వెలుగొందుతున్న ‘ఆత్మ నిర్భర్ భారత్’

ABN , First Publish Date - 2023-01-24T03:55:07+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో భారతదేశం ప్రపంచ రాజకీయాలపై తన ప్రభావాన్ని, పలుకుబడిని పెంచుకుంటున్న విషయాన్ని...

వెలుగొందుతున్న ‘ఆత్మ నిర్భర్ భారత్’

ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో భారతదేశం ప్రపంచ రాజకీయాలపై తన ప్రభావాన్ని, పలుకుబడిని పెంచుకుంటున్న విషయాన్ని పాకిస్థాన్ సైతం కాదనలేకపోతోంది. అన్ని రంగాల పెట్టుబడులకు భారత్‌ను స్వర్గధామంగా మార్చారని, జీడీపిని 3 ట్రిలియన్ డాలర్లకు పెంచుకున్న భారతదేశం విదేశాంగ విధానాన్ని అత్యంత నైపుణ్యంతో నిర్వహిస్తోందని పాక్‌లో ప్రముఖ పత్రిక ‘ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ ప్రశంసించింది. ఇవాళ అగ్రదేశాలు సైతం ఆర్థిక మాంద్యంతో సతమతమవుతుంటే, పొరుగున ఉన్న చైనా కొవిడ్ వాతపడి ఆర్థికంగా క్రుంగిపోతుంటే, పాకిస్థాన్ ఆహార సంక్షోభం, తీవ్ర విద్యుత్ కొరతతో కుదేలవుతుంటే భారతదేశం చెక్కుచెదరకుండా, స్థిరమైన ఆర్థిక వ్యవస్థతో నిలదొక్కుకుంటోంది. ప్రపంచ రాజ్యాల్లో తన ప్రతిష్ఠ పెంచుకుంటోంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. అవి:

(1) 140 కోట్ల జనాభా ఉన్న భారత్ కొవిడ్‌తో అతలాకుతలమయిపోతుందని ఇంటా, బయటా అనేకమంది ఊహించారు. కానీ అతి వేగంగా కొవిడ్ వాక్సిన్లను స్వదేశంలోనే ఉత్పత్తి చేయడం, గరీబ్ కల్యాణ్ యోజన, అన్న యోజన వంటి పథకాలను దేశమంతా అమలు చేయడం మూలంగా కొవిడ్ సంక్షోభం నుంచి భారత్ తేరుకుంది. అంతేకాదు, ప్రపంచంలో అనేక దేశాలకు వాక్సిన్లు, ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసింది. (2) ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత అక్కడ చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయులను కాపాడడం కష్టమని అనేకమంది పెదవి విరిచారు. అయితే ఎవరూ ఊహించనంత వేగంగా భారత ప్రభుత్వం స్పందించి ఆపరేషన్ గంగా పథకంలో భాగంగా 90 విమానాల్లో భారతీయులను వెనక్కి తీసుకువచ్చింది. అంతేకాదు, ఉక్రెయిన్‌పై స్వతంత్ర వైఖరిని అవలంబించి రష్యా నుంచి మన చమురు సరఫరాకు ఢోకా రాకుండా చూసుకుంది. భారతీయుల ప్రయోజనాలు కాపాడడమే అన్నిటికన్న ప్రధాన లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యవహరించారు. (3) సరిహద్దుల భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం ఎలాంటి రాజీలేని ధోరణితో వ్యవహరించింది. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు చొరబడడం, స్థానికులకు శిక్షణ శిబిరాలు నిర్వహించడం తగ్గిపోయాయి. చైనాకు కూడా సరిహద్దుల్లో దుస్సాహసం చేస్తే సహించబోమనే గుణపాఠాన్ని మనం పంపగలిగాము. గతంలో ఏ ప్రభుత్వమూ తలపెట్టని విధంగా మోదీ ప్రభుత్వం 3600 కిమీ సరిహద్దు రోడ్లను నిర్మించింది. (4) అనేక అగ్రరాజ్యాలు పాలుపంచుకుంటున్న ప్రతిష్ఠాత్మక జీ–20 సమావేశాలకు భారత్ సారథ్యం వహిస్తున్న నేపథ్యంలో ప్రపంచ శాంతి, పర్యావరణం, ఆర్థిక అభివృద్ధి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మొదలైన అనేక రంగాల్లో భారత్ సాగిస్తున్న పురోగతి ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నదనడంలో సందేహం లేదు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌లో జరిగినన్ని అగ్ర నేతల శిఖరాగ్ర సమావేశాలు, అనేక ఇతర అంతర్జాతీయ సమావేశాలు గతంలో ఎన్నడూ జరగలేదు. ఒకే ఏడాది మూడు అంతర్జాతీయ వేదికలు జీ–20, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, షాంఘై కార్పొరేషన్లకు సారథ్యం వహించిన ఘనత భారత్‌కు దక్కింది. క్వాడ్, బ్రిక్స్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో కూడా మనం కీలక పాత్ర పోషిస్తున్నాం. అగ్రరాజ్యాలతో కూడిన జీ–7 ప్రతి సమావేశానికి మోదీకి ఆహ్వానం లభిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నిర్ణయాత్మకమైన విదేశాంగ విధానం మోదీ సారథ్యంలో అమలు అవుతోంది.

