Share News

ఓటమికి జడిసి ఓటుపై వేటు!

ABN , First Publish Date - 2023-11-02T02:01:40+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల నమోదు, తొలగింపులో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఓటుపై వేటు ప్రజాస్వామ్యానికే చేటు! జగన్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీ ఓట్లను...

ఓటమికి జడిసి ఓటుపై వేటు!

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల నమోదు, తొలగింపులో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఓటుపై వేటు ప్రజాస్వామ్యానికే చేటు! జగన్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీ ఓట్లను తొలగిస్తున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో బోగస్ ఓట్లను వేల సంఖ్యలో చేరుస్తున్నారు. పాలకపక్షం అదురుబెదురు లేకుండా అధికారులను అడ్డుపెట్టుకుని బోగస్ ఓట్లు చేరుస్తూ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం పాలుచేస్తున్నది. అక్రమంగా ఓట్లు తొలగించడం, నమోదు చేయడం ప్రజాతీర్పును అగౌరవపర్చడమే. ఇది రాజ్యాంగ వ్యవస్థలను కూలగొట్టే కుట్రలో భాగమవుతుంది. రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చాలన్నా, పేదవాడి స్థితిని, గతిని మార్చాలన్నా ఓటు కీలకం.

మార్టూరు ఘటన ప్రజాస్వామ్య ప్రక్రియను దిగ్ర్భాంతికి గురిచేసేలా ఉంది. ఓట్ల నమోదు, తొలగింపులో పోలీసులకు ఎలాంటి ప్రమేయం ఉండదు. అలాంటిది ఏకంగా 15వేల మంది మహిళా పోలీసులను రాష్ట్రవ్యాప్తంగా బీఎల్వోలుగా నియమించారు. ఏకంగా మహిళా పోలీసులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేసి సాక్షాత్తూ పోలీసు అధికారులే దానిని పర్యవేక్షించడం తీవ్రమైన నేరంగా పరిగణించాలి. ప్రతిపక్ష పార్టీ ఓట్లను తొలగిస్తూ, వైసీపీ వారి ఓట్లు చేరుస్తూ పోలీసులు స్వామిభక్తిని చాటుకుంటున్నారు. ఇది ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను గేలిచేస్తోంది. ఉరవకొండ వ్యవహారంలో స్థానిక శాసనసభ్యుడు, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ చేసిన ఫిర్యాదుతో అనంతపురం జిల్లా పరిషత్ సీఈవో భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అంతకుముందు అదే స్థానంలో పనిచేసిన స్వరూపారాణి పైనా సస్పెన్షన్ వేటుపడింది. అధికారపార్టీ కోసం నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు తొలగిస్తే ఇలాంటి గతే పడుతుందని అధికారులకు అర్థం కావాలి. పాలకపక్ష వికృత క్రీడలో అధికారులు పావులుగా మారకూడదు.

మళ్లీ అధికారంలోకి రావాలంటే కుట్రలు, కుతంత్రాలు తప్ప మరోమార్గం జగన్‌రెడ్డికి కనిపించడం లేదు. దీంతో దుర్బుద్ధితో దొంగ ఓట్ల తంతుకు తెరదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దొంగఓట్లతోనే గెలిచారు. తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో వేలాది దొంగ ఓట్లు నమోదు చేసి అవకతవకలకు పాల్పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 27లక్షల ఓట్లను తొలగించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం ఓట్ల తొలగింపు బూత్ లెవల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరగాలి. ఓటర్ల జాబితా నుంచి ఎవరి పేరైనా తొలగించాలంటే ఆ వ్యక్తికి లేదా కుటుంబసభ్యులకు ముందస్తు నోటీసివ్వాలి. దానికి వారు సమాధానమిచ్చాక అది సహేతుకంగా లేకపోతే జాబితా నుంచి తొలగించాలి. ఒకే వ్యక్తి పేరు జాబితాలో రెండు చోట్ల ఉంటే ఎక్కడ ఓటు తొలగించాలో నోటీస్ ఇచ్చి అడగాలి. బూత్ స్థాయి అధికారులే పరిశీలించి ఇవన్నీ చేయాలి. అయితే కొంతమంది బూత్ స్థాయి అధికారులు వైసీపీ నాయకులతో కుమ్మక్కై వాలంటీర్ల సహకారంతో పెద్ద ఎత్తున ఓట్లు తొలగిస్తున్నారు. ఒకే కుటుంబంలోని ఒకరి ఓటు ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో, మరొకరిది వేరే కేంద్రం పరిధిలో చేర్చుతున్నారు. ఓటర్ల జాబితా మొత్తాన్ని తమ ఇష్టానుసారంగా మారుస్తూ ఓటర్లను అయోమయానికి గురిచేస్తున్నారు.

