెదురు చూచు చుంటిమి. గాని రెయిలు పడ్డ తర్వాత కూడా గొణుగుడునకు కావలసినన్ని అవకాశములు రెయిల్వేవారు కల్పించినారు. ఊళ్ల దగ్గర స్టేషనులుంటే ఉపద్రవము వస్తుందని కాబోలు యోచించి కాళ్లకు కసరత్తు కలిగి పురజనులు దృఢముగా వుండగలుగుటకు ఊళ్లకు కడుదూరముగా స్టేషనులు వుంచినారు. కొన్ని చోట్ల తుని తగవులు కూడా చేయుచు వచ్చిరి. అలమండ స్టేషను ఊరికి రమారమీ రెండు మైళ్ల దూరము, సింహాచల స్టేషను వూరికి మూడుమైళ్లు, వాల్తేరు స్టేషను త్రిశంకు స్వర్గమువలె వాల్తేరుకు విశాఖపట్నముకు అంటివుండక రెంటికీ యెడమగా వున్నది. విజయనగరం నుంచి అనకాపల్లి వెళ్లగోరువారు అసావాదిత్యో బ్రహ్మా అని అనకాపల్లి త్రోవ వదిలి వాల్తేరు స్టేషను యాత్ర చేసి వొకగంట ఆ స్థలమును సేవించి, తిరిగి వదలిపెట్టి అనకాపల్లి త్రోవవరకు వెనుకకు త్రొక్కి అక్కడనుండి అనకాపల్లి వెళ్లేసరికి మధ్యాహ్నముకాగా ఆ యెండలో వూరికి అద్దెబళ్లకుగాను బండివారలతో అద్దెనుగురించి పోరాడి, వూరుచేరి మూడుఝాములలోగా యిన్ని మెతుకులు కడుపులో వేసుకొన్న యెడల కృతార్ధులని యోచించతగును...’ గురజాడ అప్పారావుగారు 1893 డిసెంబరు 10వ తేదీన విజయనగరంలో రెయిలు ప్రయాణం చేసిన సందర్భంగా రాసుకున్న డైరీలో వాక్యాలు!

మద్రాసు నుంచి విశాఖపట్నం వరకూ రైల్వే లైను 1893లో ఆరంభమయ్యింది. 1910 నాటికి అది కలకత్తా వరకూ పొడిగించారు (అప్పటికి కలకత్తా మన దేశ రాజధాని). 1892 ఆగస్టులో ‘కన్యాశుల్కం’ మొదటి ప్రదర్శన జరిగింది. (ఈనాడు మనకు పరిచయమయిన రెండోకూర్పు 1909లో ప్రచురణయ్యింది. 1910లో తొలి ఆధునిక కథ ‘దిద్దుబాటు’ను గురజాడ రాసేరు. ఆధునికతకు రైల్వేలూ, బస్సులూ, యితర యంత్ర ప్రయాణసాధనాలూ ఉపకరిస్తాయని చెపుతారు. ఇది ఒక రకంగా నిజమేకావచ్చుగానీ, ఆ సాధనాల నిర్వాహకులూ, లేదా యజమానులూ, లేదా పాలకులూ సమాజాన్ని ఆధునికతవైపు నడిపించాలనే లక్ష్యంతో వీట్ని ప్రవేశపెట్టడంగానీ, నిర్వహించడంగానీ చేయరు! వారి నిర్వాకం ఎలా వుంటుందో రైలు వొచ్చిన తొలినాళ్లలోనే, యెక్కిన తొలి ప్రయాణంలోనే, భవిష్యత్‌ని దర్శించేడు గురజాడ. నూట ఇరవయ్యేళ్ల తర్వాత గూడా రైళ్లు, స్టేషనులు పురజనుల కాళ్లకు కసరత్తులూ, దృఢత్వమూ యిచ్చేందుకే ప్రయత్నలోపం లేకుండా కృషి చేస్తున్నాయి. నిజానికి డైరీలోని ఆ వాక్యాలు ప్రజల జీవనావసరాలపట్ల రాజ్యపు నిరాసక్తధోరణిని నిర్మొహమాటంగా, వ్యంగ్యంగా యెత్తిచూపించేవి!

ఆధునిక రెయిలు ప్రయాణసాధనం వచ్చిన రోజుల్లోనే కళింగ ప్రాంతంలోని కన్యాశుల్క దురాచారమ్మీద శాసనసభల్లోనా, యితరేతర వేదికల్లోనా చర్చజరుగుతోంది. కానీ చర్చల సారాంశాలు సాధారణ ప్రజానీకాన్ని చేరడం లేదు. విజయనగరం మహారాజాగారి కోరిక మేరకు ప్రజలకు చేరేవిధంగా కన్యాశుల్కం దురాచారాన్ని దుయ్యబడుతూ నాటకం రాయదలచి, గురజాడ రాసేరు. ఆ నాటకాన్ని మొదటి రెయిలు కంటే ముందే 1892లో జగన్నాధ విలాసినీసభ వారు ప్రదర్శించేరు. రెయిలు మన కళింగం దాటి కలకత్తాకు పొడిగించిన యేడాది 1910లో గురజాడ ‘దిద్దుబాటు’కథ రాసేరు. ఈ రెండు తేదీలూ, గురజాడ రచనలూ కలిపి యెందుకు రాస్తున్నానంటే – ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన ఆధునిక ఉత్పత్తి సాధనాలూ, ఉత్పత్తి విధానాలూ, మార్కెట్టూ, వాటి ప్రభావమూ, అప్పటికి మన ప్రాంత స్థితిగతులను గుర్తు చేసుకుంటూ, ఆ వెలుగులో గురజాడ రచనలను పరిశీలించి, ఆయనను ఎలా అర్థం చేసుకోవాలో, ఆయన నుంచి యేమి స్వీకరించాలో బోధపరచుకోడానికి ఉపకరిస్తుందని!

