ఆధిపత్యాలపై ధిక్కారస్వరం
ABN , First Publish Date - 2023-03-05T00:42:00+05:30 IST
రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి, విద్యావేత్త కోలా రాజ్యలక్ష్మి 1980ల్లో జంటనగరాల్లో రచయిత్రులను కూడగట్టి ఒక్కొక్క నెలా ఒకరి ఇంట్లో సాహితీ గోష్ఠులు నిర్వహిస్తుండేవారు...
రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి, విద్యావేత్త కోలా రాజ్యలక్ష్మి 1980ల్లో జంటనగరాల్లో రచయిత్రులను కూడగట్టి ఒక్కొక్క నెలా ఒకరి ఇంట్లో సాహితీ గోష్ఠులు నిర్వహిస్తుండేవారు. సమకాలీన సాహిత్యాన్ని చర్చించేవారు. అప్పటికి చిరు రచయిత్రినే అయినా సీతాదేవి నన్ను ఆ సాహితీ చర్చలకు ఆహ్వానించేవారు. కొంత కాలం తరువాత ఆ సమావేశాలు ‘సఖ్యసాహితి’ అనే సంస్థగా పరిణమించాయి. ‘సఖ్యసాహితి’లో యశోదారెడ్డి, ఆనందారామం, తురగా జానకీరాణి వంటి ఒకతరం సాహితీ దిగ్గజాలు ఉండేవారు. అప్పట్లోనే రామలక్ష్మిని మొదటిసారి చూసాను. ఆమె స్నేహితులు డా.శాంత, కల్పకం (ఏల్చూరి సీతారాం తల్లి) నీ కూడా కలిసాను.
లేఖిని సాహిత్య సంస్థ ఒకసారి తెలుగు విశ్వవిద్యాలయంతో రచయిత్రుల రచనల గురించి సదస్సు నిర్వహించాలనుకున్నప్పుడు నేను రామలక్ష్మి కథల గురించి ప్రసంగిస్తానన్నాను. ఆ సందర్భంగా రామలక్ష్మితో ఆవిడ కథలమీద వ్యాసం రాయాలనుకున్నానని చెప్తే చాలా సంతోషపడి రెండు కథల పుస్తకాలు ఇచ్చారు. నేను రచయిత్రుల కథల గురించి రాయాలనుకున్నది, రాసిన మొట్టమొదటి వ్యాసం రామలక్ష్మి కథల గురించే. రాసిన వ్యాసం చూపించితే బాగారాసావోయ్ అని ప్రశంసించారు. ఆ తర్వాత, నా ముందుతరం ఇరవైరెండు మంది రచయిత్రులపై వ్యాసాలు రాసి సంపుటీకరించాను. 1950ల్లో సుప్రసిద్ధ సాహిత్య పత్రిక ‘తెలుగు స్వతంత్ర’ సంపాదకవర్గంలో రామలక్ష్మి ఉండేవారు. అదే కాలంలో మాపెద్దక్కయ్య పి.సరళాదేవి కథలు ఆ పత్రికలో వెలువడేవి. ఆ కారణంగా రామలక్ష్మికి నేను సరళాదేవి చెల్లెలుగా తెలుసు. శీలా వీర్రాజు భార్యగానూ తెలుసు. మేము మలక్‌పేటలో ఉన్నప్పుడు ఆమె మా ఇంటికి దగ్గరలోనే ఉండేవారు. నేను తరుచూ కలిసేదాన్ని. వాళ్ళింటికింద ఇంట్లో అబాకస్ టీచర్ ఉండేవారు. మా మనవరాలిని అక్కడకి తీసుకు వెళ్ళినప్పుడు క్లాసు అయ్యేవరకూ రామలక్ష్మి దగ్గరకి వెళ్ళేదాన్ని. ఎన్నెన్నో కబుర్లు చెప్పేవారు. ఒక గంట ఎంత తొందరగా గడచిపోయేదో! ఆమె తన తరం వారి గురించి అనర్గళంగా ఎన్నో విషయాలు చెప్తుంటే సమయం తెలిసేది కాదు. నాకు ఎంతో ఇష్టమైన కవి శ్రీశ్రీ గురించి తాగుబోతుగా చెప్తుంటే బాధకలిగింది కాని నిజాల్ని ఒప్పుకోవాలి కదా!
