Share News

గద్దర్‌ వ్యక్తిత్వ హననంలో కుల స్వభావాలు

ABN , First Publish Date - 2023-10-28T04:38:02+05:30 IST

గద్దర్‌ కేంద్రంగా జరుగుతున్న మౌఖిక, లిఖిత సంవాదాలు అంతర్లోకాలలో అలజడిని సృష్టిస్తున్నాయి. యాభై ఏళ్ల తర్వాత కాగితాలను తిరగేస్తే గద్దర్‌ మీద వేసిన నిందలు మాత్రమే చరిత్రలో...

గద్దర్‌ వ్యక్తిత్వ హననంలో కుల స్వభావాలు

గద్దర్‌ కేంద్రంగా జరుగుతున్న మౌఖిక, లిఖిత సంవాదాలు అంతర్లోకాలలో అలజడిని సృష్టిస్తున్నాయి. యాభై ఏళ్ల తర్వాత కాగితాలను తిరగేస్తే గద్దర్‌ మీద వేసిన నిందలు మాత్రమే చరిత్రలో భాగమై మరో యుగకర్త అనూహ్యంగా మసకబారే ప్రమాదం ఉంది. అందుకే సత్యవచనం మీద గురి ఉన్న ప్రతి ఒక్కరూ చరిత్రను రికార్డు చేయాలి. గద్దర్‌ జీవించినంత కాలం ఏలికను వెంటాడాడు. మరణించాక కూడా పార్లమెంటరీ రాజకీయ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేసాడు. ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించకపోతే ఓట్ల రాజకీయాలలో ఎక్కడ వెనుకపడిపోతామోననే దిగులును కలిగించాడు. ఇసుక వేస్తే రాలనంత జనం ఎక్కడి నుంచి వచ్చారు? గద్దర్‌ అర్ధ శతాబ్ద కాలంలో నమ్ముకున్న ప్రత్యామ్నాయ సిద్ధాంత రాజకీయాలు, స్పష్టమైన ఆచరణ, ప్రతిభావంతమైన సృజనాత్మక వ్యక్తీకరణనే కోట్లాది ప్రజలకు గద్దర్‌ను చేరువచేసింది.

కాలం కడుపుతో ఉండి కవిని కంటుందని శివసాగర్‌ రాసిన మాట గద్దర్‌కు సరిపోలుతుందని భావించటంలో అతిశయోక్తి లేదు. ఒకరకంగా మరణానంతరం ఆయన మీద గురిపెట్టిన రాతలన్ని గద్దర్‌ ఎదుగుదలను, ఆచరణను చూసి ఓర్చుకోలేనివని భావించేవారే గణనీయంగా ఉన్నారు. మావోయిస్టు రాజకీయాలు గద్దర్‌లో పరిమాణాత్మక మార్పు గుణాత్మకంగా రూపొందడానికి దోహదపడ్డాయి. అయితే గద్దర్‌ స్వయం ప్రకాశం కాకపోతే కేవలం విప్లవ రాజకీయాలు మాత్రమే ఆయనను రూపొందించలేవని గుర్తించడానికి గతితర్కం తెలిస్తే సరిపోతుంది. జడతర్కాన్ని ఆశ్రయిస్తే మాత్రం స్థల, కాలాల స్పృహను కోల్పోతాం.

ప్రజాకళల ప్రదర్శనలో నవ్యరీతులను గద్దర్‌ ప్రవేశపెట్టాడు. కొత్త ఆహార్యంతో వేదిక మీదకు ఆయన ప్రవేశమే కళాత్మక వ్యక్తీకరణ. వీర, రౌద్ర, దుఃఖ రసాలను వేదిక మీద పండించగల నైపుణ్యం గద్దర్‌ పాటకు ఉంది. చేతిలోని కర్రను వర్గ శత్రువు మీదకు ఆయుధంలా ఎక్కుపెట్టి, భుజం మీది గొంగడి ఒరిగిపోయిన వీరుడిలా, అమరవీరుడి తల్లి ఒడిలా మారిపోయే కళాత్మక దృశ్యం గద్దర్‌లోనే చూడగలం. పాటలోని రసాత్మక భావానికి అనువుగా ఆంగిక, వాచిక అభినయాలను గద్దర్‌ లక్షలాది మంది సమక్షంలో ప్రదర్శించే కళగా మార్చాడు. ఆయన, పాటలో పల్లవిని అందుకునే కంటే ముందే, ప్రత్యేకమైన రాగాన్ని, సాకీని ప్రదర్శన రూపంలోకి తెచ్చాడు. గంభీరమైన సిద్ధాంతాన్ని, రాజకీయాలను, వర్గపోరాటాన్ని తన కళాత్మకమైన వాక్కు ద్వారా కోట్లాది ప్రజలకు పరిచయం చేసే వాగ్గేయశైలిని గద్దర్‌ రూపుకట్టాడు. మసీద్‌లోని నమాజ్‌, గుడిలోని ప్రార్థన, అడవిలోని ఆదిమ రాగం... అన్నింటిని కలగలిపి తానే ఒక భూగోళ రాగమైన అరుదైన వ్యక్తిత్వం గద్దర్‌ది.

