Share News

చిక్కుముడులు విప్పకుండా నదుల అనుసంధానమా?!

ABN , First Publish Date - 2023-11-01T01:07:29+05:30 IST

బిడ్డ పోయినా పురిటి వాసన పోలేదన్నట్లుంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు. దక్షిణాదిలో పాగా వేయాలని తమిళనాడులో అన్నాడిఎంకె హయాంలో శత విధాల ప్రయత్నించి విఫలమైంది...

చిక్కుముడులు విప్పకుండా నదుల అనుసంధానమా?!

బిడ్డ పోయినా పురిటి వాసన పోలేదన్నట్లుంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు. దక్షిణాదిలో పాగా వేయాలని తమిళనాడులో అన్నాడిఎంకె హయాంలో శత విధాల ప్రయత్నించి విఫలమైంది. తర్వాత ఉన్న కర్ణాటక పోయింది. ఇప్పుడు ఆశలు పెంచుకున్న తెలంగాణలో పప్పులుడికేట్టు లేదు. అయినా ఏదో ఒక రూపంలో రానున్న సాధారణ ఎన్నికల్లో దక్షిణాది నుంచి కొన్ని పార్లమెంటు స్థానాలైనా దక్కించుకొనేందుకు ఆ పార్టీ వివిధ రకాలైన వ్యూహాలు ఎత్తుగడలు వేస్తోంది. అందులో భాగంగానే తిరిగి గోదావరి కావేరి అనుసంధానం చేపట్టేందుకు సిద్ధమౌతోంది. ఈ సందర్భంగా న్యాయపరమైన సహజ సూత్రాలకు కేంద్ర ప్రభుత్వం తిలోదకాలిస్తోంది. ఏ నదీ లోయ నుండైనా మరొక నదీలోయకు నదీజలాలను తరలించాలంటే ముందుగా ఆ నదీ లోయ ప్రాంత ప్రజల అవసరాలు పూర్తిగా తీరి మిగులు జలాలు వుంటేనే తరలించాలి. దీనికి తోడు ఆ నదీ లోయలోని భాగస్వామ్య రాష్ట్రాల మధ్య వాటాలు నిర్ధారణ కావాలి. ఆయా భాగస్వామ్య రాష్ట్రాల్లో తమ మెట్ట ప్రాంతాల అవసరాలు అంతర్గత నదుల అనుసంధానంతో పూర్తిగా తీరిన తర్వాత మిగులు జలాలు వుంటే ఇతర నదీ లోయ ప్రాంతాలకు తరలించాలి. ఇవేవీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పట్టడం లేదు. నయానా భయానా ఏదో ఒక రూపంలో రాష్ట్రాల అధికారాల్లో చొరబడేందుకు సిద్ధమౌతోంది. ఈ దిశగా జాతీయ జల అభివృద్ధి సంస్థ స్థాయీ సంఘంతో పాటు నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాలు శుక్రవారం హైదరాబాద్‍లో నిర్వహించుతోంది.

గోదావరి నదిలో మిగులు జలాలు లేవని కేంద్ర జలవనరుల శాఖకే చెందిన కేంద్ర జల సంఘం చెబుతుండగా ఏదో ఒక భాగస్వామ్య రాష్ట్రానికి స్పాట్ పెట్టేందుకు సిద్ధమౌతోంది. ఈ దుష్టయజ్ఞంలో ఛత్తీస్‌గఢ్‌‌ను బలిపశువు చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఛత్తీస్‌గఢ్‌‌ను ఉపయోగించుకొని 141 టీయంసీలను తరలించుతామని అధికారయుతంగా పైకి చెబుతున్నారు. అంతిమంగా గోదావరిలో మిగులు జలాలపై హక్కు వున్న ఆంధ్రప్రదేశ్‌కు నష్టం కలుగజేసేందుకు పథక రచన జరుగుతోంది. తొలుత ఇంద్రావతి సబ్ బేసిన్‌లోని ఛత్తీస్‌గఢ్‌ నీటికి ఎసరు పెడుతున్నారు.

