అవినీతి, అసత్యం జగన్ కవచకుండలాలు

ABN , First Publish Date - 2023-02-03T01:24:03+05:30 IST

తనసమర్ధత ఏమిటో తెలుసుకోకుండా తాను చెప్పిన అబద్ధాలు నమ్మి తనకు ముఖ్యమంత్రి పదవి అప్పగించిన ప్రజలు సిఎం జగన్మోహన్ రెడ్డికి చులకనగా కనిపిస్తున్నారు...

అవినీతి, అసత్యం జగన్ కవచకుండలాలు

తనసమర్ధత ఏమిటో తెలుసుకోకుండా తాను చెప్పిన అబద్ధాలు నమ్మి తనకు ముఖ్యమంత్రి పదవి అప్పగించిన ప్రజలు సిఎం జగన్మోహన్ రెడ్డికి చులకనగా కనిపిస్తున్నారు. తన వంటి వాడిని నమ్మి ముఖ్యమంత్రిని చేసిన అమాయక ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్పి అయినా నమ్మించవచ్చన్న ధీమా ఆయనలో పెరిగిపోయింది. అందుకే నోరు పట్టని అబద్ధాలు జగన్‌రెడ్డి అలవోకగా చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చేందుకు చెప్పిన అబద్ధాలు ప్రజలు మర్చిపోయి ఉంటారని, ఇప్పుడు వాటినే ముఖ్యమంత్రిగా చెప్పి ప్రజలను మరోమారు వంచించే ప్రయత్నాలు మొదలెట్టారు. అవినీతి, అబద్ధాలు జగన్ కవచ కుండలాలు. తాను చెబుతున్న అబద్ధాలను ప్రజలు మౌనంగా వింటున్నందున వాటిని జనం నిజంగానే నమ్ముతున్నారన్న భ్రమలో ఆయన ఉన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్లు చెబుతున్నవి అసత్యాలు, అర్ధ సత్యాలు అని తెలిసినా కూడా ప్రజలు ప్రశ్నించకపోవడంతో జగన్‌రెడ్డి అబద్ధాల డోసును రోజురోజుకూ మరింత పెంచుతున్నారు. ఒక అబద్ధం పదేపదే చెబితే నిజమైపోతుందని ఆయన బలంగా నమ్ముతున్నారు.

అటు నిబంధనలు ఉల్లంఘించి తెస్తున్న అప్పులపైనా, అభివృద్ధి, వృద్ధిరేట్ల పైనా నోటికి వచ్చిన అంకెలు చెబుతూ జనం చెవుల్లో పూలు పెడుతున్నారు. తమ ప్రభుత్వం కంటే తెలుగుదేశం ప్రభుత్వమే ఎక్కువ అప్పులు చేసిందని జగన్మోహన్‌ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు. అంతేకాదు జీఎస్‌డీపీ వృద్ధిరేటులో రాష్ట్రం దూసుకుపోతోందని, ఏపీ వృద్ధిరేటు 11.43 శాతం ఉందని సీఎం జగన్ చెబుతున్నారు. వృద్ధిరేటు పెరిగితే మరి ఖజానా ఆదాయం ఎందుకు పెరగలేదు. తర్వాత ఉద్యోగాల కల్పన కూడా పెరగాలి. రాష్ట్రంలో ఈ రెండూ జరిగాయా? అయినా వృద్ధిరేటు రెండంకెలకు ఎలా చేరిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అధికంగా అప్పులు తెచ్చుకునేందుకు జీఎస్‌డీపీని పెంచి చూపిస్తున్నారు. ఆర్థికాభివృద్ధిని పూర్తిగా గండి కొట్టి నెగెటివ్ ట్రెండ్ తెచ్చి ఆయా గ్రోత్ ఇంజన్లన్నీ రివర్స్ చేశారు. మొత్తం పారిశ్రామిక రంగం –1.4శాతం, మొత్తం సేవారంగం –1.7 శాతం మాత్రమే ఉన్నాయి. కొత్తగా పెట్టుబడులు, కొత్త కంపెనీలు, కొత్త ఉద్యోగాలు లేకుండా రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించడానికి ప్రభుత్వం వద్ద ఏమన్నా మంత్రదండం ఉందా? వృద్ధి రేటు, సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీరు చెప్పే వృద్ధిరేటు అదనంగా అప్పులు తెచ్చుకునేందుకు చూపించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప, రాష్ట్రాన్ని ఉద్ధరించేది కాదు.

‘మార్చి 3, 4 తేదీలలో విశాఖలో జరిగే ఇన్వెస్టర్ల సమ్మిట్‌కు రావలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మీరు రావడమే కాకుండా, మా రాష్ట్రంలో వ్యాపారం చెయ్యడం ఎంత సులభమో విదేశాల్లో మీ సహచరులకు కూడా చెప్పి తీసుకురండి’ అని ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సమావేశంలో పలు దేశాలకు చెందిన దౌత్యవేత్తలను, కంపెనీల ప్రతినిధులను సిఎం జగన్‌రెడ్డి ఆహ్వానించారు. సంతోషం, కానీ పాలకులు విశ్వసనీయత కోల్పోయినప్పుడు పెట్టుబడులు వస్తాయను కోవడం అత్యాశే అవుతుంది. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని జగన్ ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు. పెట్టుబడులు రాబట్టడానికి ప్రయత్నించడం తప్పు కాదు కానీ ఉన్న పరిశ్రమలను వెళ్లగొడుతూ, మరో పక్క పెట్టుబడులు రాబట్టడానికి ప్రయత్నిస్తే ఎవరు వస్తారు? ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా లేకుండా పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించిన జగన్‌రెడ్డి, నేడు ఆ హోదా లేకుండా రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయనుకుంటున్నారో. కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని బీరాలు పలికిన మీరు, 32 మంది ఎంపీలు ఉన్నా ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు? దేశ, విదేశాల్లో ఉన్న పెట్టుబడిదారులు తాము పెట్టుబడి పెట్టే రాష్ట్రంలో అన్నీ అధ్యయనం చేసి పెట్టుబడులు పెడతారు. కానీ శాంతిభద్రతలు లేని రాష్ట్రంలో; బెదిరించి, పరిశ్రమలలో వాటాలు అడిగే రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు? హైదరాబాద్ పేరు చెబితే చాలు పెట్టుబడిదారులు బారులు తీరుతున్నారు. ఆర్థికంగా దివాళా తీసిన రాష్ట్రంలో వృద్ధిరేటు పరుగులు తీస్తోందని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు.

