కెప్టెన్‌ జలగం రామారావు పర్యావరణ ఉద్యమాల చిరునామా

ABN , First Publish Date - 2023-09-22T01:09:39+05:30 IST

పర్యావరణవేత్త, సామాజిక చింతనాపరుడు కెప్టెన్‌ జలగం రామారావు. తన 94వ ఏట మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. ప్రత్యేకంగా పర్యావరణం, కాలుష్యం అంశాలపై...

కెప్టెన్‌ జలగం రామారావు పర్యావరణ ఉద్యమాల చిరునామా

పర్యావరణవేత్త, సామాజిక చింతనాపరుడు కెప్టెన్‌ జలగం రామారావు. తన 94వ ఏట మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. ప్రత్యేకంగా పర్యావరణం, కాలుష్యం అంశాలపై పనిచేసే కొద్దిమంది వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఖమ్మం జిల్లాలో జన్మించిన ఆయన ఇంజినీరింగ్‌ పూర్తి చేశాక నౌకాదళంలో చేరారు. కెప్టెన్‌ స్థాయికి ఎదిగి 23 సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ పొందారు. దాదాపు రెండు దశాబ్దాలు హైదరాబాద్‌లో చిన్న మెషిన్‌ టూల్స్‌ పరిశ్రమ నడిపించారు. పరిశ్రమ రంగంలో జరుగుతున్న అవకతవకలను, పరిశ్రమలు వెదజల్లే కాలుష్యాన్ని, దానిని నియంత్రించే కాలుష్య నియంత్రణ మండలి పని విధానాన్ని, ఆ సంస్థ అధికారుల్లో పేరుకుపోయిన అవినీతిని, వాళ్ల బాధ్యతారాహిత్యాన్ని చాలా దగ్గర నుంచి వీక్షించారు. అప్పుడు ఆయన పర్యావరణం, కాలుష్యం విషయాల్లో తన వంతుగా ఏమైనా చేయాలని సంకల్పించుకున్నట్టుగా ఉంది. తన సోదరుడు జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎప్పుడూ ప్రభుత్వ గౌరవ పదవులకు, ప్రభుత్వ ఆశీస్సులకు వెంపర్లాడలేదు.

రామారావు ముక్కుసూటిగా మాట్లాడే, ప్రవర్తించే వ్యక్తి. మితభాషి, నిగర్వి. హైదరాబాద్‌లో సామాజిక అంశాలతో, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు, విధ్వంసం అవుతున్న పర్యావరణ ఉద్యమాల్లో మేము పని చేస్తున్న క్రమంలో రామారావుతో పరిచయం ఏర్పడింది. పఠాన్‌చెరువు దగ్గర రుద్రారంలో దేశంలోనే అతి పెద్ద పశువుల వధశాల ఏర్పాటయింది. అల్‌ కబీర్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీ పెద్ద మొత్తంలో పశుమాంసం, గొర్రె మాంసం అరబ్‌ దేశాలకు, జపాన్‌, తైవాన్‌ దేశాలకు ఎగుమతి చేసేది. ఈ కంపెనీ ముస్లిం మతస్తులదని, తెలంగాణ గ్రామాలలోని పశుసంపదను వినాశనం చేస్తుందని దానికి వ్యతిరేకంగా 1994లో ఒక ఉద్యమం మొదలయింది. ఆ కంపెనీని ముస్లింలు, ఉత్తర దేశానికి చెందిన మార్వాడీలు కలిసి నిర్వహిస్తున్నారన్న విషయాలను బహిర్గతపరచి, ప్రొ. కేశవరావు జాదవ్‌, ఆ ఉద్యమాన్ని కొత్త దిశలో నడిపారు. కరువు కాటకాలు, వ్యవసాయంలో సంక్షోభం వల్ల తెలంగాణలోని మెదక్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులు తమ జీవనం గడవడానికి పశువులను అల్‌కబీర్‌ వధశాలకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే తప్ప ఈ ఫ్యాక్టరీ మూతపడదు అని ఒక నూతన దిశవైపు ఉద్యమాన్ని జాదవ్‌ నడిపించారు. ఈ తరుణంలో కెప్టెన్‌ రామారావు ఈ ఉద్యమానికి తోడుగా ఉండి తనకు తెలిసిన చాలా విషయాలను జాదవ్‌తో పంచుకునేవారు.

రామారావు క్షేత్రస్థాయిలో ఉద్యమంలో పాల్గొన్న విషయాలు నేను గమనించలేదు కాని, సమస్యలపై పిటిషన్లు సమర్పించడం, తనకు తెలిసిన పర్యావరణ అంశాలు పంచుకోవడం, న్యాయస్థానాల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేయడం చేసేవారు.

1996లో నల్లగొండలో నాగార్జునసాగర్‌ పక్కనే యురేనియం తవ్వకాలు చేపట్టి, పరిశ్రమ స్థాపించాలని ప్రయత్నాలు జరిగినప్పుడు, పెద్ద ఎత్తున పర్యావరణవేత్తలు, సామాజిక సంస్థలు యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమంలో రామారావు చురుగ్గా పాల్గొన్నారు. అప్పుడు నల్లగొండ మాల్‌ దగ్గర జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి కూడా రామారావు మాతో పాటు హాజరయ్యారు. తర్వాత దేశవ్యాప్తంగా యురేనియం వ్యతిరేక ఉద్యమాలు మొదలై ఒక జాతీయ యురేనియం వ్యతిరేక సంఘటన ఏర్పడ్డప్పుడు దాంట్లో సభ్యుడిగా ఉంటూ చివరి వరకు ఆ సంస్థతోనే ఉన్నాడు. కొవ్వాడ అణువిద్యుత్‌ వ్యతిరేక ఉద్యమంలో భావపరంగా పాలు పంచుకొని చాలా పిటిషన్లు పంపి ప్రజాభిప్రాయానికి బలం చేకూర్చాడు.

