బెల్లం కొట్టిన రాయి
ABN , First Publish Date - 2023-08-03T01:10:29+05:30 IST
ఎంత గోరం జరిగినా ఉలుకూ పలుకూ లేకుంట బుర్ర దించీసి ఏదీ ఇనబడనట్టున్నోడిని ‘ఏందిరా.. ఇంతమంది నెత్తులు బద్దలుగొట్టుకోని ఏదడిగినా నోరిప్పవు బెల్లంకొట్టిన రాయిలాగా...
ఎంత గోరం జరిగినా ఉలుకూ పలుకూ లేకుంట బుర్ర దించీసి ఏదీ ఇనబడనట్టున్నోడిని ‘ఏందిరా.. ఇంతమంది నెత్తులు బద్దలుగొట్టుకోని ఏదడిగినా నోరిప్పవు బెల్లంకొట్టిన రాయిలాగా’ ఏదోవొకటి సెప్పు అంటారు మాకాసి. ఇదే తిత్తవ మన దేశ ప్రధానమంత్రిగారిది. దేశం దేశమంతా గుప్పు మన్నాదావార్త. గచ్చుమన్నారు జనాలు. వార్తంటే అలాటిలాటి వార్తా. ప్రెపంచమే నిచ్చరపోయి సూసిన వార్త. మునుపెన్నడూ ఎక్కడా, ఎవులూ కనీవినీ ఎరగని దుర్మార్గమైన వార్త. ఇది తెలిసినా తెలీనట్టు, వినబడినా వినబడనట్టు ‘బెల్లంకొట్టిన రాయి’లాగా ఉలక్కా పలక్కా పల్లకుంటన్నాడంటే ఏటనుకోవాల? ఇతగాడు దేశాలంట తిరిగి ‘మాదేశిం ఇంత గొప్పది, అంత గొప్పది, ప్రెపంచానికి పెద్ద గురువు’ అని టప్పండాలు కొట్టుకోని తిరుగుతాడుగావాల! సూటూ బూటూ ఏసుకోని సికార్లు సేత్తాడుగావాల! ఈ పెద్దమనిసికి ఇక్కడోటి ఏటి జరుగుతందో తెలీదా? తెలీక్కాదు ‘ఊరుకున్నంత ఉత్తమూ లేదు, పల్లకున్నంత పత్తిమూ లేదు’ అదీ అతగాని ఉద్దేశిం. ఏటిసదివినాడో ఎవలికీ ఎరికినేదు గానీ మా ఎవకమైనోడు. పెదివిప్పితే సమాదానం సెప్పాల. సెప్పడాకి ప్రెశ్నిలు ఒకటా రెండా? ఏటి సెప్పుతాడు మారాజుకొడుకు. అందుకే పల్లక ముంగిపోతు లాగున్నాడు. అది అతగాడి ఎత్తు.
అప్పుడెప్పుడో కౌరవుల నిండు కొలువులోన కోడల్నే కోకలిప్పి అవమానించి ఇరగబడి నవ్వుతుంటే బాద్యతగల పెద్దోలు ఇలగే ‘బెల్లంకొట్టిన రాయి’లాగ పల్లక నోరుమూసుకోని ఉండిపోనారట గానీ ఎవుడూ ‘ఇదన్నేయం’, ‘ఇది తప్పు’ అని ఒక మాట అనలేదట. అడిగిన సిన్నోడు వికర్ణుడ్ని ‘నోరుమూసుకో’ అని గసిరీసేరట ఆ దుర్యోదన, దుస్సేసనులు.
‘ఈ తగువులు ఇప్పుడివికావూ, నెహురూగారి కాసి ఉన్నాయీ’ అని తప్పు తొలి ప్రధానమంత్రి మీద తోసీడాకి సూసింది అతగాడి పెబుత్వం. ఎవులెలగ పోతే నాకేటి? అనుకుంటన్నాడేటో. కాకపోతే ఆ లోయ ఖాళీ అయిపోతే అయినోళకి కట్టబెట్టీవొచ్చునని ఆలోచన చేస్తన్నాడేటో. మరేల.. ఈ దేశంల అతగానికి ఎవులెవులు ఇష్టం లేనోళ్ళున్నారో ఆళ్ళని సాయిబులు, క్రిస్టినీసు, కమీనిష్టులు వీళేగదా. ఈళందర్నీ ఒకదగ్గిర పెట్టి అగ్గిబెట్టి తగలెట్టీమనండి. అప్పుడెవుడో అతగాడు.. ఎవుడూ... ఆ హిట్లరు అతగాడిలాగ. ఇక ఏ బాధా ఉండదు. ఒకే మతమూ ఒకే జాతీ ఉట్టిగట్టుకోని ఊరేగొచ్చును ఈ భూమండలం ఉన్నంతవరకీ.
ప్రెపంచమంతటికీ పెద్దగురువట.. ఇలపింటి దుర్మార్గాలు జరుగుతుంటే పిసరంత పట్టించుకోలేదు, పరామర్శించి బాధితుల్ని ఓదార్చడాకీ ఎళ్ళలేదు అతగాడేం పెద్దమనిషి. ఏ ముఖం పెట్టుకోని నీతి వాక్యాలు చెప్తాడు? మాట ఉప్మానానికి ఊరికి ప్రసిడెంటుంటాడు. ఏ వీధిలోనో కొట్టుకున్నారనో తిట్టుకున్నారో కవురొస్తాది, ఎల్లడం మానెస్తన్నాడా? బాధ్యతగా ఎల్లి ఇరువర్గాల్కీ సర్దిసెప్పి అక్కడ పరిస్థితి సక్కదిద్దుతన్నాడా లేదా? ఆ సందాయమే గదా. ఊరికి సర్పంచైతే దేశింకి ప్రెధాని.. అంతేగాదా. ఎక్కువ బలం ఉన్నోళ్లు అనాదోళమీద దాడి చేసినా పట్టించుకోక సినిమా చూసినట్టు చూస్తే పోలీసులెందుకు? చట్టాలెందుకు? మరి గవర్మెంటెందుకు? హాయిగ ప్రజల సొమ్ముతోటి ఇమానాలెక్కి ప్రపంచమంతా తిరగడానికా?
ఇలగ బెల్లంకొట్టిన రాయిలాగ, శంఖం ముందల సెవిటోడి లాగ, కదలకామెదలకా, ఉలక్కా పలక్కా ఉండిపోతండంటే అతగాడికి తెలీక్కాదు. అదంతా ఒక నాటకం. ఆ బెల్లంకొట్టిన రాయిని బగమంతుడి తోటి సమానంగా పూజించుతారు కొందరు మూర్ఖులు. దేశింకి పట్టిన తెగులిది. ఎప్పుడొదుల్తాదో ఏటో.
గంటేడ గౌరునాయుడు