చెట్లు కూలుతున్న ఆ దృశ్యం చెబుతున్నదేమిటి?

ABN , First Publish Date - 2023-03-25T00:44:20+05:30 IST

అలకనంద లోయ ఎగువ ప్రాంతంలోని మన్దాల్ గ్రామంలో చిప్కో కథ ప్రారంభమయింది. 1973 మార్చి 27న కలప వ్యాపారులు ఆ అటవీ గ్రామపరిసరాలలోని చెట్లను నరికివేయడానికి వచ్చారు...

చెట్లు కూలుతున్న ఆ దృశ్యం చెబుతున్నదేమిటి?

అలకనంద లోయ ఎగువ ప్రాంతంలోని మన్దాల్ గ్రామంలో చిప్కో కథ ప్రారంభమయింది. 1973 మార్చి 27న కలప వ్యాపారులు ఆ అటవీ గ్రామపరిసరాలలోని చెట్లను నరికివేయడానికి వచ్చారు. మన్దాల్ గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు ఆ చెట్లను హత్తుకుని నిలబడి, వాటిపై గొడ్డలి వేటుపడకుండా నిరోధించారు. ఇదొక వినూత్న అహింసాత్మక పోరాటం. మన్దాల్ గ్రామస్తులను అనుసరించి ఉత్తరాఖండ్ హిమాలయ ప్రాంతాల ప్రజలు అందరూ తమ అడవులను కాపాడుకున్నారు. చిప్కో ఆందోళన ప్రజ్వరిల్లి యాభై సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ ఉద్యమ స్ఫూర్తితో అడవులు, పచ్చిక మైదానాలు, జల వనరులు పూర్తిగా సమాజ సమష్టి నియంత్రణలో ఉండాలనే లక్ష్యంతో అట్టడుగువర్గాల వారి స్థాయిలో పలు పోరాటాలు జరిగాయి. భారతదేశ అభివృద్ధికి అవి ఒక కొత్త సమగ్ర మార్గాన్ని సూచిస్తున్నాయని ఆ నిర్మాణాత్మక పోరాటాలను అధ్యయనం చేసిన మేధావులు వాదించారు. పాశ్చాత్య దేశాల ఆర్థికాభివృద్ధి నమూనాను అనుసరించి స్వతంత్ర భారతదేశం పెద్ద పొరపాటు చేసిందని కూడా అభిప్రాయపడ్డారు. అట్టడుగువర్గాల వారి సంక్షేమానికి, పర్యావరణ భద్రతకు పూచీపడే అభివృద్ధి నమూనాను దేశం అమలుపరచివుండవల్సిందని స్పష్టం చేశారు. ఇప్పటికీ మించిపోయిందీ ఏమీ లేదని, ప్రస్తుతం అనుసరిస్తున్న అభివృద్థి నమూనాలో మౌలిక మార్పులు చేయడం ద్వారా ప్రజా, పర్యావరణ హితమైన పురోగతిని సాధించవచ్చని వారి నమ్మకం. భారత్‌కు ఇప్పుడు ఒక కొత్త ఆర్థికాభివృద్ధి నమూనా అవసరం ఉంది. భావి తరాల ప్రయోజనాలు, అవసరాలకు నష్టం వాటిల్లకుండా, నిర్భాగ్య ప్రజలను అమానుష పేదరికం నుంచి బయటపడవేసే మార్గంగా ఆ నమూనా ఉండి తీరాలి.

మన దేశంలో పర్యావరణ సంబంధిత అంశాలపై బహిరంగ చర్చ 1980వ దశకంలో చాలా విస్తృతంగా, ప్రభావవంతంగా అనేక స్థాయిలలో జరిగింది. పర్యావరణ సంక్షోభం లేవనెత్తిన నైతిక ప్రశ్నలను లోతుగా తరచి చూసింది; పర్యావరణ సుస్థిరతను పెంపొందించడానికి రాజకీయ అధికార పంపిణీలో అవసరమైన మార్పులను సూచించింది; ఆర్థికాభివృద్ధి, పర్యావరణ భద్రత లక్ష్యాలను ఏక కాలంలో సాధించగల కార్మిక ప్రాధాన్య ఉత్పత్తి విధానాల రూపకల్పనపై స్ఫూర్తిదాయక వాదోపవాదాలు జరిగాయి. అడవులు, నీరు, రవాణా, ఇంధన వనరులు, భూములు, జీవ వైవిధ్యం మొదలైన వాటినన్నిటినీ ఆ ప్రజా చర్చ పరిగణనలోకి తీసుకున్నది. ప్రభుత్వం ప్రతిస్పందించింది. ప్రప్రథమంగా కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ పర్యావరణ మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేశారు. కొత్త చట్టాలను తీసుకువచ్చారు. నూతన రెగ్యులేటరీ వ్యవస్థలనేర్పాటు చేశారు. ఉన్నత విద్యా సంస్థలలో పర్యావరణ సంబంధిత అంశాలపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి.

