పౌర స్మృతి : బీజేపీ తవ్విన గోతిలో విపక్షాలు
ABN , First Publish Date - 2023-06-23T02:42:10+05:30 IST
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మళ్లీ వివాదాన్ని రగుల్కొల్పింది. ప్రతిస్పందనలు ఊహించిన విధంగానే ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు...
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మళ్లీ వివాదాన్ని రగుల్కొల్పింది. ప్రతిస్పందనలు ఊహించిన విధంగానే ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. యూసీసీ అంశాన్ని లా కమిషన్ మళ్లీ పరిశీలనకు తీసుకోవలసిన అవసరమేమిటని విపక్షాలు ప్రశ్నించాయి. పలువురు ప్రతిపక్షనేతలు యూసీసీకి వ్యతిరేకంగా వాదనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెడతామన్నరాజ్యాంగ హామీని నెరవేర్చేందుకు తాము నిబద్ధమయ్యామని బీజేపీ ఘోషిస్తుండగా లౌకికవాద రాజకీయాలు యూసీసీకి వ్యతిరేకంగా మోహరించాయి. పాలక, ప్రతిపక్షాల మధ్య ఒక సైద్ధాంతిక సమరానికి రంగం సిద్ధమయినట్టుగా కనిపిస్తోంది.
కాలం ఎంత భీరువుగా మారిపోయింది! రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీ అక్రమంగా ఏ క్షేత్రం– గతంలో హిందూ మతం, జాతీయవాదం, ఇప్పుడు యూసీసీ మొదలైనవి ఇందుకొక ఉదాహరణ– లోకి చొరబడినా లౌకికవాద రాజకీయాలు అక్కడి నుంచి వెనక్కివెళ్లిపోతున్నాయి, ఈ పలాయనాన్ని అడ్డుకోవాలి. ఉమ్మడి పౌర స్మృతిపై తమ సూత్రబద్ధ, ప్రగతిశీల వైఖరిని లౌకికవాద రాజకీయాలు కాపాడుకోవాలి. యూసీసీ విషయమై కొన్ని వాస్తవాలను మనం నొక్కి చెప్పాలి. అవి: ఏ ఒక్క మతం ఆచారాలు, ఆచరణలతో దానికి ఎటువంటి సంబంధం లేదు; భిన్న మతాల మధ్య, ఒక మతంలోని విభిన్న సామాజిక సమూహాల మధ్య సమానత్వానికి సంబంధించిన రాజ్యాంగ సూత్రాల ఏకరీతి సర్వోత్కృష్టతను అది వక్కాణిస్తుంది; జెండర్ న్యాయం దాని మౌలిక లక్ష్యం. యూసీసీ భావనను వ్యతిరేకించడాన్ని తిరస్కారయోగ్యమైన రాజకీయంగా పరిగణించి తీరాలి. 2024 లోక్‌సభ ఎన్నికలు ఆసన్నమవుతున్న తరుణంలో యూసీసీ భావనపై చర్చను పునః ప్రారంభించడం ఒక పనికిమాలిన రాజకీయ వ్యూహంగా పేర్కొనక తప్పదు.
ఉమ్మడి పౌర స్మృతి భావన ఏమిటి? చట్టం ముందు సమానత్వం. ఇదే దాని తార్కిక ప్రాతిపదిక. ఒకే నేర విచారణా స్మృతిని దేశ పౌరులు అందరికీ వర్తింపచేస్తున్నప్పుడు పౌర స్మృతి విషయంలో కూడా అదే సూత్రాన్ని ఎందుకు పాటించకూడదు? భిన్న మతాల వారికి, వారికే సొంతమైన ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అయితే వ్యక్తుల ప్రాథమిక హక్కులను ఏ మత సమాజమైనా అణచివేయడాన్ని అనుమతించడం న్యాయమేనా? కానే కాదు. ఒక సామాజిక సమూహ మతపరమైన హక్కులు, అదే సామాజిక సమూహానికి చెందిన స్త్రీలకు సమానత్వ హక్కును నిరాకరించడం సబబేనా? కానే కాదు.
