ప్రచారానికే పరిమితమైన తృణధాన్యాల సాగు
ABN , First Publish Date - 2023-08-02T01:06:10+05:30 IST
తృణధాన్యాల వినియోగం దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలు, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు ఆహారంగా ఉండేవి...
తృణధాన్యాల వినియోగం దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలు, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు ఆహారంగా ఉండేవి. పది సంవత్సరాల క్రిందట 8.6 లక్షల హెక్టార్లలో తృణధాన్యాలు పండించేవారు, ఇప్పుడు అది కేవలం 1.86 లక్షల హెక్టార్లకు పరిమితమయింది. ఫార్మర్స్ ఇంట్రెస్ట్ గ్రూప్, రాష్ట్రాల మిల్లెట్ బోర్డులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దేశంలో రెండు విడతలుగా 25 కోట్ల సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా, రైతులకు పెద్దగా ఉపయోగపడడం లేదు. చాలా రాష్ట్రాల్లో సేంద్రియ కర్బనం పూర్తిగా తగ్గింది. జాతీయ మట్టి సర్వే–భూ వినియోగ ప్రణాళిక సంస్థ వారు స్థానిక సాగు భూములు తీరుతెన్నులు, వాతావరణ పరిస్థితులను బట్టి ఏయే పంటలు సాగు చేసుకుంటే ఫలితం బాగుంటుందో సూచనలు ఇస్తున్నారు. ఈ మధ్య వారు ప్రచురించిన నివేదికలో తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో సేంద్రియ కర్బనం అడుగంటిందని, ఇప్పటికైనా ప్రభుత్వం, రైతులు జాగ్రత్తపడి సేంద్రియ కర్బనాన్ని కనీసం 0.7 కైనా పెంచుకోకపోతే భూములు సాగు యోగ్యం కాకుండా పోతాయని హెచ్చరించారు. ఇప్పటికైనా చిరుధాన్యాల ఉత్పత్తిలో క్షీణిస్తున్న ధోరణిని తిప్పికొట్టడం, ఆహార వ్యవస్థలో మిల్లెట్ల ప్రాధాన్యాన్ని పునరుద్ధరించే చర్యలు చేపట్టాలి.
డా. ముచ్చుకోట సురేష్‌బాబు