పాట రచనలో కొనసాగుతుండిన కవితా మార్మికతను గద్దర్‌ చేదించాడు. మావో చెప్పినట్లు ప్రజల రూపంలో విప్లవ సారాన్ని శక్తిమంతంగా తిరిగి విప్లవ శ్రేణులకు అందించే కళాత్మక రచనా పద్ధతిని ప్రవేశపెట్టాడు. గ్రామీణ సజీవ మాండలికాన్ని, మధ్యతరగతి సంకర భాషతో అన్వయం చేసి కొత్త డిక్షన్‌ తయారుచేసాడు. పండితులు, పామరులు ఏకరూపంగా తన పాటను అనుభవించేలా శ్రోతలను తయారుచేసుకున్నాడు. రాజ్య అణచివేతలో భాగమైన వ్యక్తులు కూడా గద్దర్‌ పాటకు అభిమానులుగా ఉండే అరుదైన సందర్భాన్ని ఆవిష్కరించాడు. పాట నిర్మాణంలో భాష నిర్వహించే పాత్ర, దాని రహస్యం గద్దర్‌కు మాత్రమే తెలుసు అన్నంతగా స్థిరపర్చాడు. గద్దర్‌ పాట ప్రతి మూల మలుపులో చారిత్రకపాత్రను నిర్వహించింది. సిరిమల్లె చెట్టుకింది లచ్చుమమ్మ పాట స్త్రీవాద భావనలకు పునాది వేస్తే, దళిత పులులమ్మ పాట రూపుదిద్దుకుంటున్న దళిత ఉద్యమానికి మార్చింగ్‌ సాంగ్‌లా మారింది. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పాట తెలంగాణ అస్తిత్వ పోరాటానికి పతాక గీతమైంది. విప్లవ సందేశాన్ని, వర్గ పోరాట రాజకీయాలను సాహిత్య రూపంలో జనశ్రేణులకు చేరవేసిన అరుదైన వ్యక్తి గద్దర్‌.

కొండపల్లి సీతారామయ్య రాసిన ‘వ్యవసాయిక విప్లవం’ అనే పుస్తకాన్ని ‘భారతదేశం భాగ్యసీమరా’ పాటగా మలిచిన గద్దర్‌ దానికి విస్తృత ప్రాచుర్యం కల్పించాడు. అమరత్వం రమణీయమైందనే సత్యాన్ని పాటగా అల్లి గద్దర్‌ పాడుతుంటే వరంగల్‌ రైతు కూలి సభలో (1990)లో పదిహేను లక్షల మంది దుఃఖించారని చరిత్ర చెబుతుంది. వీరులకు నామవాచకం లేకుండా సర్వనామాన్ని అన్వయించాడు. వర్గపోరాటంలో అమరులైన వీరులకు వీరత్వాన్ని, అమరత్వాన్ని స్థిరపర్చడంలో ప్రజలలో ఆ స్థాయి ఆమోదాన్ని తీసుకురావడంలో గద్దర్‌ పాట నిర్వహించిన పాత్ర విస్మరించలేనిది. ప్రజల కోసం ప్రాణాలిచ్చే సంప్రదాయానికి సాహిత్య గౌరవం కల్పించడం వలన వీరత్వం అనే భావాన్ని చెదిరిపోకుండా ఉంచడంలో ఆయన పాట ఉపయోగపడింది. పాట రచనలో కొనసాగుతుండిన సంప్రదాయ పద్ధతికి స్వస్తి చెప్పి డప్పు, డోలక్‌ లాంటి సంగీత వాద్యాలకు అనువుగా పాట ఛందస్సును మార్చినవాడు గద్దరే. గేయఛందస్సు, వచన కవిత మాత్రలను దాటి జానపదంలో ఉన్న ఛందో నియమాన్ని గద్దర్‌ పాటలలోకి ఒంపాడు. ఏ పాదంలో ఎన్ని మాత్రలు ఉండాలో పాట వస్తువును బట్టి, సందర్భాన్ని బట్టి నిర్ణయించుకునేదే తప్ప మార్గ పద్ధతిని అనుసరించడం సాధ్యం కాదని గద్దర్‌ నిరూపించాడు. తన ఆశుకవిత్వంలో గణాలు ఎప్పటికప్పుడు మారిపోతుండేవి.