ఇవేవీ బీజేపీ వాదనలు కావు. ఉమ్మడి పౌర స్మృతికి మహిళా సంఘాలు మౌలిక డిమాండ్ వెనుక ఉన్న తార్కిక ప్రాతిపదిక అది. ఈ విషయమై మన రాజ్యాంగ సభలో ఏకాభిప్రాయమున్నది. యూసీసీని ప్రాథమిక హక్కుల్లో చేర్చాలనే ప్రతిపాదన ఒకటి రాజ్యాంగ సభ పరిశీలనకి వచ్చింది. అయితే ఆనాటి దేశ విభజన అల్లకల్లోల వాతావరణంలో ఆ అంశాన్ని చర్చకు చేపట్టడం వివేకవంతం కాదని రాజ్యాంగ సభ భావించింది. ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెట్టాలని అభిలషించిన నెహ్రూ, అంబేడ్కర్, లోహియాలు కూడా ఆ తార్కిక వాదనను ఉపయోగించుకున్నారు. స్వతంత్ర భారతదేశంలో స్త్రీ వాద ఉద్యమం యూసీసీని డిమాండ్ చేసేందుకు అది పురిగొల్పింది. భారత రాజ్యాంగ అధికరణ 44 ఇలా పేర్కొంది: ‘ప్రభుత్వం భారత భూభాగం అంతటా పౌరులు అందరికీ ఒకే విధమైన పౌర స్మృతి తీసుకుని రావడానికి ప్రయత్నించాలి’. ఇది రాజ్యాంగం నిర్దేశించిన ఆదేశిక సూత్రం కూడా. ఈ కీలక రాజ్యాంగ సూత్రాలను ఎలా ఉపేక్షించగలం? అందునా రాజ్యాంగం అమలులోకి వచ్చి 73 సంవత్సరాలు అయిన తరువాత ఉమ్మడి పౌర స్మృతి భావనకు దేశం ఇంకా సిద్ధంగా లేదని మనమెలా చెప్పగలం?
ఉమ్మడి పౌర స్మృతి పట్ల వ్యతిరేకత స్ఫూర్తిదాయక సంఘటనలకు దారి తీయగలదని నేను భావించడం లేదు. సార్వత్రక ఎన్నికలకు పది నెలల ముందు, మోదీ ప్రభుత్వమే నియమించిన లా కమిషన్ సమగ్రంగా చర్చించి, తిరస్కరించిన ఐదు సంవత్సరాల అనంతరం ఉమ్మడి పౌర స్మృతి అంశాన్ని మళ్లీ ప్రజల ముందుకు తీసుకురావడంలో అసలు లక్ష్యమేమిటి? మైనారిటీ మతస్థులపై మళ్లీ దుమ్మెత్తిపోసేందుకు అవకాశాన్ని సృష్టించడమే కాదూ? కాంగ్రెస్ మొదలైన పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు హిందువుల కుటుంబ, మత చట్టాలలో ఆమోదయోగ్యంకానిరీతిలో మార్పులు చేసి వాటిని బలవంతంగా హిందూ మతస్థులపై రుద్దాయని, అయితే ముస్లింలు, క్రైస్తవుల విషయంలో అటువంటి పనికి వెనుకాడాయని ప్రజలకు మరొకసారి స్పష్టంచేసి ఎన్నికల వేళ తన రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవడానికి అధికార పార్టీ పూనుకున్నది.. ముస్లిం, క్రైస్తవ మత సమాజాల కరడుగట్టిన మితవాద నాయకులతో ప్రతిపక్షాలు కుమ్మక్కు అయ్యాయని విమర్శించేందుకు అవకాశాన్ని కల్పించుకోవడమే యూసీసీపై చర్చను పునః ప్రారంభించడం వెనుక ఉన్న అసలు ధ్యేయం. ట్రిపిల్ తలాక్ విషయంపై చర్చ సందర్భంగా జరిగినట్టు ప్రతిపక్షాలు మళ్లీ బీజేపీ వలలో చిక్కుకోకూడదు.
