ప్రతి అడుగూ ప్రజాక్షేమానికే...

ABN , First Publish Date - 2023-02-02T00:40:32+05:30 IST

నాలుగు పదుల వయసు పుట్టినరోజు జరుపుకొన్న మరుసటి రోజే నాలుగువేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టాడు అతను...

ప్రతి అడుగూ ప్రజాక్షేమానికే...

నాలుగు పదుల వయసు పుట్టినరోజు జరుపుకొన్న మరుసటి రోజే నాలుగువేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టాడు అతను. ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేసిన, చేస్తున్న వారిలో వర్తమాన భారతదేశంలోనే అత్యంత పిన్న వయస్కుడు అతడేనేమో. నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రతిపక్షం అతన్ని అనుభవరాహిత్యుడని, అసమర్థుడని ఎగతాళి చేసింది. ఆ మాటలకు వెరవక తాను నిర్వర్తించే గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల ద్వారా ఐటీ సంస్థలను రాష్ట్రానికి తెచ్చాడు. గ్రామీణ ఆంధ్రలో మౌలిక సౌకర్యాలలో పెనుమార్పులు తెచ్చాడు. నాలుగేళ్ళలో రాష్ట్రానికి వందలాది జాతీయ అవార్డులు వచ్చాయి. విమర్శలకు తన చేతలతో, రాష్ట్ర అభివృద్ధితో జవాబు చెప్పాలి అనుకొన్నాడు. బహుశా అదే అతను చేసిన తప్పేమో. మారిన నేటి రాజకీయాల్లో ప్రత్యర్ధి అసభ్య విమర్శలకి అంతే పరుషంగా జవాబిచ్చే సంస్కృతికి మారటానికి అతని పెంపకం అడ్డొచ్చింది. కువిమర్శలకి అభివృద్ధే సమాధానమనే అతని సూత్రం, దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో పనిచేయలేదు. సోషల్ మీడియా మొదలుకొని, ప్రతిపక్షం తన ఆధ్వర్యంలోని మీడియా, టీవీలను వాడుకొని పదేపదే అబద్ధాన్ని ప్రచారం చేసి అతని వ్యక్తిత్వాన్ని దొంగదెబ్బ కొట్టింది. ఫలితంగా పార్టీనే కాదు, ఓట్లు చీలిపోయి స్వల్ప తేడాతో అతనూ ఓడిపోయాడు. పాతాళానికి నెట్టేశాము అని ప్రత్యర్థులు సంతోషపడిపోయారు.

మేలిమి బంగారానికి చెదలు పట్టవన్నట్టు, నాలుగు సంవత్సరాల్లో పడిలేచిన కడలి తరంగంలా ఉవ్వెత్తున రాజకీయాల్లో అత్యంత వేగంగా మళ్ళీ దూసుకొచ్చాడు. ఎంతో పరిణతి చెందిన పార్టీ యంత్రాంగం కూడా అతనికి ఆదరవు అయింది. కట్ చేస్తే, రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు. మాటలలో అసభ్యత లేదు కానీ పదునెక్కాయి. ఉత్తుత్తి హామీలు లేవు కానీ సమస్యల పట్ల అవగాహన చూపిస్తున్నాడు. ప్రజలు మంగళహారతులు ఇస్తున్నారు. అతని రాక కోసం వేచి చూస్తున్నారు. నవ్వుతూ పలకరిస్తున్నారు. ఆదరణతో చూస్తున్నారు. ఒక నియోజకవర్గంలో ఓడిపోయిన వ్యక్తి రాష్ట్రం అంతా తిరుగుతానని సవాలు విసురుతున్నాడు. అతనే, నారా లోకేష్, యువగళం పాదయాత్ర సారథి.