ఇప్పటి వరకు తెలుగు సాహిత్యంలో కవితా ఇతివృత్తాన్ని, భాషను, ఛందో నియమాన్ని కొత్తగా నిర్దేశించిన వారిని యుగకర్తలు అనడం ఆనవాయితీగా వస్తుంది. సాహిత్య చరిత్ర నిర్మాణ పరికరాలు అందించిన సాధనాల ఆధారంగానే ప్రాచీన కాలంలో నన్నయ, పాల్కుర్కి సోమన, అల్లసాని పెద్దన ఆధునిక కాలంలో గురజాడ యుగకర్తలుగా నిర్ణయించబడ్డారు. వీరందరికి భిన్నమైనవాడు గద్దర్‌. గద్దర్‌ చేపట్టిన ప్రక్రియ జనబాహుళ్యం పొందిన పాట, కనుక పాట రచనా సంవిధానంలో ఆయనకు ఆయనే సాటి. వాగ్గేయ సంప్రదాయాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. భాషలో, వస్తువులో, ఛందో నియమంలో గద్దర్‌ పాటించిన కొత్త పద్ధతి వలన ఆయన యుగకర్త అవుతాడు. అర్ధ శతాబ్దాన్ని గద్దర్‌ తన పాటతో శాసించాడు. పాటకు గద్దర్‌ సర్వనామమా? నామవాచకమా? పర్యాయపదమా? అని తేల్చుకోలేనంతగా సాహిత్య ప్రపంచాన్ని సందిగ్ధంలోకి నెట్టివేసాడు. కవిగా ఆయన విస్తృతి, వైవిధ్యం భిన్నమైనది.

మనదేశంలో సామాజిక సమూహాల పెనుగులాటలన్ని విప్లవాన్ని వేగవంతం చేయడానికేననే సత్యం గతితర్కాన్ని వీడిన యాంత్రిక వాదులకు అర్థం కావడం లేదు. కనుకనే సామాజిక సమూహాల ఆందోళనలో భాగమైన గద్దర్‌ మీద వారి అకారణద్వేషం. నిర్మాణపరంగా గద్దర్‌ మావోయిస్టు పార్టీ నిబంధనావళికి భిన్నమైన రాజకీయ వ్యక్తీకరణ చేసాడు. కనుక ఆ పార్టీ సభ్యత్వాన్ని కోల్పోయాడు. అంతమాత్రాన గద్దర్‌ పాలకవర్గం కాదు. వర్గ శత్రువు అంతకంటే కాదు. ఆయనలో ప్రవేశించిన పార్లమెంటరీ ఎన్నికల భావనలోని సత్యాసత్యాలను ఇంకా తేల్చవలసే ఉంది. కనుక మన సమాజం గద్దర్‌ను అర్థం చేసుకునే స్థాయికి ఎదిగిందా? అనే ప్రశ్న ఉదయిస్తుంది. భూస్వామ్య, కులవిలువలు, పవిత్రతను గద్దర్‌కు ఆపాదించి నిర్ణయాలు చేయబూనుకోవడం ఎంత మేరకు శాస్త్రీయం? ఈ దేశంలో విలువలు పాటించాలంటే ఏ విలువలను ప్రామాణికంగా తీసుకోవాలి? గద్దర్‌కు విప్లవం ఆదర్శం కాదు, అదొక అవసరం. అందుకే తన యాభై ఏళ్ల విప్లవ జీవితం అవసరంగానే ఆచరించాడు. దాని కోసం అజ్ఞాత జీవితం, జైళ్లు, తుపాకి గుళ్లకు ఎదురెళ్లటం సంతోషంగా స్వీకరించాడు. శరీరంలో తుపాకి గుండు ఎంతగా సలుపుతుండినా నిబద్ధత, నిమగ్నత ప్రదర్శించాడు. కనుక ఆధిపత్య వర్గాలు నిర్దేశించిన విలువల చట్రంలో గద్దర్‌ను బంధించి రంధ్రాన్వేషణ చేయడం వలన ఆత్మ సంతృప్తి మిగులుతుందే కానీ విప్లవానికి ఏ మాత్రం దోహదం చేయదు. బ్రాహ్మణీయ పవిత్రతను గద్దర్‌కు ఆపాదించి శీల పరీక్షకు పూనుకోవడం వలన విప్లవ సంప్రదాయంలో కొనసాగిన వ్యక్తుల పట్ల సమాజంలో అపనమ్మకాలు ఏర్పడుతాయనే సోయి పవిత్రులకు ఉండాలి. మన సాహిత్య సమాజంలో ఉదారవాదులైన గురజాడ, కాళోజీ, ప్రగతిదాయకులైన శ్రీశ్రీ, బాలగోపాల్‌కు ఇచ్చిన కనీస గౌరవం కూడా గద్దర్‌కు ఇవ్వకుండా వ్యక్తిత్వ హననానికి పూనుకోవడంలో వారి వారి కుల స్వభావాలు పనిచేస్తున్నాయని ఎవరైనా భావిస్తే భావించిన వారి తప్పు ఎలా అవుతుంది?

ప్రొ. చింతకింది కాశీం

ఉస్మానియా యూనివర్సిటి

Updated Date - 2023-10-28T04:38:02+05:30 IST