ఉమ్మడి పౌర స్మృతిని కలిగి ఉండడమంటే ఏమిటి? ఏమిటి దాని వలన ప్రయోజనం? ఈ అంశాలను లోతుగా అర్థం చేసుకోవాలని సాంఘిక సంస్కర్తల దార్శనికత, రాజ్యాంగ నిర్మాతల సంకల్పం, స్త్రీ వాద ఉద్యమ ప్రభావశీలత మనలను పురిగొల్పుతున్నాయి. ఉమ్మడి లేదా ఏకరీతి పౌర స్మృతి సాటిలేనిది గానీ, సర్వసమమైనది గానీ కాదు; అది కొన్ని సామాన్య సూత్రాలను, అయితే భిన్నమైన నియమాలను అనివార్యం చేస్తుంది. ఇది, క్లైమేట్ జస్టిస్ సంప్రదింపులలో అందరూ అంగీకరించిన ఉమ్మడి కర్తవ్యం, భిన్న బాధ్యతలు అన్న సూత్రానికి తుల్యమైనది. ఉమ్మడి పౌర స్మృతి విషయంలో ఏకరూపత అంటే సమస్త మత, సామాజిక జనసముదాయాలూ ఒకే విధమైన రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉండడమే. ఏ మతానికి చెందిన కుటుంబ చట్టమూ సమానత్వ హక్కు, వివక్ష వ్యతిరేక హక్కు, జెండర్ న్యాయం భావన ఉల్లంఘించడాన్ని అనుమతింపబడదు. ఈ రాజ్యాంగ సూత్రాలను అంగీకరించని, అతిక్రమించే ఎలాంటి ఆచారమైన సరే, ఎటువంటి కుటుంబ చట్టమైనా సరే అమలులో ఉండడానికి వీలు లేదు.
అదే సమయంలో ఈ సామాన్య సూత్రాలు భిన్న సామాజిక వర్గాల విషయంలో, అవి అనుసరించిన స్పష్టమైన ఆచారాలు, సంప్రదాయాల ఆధారంగా, భిన్న భిన్న రూపాల్లో ఉనికిలో ఉంటాయి. హిందూ ఆచారాలకు భిన్నంగా ముస్లిం వివాహం నిఖానామా ప్రాతిపదికగా గల ఒక ఒడంబడిక. ఒక ‘ఏకరీతి’ పౌర స్మృతిని అంగీకరించే ముస్లింలు ఆ నిఖానామా ఆధారిత ఒడంబడిక వివాహ సంప్రదాయాన్ని త్యజించవలసిన అవసరం లేదు; హిందువులు దానిని అనుసరించాల్సిన అవసరమూ లేదు. భిన్న మత వర్గాలు ఏకరీతి రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించనంతవరకు వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం మొదలైన వ్యవహారాలలో, తమ తమ వేర్వేరు ఆచారాలు, ఆచరణలను పాటించే స్వేచ్ఛను కలిగి ఉంటాయి.