కాలం కఠినమైనది. 1980ల్లో పర్యావరణ చైతన్యం సాధించిన ప్రయోజనాలు ఆ తరువాయి దశాబ్దాలలో నిరర్థకమైపోయాయి. 1991లో ఆరంభమైన ఆర్థిక సంస్కరణలు ఈ భ్రష్టత్వానికి కారణమయ్యాయి. నూతన ఆర్థిక విధానాలు ఉత్పాదక సామర్థ్యాన్ని, ఆదాయాలను పెంపొందించాయి. కానీ, పర్యావరణ ఆరోగ్యం, భద్రత విషయంలో మరెన్నో క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టవలసిన కర్తవ్యం మిగిలేవుంది. ముఖ్యంగా రసాయన, మైనింగ్ రంగాలలో కచ్చితమైన నియంత్రణ చర్యలు చేపట్టని పక్షంలో సమస్త భౌతిక వనరులూ మరింతగా కాలుష్య కోరల్లో చిక్కుకుంటాయి.

1990 దశకంలోనూ, ఆ తరువాత పర్యావరణ క్షీణత వేగవంతమయింది. పర్యావరణవేత్తలపై దాడులూ ముమ్మరమయ్యాయి. మైనింగ్ కంపెనీలు అడవులను ధ్వంసం చేశాయి. మధ్య భారతంలో గిరిజనులను పెద్ద సంఖ్యలో నిర్వాసితులను చేశాయి. ఈ రాజ్యాంగ విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా పోరాడిన వారిని నక్సలైట్లుగా, వారి పక్షాన నిలబడిన వారిని అర్బన్ నక్సల్స్‌గా పాలకులు ముద్రవేశారు. అనేక మందిని జైళ్లలో బంధించడం జరుగుతోంది. కొంతమంది ఆ నిర్బంధంలోనే మరణించారు. స్టాన్‌స్వామి ఇందుకొక ఉదాహరణ. మైనింగ్ కంపెనీల యాజమాన్యాలు రాజకీయవేత్తలతో కుమ్మక్కై జాతి సంపదను కొల్లగొడుతున్నాయి. రాజకీయ నేతలకు, ప్రభుత్వాధికారులకు కోట్ల నజరానాలు ఇస్తున్నాయి.

మానవ కార్యకలాపాల మూలంగా కాలుష్య కారక వాయువులు వాతావరణంలో భారీ పరిమాణంలో సంచితమవడం నేడు మానవాళి మనుగడకు ఎదురవుతున్న సవాళ్లలో ప్రధాన మైనది. ప్రపంచంలో వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్నది ఉత్తర భారతావని నగరాలలోనే. జల కాలుష్యం కూడా అంతే తీవ్రమైనది. చారిత్రక ప్రశస్తి గల పలు జీవనదులు జీవ జాల పరంగా మృత వాహినులై పోవడం ఎంత విషాదం! భూగర్భ జలస్తరాలు అంతరించిపోతున్నాయి. రసాయన ఎరువులతో నేలలు కలుషితమైపోతున్నాయి. అనాలోచిత, అనియంత్రిత భవన నిర్మాణ కార్యకలాపాలతో తీర ప్రాంతాల పర్యావరణ వ్యవస్థలు ధ్వంసమైపోతున్నాయి.

పర్యావరణ ఆరోగ్య క్షీణత మూలంగా మనం భారీ ఆర్థిక మూల్యం చెల్లిస్తున్నాం. వాయు, జల కాలుష్యాలు ప్రజలను అనారోగ్యాలకు గురి చేసి, ఉద్యోగ విధులు నిర్వర్తించలేని విధంగా శక్తిహీనులను చేస్తున్నాయి. నేలలు విషపూరితమై పంటల సాగుకు పనికి రాకుండా పోతున్నాయి. అడవులు, పచ్చిక భూములు అంతరిస్తుండడంతో గ్రామీణ జీవనాధారాలు తీవ్రంగా దెబ్బ తింటున్నాయి. పర్యావరణ వ్యవస్థల పతనం కారణంగా భారత్ ఏటా రూ. 3.75 ట్రిలియన్ (మన జీడీపీలో 5.7 శాతానికి సమానం) నష్టపోతున్నదని దశాబ్దం క్రితమే ఆర్థికవేత్తలు అంచనా వేశారు. మన దేశంలో పర్యావరణ నష్టాల భారాన్ని ప్రధానంగా మోస్తున్నది పేద ప్రజలే.

