Share News

అభివృద్ధి నిరోధక శక్తులను ఓడించండి!

ABN , First Publish Date - 2023-11-02T01:51:33+05:30 IST

ప్రస్తుతం ఎన్నికలబరిలోవున్న బీఆర్‌ఎస్‌ (గతంలో టిఆర్‌యస్‌) తన 9 సంవత్సరాల పాలనా కాలమంతటా రాష్ట్రంలోని బడాపెట్టుబడిదారీ శక్తులకు, విదేశీపెట్టుబడికి...

అభివృద్ధి నిరోధక శక్తులను ఓడించండి!

ప్రస్తుతం ఎన్నికలబరిలోవున్న బీఆర్‌ఎస్‌ (గతంలో టిఆర్‌యస్‌) తన 9 సంవత్సరాల పాలనా కాలమంతటా రాష్ట్రంలోని బడాపెట్టుబడిదారీ శక్తులకు, విదేశీపెట్టుబడికి, భూస్వామ్యవర్గాలకు సేవచేస్తూవచ్చింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ‘సంక్షేమ పథకాల’న్నీ కంటి తుడుపుచర్యలేగాని ప్రజాసమస్యలకు ఇవేవీ పరిష్కారంకావు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెయ్యని వాగ్దానాలు కూడా అమలుచేసి భూస్వామ్య వర్గానికి, ధనికులకు వరాలు కురిపించింది. కానీ పేద, భూమిలేని రైతాంగానికి హామీలు అమలుచేయ నిరాకరించింది. తమ సమస్యల పరిష్కారానికి గ్రామీణపేదలు పట్టణపేదలు పోరాడవలసివస్తున్నది. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలపై నిర్బంధాన్ని ప్రయోగించి, కోర్టులచుట్టూ తిప్పుతూ వేధిస్తున్నది. ఇక, కేంద్రంలో బీజేపీ 9 సంవత్సరాలుగా అధికారపార్టీగా ఉంటూ పాలనాకాలం అంతా బడాపెట్టుబడిదారీ వర్గానికి, విదేశీపెట్టుబడికి, భూస్వామ్యవర్గానికి సేవచేస్తూ వచ్చింది. నల్లచట్టాలన్నింటినీ బలోపేతం చేస్తూ దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని అమలుచేస్తున్నది. జమ్మూ–కాశ్మీరులోనూ, ఈశాన్య భారతదేశంలోనూ సైనికపాలనను, అర్ధమిలటరీ పాలనను నడిపిస్తున్నది. ఏకజాతి ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ దేశంలోని వివిధజాతుల ఐక్యతను, అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నది. వివిధ రాష్ట్రాల న్యాయమైన హక్కులను అణచివేయడానికి, ఆయా రాష్ట్రాలలో తమ ప్రభుత్వాలను ఏర్పరచటానికి తనకున్న నిరంకుశాధికారాలను ప్రయోగిస్తున్నది. పశ్చిమాసియాలో అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న యుద్ధానికి మోదీ ప్రభుత్వం వంతపాడుతున్నది. ఇక, దశాబ్దాల తరబడి కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ ప్రకటిత, అప్రకటిత అత్యవసర పరిస్థితి ద్వారా సైనిక, అర్ధమిలటరీ బలగాలమీద ఆధారపడి దేశంలో నిరంకుశపాలనను అమలుజరిపింది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంటూకూడా అమెరికా అగ్రరాజ్య అనుకూల విదేశాంగ విధానాన్ని అనుసరించటంలోనూ బీజేపీతో పోటీ పడుతున్నది. ఈ మూడుపార్టీలూ ఎన్నికల మ్యానిఫెస్టోల పేరుతో ప్రజల డబ్బుతో ఓట్లుకొనే పథకాలను ప్రకటిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ఈ కార్యక్రమం పోటాపోటీగా సాగుతున్నది. ఈ పథకాలన్నంటి సారాంశం ప్రజలకు చిన్న చిన్న రాయితీలను కల్పించి, వారెదుర్కొంటున్న నిజమైన సమస్యల పరిష్కారాన్ని దాటవేయటమే. ఈ పరిస్థితుల నేపథ్యంలో, రాష్ట్రంలో 40 నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా తెలంగాణ శాసనసభ ఎన్నికలలో భారతకమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (మా–లె) పాల్గొంటున్నది. పాలకవర్గాల అభివృద్ధినిరోధక విధానాలను ఎండగడుతూ, ప్రజలు తమ మౌలికసమస్యల పరిష్కారం కోసం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ కోసం పోరాడాలని ప్రజలకు వివరించి చెప్పడం ద్వారా ప్రజా ఉద్యమాన్ని విస్తరింపజేస్తాము. యుసిసిఆర్‌ఐ (యం–యల్‌) ప్రధాన డిమాండ్లు ఇవీ: భారతదేశం అమెరికా అగ్రరాజ్య అనుకూల విదేశాంగ విధాన పరిధినుంచి బయటపడాలి. దేశంయొక్క నిజమైన జాతీయ ప్రయోజనాలకు, శాంతికి, అభివృద్ధికి తోడ్పడే, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించాలి. జాతీయ పరిశ్రమలకు, ప్రత్యేకించి తెలుగు జాతీయ పరిశ్రమలకు రక్షణ కల్పించాలి. కార్మికుల, మధ్యతరగతి వర్గాల పనిపరిస్థితులను మెరుగుపరచాలి. అవసరమైన జీతాల పెరుగుదలను అమలుచేయాలి. భూస్వామ్యవిధానాన్ని రద్దుచేయాలి– దున్నేవానికి భూమిని పంచాలి. తెలుగుప్రజల జాతీయ ఐక్యతను, తెలుగు సంస్కృతి, భాషల సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి. అన్ని నిర్బంధచట్టాలను రద్దుచేయాలి.

యుసిసిఆర్‌ఐ (ఎం–ఎల్‌) తెలంగాణ

Updated Date - 2023-11-02T01:51:33+05:30 IST