(5) మోదీ సర్కార్ భారత దేశంలో సుపరిపాలనకు కట్టుబడి ఉన్నదని, శాంతి భద్రతల పరిస్థితి సజావుగా మారడం, రహదారులు, రేవులు, విమానాశ్రయాలు, జల మార్గాలు, ప్రజారవాణాతోపాటు అనేక ప్రాజెక్టులు వేగంగా అమలు కావడంతో విదేశీ పెట్టుబడిదారులకు భారత్ అనువైన ప్రదేశంగా మారింది. భారత మాల, సాగర్ మాల, రవాణాకే అంకితమైన కారిడార్లు, ఉడాన్ వంటి బృహత్తర కార్యక్రమాలు భారతదేశంలో వ్యాపారాన్ని మరింత సులభతరం చేశాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, అయిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన భారత్‌లో బిలియన్ డాలర్ల టర్నోవర్ దాటిన యూనీకార్న్‌లు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. (6) ఆత్మనిర్భర్ భారత్ ఒక నినాదం కాదని మోదీ సర్కార్ ఆచరణలో రుజువు చేసింది. దేశంలో ఉపయోగిస్తున్న 95 శాతం మొబైల్ ఫోన్లు భారతదేశంలో తయారు చేసినవే. ఆపిల్ కంపెనీతో పాటు ఇతర అమెరికా ఎలెక్ట్రానిక్స్ సంస్థలు చైనా నుంచి భారత్‌కు తరలివస్తున్నాయి. మరో నాలుగేళ్ల లోపు ప్రపంచంలో ఉపయోగించే ఆపిల్ ఫోన్లలో సగం భారతదేశంలోనే తయారు కావాలని ఆపిల్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో రక్షణ ఉత్పత్తుల సేకరణ నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల వరకు ‘మేక్ ఇన్ ఇండియా’ విధానాన్ని భారత్ అమలు చేస్తోంది. 2021–22లో రూ.14వేల కోట్ల మేరకు రక్షణ ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేయడమే ఆత్మనిర్భర్ రంగంలో సాధించిన విజయానికి తార్కాణం.

ఇంటా, బయట ఒకేసారి విజయం సాధించాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయం సాధిస్తోంది. మహోన్నత భారత సాంస్కృతిక వారసత్వాన్ని దేశమంతటా ప్రజలకు తెలియజేసి, కాశీనుంచి కన్యాకుమారి వరకు భారత్ సాంస్కృతికంగా ఒకటే అన్న భావనను కల్పించేందుకు ఆయన చేపట్టిన కాశీ–తమిళ సంగమం ప్రాజెక్టు ఘన విజయం సాధించింది. తమిళనాడులో కాశీ మూలాలు, కాశీలో తమిళనాడు ప్రభావం గురించి ప్రధానమంత్రి స్వయంగా వివరించారు. అయోధ్యలో శరవేగంతో నిర్మాణమవుతున్న రామమందిరం, విశాలంగా విస్తరిస్తున్న కాశీ మందిర కారిడార్, సోమనాథ్‌లో అమలు జరుగుతున్న అభివృద్ధి పనులు, హిమాలయాల్లో కేదార్‌నాథ్ ధామ్ పునర్నిర్మాణం, తొలిసారి చార్‌ధామ్‌కు అన్ని వాతావరణాలను తట్టుకునే రహదారులను నిర్మించడం, ఉజ్జయిని మందిర కారిడార్ విస్తరణ, స్వదేశ్ దర్శన్, ప్రసాద్ యోజనతో పాటు వలసవాద భావజాలాన్ని నిర్మూలించేందుకు ఇండియాగేట్ వద్ద ఉన్న రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా మార్చి సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రతిష్టించడం అన్నీ భారత్‌ను దేశ భక్తిపరంగా, సాంస్కృతికంగా సమైక్యం చేయడం కోసమే.

‘సబ్ కే సాథ్ సబ్ కా విశ్వాస్’పై పూర్తి విశ్వాసం ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడుతూ మైనారిటీల్లో తీవ్రంగా వెనుకబడిన పస్మందాలు, వెనుకబడిన వర్గాలు, బోహ్రా ముస్లింలు, సిక్కులు క్రైస్తవులతో పాటు సమాజంలో అణగారిన వర్గాలను చేరుకుని ప్రభుత్వం అందరికోసం పని చేస్తుందన్న విశ్వాసం కలిగించాలని చెప్పారు. మోదీ సారథ్యంలో బిజెపి రోజురోజుకూ విస్తరించడం, వివిధ సామాజిక వర్గాలను చేరుకోవడం గమనించిన ప్రతిపక్షాలు దిక్కుతోచని స్థితిలో విదేశీ మీడియాను ఉపయోగించుకుని సామాజిక వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ఈ ప్రయత్నాలను ఎంత మాత్రమూ సహించే ప్రసక్తి లేదు. ఇప్పటికే న్యాయవ్యవస్థ తీర్పుల ద్వారా, ప్రజాస్వామ్య యుతంగా జరిగిన పలు ఎన్నికల ద్వారా జరిగిన అగ్నిపరీక్షల్లో స్వచ్ఛమైన నేతగా ఆవిర్భవించిన మోదీ పట్ల కుతంత్రాలు ఎంతమాత్రమూ చెల్లవు.

వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2023-01-24T03:55:10+05:30 IST