గత మూడున్నర సంవత్సరాల పాలనలో ప్రస్తుత ప్రభుత్వం సుపరిపాలన ఇవ్వటం లేదని; ప్రభుత్వ నిబంధనలు, విధివిధానాలు ప్రజాప్రయోజనాలను ప్రోదిచేసేవిగా లేవని; ప్రజావనరులు సక్రమంగా వినియోగం కావటంలేదని; పౌరసేవల కోసం ప్రభుత్వం దగ్గర తగిన సామర్ధ్యం లేదని; అలవి మాలిన అప్పులు చేస్తూ, దివాళా స్థితికి రాష్ట్రాన్ని తేవటం; చివరికి ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితికి ప్రభుత్వం రావటం; ఇసుక నుండి రోడ్ల దాకా అన్నీ ప్రజలకు దూరం కావటం; నిత్యావసరాల ధరలు ప్రజలకు అందనంత పైకి వెళ్ళటం; ఆదాయమంతా కొంతమంది పెద్దల దగ్గర పోగుపడటం... ఇలా చాంతాడంత కష్టాలను ప్రజలు ఏకరువు పెడుతున్నారు. వీటి సాధన కోసం రోడ్ల మీదకు వస్తున్నారు. ప్రచారసాధనాల ద్వారా తమ కష్టాలను తెలియజేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలకు ముందుగా కావాల్సింది సాంత్వన; తర్వాత ధైర్యం కలగజేయటం; ప్రజల నిస్సహాయతని మాయం చేస్తూ జీవన ప్రయాణంలో తమ భవిష్యత్తు బాగుంటుందనే భరోసా కలిగించటం. ఆ మేరకు గత నాలుగున్నర దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇంకోసారి ఆ బాధ్యతలను భుజానికెత్తుకుంది. తమ పార్టీ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతుందని, భవిష్యత్తు పట్ల మళ్ళీ ఆశలు చిగురింపజేసి, వాటిని తీర్చుకొనే సుపరిపాలన కల్పిస్తుందని హామీ ఇవ్వటమే ఈ పాదయాత్ర లక్ష్యం.

రకరకాల యాత్రా విధానాల పరిశీలన తరువాత ప్రజలను కలుసుకుని వారి బాధలు వినడానికి పాదయాత్ర ఎంపికయింది. మరి పాదయాత్ర ఎవరు చేయాలి అనే ప్రశ్న వచ్చింది. ప్రత్యర్థులచే అకారణ వ్యక్తిత్వ హననానికి గురై, తిరిగి ఆ వ్యక్తిత్వ పునర్నిర్వచనానికి, పార్టీ సారథ్య భాధ్యతలు ప్రధాన కార్యదర్శిగా మోస్తున్న లోకేష్ అత్యంత సహజ ఎంపికే. నాలుగు సంవత్సరాల్లో ఎలా మారిపోయాడు అనే సందేహాలు అవసరం లేదు. ఎందుకంటే, ఇంతకు ముందు అతని గురించి వ్యాప్తి చేసినవన్నీ కేవలం వండి వార్చిన అబద్ధాలు. అసలు వ్యక్తిత్వం ఎప్పుడూ భద్రంగానే ఉంది. 2019కి ముందు లోకేష్‌తో ఏ మాత్రం పరిచయం ఉన్నవారికైనా అతని విద్వత్తు, విజ్ఞాన స్థాయి, ప్రొఫెషనల్ అప్రోచ్ తెలుసు. సమస్యలను పరిష్కరించే చాకచక్యం వారు చూశారు. కానీ రాజకీయ చెదల మధ్యన అవేవీ బయటకు రాలేదు. ‘గెలుపుదేముంది, నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది, కానీ ఓటమి ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తుంది’ అని ఎవరో కవి చెప్పినట్టు, 2019లో ఓటమి, లోకేష్‌ను వ్యక్తిత్వపరంగా, బహిర్గతంగా ఏ విధంగా ప్రపంచానికి పరిచయం కావాలో పునర్నిర్వచించుకొనేలా చేసింది. దెబ్బలు తగిలితేనే శిల శిల్పం అవుతుందన్నట్టు, అతనిని ఎగతాళి చేసిన నోళ్లే, అతనికి తన కౌశల్యమెంటో చెప్పే అవకాశం ఇచ్చాయి.

మరి లోకేష్ ప్రజాబాహుళ్యానికి గత నాలుగు సంవత్సరాల్లో దగ్గరయ్యారా అంటే, అతని మీద ఈ రోజు ప్రజలు కురిపిస్తున్న అభిమానమే అందుకు తార్కాణం. ఒక వ్యక్తి రాజకీయ నాయకుడి నుంచి ప్రజానాయకుడుగా ఎప్పుడు మారుతాడంటే... ప్రజలు అతన్ని ఆమోదించి, ఆరాధించినప్పుడు. అది ఎలా బయటపడుతుందంటే... మిద్దెలెక్కి, మేడలెక్కి, మెట్లెక్కి, చెట్లెక్కి, గేట్లెక్కి, హోర్డింగ్‌లెక్కి, ఎలాగైనా సరే ఆ వ్యక్తిని ప్రజలు ఆతృతగా చూసే ఆ క్షణమే ప్రజానాయకుడిగా ఎదుగుదలకు నాంది. ఇప్పుడు జరుగుతోంది అదే. టీవీలు, ఇంటర్నెట్ ఉన్న ఈ రోజుల్లో కూడా మన ఊరికొచ్చిన ఆ వ్యక్తిని చూద్దామనే ప్రజల ఉత్సుకత, నాయకుడి పట్ల ఆరాధనకు మొదటి మెట్టు.