ఛత్తీస్‌గఢ్‌‌లో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ వాటా నీళ్లు ఇవ్వబోమని ఖరాఖండిగా చెబుతోంది. మరి గోదావరి కావేరి అనుసంధానానికి నికర జలాలను ఎక్కడ నుంచి తెస్తారు? గోదావరి కావేరి అనుసంధాన పథకానికి చాలా పూర్వరంగముంది. 1989లో జాతీయ జల అభివృద్ధి సంస్థ తొమ్మిది అనుసంధానాలను ప్రకటించింది. 1901–02 నుంచి 1981–02 మధ్య 75శాతం నీటి లభ్యత కింద శ్రీరామసాగర్ నుండి ఇచ్చంపల్లి వరకు 2337.59 టీయంసీల నీళ్లు వున్నట్లు అంచనా వేసింది. ఇచ్చంపల్లి వద్ద 717.64 టీయంసీలు మిగులు వున్నట్లు తేల్చి తొమ్మిది అనుసంధానాలను ప్రతిపాదించింది. అందులో మొదటి మహానది (మణిభద్ర) – గోదావరి (ధవళేశ్వరం) ఆఖరు లింకు కావేరి వైగయ్ గుండర్. అయితే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిషా అంగీకరించనందున ఈ పథకం అటకెక్కింది.


తదనంతరం తిరిగి జరిగిన మరొక సర్వేలో 231 టీయంసీల నీళ్లు తగ్గిపోయి ఇచ్చంపల్లి నుండి కిందకు 140 టీయంసీలు విడుదల చేస్తేనే రెండు రాష్ట్రాల అవసరాలు తీరుతాయని తేలింది. ఇవన్నీ కూడా అధికారయుతమైన గణాంకాలే. అందుకే కేంద్ర జల సంఘం గోదావరిలో మిగులు జలాలు లేవని చెప్పింది. ఈలోపు ఒడిషా నిక్కచ్చిగా మహానది నుండి నీళ్లు ఇచ్చేది లేదని తేల్చింది. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ఒప్పించడం పక్కన పెట్టి గోదావరి కావేరి అనుసంధానానికైనా పట్టువదలని విక్రమార్కుడిలాగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తొలి రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా మహానది గోదావరి అనుసంధానం చేసిన తర్వాతనే గోదావరి కావేరి అనుసంధానానికి అంగీకరించుతామని అడ్డం తిరిగారు. ఈ లింక్ అమలు జరిగితే మహానది నుండి దాదాపు రెండు వందల టీయంసీల నీళ్లు గోదావరిలో ధవళేశ్వరం వద్దకు చేరుతాయి. అయితే ఇన్ని నీళ్లు ధవళేశ్వరం వద్ద చేరితే ఉపయోగం లేదని ఏపీ జలవనరుల శాఖ పెదవి విరిచింది. కేసీఆర్ అడ్డం తిరగడంతో అప్పట్లో దీనికి బ్రేకులు పడ్డాయి. ఆ మధ్య తెలంగాణ ఒక మెట్టు దిగినట్లు వార్తలు వున్నాయి. తమ వాటా (967 టీయంసీలు) నీళ్లు పోగా మిగులు వుంటే తరలించవచ్చని దానితో పాటు గోదావరిపై తాము సమర్పించిన పథకాలకు చెందిన డీపీఆర్‍లు ఆమోదించాలనే షరతు పెట్టినట్లు ఇందుకు టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరాం తలూపినట్లు కూడా గతంలోనే వార్తలు వచ్చాయి.

