క్రికెట్ బోర్డ్ తక్షణ కర్తవ్యం

ABN , First Publish Date - 2023-06-16T01:08:08+05:30 IST

‘నేనుఅలసిపోయాను, కొంత విశ్రాంతి అవసరం’ అని ప్రముఖ భారతీయ క్రికెటర్ ఒకరు అన్నారు. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ మధ్య రోజుల్లో నాతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ...

క్రికెట్ బోర్డ్ తక్షణ కర్తవ్యం

‘నేనుఅలసిపోయాను, కొంత విశ్రాంతి అవసరం’ అని ప్రముఖ భారతీయ క్రికెటర్ ఒకరు అన్నారు. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ మధ్య రోజుల్లో నాతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఆ సుప్రసిద్ధ క్రికెటర్ ఆ మాట అన్నారు. ఆయన అలా అనడం నన్ను చకితుడిని చేసింది. ‘మరి, కొన్ని మ్యాచ్‌ల వరకు ఆడకుండా ఉండేందుకు అనుమతి ఇవ్వాలని మీరు మీ ఫ్రాంచైజ్‌ని ఎందుకు అడగలేదు’ అని ప్రశ్నించాను. నేను అలా ప్రశ్నిస్తానని ఆయన ఊహించలేదు. ‘సరే, మీరు కోరుకున్న విధంగా వెసులుబాటు పొందేందుకై, జోక్యం చేసుకోవాలని బీసీసీఐ (భారత క్రికెట్‌ నియంత్రణ మండలి)ను అడిగివుండవల్సింది’ అని కూడా నేను సూచించాను. ‘క్రికెటర్ల పక్షాన బీసీసీఐ నిలబడగలదని మీరు నిజంగా భావిస్తున్నారా? ఫ్రాంచైజ్ యజమానుల కంటే క్రికెట్ బోర్డ్ ప్రగతిశీలంగా వ్యవహరిస్తుందా? మనం ఇండియాలో ఉన్నాము కానీ బ్రిటన్ లేదా ఆస్ట్రేలియాలో లేము కదా’ అని ఆయన విస్మయకర స్వరంతో అన్నారు.

భారతీయ క్రికెట్ జట్టు ఇటీవల ఒక ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్‌లో మరోసారి ఓడిపోయింది. ఎందుకు పరాజయం పాలయ్యామన్న విషయమై నిశిత విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా ఆటస్థలంలో తీసుకున్న నిర్ణయాలపై పలువురు తమ దృష్టిని కేంద్రీకరించారు. టాస్‌ను గెలిచి ఫీల్డింగ్‌ను తీసుకోవడంలో భారత్ తప్పు చేసిందా? ఆర్.అశ్విన్ లాంటి అత్యుత్తమ బౌలర్‌ను జట్టులోకి ఎందుకు తీసుకోలేదు? మన బౌలర్లు, బ్యాటర్లు ఎక్కడెక్కడ, ఏ విధంగా తప్పులు చేశారు? ఇత్యాది ప్రశ్నలు చర్చలోకి వస్తున్నాయి. ఈ ప్రశ్నలను అందరూ ప్రస్తావిస్తున్నారు. వాటికి సమాధానమేమిటో వారికి బాగా తెలుసుగానీ ఎవరికి వారు చెప్పడం లేదు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌కు మన జట్టు సరైన విధంగా సంసిద్ధమవలేదు అన్నదే ఆ సమాధానం. అవును, ఆ పోటీకి సన్నద్ధంగా మన జట్టు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఈ చాంపియన్‌షిప్‌కు పోటీపడిన సమయాన్ని రాబోయే టెస్ట్ మ్యాచ్‌లకు సంసిద్ధమవడానికి ఉపయోగించుకుని ఉంటే బాగుండేదని సారథి రోహిత్ శర్మ సరిగానే చెప్పారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో నిర్ణయాత్మక ఇన్నింగ్స్ ఆడిన ఇరువురు ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్‌లు ఈ ఏడాది ఐపీఎల్‌లో పాల్గొనకపోవడం గమనార్హం. బౌలర్ స్కాట్ బొలాండ్ ఇప్పుడు పూర్తిగా టెస్ట్ మ్యాచ్‌లపైనే తన దృష్టిని కేంద్రీకరించారు. సారథి ప్యాట్ కమిన్స్ అయితే లాభదాయకమైన ఐపీఎల్ కాంట్రాక్టును వదులుకుని రాబోయే టెస్ట్ మ్యాచ్‌లలో తమ దేశానికి విజయం సాధించడానికి నిబద్ధమయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఇతర బౌలర్లు కూడా ఇదే రీతిలో టెస్ట్ మ్యాచ్‌లపైనే తమ దృష్టిని కేంద్రీకరించారు. ఒక్క చటేశ్వర్ పుజార మినహా భారత జట్టులోని ప్రతీ ఒక్కరూ ఐపీఎల్‌లో ఆడారు. ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, కామెరూన్ గ్రీన్ మాత్రమే ఈ ఏడాది ఐపీఎల్ వేడుకలో పాల్గొన్నారు.

అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్ నిర్ణయం తమ చేతుల్లో లేదని, ఆ అధికారం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు మాత్రమే ఉందని బీసీసీఐ అధికారులు చెబుతుంటారు. ఇది కొంతవరకు మాత్రమే నిజం. క్రికెట్ ప్రపంచంలో ఒక సూపర్ పవర్‌గా చెలామణీ అవుతున్న బీసీసీఐకి, ఐసీసీ నిర్ణయాలను ప్రభావితం చేయగల శక్తి ఉన్నదనడంలో సందేహం లేదు. అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌ల ద్వారా వచ్చే ఆదాయంలో అధిక భాగాన్ని దబాయించి అడిగి తీసుకుంటున్న బీసీసీఐ, ఒక మ్యాచ్ షెడ్యూల్‌ను ఆటగాళ్లకు అనుకూలంగా నిర్ణయించే విషయంలో తన నిస్సహాయతను వ్యక్తం చేస్తోంది! నిజమేమిటంటే డబ్బును ఎలా ఆర్జించాలో బీసీసీఐకి బాగా తెలుసు; అయితే ఆ డబ్బును క్రికెట్ ఆటకు మరింత సమున్నత భవిష్యత్తును నిర్మించేందుకు ఎలా మదుపు చేయాలో ఆ ‘సూపర్ పవర్’కు తెలియదు. ఇప్పుడు క్రికెట్ ఒక విశిష్ట త్రికం. టెస్ట్ క్రికెట్, వన్డే ఇంటర్నేషనల్, టి 20 ఫార్మాట్‌లే ఆ త్రికం. ఈ మూడు క్రికెట్ ఫార్మాట్ల అవసరాలు పూర్తిగా భిన్నమైనవి. నాటకీయత నెమ్మదిగా వెల్లడయ్యే టెస్ట్ క్రికెట్ మధురమైన మధిర లాంటిది అయితే ఉన్మాదకరమైన వేగంతో కూడిన టి 20 ఒక శీతల పానీయం లాంటిది. ఈ రెండు ఫార్మాట్ల మధ్య ఒక సమతౌల్యత సాధించగలగడం అంత తేలిక కాదు. బీసీసీఐలోని పెద్దలు మిగతా ఫార్మాట్ల కంటే భారీ ఆదాయాన్ని తీసుకువచ్చే ఐపీఎల్ వైపే మొగ్గారని చెప్పేందుకు పలు ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. 2008లో ‘క్రికెటైన్‌మెంట్’లో ఒక ప్రయోగంగా ప్రారంభమైన టి 20 ఇప్పుడొక సామూహిక వినోదంగా పరిణమించింది. అసంఖ్యాక క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్‌లను ఆదరిస్తున్నారు. బీసీసీఐకి అపరిమిత ఆదాయమూ సమకూరుతోంది.

టెస్ట్ క్రికెట్‌లోని సౌందర్యాత్మకతను నేను ఎంత ప్రగాఢంగా అభిమానిస్తున్నప్పటికీ ఐపీఎల్ గొప్పదనాన్ని సంశయించను. అది టీ 20 ఫార్మాట్ క్రికెట్‌ను సరికొత్తగా ఆవిష్కరించింది. ఆటస్థలానికి ఆవల క్రికెట్‌ను అపూర్వంగా మార్చి వేసింది. కూలీగా ప్రారంభమైన వారు కోటీశ్వరుడు స్థాయికి ఎదిగేందుకు అది అద్భుత అవకాశాలను కల్పిస్తోంది. ఈ తరం భారతీయుల మహా స్వప్నంలో భాగమైన అటువంటి అసాధారణ ఉన్నతి సుసాధ్యమేనని ఐపీఎల్ స్ఫూర్తిదాయక ఉదంతాలు ఏటా విశదం చేస్తున్నాయి. రింకూ సింగ్ విజయ గాథే ఇందుకొక ఉదాహరణ. క్రీడాక్షేత్రం ఎల్లలు దాటిపోయేలా బంతిని కొట్టగల రింకూ బ్యాటింగ్ నైపుణ్యాలు అతని కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించి, సామాజిక గౌరవాన్ని పెంపొందించాయి. ఐపీఎల్ ద్వారా క్రికెటర్లు తమ ఆర్థిక విలువను పెంపొందించుకుంటున్నారు. ఆ టోర్నమెంట్ సాఫల్యాన్ని మరీ మరీ ప్రస్తుతించేందుకు ఈ ఒక్క కారణం చాలదూ?