ఒక ఏకైక శాసన నిర్మాణంతో ఉమ్మడి పౌర స్మృతి సంభవించబోదు. శాసనబద్ధంగా అది ఉనికిలోకి వచ్చినప్పటికీ, తనకు ముందున్న వేర్వేరు ఆచారాలు, విభిన్న సంప్రదాయాలను అది పూర్తిగా తుడిచిపెట్టగలదని భావించడం పొరపాటే అవుతుంది. గొప్ప ప్రభావంచూపే, విస్తృతంగా వర్తించే మూడు చట్టబద్ధ మార్పులతో మాత్రమే ఉమ్మడి పౌర స్మృతి జాతి జీవన స్రవంతి భాగమవుతుంది. అవేమిటో చూద్దాం. తొలుత, 21వ లా కమిషన్ సూచించిన విధంగా ప్రస్తుతమున్న వివిధ మత చట్టాలను విస్తృతంగా సంస్కరించవలసిన అవసరమున్నది ప్రస్తుతం చట్టబద్ధంగా అనుమతిస్తున్న ముస్లిం బహుభార్యాత్వ ఆచారంపై తీవ్ర ఆంక్షలు విధించాలి. ముస్లిం మహిళల ప్రయోజనాలను కాపాడేందుకు ఇది తప్పనిసరి. అలాగే హిందువులు, ఇతర సామాజిక వర్గాలలో సైతం చట్టవిరుద్ధంగా ఆచరణలో ఉన్న బహుభార్యాత్వ సంప్రదాయాన్ని రూపుమాపవలసిన అవసరమున్నది. క్రైస్తవులలో విడాకుల, దత్తత పద్ధతులను సరళీకరించాలి. ప్రత్యేక వివాహ చట్టంలోని ‘నోటీస్ పీరియడ్’ నిబంధనను పూర్తిగా తొలగించాలి. హిందూ ధర్మశాస్త్రంలోని ‘ఆస్తిపై ఉమ్మడి హక్కు’ సిద్ధాంతాన్ని, హిందూ ఉమ్మడి కుటుంబానికి పన్ను సంబంధిత ప్రత్యేక హక్కుల నిబంధనను పూర్తిగా తొలగించాలని కూడా లా కమిషన్ సిఫారసు చేసింది. ఈ మార్పులు అన్నిటినీ అన్ని మతాలలోని సంప్రదాయవాదులు పూర్తిగా వ్యతిరేకిస్తారు అయితే లౌకికవాద రాజకీయాలు ఆ ఒత్తిళ్లను సమర్థంగా ఎదుర్కోవాలి.
ప్రస్తుతం ఏ చట్టం పరిధిలో లేని భిన్న మతాల వారి ఆచారాలు, ఆచరణలను క్రోడీకరించడం శాసనవిహితంగా రావాల్సిన రెండో మార్పు. ఎటువంటి కౌటుంబిక వివాదంలో అయినా పిల్లల ప్రయోజనాల పరిరక్షణకు సర్వోత్కృష్ట ప్రాధాన్యాన్ని ఇవ్వవలసిన అవసరమున్నది. ఇది ఉమ్మడి పౌర స్మృతిలో సంపూర్ణంగా ప్రతిబింబించాలి. ప్రస్తుతమున్న వివిధ మత, కుటుంబ చట్టాలను అంగీకరిచని వారి సౌకర్యార్థం ఒక ఉమ్మడి పౌర స్మృతిని సృష్టించేందుకు వీలుగా ప్రత్యేక వివాహ చట్టంలో విస్తృత మార్పులు చేయాలి. అటువంటి పౌరస్మృతికి నమూనాగా చెప్పదగ్గ ఉమ్మడి పౌర స్మృతి ఒకటి ఇప్పటికే గోవాలో అమలులో ఉన్నది. అన్ని మతాల వారికి అది వర్తిస్తుంది. అటువంటి స్మృతి ఆధారంగా ఒక స్వచ్ఛంద స్మృతిని రూపొందించాలని అంబేడ్కర్ సూచించారు. హిందూ మతం, జాతీయవాదం మొదలైన వ్యవహారాలలో భారతీయ జనతా పార్టీ ప్రభావశీలతను సమర్థంగా ఎదుర్కోలేక లౌకికవాద రాజకీయాలు తిరోగమించాయి. ఇటువంటి ఆత్మ వినాశక రాజకీయాలకు ఉమ్మడి పౌర స్మృతి సరికొత్త ఉదాహరణ కాగూడదు. ఉమ్మడి పౌర స్మృతి భావన పట్ల బెదిరిపోవడం కాకుండా ఈ వ్యాసంలో సూచించిన విధంగా దానిని రూపొందించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయాలి. బీజేపీ ఎత్తుగడలను అర్థం చేసుకోవాలి. మైనారిటీ మతాల మితవాద నాయకులతో చేతులు కలపకూడదు. అధికార పక్ష దబాయింపులకు భయపడకుండా ప్రతిపాదిత ఉమ్మడి పౌర స్మృతి ముసాయిదాను రూపొందించి ప్రజలకు నివేదించాలని లౌకికవాద రాజకీయాలు స్పష్టంగా డిమాండ్ చేయాలి.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)