కేసీఆర్‌తో లాలూచీపడే అపెక్స్ కౌన్సిల్‌కి వెళ్లలేదా?

ABN , First Publish Date - 2023-09-26T02:30:26+05:30 IST

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన నీటి కేటాయింపుల జీవోపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు మీద విచారణ జరిపిన బ్రిజేశ్ కుమార్...

కేసీఆర్‌తో లాలూచీపడే అపెక్స్ కౌన్సిల్‌కి వెళ్లలేదా?

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన నీటి కేటాయింపుల జీవోపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు మీద విచారణ జరిపిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ గత వారం ఇచ్చిన తీర్పుతో మున్ముందు రాయలసీమకు గోడ దెబ్బ చెంప దెబ్బ రెండూ తగలనున్నాయి.

వాస్తవంలో ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను ఆశ్రయించకూడదు. టీడీపీ హయాంలో 2016లో జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ తీర్మానాన్ని ఆధారం చేసుకొని తిరిగి అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరి తెలంగాణను నిలువరించాల్సి ఉంది. రాష్ట్ర విభజన చట్టం మేరకు ప్రాజెక్టు ఉనికినే ప్రశ్నించాలి. కీలకమైన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని పక్కన పెట్టారంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆగ్రహం వస్తుందని భావించారేమో. ఇదిలా వుండగా తదుపరి కేంద్ర మంత్రి షెకావత్ ఆధ్వర్యంలో జరిగిన రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రస్తావన తీసుకు రాలేదంటే గొంతెండి పోతున్న రాయలసీమ ఎటు పోయినా ఫర్వాలేదు గాని కేసీఆర్‌తో పెనవేసుకొన్న బంధానికి దెబ్బ తగలకూడదని భావించినట్లుంది. లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎవరూ సలహా ఇవ్వలేదని భావించాలి. కాకుంటే రాష్ట్ర జలవనరుల శాఖ తామేదో చేస్తున్నట్లు రాయలసీమ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు ట్రిబ్యునల్‌కు వెళ్లి అభాసు పాలయ్యింది.

ప్రతిపక్షాలను వెంటాడేందుకు లక్షలాది రూపాయలు మంచినీళ్ల ప్రాయంగా లాయర్లకు వ్యయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రానికి జీవనాడి అయిన అంతర్ రాష్ట్ర జల వివాదాల్లో కోర్టు తలుపులు తట్టేందుకు సిద్ధం కాకపోవడమే విషాదమే. ఈ దుర్విధానమే ప్రధానంగా నిత్య క్షామ పీడిత ప్రాంతమైన రాయలసీమకు నేడు శాపమైంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలుపు చేయాలని చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన తర్వాత కూడా పనులు జరుగుతున్నాయని తెలంగాణ వైపు నుంచి ఫిర్యాదు వెడితే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని గ్రీన్ ట్రిబ్యునల్లో స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. అయితే మరో వైపు గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం ఉన్నా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చాటుమాటుగా పనులు సాగిస్తున్న సమయంలో ప్రమాదమొకటి జరిగి ఒకరు చనిపోయారు. ఇంత సాక్ష్యమున్నా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసే దిక్కులేకుండా పోయింది. ఈ ఒక్క సంఘటనే కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి రంగంలో ఆంధ్రా పట్ల అనుసరిస్తున్న వైఖరికి అపకారం జరగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతర్ రాష్ట్ర జల వివాదాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుకొని తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు వలస పాలకులని నీటిని దోచుకుపోతున్నారని దుమ్మెత్తి పోయడమే కాకుండా కృష్ణా నదీ జలాలు ఫిఫ్టీ–ఫిఫ్టీ పద్ధతిలో పంపకం జరగాలని, ప్రధానంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నీళ్లు దోచుకుపోతున్నారని ఆరోపణలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడడం లేదు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గాని, సీమకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కరూ నోరు విప్పడం లేదు. వీరికి హైదరాబాద్‌లో స్థిరాస్తులున్నందున వాటికి ముప్పు వాటిల్లుతుందని ఎవరూ ఉలకడం లేదు, పలకడం లేదు.


పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ జారీ చేసిన జీఓపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు వెళ్లమని ఏ న్యాయనిపుణుడు లేక రాష్ట్ర ఉన్నతాధికారి సలహా ఇచ్చారో గాని ఇందుకు చెందిన నేపథ్యం రికార్డులు పూర్తిగా వారు అధ్యయనం చేసినట్లు లేదు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రాష్ట్ర విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని టక్కుటమార విద్యలు ప్రదర్శించినా రాష్ట్ర విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో లేని ప్రతి ప్రాజెక్టు కొత్తదని ప్రస్తుతం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ రాజముద్ర వేసింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టుని నిర్ధారించిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా కేంద్ర జలసంఘం నీటి కేటాయింపులు ఏలా చేస్తుంది? ఇప్పటికైనా రాష్ట్ర జలవనరుల శాఖ కళ్లు తెరిస్తే మంచిది. ట్రిబ్యునల్ చెప్పే వరకు ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది రూపాయలు జీతాలు తీసుకొనే అధికారులకు, సలహాదారులకు ఈ విషయం తట్టలేదంటే నమ్మలేం. ఇక్కడే అసలు లాలూచీ ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు చేస్తున్న హడావుడికి భగ్నం కలుగకూడదని రాంగ్ నెంబర్‌కు రింగు చేసి ప్రస్తుతం భంగపడింది. టీడీపీ హయాంలో కేసీఆర్ అడ్డదిడ్డంగా వ్యవహరించిన తర్వాత 2016 సెప్టెంబర్‌లో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. చంద్రబాబు నాయుడు బెడద తప్పించుకొనేందుకే వ్యూహాత్మకంగా ఆయన ఓటమికి అవసరమైన ఇంధనం కేసీఆర్ సరఫరా చేశారు. 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం కింద విధంగా తీర్మానం చేసింది. సౌలభ్యం కోసం ఇంగ్లీషు వెర్షన్ యధావిధిగా ఇస్తున్నాను ‘‘ది అపెక్స్ కౌన్సిల్ ఈజ్ రిక్వెస్ట్ టు పుట్ ఆన్ హోల్డ్ ది కన్‌స్ట్రక్షన్ ఆఫ్ 1) పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 2) దిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, టిల్ దె ఆర్ ప్రాపర్లీ అప్రైజ్డ్ బై కేఆర్‌యంబి అండ్ సిడబ్లుసి అండ్ శాంక్షన్ బై అపెక్స్ కౌన్సిల్.’’

2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ ఇంత స్పష్టంగా తీర్మానం చేసిన తర్వాత కూడా తదుపరి జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రస్తావన తీసుకు రాలేదంటే ఏమని భావించాలి? అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగి ఆంధ్రప్రదేశ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై ఉంటే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు కూడా లభించేవి కావు.

ఇప్పటికీ ప్రాజెక్టుకు ఆయువు పట్టైన నీటి కేటాయింపులు జరగలేదు. ఈ దశలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరవలసి ఉంది. అప్పుడే తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి లేఖ రాస్తూ న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ఆమోదించి నీటి కేటాయింపులు చేయాలని కోరింది. ఇప్పటికైనా రాష్ట్ర జలవనరుల శాఖ 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ తీర్మానాన్ని కేంద్ర జలవనరుల శాఖతో పాటు తత్సంబంధిత శాఖల వద్ద సమర్పించి అభ్యంతరాలు పెట్టవలసి ఉంది.

తెలంగాణ ఎన్ని మొండి వాదనలు చేసినా ఆంధ్రప్రదేశ్ వేసిన పిటిషన్ కొట్టి వేస్తూ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2015 తర్వాత నిర్మాణం చేపట్టిన కొత్త పథకంగా పరిగణిస్తామని, దీనికి నీటి కేటాయింపులు తమ పరిధిలో లేవని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ స్పష్టం చేయడం ముదావహం. అయితే పిల్లి గుడ్డిదైతే ఎలుక భరతనాట్యం చేసిందన్నట్లు ఈ తీర్పు తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ నిరాసక్తతతో ఉంటే ఇంతే సంగతులు. అప్పుడే తమకు కేంద్ర జల సంఘం వద్ద నీటి కేటాయింపులకు అడ్డంకి తొలగిపోయిందని తెలంగాణ జలవనరుల శాఖ సంబర పడుతోంది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోరదనే ధీమానే. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రియాశీలంగా వ్యవహరించకపోతే తెలంగాణ ప్రభుత్వం తనకున్న లాబీతో కేంద్ర జల సంఘం వద్ద నీటి కేటాయింపులు చేసుకొనే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే శ్రీశైలం జలాశయంలో 800 అడుగులు నీటి మట్టం ఉన్నా 90 టియంసిలు నికర జలాల కింద తెలంగాణ ఉపయోగించుకొంటుంది. మరోవైపు వరద ఉన్న రోజుల్లో యధేచ్ఛగా విద్యుదుత్పత్తి కోసం కిందకు నీళ్లు వదలుతుంది. ఈ నీళ్లతో కోస్తా జిల్లాలకు ఇబ్బంది ఉండదు. ఎటొచ్చీ ముల్లు మీద ఆకు పడినా, ఆకు మీద ముల్లు పడినా దెబ్బతినేది దురదృష్టం చేసుకున్న రాయలసీమ మాత్రమే. రాయలసీమలో మిగులు జలాలు ఆధారంగా నిర్మితమైన హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలుగొండ, తెలుగుగంగ పథకాలకు నీళ్లు హుళక్కే.

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Updated Date - 2023-09-26T02:30:26+05:30 IST