ఒకసారి రామలక్ష్మికి పొట్ట ఆపరేషన్ అయ్యిందట. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ డాక్టర్ ‘మీ పొట్టనిండా అక్షరాలే ఉన్నాయని ఆరుద్ర గారు అన్నారు. ఒక్క అక్షరం ముక్కా లేదు రామలక్ష్మిగారూ’ అన్నాడని చెప్తూ నవ్వారు. అది విన్నాక ఎప్పుడు తలచుకున్నా నవ్వొస్తూ ఉంటుంది. కేంద్ర సాహిత్య అకాడమీ కోసం డా. పి.శ్రీదేవి గురించి మోనోగ్రాఫ్ రాయమని నాకు ఉత్తరం వచ్చినప్పుడు రామలక్ష్మిని కలిసాను. శ్రీదేవి మా పెద్దక్కయ్యకు కుటుంబమిత్రులు. అయితే అక్కయ్య కీర్తి శేషురాలు కనుక శ్రీదేవి వివరాలు చెప్పగలిగేది రామలక్ష్మి గారే. అదే విషయం ఆమెకు చెప్పి ‘శ్రీదేవి గురించి మీకు తెలిసిన వివరాలు చెప్తారా’ అని అడిగాను. ‘నేను చెప్పేవి నెగెటివ్‌గా ఉంటాయి నీకు ఇష్టమేనా’ అన్నారు. అయితే వద్దులెండి అని వచ్చేసాను.
రామలక్ష్మికి పత్రికా రంగంలోనూ, సినిమారంగంలోను, సామాజిక సేవారంగంలోను, సాహిత్య రంగంలోనూ, రాజకీయ రంగంలోను ఇలా అనేక అనుభవాలు ఉండటంవలన వాటిల్లోని లొసుగుల్ని అనర్గళంగా చెప్పేవారు. ఎదురుగా ఉన్నవారికి కొన్ని విషయాలు నచ్చినా నచ్చకపోయినా ఆమె తన మనసులో మాటను, తన అభిప్రాయాన్ని చెప్పటానికి జంకరు. తనని అందరూ గయ్యాళినని అంటారని కూడా తానే నవ్వుతూ చెప్పుకుంటారు. నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు నిష్కర్షగా చెప్పకమానరు. అందుచేత కొంతమంది ఆమెకు దూరమయ్యారు. నిజానికి రచనా వ్యాసంగంలో ఆమె చురుగ్గా ఉన్న కాలంలో ఆయా రంగాలలో పురుషాధిక్యత మరింత ఎక్కువ. వాటిని తట్టుకొని నిలదొక్కుకోవాలంటే ధిక్కార స్వరం ఉండక తప్పదేమో.
ప్రతీ ఒక్కరి గురించి, అందులోనూ సినీ సాహిత్యరంగాలలోని వారి మంచికన్నా వాళ్ళ ప్రవర్తనలోని దుర్గుణాలను, వాళ్ళ రెండుముఖాలను వేరు చేసి నిర్భయంగా చూపించేవారు. నెగెటివ్‌గానే మాట్లాడుతున్నట్లు అనిపించినా ఆవిడలోని పాజిటివ్‌నెస్ మనం స్పష్టంగా గుర్తించగలం. కదలడానికి కాళ్ళు సహకరించకపోవటం వలన చాలా కాలంగా వీల్ చైర్‌కే పరిమితం అయినా అన్నింటికీ ఒకరిపై ఆధారపడాల్సి వచ్చినా సాహిత్యం, సినీరంగం పత్రికలూ వీటి గురించి తప్ప తన శారీరక అసహాయత్వం గురించి గానీ, అనారోగ్యాల గురించి గానీ ఒక్కసారి తలచేవారు కాదు. ఆ వయసులో కూడా అంత హాస్యంగా, చమత్కారాలతో సానుకూల దృక్పథంతో మాట్లాడటం వలన ఆమెతో మాట్లాడుతున్నంత సేపూ హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది అనేది మాత్రం నిజం.
ఒకసారి జూన్ నాలుగు ఆరుద్ర జన్మదినం సందర్భంగా ఆయన పుస్తకం ఆవిష్కరణ అని నాతో సహా ఒక పదిహేను మంది రచయిత్రులను ఇంటికి పిలిచారు. ఆరుద్రగారి పాటలతో కబుర్లతో సందడిగా గడిపాము. తర్వాత కూడా మరో రెండుసార్లు ఒకరిద్దరు ఆత్మీయులతో కొన్ని గంటలు గడపటం జరిగింది. పదేళ్ళ క్రితం మేము ఇల్లు మారటంతో రామలక్ష్మిని కలవటం కుదరలేదు. నా వ్యాససంపుటిని ఆమెకు ఇవ్వటానికి వెళ్ళలేక మా అమ్మాయితో పంపాను. అది అందుకున్నాక ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు. తర్వాతైనా వెళ్ళాలను కొని కూడా అశ్రద్ధ చేసాను. ఇప్పుడు ఈ విధంగా రామలక్ష్మి గారితో నా అనుబంధం తలచుకొని ఆమెకు నివాళి సమర్పించవలసిరావటం బాధాకరం. ఒక తరంలో తన రచనలతో, తన వాగ్ధోరణితో, కచ్చితమైన దృక్పథంతో సాహిత్య కళారంగాలలో సంచలనం కలిగించిన సాహితీ దిగ్గజం తరలిపోయింది.
శీలా సుభద్రాదేవి