లోకేష్ వ్యక్తి నుంచి నాయకుడిగా ఎదుగుతున్న క్రమం ఇది. ప్రభుత్వం ఈ పాదయాత్రని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. శతాబ్దాల క్రితం చట్టాలని తవ్వి జీఓ నెం.1 తెచ్చింది. కానీ ప్రజలతో సన్నిహితం కావడానికి ఇవేవీ అడ్డుకాలేదు. లోకేష్‌కు ఈ అభిమానం ఒక్క రోజులో రాలేదు. ఇంత పెద్ద యాత్రలకు సిద్ధం కావడానికి, నాలుగు సంవత్సరాలుగా చేసిన పర్యటనలు, తలకెత్తుకొన్న కార్యక్రమాలు, రోజుకు ముప్పై నలభై మీటింగులు పెట్టుకోవటం దాకా ఎంతో నిగూఢ కృషి దాగి ఉంది. కుప్పంలో లోకేష్ యాత్రని నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ తర్వాత ప్రసార సాధనాల్లో చూస్తున్నా. అన్నం ఉడికిందా లేదా అనేది పూర్తిగా ఉడికిందాకా చూడనవసరం లేదు. ప్రజల మొహల్లో ప్రస్ఫుటంగా కనపడే ఆ ఉత్సాహం, అతన్ని చూడ్డం కోసం వేచి ఉండడం, ఇతనేనా, ఇలా ఉంటాడా అంటూ తమ కిష్టమైన నాయకుడిని చూస్తున్నామన్న ఆరాధన పూరిత మొహాలు, చిరునవ్వుతో చూడ్డం, ఇదే ప్రజలు తమ నాయకుడి పట్ల చూపే ఆరాధన. కొంతమంది ఇది సైకోఫేన్సీ అంటే, ఒకరకంగా కావచ్చేమో కూడా. మనందరం చిన్నప్పుడు ఇలా అప్పటి ప్రముఖ రాజకీయ నాయకులని అబ్బురంగా చూసినోళ్ళమే. ప్రజలు ఎప్పుడూ నాయకులని ఆరాధిస్తారు. అది వారికి ఇష్టం కూడా. కానీ ఆ ఆరాధన ఒక్క రోజులో రాదు. కొంతమందికి జీవితాంతమూ రాదూ.

నిజానికి పాదయాత్రలు మొదట్లో కంటే నాయకుడు నడిచే కొద్దీ ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. నాయకుడు పడే కష్టం చూసే కొద్దీ ప్రజల అభిమానం విశేషంగా మారుతుంది. ఇది స్వయంగా నేను పదకొండేళ్ళ క్రితం చంద్రబాబు పాదయాత్రలో దగ్గరగా ఉండి చూశాను. మన కోసం ఆ నాయకుడు ఇల్లూ వాకిలి వదిలేసి రోడ్లు పట్టుకు తిరుగుతూ, ఇంత మారుమూలన ఉన్న మన దగ్గరకి వచ్చాడనే భావన ప్రజలకు ఆ వ్యక్తి మీద ఆరాధన కలిగిస్తుంది. తమకిచ్చిన హామీలు ఎంత వరకు తీరుస్తాడా అనే విషయం పక్కన పెడితే, కనీసం తెలుసుకొన్నాడు అనే భావన ప్రజలకు సాంత్వన కలిగిస్తుంది. ఇది తప్పా, కరెక్టా అంటే దేశంలో రాజకీయ నాయకులు ప్రజల హృదయాలలోకి వెళ్లడానికి ఇదొక మార్గం అనుకొన్నారు. 1983లో, ఆ తరవాత ప్రధాని అయిన చంద్రశేఖర్ నుంచి ఈ రోజు లోకేష్ దాకా దీనిని అనుసరిస్తున్నారు. లోకేష్‌, ఇక మీకు ప్రజానుగ్రహంలో ఎదురు లేదు. అలాగే ముందుకు సాగిపో. ప్రజల కోసం కష్టపడు. వారి మన్ననలు అందుకో.

నీలాయపాలెం విజయకుమార్

తెలుగుదేశం పార్టీ

Updated Date - 2023-02-02T00:40:35+05:30 IST