Share News

గొల్ల కురుమలు కేసీఆర్‌ను నమ్ముతారా?

ABN , First Publish Date - 2023-11-02T01:44:26+05:30 IST

రాష్ట్రంలో గొల్లకురుమలు 30 లక్షలకు పైగా ఉన్నారు. ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌ను నమ్మిన సామాజిక వర్గం గొల్లకురుమలు. గతంలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో...

గొల్ల కురుమలు కేసీఆర్‌ను నమ్ముతారా?

రాష్ట్రంలో గొల్లకురుమలు 30 లక్షలకు పైగా ఉన్నారు. ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌ను నమ్మిన సామాజిక వర్గం గొల్లకురుమలు. గతంలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో 90శాతం గొల్లకురుమలు టీఆర్‌ఎస్‌కు ఓట్లేసి ఆ పార్టీ గెలుపునకు దోహదపడ్డారు. కానీ, గొర్రెల పంపిణీ పథకం గొల్లకురుమల నమ్మకాన్ని వమ్ముచేసింది. రెండేండ్లలో 7.30లక్షల మంది గొల్లకురుమలకు గొర్రెలు పంపిణీ చేస్తామని లబ్ధిదారులను ఎంపిక చేసి, ఈ ఆరేండ్లలో 3.98లక్షల మందికి మాత్రమే గొర్రెలిచ్చి చేతులు దులుపుకున్నారు. పంచిన గొర్ల ద్వారా గొల్లకురుమలకు పేరు బదనాం తప్ప లాభపడ్డది మాత్రం దళారులే. మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఆ నియోజకవర్గంలోని 7,600 మంది గొల్లకురుమల అక్కౌంట్లకు నగదు బదిలీ చేశారు. దీంతో నమ్మిన గొల్ల కురుమలు అక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థికే పట్టం కట్టారు. కానీ ప్రభుత్వం మాత్రం నగదు బదిలీ చేసినట్టే చేసి, లబ్ధిదారుల అకౌంట్లను ఫ్రీజ్‌ చేసి, చివరకు అక్కడ గొర్రెలు కానీ, నగదు కానీ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది. ప్రతి గ్రామంలో కొందరికి గొర్రెలు పంపిణీ చేసి, మరికొందరికి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల సహజంగానే వ్యతిరేకత పెరుగుతుంది. గొర్రెలు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించడంతో ఇప్పటికే 88,000 మంది తమ వాటాధనం కింద డి.డి.లు తీశారు. ఒక్కొక్కరు రూ. 43,750 చొప్పున, సుమారు 385 కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాలో చెల్లించి ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. కనీసం డి.డి.లు చెల్లించిన లబ్ధిదారులందరికి పంపిణీ చేయాలంటే రూ.15వందల కోట్లు అవసరం. కేంద్రంలో బీజేపీ ఆధీనంలో ఉన్న ఎన్సీడీసీ ఋణం ఇవ్వనని చేతులెత్తేయడంతో ఎన్సీడీసీ అప్పు మీదనే ఆధారపడ్డ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ తరుణంలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో అధికార పార్టీకి భయం పట్టుకుంది. మరోవైపు గొల్లకురుమలు కూడా గొర్రెల సంగతి దేవుడెరుగు కనీసం డి.డి.ల రూపంలో చెల్లించిన డబ్బులైనా తిరిగి వస్తాయా రావా అని ఆందోళన పడుతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ మరోసారి గొల్లకురుమలను నమ్మించగలరా? లేదా గెలిపించిన వారి చేతనే ఓటమికి బాటలు వేసుకుంటారా?

ఉడుత రవీందర్‌

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం (జి.ఎం.పి.ఎస్‌)

Updated Date - 2023-11-02T01:44:26+05:30 IST