1990లో పఠాన్‌చెరువు, రామచంద్రాపురం, ఇస్నాపూర్‌, బొల్లారం, పాషమైలారంలో ఏర్పాటయిన కర్మాగారాల వల్ల ఈ ప్రాంతంలోని 40 గ్రామాల్లో కర్మాగారాలు విడిచిపెట్టే రసాయన పదార్థాల వల్ల చెరువులు, కుంటలతో పాటు భూగర్భజలాలు కూడా కలుషితమయ్యాయి. పెద్దయెత్తున వ్యవసాయం దెబ్బతింది. పశువులు వ్యాధులబారిన పడ్డాయి. ఈ సమయంలో ఈ పరిశ్రమలకు వ్యతిరేకంగా పెద్ద ప్రజా ఉద్యమం వచ్చింది. పర్యావరణవేత్త ప్రొ. పురుషోత్తం రెడ్డి, రైతు నాయకుడు అల్లాని కిషన్‌రావు పూర్తిస్థాయిలో ఈ ఉద్యమంలో పాలుపంచుకొని పని చేశారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ సమస్యపై వేసిన పిటిషన్‌లకు స్పందించి స్థానిక జడ్జిని విచారించి నివేదిక ఇమ్మని ఆదేశాలు జారీ చేశాయి. ఈ విషయంలో రామారావు నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియలో పాల్గొన్నారని మేము విన్నాం.


హైదరాబాద్‌ పక్కనున్న జంట జలాశయాలను కాపాడేందుకు జీవో 111 తీసుకువచ్చారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఆదేశాలను సడలించి ఆ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి కోసం ప్రయత్నాలు జరిగాయి. జీవో 111 విశిష్టతను ముఖ్యమంత్రికి వివరించి, దాన్ని మార్చకుండా ఉండడానికి కన్నభిరాన్‌, వేదకుమార్‌, పురుషోత్తం రెడ్డి, ఇంకా చాలామంది సామాజిక కార్యకర్తలు కృషి చేశారు. అందులో రామారావు భాగం పంచుకోవడమే కాక ఈ మధ్యనే మరణించిన మానిక్‌ షా దబేరాతో కలిసి కోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. పర్యావరణవేత్త జీవానందరెడ్డి సహచర్యంలో హుస్సేన్‌సాగర్‌ కాలుష్యంపై నివేదికలు తయారుచేశారు. పలుమార్లు ప్రభుత్వానికి పిటిషన్లు సమర్పించారు.

బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్‌లో వ్యాయామశాల ఏర్పాటు ప్రయత్నాలు జరిగినప్పుడు దబేరా, కాజల్‌ మహేశ్వరిలతో కలిసి ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. వ్యాయామశాల వల్ల కెబిఆర్‌ పార్క్‌ వినాశనానికి కేంద్రం అవుతుందని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ బాగా ప్రజాదరణ పొందింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల గ్రామమైన కొవ్వాడలో న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేసే ప్రయత్నం జరిగినప్పుడు దాని వల్ల ప్రజలకు కలిగే నష్టాన్ని వివరిస్తూ రామారావు ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. శ్రీకాకుళం జిల్లా, సోంపేటలో పవర్‌ ప్లాంట్‌కు జరిగిన ఉద్యమంలో మానవ హక్కుల వేదిక పూర్తిస్థాయిలో పాల్గొని ఉద్యమకారులకు సహాయ సహకారాలు అందించింది. ఆ ఉద్యమం జరిగినన్ని రోజులు రామారావు అన్ని విషయాలు తెలుసుకుంటూ నాతో ఫోన్‌లో మాట్లాడేవారు.

కాలుష్య నియంత్రణ మండలి పని విధానంలో ఆ సంస్థలో బాధ్యతాయుత స్థానాల్లో ఉండేవారి విషయంలో రామారావుకి కచ్చితమైన అభిప్రాయాలుండేవి. ఈ సంస్థ వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని, సంస్థ అవినీతిలో మునిగిపోవడమే కాక పదవీవిరమణ చేసిన కొందరు అధికారులకు పునరావాస కేంద్రంగా మారిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు. సంస్థలోని సభ్యులంతా పరిశ్రమల ప్రతినిధులే ఉంటారని, వాళ్లకు లాభాపేక్ష తప్ప ప్రజల బాధలు పట్టవని, వాళ్లు కాలుష్యాన్ని నివారించే, నియంత్రించే చర్యలు ఎలా చేపడతారని ప్రభుత్వంపై ధ్వజమెత్తుతూ పలుమార్లు ఉత్తరాలు రాశారు. కాలుష్య నియంత్రణ మండలిలో పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు బోర్డు మెంబర్లుగా ఉండాలని అభిప్రాయపడేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈ సంస్థను మూసివేయడం మంచిదని ఒకసారి పత్రికలో ప్రకటన కూడా చేశారు. హైదరాబాద్‌ నగరంలో ప్రజల సమస్యలపై ఇప్పుడు వేదకుమార్‌ సారథ్యంలో నడుస్తున్న ‘ఫోరం ఫర్‌ బెటర్‌ హైదరాబాద్‌’ సంస్థలో రామారావు ప్రారంభం నుంచి బాధ్యతలు నిర్వహించారు.

పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణ, నియంత్రణ కోసం తన జ్ఞానాన్ని సమయాన్ని నిబద్ధతతో ధారపోసిన కెప్టెన్‌ జలగం రామారావుకు మనమంతా నివాళి తెలుపుదాం.

యస్‌. జీవన్‌ కుమార్‌

మానవ హక్కుల వేదిక

Updated Date - 2023-09-22T01:09:39+05:30 IST