తాను ఎక్కిన రైలు తీరుతెన్నుల్ని విమర్శించిన గురజాడ– బహుశా రచయితకు సమాజాన్ని దిద్దుబాటు చేసే లక్ష్యం వుండి తీరాలనుకున్నాడేమో, అందుకే తన రచనలన్నీ సామాజిక స్థితిగతులమీదా, సమాజంలో జరుగుతోన్న అక్రమాలమీద, అమానుషాలమీదా విమర్శా, విసుర్లూ, వ్యంగ్యాస్త్రాలుగా ప్రయోగిస్తూ, కొన్నిచోట్ల మన కంటికి ఆననంత సుదూర మానవ సుందర స్వప్నాన్ని మన కళ్లకు చూపిస్తూ, మనం నిర్మించుకోగలిగే స్వర్గాన్ని గొప్ప విశ్వాసంతో బోధిస్తాడు! అది ‘కన్యాశుల్కం’ నాటకం కావచ్చు, ‘దిద్దుబాటు’ కథ కావచ్చు, ‘సంస్కర్తహృదయం’ కథ కావచ్చు, ‘దేశభక్తి’ గీతం కావచ్చు, ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ కావచ్చు, కొసకి ‘కొండుభట్టీయం’ కావచ్చు... గురజాడ లక్ష్యం మనుషుల్ని మంచివైపు నడిపించడం. అందరూ మంచిగా వుంటే అందరికీ మంచి జరుగుతుందన్న శుద్ధ ఆదర్శవాదం కావచ్చేగానీ, గురజాడ ఆకాంక్ష అది!


స్త్రీ పురుషులు సమానమనీ, యిద్దరూ ఒక స్వర్గాన్ని నిర్మించుకోవాలనీ తొలిసారి ప్రేమ అనే భావనను సాహిత్యంలోకి తీసుకువచ్చేడు. మగడు వేల్పను పాత మాట... అన్నాడు. ఈ భావనతో కవితలే గాక ‘దిద్దుబాటు’, ‘మెటిల్డా’ కథలు రాసేడు. ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చునన్నాడు. అలాగే అప్పటికే చరిత్రలో జరిగిన మత కల్లోలాలల్లో జరిగిన హింసను చూసి, మతాన్ని ఈసడించేడు. మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగునన్నాడు. ‘పెద్దమసీదు’, ‘దేవుళ్లారా మీ పేరేమిటి’ అన్న కథలు రాసేడు. అప్పటి సంస్కర్తల బోలుతనాన్ని ఎండగట్టే ‘సంస్కర్తహృదయం’ కథ ఇంగ్లీషులో రాసేడు (అవసరాల సూర్యారావు తెలుగులో అనువదించేరు). ఇలా కథ, కవిత, నాటకం, వ్యాసం యేది రాసినా సమాజాన్ని దిద్దుబాటు చేసే కర్తవ్యనిర్వహణగా గురజాడ రాసేరు. వారి రచనలెంత గొప్పవో, యిప్పటికీ వాటి రెలవెన్సు కోల్పోకపోవడమే ఉదాహరణ! దేశభక్తి గీతం నిజానికి యీ భూమ్మీది యే దేశానికయినా ఒప్పే జాతీయ గీతం! అది 1910లో రాసేరు. అప్పటికి మన దేశం యింకా ఒక దేశంగా, యిప్పుడున్న భౌగోళిక రూపంలో లేదు. రాజులూ, నవాబులూ, ఆంగ్లేయులూ పాలిస్తున్నారు. ఇంకోవేపు ఆంగ్లపాలన తొలగాలన్న ఆందోళనలు నడుస్తున్నవి. స్వాతంత్ర్యం సిద్ధిస్తే, ఒక దేశంగా మన దేశం రూపొందితే యెలా వుండాలి, ప్రజలెలా వుండాలి, పాలకులెలా వుండాలి, దేశమేరీతి ముందుకుపోవాలి అన్న ప్రణాళికను ఆ గీత రూపంలో అందించేరు. కనుకనే వందేళ్లకు ఒక టాగూరు జన్మిస్తారేమోగానీ, వెయ్యేళ్లకు ఒక గురజాడ జన్మించడం కష్టమన్నారు విమర్శకులు! దురదృష్టవశాత్తూ అధినాయకులను భాగ్యవిధాతలుగా కొలిచే గీతం మన జాతీయగీతమయ్యింది (రాసిన రచయితే ఆ గీతం పట్ల అసంతృప్తిని వెళ్లగక్కినా). గురజాడ తెలుగులో రాయడం ఆయన దురదృష్టం, తెలుగువారి అదృష్టం! అసలు రచన ఆరంభం ఇంగ్లీషులోనే చేసేరు, సారంగధరను ఇంగ్లీషులో రాసేరు!