ప్రకృతిని గౌరవించి, ప్రాకృతిక పరిమితులకు అనుగుణంగా జీవించడాన్ని మానవులు నేర్చుకోవాలి. మనుగడకు, జీవితాభ్యుదయానికి ఇది చాలా ముఖ్యం-. చిప్కో ఉద్యమం ఎలుగెత్తిన సత్యమిది. అయితే వర్తమాన భారతదేశంలో ఈ పాఠం ఉల్లంఘనకు గురవుతోంది. చిప్కో ఉద్యమ జన్మభూమి అయిన హిమాలయ ప్రాంతాలలోనే మరింత పాశవికంగా ఆ సత్యాన్ని కాలరాచి వేస్తున్నారు. ఇటీవలి జోషి మఠ్ విషాదమే ఇందుకొక నిదర్శనం. చిప్కో ఉద్యమ నేత చండీ ప్రసాద్ భట్ సహా ఎంతో మంది శాస్త్రవేత్తలు 1970ల నాటినుంచీ హిమాలయ ప్రాంతాలలో ముమ్మరంగా సాగుతున్న రోడ్ల విస్తరణ, జల విద్యుదుత్పత్తి ప్రాజెక్జ్‌ల నిర్మాణం, భవన నిర్మాణ కార్యకలాపాలతో ముంచుకొచ్చే ప్రమాదాల గురించి ప్రభుత్వాలను హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఖాతరు చేయలేదు. చివరకు సుప్రీంకోర్టు సైతం తానే నియమించిన ఒక కమిటీ నివేదికను తిరస్కరించి, చార్‌ధామ్ హైవే ప్రాజెక్ట్‌కు అనుమతినిచ్చింది. జోషి మఠ్ లాంటి విషాద ఘటనలు సమీప భవిష్యత్‌లోనే మరిన్ని సంభవించేందుకు ఆస్కారమున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు విధ్వంసకర అభివృద్ధికే ప్రాధాన్యమిస్తున్నాయి!

పర్యావరణ హితకరమైన సుస్థిర అభివృద్ధిని సాధించేందుకు అవసరమైన మేధో సంపత్తి మనకు సమృద్ధిగా ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవీ దానిని ఉపయోగించుకునేందుకు శ్రద్ధ చూపడం లేదు. పర్యావరణానికి నష్టం కలిగించని రవాణా, ఇంధన విధానాలను రూపొందించి అమలుపరచగల అనుభవజ్ఞులైన నిపుణులు మన ఐఐటీలు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మొదలైన ఉన్నత విద్యాసంస్థలలో చాలామంది ఉన్నారు. అయితే వారి సేవలను ఉపయోగించుకునేందుకు పాలకులు సిద్ధంగా లేరు. ఎందుకని? తమ స్వార్థ ప్రయోజనాలకు పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కవడం వల్లే కాదూ?

గురుదేవ్ రవీంద్రుడు 1922లో ఒక ఉపన్యాసంలో ఇలా వ్యాఖ్యానించారు: ‘ప్రాకృతిక సంపదలను విచక్షణారహితంగా కొల్లగొట్టేందుకు మానవులను ఆధునిక యంత్రాలు ప్రేరేపిస్తున్నాయి. ప్రకృతి కోలుకోలేని విధంగా నష్టపోతోంది. భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న సంపదలను తవ్వితీస్తున్నారు. ఇది ధరిత్రికి గర్భశోకాన్ని మిగులుస్తుందనడంలో సందేహం లేదు. మానవునిలో సంపదల పట్ల విపరీతమైన లాలసను పెంచుతున్నారు. వారిలో కృత్రిమ కాంక్షలను సృష్టిస్తున్నారు. వాటిని తీర్చేందుకు ప్రకృతిని గరిష్ఠంగా దోపిడీ చేయడం మినహా మరో మార్గం లేదు’. ఈ ధోరణులు అడ్డూ అదుపు లేకుండా కొనసాగిన పక్షంలో మానవునికి మిగిలే భవిష్యత్తేమిటి అని రవీంద్రుడు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ఆయనే ఇలా సమాధానమిచ్చారు: ‘జల వనరులు శాశ్వతంగా ఎండిపోతాయి. చెట్టు చేమలు, గొడ్డు గోదా కనిపించకుండా పోతాయి. ధరిత్రి ఉపరితలమంతా ఒక ఎడారి అయిపోతుంది. భూమి అంతర్భాగంలో ఏమీ మిగలవు’. ఆ ఋషితుల్యుడి జాగృత వాణిని ఇప్పటికైనా లక్ష్యపెడితే, బహుశా అది మరీ ఆలస్యం చేసినట్టు కాదేమో?!

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2023-03-25T11:14:00+05:30 IST