గోదావరిలో ఎవరి వాటా ఎంతో తేలకుండా తెలంగాణ పథకాల డీపీఆర్‌లు ఆమోదించితే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే నష్టం చెప్పపనిలేదు. ఆంధ్రప్రదేశ్ తొలి నుండి కూడా గోదావరి కావేరి అనుసంధానం గురించి స్థిరమైన విధానాలపై నిలబడటం లేదు. తెలంగాణ ఏపీ రాష్ట్రాల మధ్య వాటాలు తేలలేదని మిగులు జలాలు వుంటే తరలించవచ్చని చెబుతూ పనిలో పనిగా పోలవరం నుండి కావేరి అనుసంధాన ప్రతిపాదన కూడా చేసింది. కేంద్ర జల సంఘం నిబంధనల మేరకు పోలవరం వద్ద నికర జలాలు లేవు కాబట్టి ఈ ప్రతిపాదన పక్కకు నెట్టబడింది. ప్రస్తుతం భాగస్వామ్య రాష్ట్రాలను ఒప్పించి ఏదో ఒక రకంగా నికర జలాలు చూపెట్టి గోదావరి కావేరి అనుసంధానం గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడిందని చెబుతున్నారు. ఈ మతలబులో భిన్న కోణాలు వున్నాయి. తెలంగాణకు చెందిన వెదిరె శ్రీరాం కేంద్ర జల వనరుల శాఖ సలహాదారుగానూ నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్‌గా వున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్‌ఖండ్ ప్యాకేజీ అమలు చేస్తామని కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలూ హామీ ఇచ్చిన అంశం చాలా మందికి గుర్తు వుంటుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాపించి వున్న ఈ ప్రాంతం అభివృద్ధికి రూ.44605 కోట్ల వ్యయంతో కెన్ బెత్వా నదుల అనుసంధానం వెదిరె శ్రీరాం ఒప్పించి అమలు చేస్తున్నారు. గోదావరి కావేరి అనుసంధానం కూడా ఆయన భుజస్కంధాలపై పెట్టారు. 2020లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కొత్త ట్రిబ్యునల్ ప్రతిపాదనకు మౌనం పాటించి పీకల మీదకు తెచ్చినట్లు ఈ అంశంలో కూడా ముఖ్యమంత్రి మౌనం పాటించితే గోదావరి జలాలకు ఎసరు పెట్టినట్లవుతుంది. ఇదే జరిగితే చంద్రబాబునాయుడు హయాంలో ప్రతిపాదించిన గోదావరి పెన్నా అనుసంధానం ద్వారా లభ్యమయ్యే గోదావరి మిగులు జలాలు 320 టీయంసీల స్థానంలో 80 టీయంసీలతో ఆంధ్రప్రదేశ్ సరిపెట్టుకోవలసి వుంటుంది. ఈ ప్రతిపాదన తెలంగాణ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో తిరిగి ముందుకు తేవడం గమనార్హం.

ఇవన్నీ అటుంచి గోదావరిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఎవరి వాటాలు ఎంతో తేలలేదు. కృష్ణా నదికి చెంది బచావత్ ట్రిబ్యునల్ తన తీర్పులో ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసింది. కాని గోదావరి ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గంప గుత్తుగా 1480 టీయంసీలను కేటాయించింది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల వాటాల అంశంలో పంచాయతీ తేలలేదు. తమ వాటా 967 టీయంసీలని, ఏపీ వాటా కేవలం 510 టీయంసీ లని తెలంగాణ వాదిస్తోంది. తమ వాటా 775 టీయంసీలుగానూ తెలంగాణ వాటా 650 టీయంసీలుగా ఆంధ్రప్రదేశ్ వాదిస్తూ, ఈ పంచాయతీ తెగేందుకు ట్రిబ్యునల్‌ను నియమించమని గట్టిగా కోరుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వంతో పూసుకు రాసుకు తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గోదావరి ట్రిబ్యునల్ నియమించేందుకు ప్రతిపాదన దశ కూడా సాధించలేకపోయారు. కేసీఆర్ కేంద్రంతో ఢీకొనే కృష్ణ ట్రిబ్యునల్ న్యాయ శాఖ వరకు ఫైల్ రన్ చేయించుకున్నారు. అంతిమంగా బీజేపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ట్రిబ్యునల్ నియామకం చేసింది. ఇన్ని చిక్కుముడులు వున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎంత ధైర్యం లేనిదే గోదావరి కావేరి అనుసంధానానికి తలపడుతోంది?

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Updated Date - 2023-11-01T01:07:29+05:30 IST