2022 ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసిన తరువాత ఫాం 6, 7 అతిక్రమణ గురించి అనేక ఫిర్యాదులు వచ్చినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. అవే తప్పులతో ఓటర్ల జాబితాను విడుదల చేశారు. దొంగ ఓట్ల నమోదు, ప్రతిపక్షాల ఓట్ల తీసివేతలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీకి పిలిచి చీవాట్లు పెట్టడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. సత్వరం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, బూత్ లెవల్ నుంచే దృష్టి సారించి ప్రతీ ఇంటికి వెళ్లి ఓటర్ల తనిఖీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం సమగ్రంగా ఓట్ల సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉంది. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను కఠినంగా శిక్షించాలి.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓటు హక్కు గురించి మాట్లాడుతూ, ‘నేను నా దేశ ప్రజల చేతికి కత్తి ఇవ్వలేదు. ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులవుతారో, అమ్ముకొని బానిసలవుతారో అది వారి చేతుల్లోనే ఉంది’ అన్నారు. పాలకపక్షాన్ని నిలదీయాలన్నా, ప్రశ్నించాలన్నా ఓటు ద్వారానే సాధ్యం. అది సద్వినియోగం అయితే పౌరుడి తలరాతను, రాష్ట్ర భవిష్యత్‌ను మారుస్తుంది. ఓటు అనే రెండు అక్షరాలు దేశ భవిష్యత్‌కు పునాది. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కొనసాగాలంటే స్వేచ్ఛగా, నిర్భయంగా పౌరులు ఎన్నికల క్రతువులో పాల్గొని ఓటుహక్కును వినియోగించుకోవాలి.

స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అన్ని వ్యవస్థలు బలహీనపడి ఉనికిని కోల్పోతున్నాయి. ఇప్పటికే న్యాయవ్యవస్థ పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షలా తయారైంది. ఎన్నికల వ్యవస్థ పాలకపక్షాల చేతిలో కీలుబొమ్మగా మారింది. ఎన్నికల వ్యవస్థ బలహీనపడితే ఎన్నికల ప్రక్రియ అపహాస్యం పాలవుతుంది. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఓటు ప్రాథమిక హక్కు. ఇది మన ప్రజాస్వామ్యానికి ఊపిరి. ప్రజలు తమ ఓటు నమోదు చేసుకోవడమే కాకుండా ఎన్నికలు వచ్చినప్పుడు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే మంచి నాయకులు ఎన్నికవుతారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా, సాంఘిక, ఆర్థిక సమానత్వాన్ని సాధించాలన్నా ఇదే కీలకం. డబ్బు, అధికారం, హింసతో నెగ్గాలని ఎన్నికల బరిలోకి వస్తున్న వారి ఆటలు కట్టించాలి. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం రాష్ట్రంలో నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో ఓటర్లు విజ్ఞతను ప్రదర్శించడం ద్వారా నియంతల పాలనకు కాలం చెల్లి ప్రజా ప్రభుత్వాలు ఏర్పడతాయి.

మన్నవ సుబ్బారావు

Updated Date - 2023-11-02T02:01:40+05:30 IST