అయితే బ్యాంకులో నిల్వ చేసుకున్న మొత్తాలే ఆటల పరమార్థమా? కానేకాదు. జాతి ప్రతిష్ఠ, జాతీయ ఆత్మగౌరవానికి ప్రతీకలు క్రీడా సంబంధిత ప్రతిభా పాటవాలు. ఈ విషయంలో క్రికెట్ గొప్పదనం గురించి మరి చెప్పవలసినదేముంది?. క్రికెట్ ఫ్రాంచైజ్‌లకు, తమ వాణిజ్య ఒప్పందాల కంటే దేశ ప్రతిష్ఠ పెంపుదలే లక్ష్యం కావాలి. దేశ పేరు ప్రఖ్యాతులను మరింతగా ప్రకాశింప చేస్తుందనే క్రికెట్, మరీ ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ తన అసాధారణ చరిత్ర, స్ఫూర్తిదాయక సంప్రదాయాలతో క్రీడారంగ చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని పొందింది. 1983లో ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ విజయం ఇన్ని సంవత్సరాల తరువాత నేటికీ అసంఖ్యాక క్రికెట్ అభిమానుల మదిలో పచ్చని స్మృతిగా ఉన్నది. 2011 ప్రపంచ కప్ పోటీలో తుది విజయానికి విశేషంగా దోహదం చేసిన మహేంద్ర సింగ్ ధోనీ ప్రశస్త బ్యాటింగ్ దృశ్యాలను వీక్షించేదుకు రాబోయే తరాలవారు కూడా తప్పక విశేష శ్రద్ధాసక్తులు చూపుతారు.

ఒక ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ మిమ్ములను ఉత్తేజపరుస్తుంది; ఎంతగానో ఆహ్లాదపరుస్తుంది. మీ మనస్సును రంజింపచేస్తుంది. అయితే అది మీలో దేశభక్తి ప్రపూరిత భావాలను కలిగిస్తుందా? లేదు. కనుక వివిధ ఫార్మాట్ల క్రికెట్‌ విషయంలో బీసీసీఐ తన ప్రాథమ్యాలను పునర్ నిర్దేశించుకోవాలి. టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున ఆడడమనేది వైయక్తిక ఆటగాళ్ల క్రీడా ప్రతిభకు సర్వోత్కృష్ట గౌరవంగా భాసిల్లేందుకు బీసీసీఐ సంకల్పించాలి. ఎలాంటి జాప్యం లేకుండా ఇందుకు పూనుకోవాలి. ఈ కర్తవ్య నిర్వహణ ఆలస్యమైతే, ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దడం అసాధ్యమవుతుందన్న వాస్తవాన్ని భారతీయ క్రికెట్ వ్యవహారాల బాధ్యులు గుర్తించి తీరాలి. ఇందుకు ఏమి చేయాలి? ఎర్ర బంతి క్రికెట్ (టెస్ట్ మ్యాచ్‌లలో ఎర్ర బంతితో ఆడడం పరిపాటి), తెల్ల బంతి క్రికెట్ (టీ20, వన్డే మ్యాచ్‌లలో తెల్ల బంతితో ఆడడం ఆనవాయితీ)కు పూర్తిగా భిన్నమైన భారతీయ జట్లను ఏర్పాటు చేయడం చాలా ఉపయుక్తంగా ఉండవచ్చు. బ్రిటిష్ వారు ఇప్పటికే ఇటువంటి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. దురదృష్టవశాత్తు మన దేశంలో సమష్టి ప్రతిభా ప్రదర్శనతో విజయ సాధనకంటే వైయక్తిక ఉత్కృష్టతతో వెలుగొందడానికే ప్రాధాన్యమిస్తున్నాము. ఈ కారణంగానే అగ్రశ్రేణి క్రికెటర్లు సైతం ప్రతీ ఫార్మాట్‌లోనూ ఆడుతున్నారు, ఆడేలా చేస్తున్నాము. క్రికెట్‌కు సంబంధించిన వివిధ ప్రక్రియలలో ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేసి, ప్రోత్సహించడం, అలాగే ప్రతీ ఫార్మాట్‌కు అదేరీతిలో కోచ్‌లను సైతం నియమించడం మరింత ఆచరణాత్మక పరిష్కారం కాగలదు.

టీమ్ ఇండియా ఆట సామర్థ్యాన్ని మరింత సమున్నత స్థాయికి మెరుగుపరిచేందుకు బీసీసీఐ పూనుకోవాలి. లాభదాయక ప్రాయోజిత కాంట్రాక్టులను స్థిరపరచడం, ప్రపంచ వ్యాప్తంగా పర్యటించేందుకు అవకాశాలు కల్పించే వివిఐపి అధికార హోదాను అనుభవించడానికే పరిమితమైతే ఎలా? క్రికెట్ బోర్డ్ అధికారులు ఒక కొత్త దార్శనికతతో వ్యవహరించడం ఎంతైనా అవసరం. బీసీసీఐ తాను కోరుకున్న విధంగా ఆదాయాన్ని ఆర్జించగలదు. అయితే క్రికెట్ సంరక్షణదారుగా బీసీసీఐ, ఆ సమున్నత క్రీడ పోషకులమైన మనకు, అంటే క్రికెట్ అభిమానులకు తప్పనిసరిగా జవాబుదారీ అవ్వాలి.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2023-06-16T01:08:08+05:30 IST