కథ, కవిత, గీతాలేగాక గురజాడ రాసిన వ్యాసాలు ఎన్నో ఉన్నాయి. మాటామంతీ శీర్షికన, గ్రామ్యశబ్ధ విచారణము గురించి నాలుగూ వ్యాసాలు, ఆంధ్రకవితాపిత శీర్షికన నాలుగు వ్యాసాలు, బంకించంద్రుని నవల మీద సమీక్ష, ఇద్దరు రాజులు శీర్షికన రవీంద్రనాధ్‌ టాగూర్‌ గురించీ వ్యాసం, ఇంకా వంగీయసాహిత్య పరిషత్తు గురించీ, కన్నడ వ్యాకరణము గురించీ వ్యాసాలు రాసేరు. ఆంగ్లేయుల సాహిత్యం గురించీ, అక్కడి విమర్శనా రంగపు వైభవం గురించీ రాసేరు. ఈ రచనల కారణంగా అప్పటి పండితులు, గ్రాంథిక భాషావాదులు గురజాడను అనేక రకాలుగా విమర్శచేసేవారు. గురజాడ వాటన్నిటినీ సవివరంగా ప్రతిస్పందించి పూర్వపక్షం చేసేరు. ఒకాయనయితే ఆకాశరామన్నగా అవతరించి గురజాడను– ‘ఇకమీదట యిటువంటి రాతలు రాయనని, బుద్ధి వచ్చినటుల పత్రికా ముఖముగా ప్రచురించండి. నేనెవరినో మీరెరుగుదురా?’ అని హెచ్చరించేరు. దానికి గురజాడ జవాబు చదివితే గురజాడ వ్యంగ్యబాణం యెంతటి వాడియయినదో తెలుస్తుంది. ‘ఆకాశరామన్న బహు దొడ్డ మనిషి. బహు ప్రాచీనుడు. రాతలు లేని కాలంలో ఆతని ఆఫీసు అమలు యెలా జరిగెనో నిశ్చయించలేము. చెట్టు చాటునుంచీ, పుట్ట చాటు నుంచీ ముఖం పెట్టి యెదట చెప్పరాని వార్త కేకవేసి వెళ్లేవారు కాబోలు...’ యిలా ఆరంభించి, ఆకాశరామన్న భావాలనూ, అతని రాతలనూ జలకడిగీసేడు గురజాడ! బంకించంద్రుని నవలను యెలా అర్థం చేసుకోవాలో, దాని పరిమితులేమిటో చెబుతూ, ‘లోకోత్తర కల్పనలుండక, లోకత్తరమయిన రచన వుండదు. గానీ మనుష్యజాతము యొక్క మనోధర్మములను, వస్తుతత్వము ననుసరించి కధ నడువవలే’ అంటాడు గురజాడ! ‘ఇద్దరురాజుల’ శీర్షికలో రవీంద్రుని ఇల్లూ, అక్కడి సాహిత్య, సంగీత గోష్టులూ, రవీంద్రుని ఆకర్షణీయ రూపమూ వర్ణిస్తూ– ఆఖరువాక్యంగా, ‘కలకత్తా పట్టణంలో చిట్టచివరికి దోమలు సైతం పొలిటీషియన్సే’ అనంటాడు. అంత సూక్ష్మపరిశీలకుడు గురజాడ!

గురజాడ సృజనాత్మక రచనలేగాక, అతని డైరీ, వ్యక్తుల రూపురేఖలూ, వారి వ్యక్తిత్వాల గురించి ఆయన రాసుకున్న నోట్సు, విజయనగరం మహారాజా గురించి రాసుకున్న జ్ఞాపకాలూ, కొన్ని పదజాలాలూ, ప్రాంతాలూ, ముఖ్యంగా ఆయన చదువుకున్న ప్రాచీన, ఆధునిక గ్రంథాల వివరాలూ, ఆంగ్లభాషలోని గ్రంథాలూ... వీటన్నిటీ పరిశీలిస్తే బతికిన ఏభయ్యేళ్లలోనే మహానుభావుడివన్నీ యెలా చేసేడనిపిస్తుంది, ఒక పక్క రాజాస్థానపు బరువు బాధ్యతలు చూస్తూ, అర్భకపు శరీరంతో, అదీ ఉబ్బసవ్యాధితో! ‘ఎవడు బతికేడు మూడు యాభైలు’ అంటారుగానీ, గురజాడ బతికేడు మూడు యాభైలు, బతుకుతాడింకెన్నో మూడు యాభైలు!

అట్టాడ అప్పల్నాయుడు

(నేడు గురజాడ జయంతి)

Updated Date - 2023-09-21T01:44:17+05:30 IST