జగన్‌రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా అతలాకుతలం కావడమే కాకుండా కళావిహీనంగా మారింది. మూడు రాజధానులు అంటూ రాష్ట్రానికి ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారు. నెలనెలా ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. అహంకార, అసమర్ధ, విధ్వంస పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టిపోయింది. ముఖ్యమంత్రి కావాలని ఊరూరా ప్రచారం చేసిన మీ కుటుంబ సభ్యులు అయినా జగన్‌రెడ్డి పరిపాలన బాగుందని చెప్పగలరా? రాష్ట్రం విడిపోయిన ఎనిమిదేళ్ల తర్వాత కూడా ఆంధ్ర ప్రజలు ఉపాధి కోసం హైదరాబాద్‌కు పరుగులు పెట్టడం, జిల్లాల నుండి పనులు లేక పొరుగు రాష్ట్రాలకు ప్రజలు వలసపోవడం జగన్‌రెడ్డి సాధించిన ప్రగతిగా చెప్పుకోవాలా? మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి అధికారం అంటే బాధ్యత అనే విషయాన్ని విస్మరించారు. ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ముఖ్యమంత్రి ఇటీవలి కాలంలో ఎక్కడ బహిరంగసభ జరిగినా అసహనంతో మీడియా, ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. దుష్ట చతుష్టయం అని, గజదొంగలు, తోడేళ్ళు అని తిట్టి పోస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్నప్పుడు అందుకు బాధ్యత తీసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి మీడియా, ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అనర్థాలకు ఇతరులను నిందించడం జగన్‌కు అలవాటుగా మారింది.

జగన్‌రెడ్డి 44 నెలల పాలనలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం సరాసరిన 10 శాతం మాత్రమే వృద్ధి ఉంది. అప్పుల వృద్ధి మాత్రం 37.5 శాతం ఉంది. కట్టాల్సిన వడ్డీ రేటు 21 శాతం పైనే ఉంది. దీనికి అసలు మొత్తం కలిపితే అది దాదాపు రూ.35 వేల కోట్ల వరకు ఉంటుంది. ఈ రెండింటినీ కలిపితే అప్పుల చెల్లింపులు రేటు దాదాపు 95 శాతానికి పెరుగుతుంది. దీన్ని బట్టి వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఎంత నాశనం చేసిందో స్పష్టంగా కనపడుతోంది. రాష్ట్ర రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు విపరీతంగా పెరుగుతోంది. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఆదాయంతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా అప్పులు చేస్తున్న ప్రభుత్వాలకు శ్రీలంక ఆర్థిక సంక్షోభమే ఒక హెచ్చరిక అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎఫ్ఆర్‌బిఎం నిబంధనలు కూడా లెక్క చెయ్యకుండా ఇష్టారాజ్యంగా అప్పులు తెస్తున్న ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చుపెడుతున్నామని చెప్పడం పచ్చి అబద్ధం. ఒక పక్క వైసీపీ నాయకుల ఆదాయం పెరుగుతుంటే, మరో పక్క ప్రజల ఆదాయం తరుగుతోంది. రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. వైసీపీ నాయకుల ఆదాయం 200 రెట్లు పెరిగింది. రాష్ట్రంలో సహజవనరులు లూటీ అవుతున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించే పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత జగన్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కింది. ఏ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసిందో, ఏ ప్రభుత్వంలో వృద్ధి రేటు అధికంగా ఉందో శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలు ప్రజలు ముందుంచాలి. అంతే తప్ప అప్పులపై, వృద్ధి రేటుపై అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించవద్దు.

ప్రతిపక్షంలో ఉండగా సుదీర్ఘ పాదయాత్ర చేసి జనంలో కలిసిపోయిన జగన్‌రెడ్డి, ఇప్పుడు ఆ జనాలను కలుసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. పొలాల్లో కూలీనాలీ చేసుకొనే వారిని కూడా బెరుకు లేకుండా ఆలింగనం చేసుకొని ముద్దులు పెట్టిన పెద్ద మనిషి, ఇప్పుడు తన పర్యటనల సందర్భంగా ప్రజల కళ్లకు కనపడకుండా పరదాలు కట్టిస్తున్నారు. సామాన్య జనం తన దరిదాపుల్లోకి రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేయిస్తున్నారు. ఏది ఏమైనా ఒక అబద్ధం పదేపదే చెబితే నిజమైపోతుందని జగన్ నమ్మకం. జగన్‌ అధికారంలోకి వచ్చాక కేవలం అప్పులు, వడ్డీల చెల్లింపుల్లోనే వృద్ధిరేటు కనిపిస్తోంది తప్ప, రాష్ట్ర అభివృద్ధిలో మాత్రం వృద్ధి లేదు.

యనమల రామకృష్ణుడు

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు

Updated Date - 2023-02-03T01:24:05+05:30 IST